చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం:
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద తిరుమల శ్రీవారి భక్తులపైకి అంబులెన్స్ (108 వాహనం) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ (40), లక్ష్మమ్మ (45)గా గుర్తించారు. అంబులెన్స్ మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం పేషేంట్‌ను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తనకు అర్థం కావడం లేదని అంబులెన్స్ డ్రైవర్ అమర్ నారాయణ అంటున్నాడు.
నేడు కుప్పంకు సీఎం చంద్రబాబు:
ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. ‘స్వర్ణ కుప్పం’ పథకం పేరిట కుప్పం రూపురేఖలు మరింతగా మార్చనున్నారు. వచ్చే ఐదేళ్ల పాటు కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ పథకంను సీఎం ఆరంభించనున్నారు. ఆది, సోమ, మంగళవారం కుప్పంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. నేడు ద్రవిడ యూనివర్శిటీలో ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ డాక్యుమెంట్‌ను సీఎం విడుదల చేయనున్నారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే స్వర్ణ కుప్పం ప్రధాన లక్ష్యం. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి పథకం ప్రధాన ఉద్దేశ్యం. కుప్పం ప్రాంతంలో సుమారు మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి కుప్పంకు మరో రెండు కొత్త డైరీలు తెచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. కుప్పం నియోజకవర్గ0లో సుమారు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్:
ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు.. రేపు ఈడీ విచారించనుంది. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో ఈ రెండు సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని శుక్రవారం నోటీసులు జారీ చేశాయి. విదేశీ సంస్థకు నిధుల మళ్లింపునకు సంబంధించి ఏసీబీ ప్రశ్నించనుంది. ఈ క్రమంలో కేటీఆర్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఎఫ్ఈఓకు రూ.45.71 కోట్ల చెల్లింపులో ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండానే నిధులు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీంతో.. కేటీఆర్‌తో పాటు, బీఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌లకు కూడా నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని కూడా విచారించే అవకాశం ఉందని సమాచారం.
నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించనున్న ప్రధాని:
నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. అత్యాధునిక హంగులతో ఎయిర్‌పోర్ట్‌ను తలపించే విధంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. రూ.430 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ఈ కొత్త టెర్మినల్ రూపుదిద్దుకుంది. 9 ప్లాట్ ఫామ్‌లు, 9 లిఫ్టులు, 5 ఎస్కలెటర్లు, 2 విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో చర్లపల్లి టెర్మినల్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో పాత రైల్వే స్టేషన్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా చర్లపల్లి స్టేషన్‌ను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం.
నేడు పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం:
2.0: దేశ వ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోని మహిళా ప్రతినిధులకు పార్లమెంటు సెషన్స్, రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం ఈరోజు (జనవరి 6) లోక్‌సభలో స్టార్ట్ కానుంది. గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈ అవగాహన సదస్సును ఆరంభించనున్నారు. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన 502 మంది మహిళా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో భాగంగా వారంతా కొత్త పార్లమెంటు, సంవిధాన్ సదన్, ప్రధాన మంత్రి సంగ్రహాలయం, రాష్ట్రపతి భవన్‌లను సందర్శిస్తారు.
మరింత క్షీణించిన రైతు నాయకుడు దల్లేవాల్ ఆరోగ్యం;
పంజాబ్- హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష (70) ఈరోజు (జనవరి 6) 42వ రోజుకు చేరుకుంది. దల్లేవాల్ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర ఆందోళన చెందుతుంది. కాగా, శనివారం నాడు స్ట్రెచర్ పైనుంచే మహా పంచాయత్‌ను ఉద్దేశించి ఆయన 11 నిమిషాల పాటు ప్రసంగించారు. తిరిగి దీక్షా శిబిరంలోకి తీసుకెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. కాగా, ఆదివారం నాటికి దల్లేవాల్ మగతలో ఉన్నారని, వాంతులు చేసుకుంటున్నారని డాక్టర్ అవతార్ సింగ్ తెలిపారు.
