సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట:
సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. బుధవారం విచారించిన ధర్మాసనం.. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని తెలిపింది. సీల్డ్ కవర్‌లో కోర్టుకు నివేదిక ఇవ్వాలని ధర్మాసనం కోరింది. తమ వాదన వినకుండా బెయిల్ ఇచ్చారని ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. రూ.195 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని న్యాయవాది గుర్తుచేశారు. సీల్డ్ కవర్‌లో నివేదిక ఇస్తామని న్యాయవాది నివేదించారు. దీంతో తదుపరి విచారణ ఈనెల 16కు న్యాయస్థానం వాయిదా వేసింది.
శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు:
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్ర్త నిబంధనలకు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమే అధికారంలో ఉంది. అయినా కూడా ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా.. ఆలయం పైనుంచి విమానాలు ఎలా వెళ్తాయంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మృతుల కుటుంబాలకు కోటి ఎక్స్‌గ్రేషియా:
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ప్రమాదంపై సిగాచీ కంపెనీ స్పందించింది. పరిశ్రమలో పేలుడు కారణంగా 40 మంది మృతి చెందారని, మరో 33 మంది గాయపడినట్లు పేర్కొంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్ని బీమా క్లైమ్ ఇస్తామని స్పష్టం చేసింది. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని సిగాచీ కంపెనీ హామీ ఇచ్చింది. ఈ మేరకు సిగాచీ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు:
తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. బనకచర్ల అంశం, సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన మాట్లాడారు. నిన్న సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు అని పేర్కొన్నారు. బేసిన్ల గురించి సీఎంకు మినిమం అవగాహన లేదనిమండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నారని, అవన్నీ ప్రజంటేషన్‌లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. తమ పార్టీ సచ్చిన పామే అయితే.. పదే పదే బీఆర్ఎస్ పేరెందుకు ప్రస్తావిస్తున్నారన్నారు. తమకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యమని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
మధ్యతరగతికి గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం:
GST: ఈ ఏడాది ఆదాయ పన్నుల రాయితీల రూపంలో మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరో చర్యకు సిద్ధమవుతోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుంది. వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) తగ్గించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను పూర్తిగా తొలగించం లేదా ప్రస్తుతం 12 శాతం పన్ను విధించబడుతున్న అనేక వస్తువులను దిగువన 5 శాతంలోకి తిరిగి చేర్చడం వంటి వాటి గురించి కేంద్రం ఆలోచిస్తోంది. ఈ అరేంజ్మెంట్ మధ్యతరగతి, ఆర్థికంగా బలహీన వర్గాలు ఉపయోగించే టూత్‌పేస్ట్, టూత్ పౌడర్, డుగులు, కుట్టు యంత్రాలు, ప్రెషర్ కుక్కర్లు మరియు వంటగది పాత్రలు, ఎలక్ట్రిక్ ఐరన్‌లు, గీజర్‌లు, చిన్న సామర్థ్యం గల వాషింగ్ మెషీన్లు, సైకిళ్లు, రూ. 1,000 కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు, రూ. 500 నుండి రూ. 1,000 మధ్య ధర కలిగిన పాదరక్షలు, స్టేషనరీ వస్తువులు, టీకాలు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలు వంటి వాటి ధరలు తగ్గే అవకాశం ఉంది. మార్పులు అమలు చేయబడితే ఈ వస్తువులు చాలా వరకు తక్కువ ధరలకు వస్తాయి. మరోవైపు, ప్రభుత్వం సరళీకృతమైన, సులభంగా పాటించే జీఎస్టీని కూడా పరిశీలిస్తోంది.
రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా:
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది మరణించారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టాయి. అయితే, విమానం గాలిలో ఉండగానే రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయా.?? అని పరిశోధకులు, విమానయాన సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. విమానం కూలిపోయే సమయంలో ల్యాండింగ్ గేర్ బయటకు ఉండటం, రెక్కల్లోని ప్లాప్స్ ఉపసంహరించుకుని ఉండటం ప్రమాద విజువల్స్‌లో కనిపించాయి. అయితే, ఇదే పరిస్థితులను ఫ్లైట్ సిమ్యులేటషన్‌లో ప్రదర్శించారు. అయితే, ఈ రకంగా ఉన్న సెట్టింగ్స్ మాత్రమే ప్రమాదానికి కారణం కాదని దర్యాప్తు గురించి తెలిసిన కొంత మంది చెప్పారు. బహుశా రెండు ఇంజన్ల వైఫల్యం ప్రమాదానికి కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.
సింధు జలాలు నిలిపేసే అధికారం భారత్‌కు లేదు:
సింధు జలాలు ఏకపక్షంగా నిలిపివేసే అధికారం భారత్‌కు లేదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ చర్య ఢిల్లీ దుష్ట కుట్రగా అభివర్ణించారు. మంగళవారం నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌ను సందర్శించిన సందర్భంగా షెహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. డాన్ పత్రికలో వచ్చిన నివేదిక ప్రకారం.. సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడానికి భారతదేశానికి అధికారం లేదని వ్యాఖ్యానించారు. సింధు జలాలపై భారతదేశం నిర్ణయం మారకపోవడంపై షరీఫ్ చర్యలు ప్రకటించారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొంది. దేశీయ వనరులతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే చాలా కాలంగా నిలిచిపోయిన డైమర్-భాషా ఆనకట్ట పనులు కూడా వేగవంతం చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ ఆనకట్ట 1980లోనే ప్రారంభించారు. కానీ పర్యావరణం, ఖర్చులు వంటి అనేక అంశాలు తలెత్తడంతో నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది.
