జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఒక టాప్ కమాండర్ హతమయ్యాడు. లష్కర్ ఉగ్రవాది అల్తాఫ్ లాలిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. శుక్రవారం ఉదయం నుంచి బండిపోరాలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. బండిపోరా జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది గాయపడ్డాడు. ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన నాల్గవ ఎన్‌కౌంటర్ ఇది.
కాగా.. గురువారం తెల్లవారుజామున, ఉధంపూర్‌లోని డూడు బసంత్‌గఢ్‌లో భద్రతా దళాలు కొంతమంది ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ హవల్దార్ అమరుడయ్యాడు. డిపోరా పోలీసులు నిన్న లష్కరే తోయిబాకు చెందిన నలుగురు గ్రౌండ్ వర్కర్లను (OGWs) అరెస్టు చేశారు. లష్కర్‌తో సంబంధం ఉన్న కొంతమంది గ్రౌండ్ వర్కర్లు పోలీసులపై, స్థానికేతరులపై దాడి చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని నిఘా సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఈ నిఘా సమాచారం ఆధారంగా, బండిపోరా పోలీసులు జిల్లాలోని వివిధ ప్రదేశాలలో సోదాలు నిర్వహించి ముట్టడి చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
READ MORE: CM Yogi: ఉగ్రదాడి బాధితుల మాటలు విని కన్నీరుపెట్టుకున్న సీఎం యోగి.. (వీడియో)