కెనడాలో అంతర్గత తిరుగుబాటు:
కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవి నుంచి ఆయన వైదొలిగే ఛాన్స్ ఉందని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ వార్త సంస్థల్లో కథనాలు ప్రచారం చేశాయి. నేషనల్ కాకస్ మీటింగ్‌కు ముందే ట్రూడో పదవీకి రాజీనామా చేస్తారని తెలుస్తుంది. అయితే, 2013 నుంచి లిబరల్ పార్టీ నేతగా జస్టిన్ ట్రూడో ఉన్నారు. ఆ పార్టీతో పాటు ప్రధాని పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారంపై ఇప్పటి వరకు ఆయన కార్యాలయం స్పందించలేదు. ట్రూడో కార్యాలయం ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.
భారత్‌లో బంగ్లాదేశ్ జడ్జిలకు ట్రైనింగ్:
భారతదేశంలో బంగ్లాదేశ్‌కి చెందిన దిగువ న్యాయవ్యవస్థ జడ్జిలకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని అక్కడి యూనస్ సర్కార్ రద్దు చేసింది. ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ఒక రోజు తర్వాత దానిని రద్దు చేసింది. ఈ శిక్షణా కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి మధ్యప్రదేశ్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ అండ్ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో జరగాల్సి ఉంది. శిక్షణకు సంబంధించిన అన్ని ఖర్చుల్ని భారత ప్రభుత్వమే భరించాల్సి ఉంది. అయితే, నోటిఫికేషన్ రద్దు చేశామని బంగ్లా న్యాయమంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. రద్దుకు సంబంధించిన వివరణ మాత్రం ఇవ్వలేదు. బంగ్లాదేశ్‌లోని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రద్దు చేసినట్లు ది డైలీ స్టార్ పత్రిక నివేదించింది.
మాట్లాడలేని స్థితిలో విశాల్:
శాల్ నటించిన 12 ఏళ్ళ క్రితం నాటి సినిమా ‘మదగజరాజ’ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ పరిస్థితి చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత బయటకు వచ్చిన విశాల్ అనారోగ్యానికి గురైనట్టు కనిపించాడు. మొఖం అంతా వాచిపోయి, మాట్లాడుతున్న సమయంలో చేతులు వణికిపోతూ,నోట్లో నుండి మాట కూడా సరిగా రాలేని పరిస్థితిలో విశాల్ చూసి ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు విశాల్ కు ఏమైంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు విశాల్ తీవ్ర చలి జ్వరంతో భాదపడుతున్నాడని అంటుంటే, కాదని ఆ మధ్య ఓ సినిమా షూటింగ్ లో విశాల్ కు తీవ్ర గాయం కారణంగా కంటికి పై భాగంలో నరాలు కాస్త దెబ్బతిన్నాయని ఇటీవల ఆ గాయం మరల ఇబ్బంది పెట్టిందని అందువలనే వణుకుతున్నాడని ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు.
టాలెంట్‌తో పాటు, చక్కటి ప్రవర్తన కూడా ఉండాలి:
ఆప్త(అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియషన్) బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈవేడుకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా ఈకార్యక్రమంలో సూపూ కోటాన్, సాగర్ లగ్గిశెట్టి, రమేష్ తూము, మధు వల్లి, చంద్ర నల్లం, శ్రీనివాస్ చందు, శ్రీనివాస్ చిమట, విగయ్ గుడిసేవ, బాబీ అడ్డా, చలమశెట్టి అనీల్(గోపి) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఆప్త(అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియషన్) వారి ఆధ్వర్యంలో నడుస్తోన్న కేటలిస్ట్ ప్రోగ్రామ్ దేశ విదేశాల నుంచి ఎందరో హాజరయ్యారు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూరర్స్‌ని ఎంకరేజ్ చేయటానికి అందరూ ఇక్కడకు రావటం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి ఫలితం మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం, మనం ఉండే ఇతర దేశాలకు ఉపయోగపడుతుందనే విశాలమైన దృక్పథంతో ఈరోజు ఈవెంట్‌ను నిర్వహించారు’ అని అన్నారు.
కొత్త ప్రయాణం ప్రారంభించిన సానియా:
చిన్నారుల ఫిట్‌నెస్, చదువు కోసం జూబ్లీహిల్స్‌లో ‘సీసా స్పేసెస్’ను ఏడాది క్రితం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థతో కలిసి భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అడుగు వేయనున్నారు. కొత్త ఏడాదిలో సీసా స్పేసెస్‌తో కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు సానియా తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని సీసా స్పేసెస్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సానియా పాల్గొన్నారు. సీసా స్పేసెస్ భాగస్వాములైన మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల, స్వాతి గునుపాటి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.