అధ్యక్షుడు జిన్‌పింగ్ మిస్సింగ్:
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అదృశ్యం కలకలం రేపింది. దాదాపు ఆయన 15 రోజులు మిస్సింగ్ అయ్యారు. మే 21 నుంచి జూన్ 5 వరకు కనిపించలేదు. ఈ వార్త దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అయితే అధ్యక్షుడి మార్పునకు ఇది సంకేతం అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనపై నిశ్శబ్ద తిరుగుబాటు జరిగిందంటూ పుకార్లు నడుస్తున్నాయి. తదుపరి అధ్యక్షుడిగా వాంగ్ యాంగ్ రాబోతున్నారంటూ నిఘా వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. జిన్‌పింగ్ నిత్యం ఏదొక కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉండేవారు. బీజింగ్‌లోని గ్రాండ్ హాళ్లలో ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు కవాతులు లేవు, స్పాట్‌లైట్లు లేవు. ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. అంటే జిన్‌పింగ్‌ను పక్కన పెట్టినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా అదృశ్యం కావడం ఇదేమీ కొత్త కాదని.. గతంలో కూడా చాలా సార్లు మిస్సింగ్ అయినట్లు సమాచారం. ఏదేమైనా చైనాలో ఏదో జరుగుతోందని వదంతులు నడుస్తున్నాయి.
వార్2 తెలుగు స్టేట్స్ రిలీజ్:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ యాక్షన్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కు విజువల్ ఫీస్ట్ ఇస్తాయని యూనిట్ కూడా బలంగా నమ్ముతోంది. యష్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ను సితార ఎంటెర్టైనమెంట్స్ నాగవంశి సుమారు రూ. 90 కోట్లకు కొనుగులు చేసారు. తెలుగు సినిమా చరిత్రలో ఒక నాన్ తెలుగు సినిమాకు ఈ ధర పలకడం హిస్టరీ. కేవలం ఎన్టీఆర్ నటిస్తుండడంతోనే ఆ రేట్ పలికిందనేది వాస్తవం. అనుగుణంగానే వార్ 2 తెలుగు స్టేట్స్ రిలీజ్ ను అదే స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు నాగవంశీ. ఆగస్టు 14న తెల్లవారు జామున షోస్ వేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే అందుకు అందుకోసం థియేటర్స్ తో చర్చలు కూడా చేస్తున్నారట. భారీ యాక్షన్ ఎంటెర్టైనర్ గా వస్తున్న వార్ 2 ను తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు బిగ్గెస్ట్ నంబర్స్ ఉండబోతున్నాయి. అలాగే తమిళ సుపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కూలీతో పోటీగా రిలీజ్ అవుతుంది వార్ 2.
ఆమె మాటలే నాకు బలం:
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తరచూ మీడియా ముందుకు వచ్చి తన మనసులోని మాటలను ఓపిగ్గా, నిజాయితీగా పంచుకుంటారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతను వ్యక్తిగత జీవితం, ఒత్తిడులు, కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. “నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ కొన్ని సార్లు కఠినంగా ఉండాల్సి వస్తుంది. నటుడిగా అలా ఉండలేను. ఎందుకంటే అది నా ప్రొఫెషన్‌పై ప్రభావం చూపుతుంది. ఇది ఆర్టిస్టులందరికీ ఎదురయ్యే సవాలే. ఎన్ని విమర్శలు ఎదురైనా నలుగురిని సంతోషపెట్టాలనే ప్రయత్నం చేస్తాను’ అని తెలిపారు. అలాగే ఆయన పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్, తప్పుడు వార్తల పై కూడా స్పందిస్తూ.. ‘నాపై వచ్చే నెగెటివిటీ ఎదుర్కోవడానికి ఐశ్వర్య ఇచ్చిన సలహాలు పాటిస్తాను. ఆమె ఎప్పుడు ఒక్కటే చేబుతుంది.. ‘నెగిటివ్ గురించి ఆలోచించకపోతే అవి మనపై ప్రభావం చూపదు. పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాలి’ అని. ఈ మాటలు నాకు ఎన్నో సందర్భాల్లో బలం ఇచ్చాయి. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు మనం మన కోసం సమయం కేటాయించుకోవాలి. ఏకాంత క్షణాలు అవసరం. కానీ అలాగని ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండలేను. నాకు ఎవరైనా మాట్లాడే వ్యక్తి కావాలి. నాకు కుటుంబమే ఒక శక్తి. మేమంతా ఇంట్లో కలిసే ఉంటాం. సరదాగా గడుపుతుంటాం. అదే నా ఆత్మీయతకు మూలం’ అని అన్నారు. ఈ మాటల్లో అభిషేక్‌కు కుటుంబం ఎంత ప్రాధాన్యమో స్పష్టంగా కనిపిస్తుంది.