వీరయ్య చౌదరి అంత్యక్రియలలో పాల్గొననున్న సీఎం:
దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వీరయ్య చౌదరికి నివాళులర్పించి.. ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి అంత్యక్రియలకు పలువురు టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు.
పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు అలెర్ట్. ఈరోజు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. పదో తరగతి విద్యార్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అలానే మన మిత్ర వాట్సప్ యాప్, లీప్ మొబైల్ యాప్‌లలో కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009కు హాయ్ అని మెసేజ్ చేసి.. విద్యా సేవలను సెలెక్ట్ చేసి, ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకోవాలి. అనంతరం రోల్ నంబరు ఎంటర్ చేస్తే.. ఫలితాలు పీడీఎఫ్ రూపంలో వస్తాయి.
పహల్గాం ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి:
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి చెందారు. కశ్మీర్ నరమేథంలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్నా.. ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోమంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే చంద్రమౌళి కుటుంబ సభ్యులు పహల్గాం బయల్దేరివెళ్లారు.
ఉగ్రదాడిపై కేసీఆర్ దిగ్భ్రాంతి:
ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు ప్రాంతాల నుంచి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అన్నారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూకశ్మీర్ లో టెర్రరిస్టుల మారణకాండ పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శోకతప్తులైన వారి కుటుంబీకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక:
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌంటింగ్ సాగనుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీసీయో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఇక పోటీలో ఎంఐఎం, బీజేపీ ఉన్నాయి. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలోకి దిగారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో… ఓటర్లుగా హైదరాబాద్ జిల్లాకు చెందిన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీసీయో మెంబర్స్, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం ఓటర్లు 112 కాగా.. అందులో కార్పొరేటర్లు 81, ఎక్స్ ఆఫీషియె సభ్యులు 31మంది ఉన్నారు.
5 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్:
పహల్గామ్ ఉగ్ర దాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్(26) ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదంగా మారింది. 5 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు సంతోషంగా.. ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. భార్యతో కలిసి హనీమూన్ కోసం కాశ్మీర్‌కు వెళ్లాడు. మంగళవారం పహల్గామ్‌లో భార్యతో కలిసి విహరిస్తున్నాడు. అంతే ఒక్కసారిగా ఉగ్రమూకలు విరుచుకుపడ్డారు. ముష్కరుల తూటాలకు అక్కడికక్కడే వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాది.. ముస్లిమా? అని అడిగాడని.. కాదనగానే తుపాకీతో కాల్చారని భార్య కన్నీటితో కుప్పకూలిపోయింది. అతడి మరణవార్త తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న నేవీ అధికారిని పొట్టన పెట్టుకున్నారని వాపోయారు.
కాసేపట్లో కేబినెట్ అత్యవసర భేటీ:
ప్రధాని మోడీ అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. కాసేపట్లో మోడీ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటన కోసం మంగళవారం జెడ్డా వెళ్లారు. వాస్తవానికి తిరిగి బుధవారం రాత్రికి ఢిల్లీకి చేరుకోవాలి. కానీ మంగళవారం సాయంత్రం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితో పర్యటన కుదించుకుని తిరిగి భారత్‌కు వచ్చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగగానే ప్రధాని మోడీతో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీనగర్ నుంచి అమిత్ షా పాల్గొ్న్నారు. ఇక పెరూ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హుటాహుటినా భారత్‌కు బయల్దేరారు. పహల్గామ్ ఉగ్ర దాడి ఘటన, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.
జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో కీలక సూత్రధారి వీడే?:
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈ దాడికి బాధ్యతను టీఆర్‌ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ తీసుకుంది. ఈ సంస్థ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే, టీఆర్‌ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హస్తం ఉందని వర్గాలు వెల్లడించాయి. ఈ దాడులకు అతనే ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. ఈ వార్తను జాతీయ మీడియా సంస్థ “ఆజ్‌తక్” ప్రచురించింది.
ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్:
జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్‌లోని బైసరన్‌లో మంగళవారం హృదయ విదారక ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటి వరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆ బృందం సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై ఢిల్లీ క్యాపిటల్స్ విచారం వ్యక్తం చేసింది. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. “పహల్గామ్‌లో జరిగిన విషాద సంఘటనలతో హృదయం బద్దలైంది. బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ఈ దారుణమైన చర్య వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరిని చూసి మా హృదయాలు విలపిస్తున్నాయి. ఈ దుఃఖ సమయంలో మేము వారితో ఉన్నాం. వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం.” అని రాసుకొచ్చిన ఢిల్లీ.. వారికి సంఘీభావం ప్రకటించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా బాధితుల కోసం ప్రార్థిస్తున్నారు.
ఓజీ రిలీజ్ డేట్ అప్పుడేనట:
మూవీ రిలీజ్ డేట్ గురించి ఓ క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబర్ 5వ తేదీన మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై రీసెంట్ గానే పవన్ కల్యాణ్.. డైరెక్టర్, నిర్మాతకు సూచించారంట. పెండింగ్ పనులు క్లియర్ చేసేసి ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 5న ఓజీ మూవీని రిలీజ్ చేయాలని చెప్పారంట. దీంతో డైరెక్టర్ మూవీ పనుల్లో చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. మే నుంచి వరుసగా అప్డేట్లు కూడా ఇస్తారంట. మే నెలలో హరిహర వీరమ్లలు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దాని తర్వాత నుంచే ఓజీ మీద అప్డేట్లు ఇస్తారు.. రిలీజ్ డేట్ వచ్చే సరికి మూవీ మీద హైప్ పెంచబోతున్నారు. పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది కూడా ఉంది. మిగతా సినిమాలతో పోలిస్తే ఓజీ మీద కాస్త ఎక్కువ అంచనాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ కూడా పదే పదే ఓజీ గురించి ప్రస్తావిస్తున్నారు.
మా హృదయాలను పిండేస్తోంది:
జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ ఉగ్రదాడి అత్యంత క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వివరించారు. బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కుతోంది. ఇలాంటి దారుణాలు జరగకూడదు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాధితులను చూస్తుంటే నా గుండె బరువెక్కుతోంది. ఇలాంటి దారుణాలు జరగకూడదు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
‘అఖండ 2’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్:
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా.. అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం పక్క. అలాంటిది ఇప్పుడు ‘అఖండ’ లాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ తో వీళ్ళు మన ముందుకు రాబోతున్నారంటే, ఇక ఏ రేంజ్ బజ్ ట్రేడ్‌లో ఉంటుందో చెప్పకర్లేదు. గత ఏడాది నుండి విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. ఇందులో ఒక పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో లేడీ సూపర్ స్టార్ సీనియర్ నటి విజయశాంతి కూడా నటించబోతుందని టాక్. రీసెంట్ గానే ఆమెను కలిసి బోయపాటి శ్రీను ఈ స్టోరీని, ఆమె పాత్ర గురించి వివరించగా.. దీంతో ఈ చిత్రంలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక షూటింగ్ సెట్స్‌లో ఉన్నప్పుడే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ అనేక ప్రాంతాల్లో పూర్తి కాగా.. బాలయ్య కెరీర్ లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయట. అయితే తాజాగా మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.. ఏంటీ అంటే నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెలలో జార్జియాకు వెళుతోంది. మే నెల అంతా జార్జియాలోనే షూటింగ్ చేస్తారట. అంతేకాదు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న టీజర్ విడుదల కాబోతుందట.