స్లీపర్ సెల్స్‌పై దృష్టి పెట్టండి:
రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్‌పై దృష్టి పెట్టండని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమన్నారు. దేశ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీకి ఆయన లేఖ రాశారు. ‘రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరం. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్‌పై దృష్టి పెట్టాలి. దేశ భద్రత, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పవన్ లేఖలో పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబుకు బిల్‌గేట్స్ లేఖ:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చొరవను అభినందిస్తూ గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ లేఖ రాశారు. ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ బృందంతో జరిగిన ఒప్పందం, సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. సీఎంపై బిల్‌గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ వచ్చినందుకు సీఎం చంద్రబాబు, బృందంకు ధన్యవాదాలు చెప్పారు. మంచి వాతావరణంలో సంప్రదింపులు జరిగాయని బిల్‌గేట్స్ లేఖలో పేర్కొన్నారు. పేదలు-అట్టడుగువర్గాల విద్య, ఆరోగ్యంలోనూ.. వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపైనా గేట్స్ ఫౌండేషన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నాను అని బిల్‌గేట్స్ రాసుకొచ్చారు.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం:
సిద్దిపేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యమయ్యారు. లెటర్ రాసిన ఐదుగురు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. అదృశ్యమైన వారిని భార్యాభర్తలు బాలకిషన్(55), వరలక్ష్మి(50), కుమారుడు శ్రవణ్ కుమార్(30), కుమారైలు కావ్య(23), శిరీష(20) గా గుర్తించారు. వీరు పట్టణంలోని ఖాదర్‌పుర వీధిలో నివసించేవారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో ఇంట్లోనే అందరి ఫోన్లు పెట్టేసి వెళ్లిపోయారు. రెండు రోజులుగా కుటుంబ సభ్యులు ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చిన బంధువులు తాళం వేసి ఉండటాన్ని గమనించారు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు డోర్ పగలగొట్టగా ఇంట్లో లేటర్ కనిపించింది. బాలకిషన్ కుటుంబం అప్పుల బాధతో అదృశ్యమైనట్లు తెలిసింది. వీరబత్తిని బాలకిషన్‌కు అప్పులు ఉన్నాయని, తనకు డబ్బులు ఇచ్చేవారు ఇవ్వకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు లేఖ రాసి పెట్టారని బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఫోన్లు కూడా ఇంట్లోనే ఉంచడంతో ఆచూకీ కనుక్కోవడం పోలీసులకు సవాలుగా మారింది. పట్టణంలోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.
గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద కారణాలను గుర్తించిన అధికారులు:
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌస్ ప్రాంతంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం భారీ నష్టా్న్ని మిగిల్చింది. తాజాగా గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాద కారణాలను అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని తేల్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలిపోవడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను నడుపుతుండటంతో ఘటన జరిగింది. కంప్రెషర్ పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో భారీగా పొగ వ్యాపించింది. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలోకి దట్టంగా వ్యాపించిన పొగ కారణంగా.. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు కుదరలేదు. టెర్రస్ నుంచి బయటకు రాలేక కుటుంబీకులు కిందకు వచ్చారు. మెట్ల మార్గంలో మంటలు భారీగా ఎగసిపడటంతో లోపలే ఉండిపోయారు. ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మారస్థితిలోకి వెళ్లారు. గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి.
హైడ్రా డ్రైవర్ ఉద్యోగాలకు పోటెత్తిన యువత:
ఇటీవల తెలంగాణలోని హైడ్రా సంస్థ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ).. ఔట్ సోర్సింగ్ పద్దతిలో 200 డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి బుధవారం ( మే 19, 21 ) వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసి.. స్వల్ప మార్కుల తేడాతో దూరమైన వారికీ ప్రాధాన్యత ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు ఒక్కసారిగా పోటెత్తారు. హైడ్రా పార్కింగ్ కార్యాలయం వద్ద పెద్డ సంఖ్యలో బారులు తీరారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అన్ని జిల్లాల నుంచి భారీగా యువత తరలి వచ్చారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడి దరఖాస్తు చేసుకున్నారు. హైడ్రా గతంలో కూడా ఔట్ సోర్సింగ్ పద్దతిలో పలు నియామకాలు చేపట్టింది. 2025 ఫిబ్రవరి నెలలో డీఆర్ఎఫ్ లోకి 357 కొత్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించింది. ఈ ఉద్యోగులు అంబర్ పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వారం రోజుల శిక్షణ అనంతరం ఫీల్డ్ లోకి పంపారు.
కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు:
భారతదేశం-పాకిస్థాన్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం పార్లమెంటరీ కమిటీకి చెప్పారని ఇండియా టుడే ఓ కథనంలో తెలిపింది. సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్నారని మిస్రీ నొక్కిచెప్పారని పార్లమెంటరీ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్-పాక్ వివాదాన్ని ఆపడంలో తన పాత్ర గురించి పదే పదే ప్రస్తావించారు. ట్రంప్ వాదనలపై ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మిస్రీ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ ధర్మ సత్రం కాదు:
భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీయులకు వసతి కల్పించడానికి ధర్మ సత్రం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక పౌరుడి ఆశ్రయం పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు దేశంలో ఆశ్రయం కల్పించవచ్చా అని కోర్టు ప్రశ్నించింది. ఇక్కడ సెటిల్ అయ్యేందుకు మీకేం హక్కు ఉందని ధర్మాసనం అడిగింది. శ్రీలంకలో ఒకప్పుడు చురుకుగా ఉన్న ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE)తో సంబంధాలున్నాయనే అనుమానంతో 2015లో శ్రీలంక జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీపాంకర్ దత్తా, కె వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. గతంలో ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు ఆ వ్యక్తిని దోషిగా తేల్చింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2018లో 10 ఏళ్ల శిక్ష వేసింది. అనంతరం అతడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. ఆ కోర్టు మూడేళ్ల శిక్ష తగ్గించింది. ఏడేళ్లు జైలు శిక్ష ఖరారు చేసింది. దీంతో ఆ శ్రీలంక పౌరుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
హీరోయిన్ తో పెళ్లి.. ప్రకటించిన విశాల్:
చాలా కాలంగా నటుడు విశాల్ పెళ్లి గురించి అనేక వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఎవరిని వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై స్పష్టత వచ్చింది. ఆయన సాయి ధన్సిక అనే నటిని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి, విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ వంటి నటీమణులతో ప్రేమలో ఉన్నాడని, వారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి విశాల్ సాయి ధన్సికతో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా, ఈ రోజు సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటించిన ‘యోగిదా’ అనే సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్‌కు విశాల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంలోనే విశాల్, సాయి ధన్సికతో తన వివాహాన్ని ధ్రువీకరించారు. నటి సాయి ధన్సిక ఏకంగా వివాహ తేదీని కూడా ప్రకటించింది. ఆగస్టు 29వ తేదీన తాను విశాల్‌తో ఏడడుగులు వేయబోతున్నట్లు ఆమె వెల్లడించింది. దీంతో విశాల్ పెళ్లి గురించి ఎన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి స్పష్టత లభించినట్లయింది.
ఇలాంటి పాత్ర ఇప్పటివరకు చేయలేదు:
మంచు మనోజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఈ రోజు మీడియాతో సంభాషిస్తూ, భైరవం సినిమా షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమాలో తాను గజపతి వర్మ అనే పాత్రను పోషించానని, ఇలాంటి పాత్ర ఇప్పటివరకు చేయలేదని, ఇది తన కెరీర్‌లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని తెలిపారు. “ఈ పుట్టినరోజు నుంచి నాకు కొత్త జన్మ ప్రారంభం కాబోతోంది,” అని మంచు మనోజ్ ఉద్వేగంగా చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన ఎంతగానో ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’ టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. పాజిటివ్ బజ్‌తో సినిమా ముందుకు సాగుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ నుంచి డాక్టర్ జయంతీలాల్ గడ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం మే 30న వేసవి సీజన్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మంచు మనోజ్ పుట్టినరోజు మే 20 సందర్భంగా, విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను వెల్లడించారు.
ప్రభాస్ మూవీ చేయకుండా ఉండాల్సింది:
ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘వైరవం’. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ వంటి ముగ్గురు హీరోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మే 30 న విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా రీసెంట్‌గా మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ముగ్గురు వ్యక్తులు ,మూడు స్వభావాలు , వారి మధ్య స్నేహం , పగలు , ప్రతీకారాలు , పట్టింపులు ఇలా అన్నిటికి జస్టిఫికేషన్ చేస్తూ చూపించే కథలా అనిపిస్తుంది. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించారు బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఛత్రపతి మూవీ హిందీలో రీమేక్ చేశారు. అయితే ఈ విషయం గురించి మాట్లాడుతూ..‘హిందీలో సినిమాలు చేసిన తెలుగు నటులు పెద్దగా లేరు. మా జనరేషన్‌లో అంటే ఉన్న వారిలో రానా, చరణ్ మాత్రమే చేశారు. కానీ ఛత్రపతి రీమేక్ విషయంలో తోందరపడ్డ. రాజమౌళి సినిమా 100శాతం విజయం సాధించింది. ఎమోషన్‌కు బాగా కనెక్ట్ అవుతారు అని అనుకున్నా. కానీ బాలీవుడ్ సవతి తల్లి లాంటిది, బిడ్డల సెంటిమెంట్లంటివి హిందీలో పెద్దగా ఉండవు అని నిర్మాత అల్ రెడి చెప్పారు. అయిన కూడా వర్కవుట్ అవుతుందని అనుకున్నాను. అప్పటికే దక్షిణాది చిత్రాలు ప్రేక్షకులు బాగా చూసేశారు. అందుకే ఆ సినిమా షూటింగ్ సమయంలో అది వర్కవుట్ అవుతుందా? లేదా అన్న డైలమాలో పడ్డ. దీంతో తెలియకుండా 100 శాతం దృష్టి పెట్టలేక పోయాను’ అంటూ తెలిపారు.