కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం:
దేశ వ్యాప్తంగా కమల వికాసం కనిపిస్తోందని, 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అద్భుతమైన సంపూర్ణ విజయం లభించిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం సాధ్యమైందని, ఈ గెలుపు వారికే అంకితం అని పేర్కొన్నారు. ఢిల్లీలో 10 ఏళ్లు మభ్యపెట్టి వంచించిన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి.. ప్రజలు సుపరిపాలనకు అవకాశం కల్పించారన్నారు. డబులు ఇంజన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అని ఢిల్లీ ప్రజలు నమ్మారన్నారు. ఢిల్లీ, ఏపీ ఎన్నికల ఫలితాలకు సారూప్యత ఉందని పురందేశ్వరి చెప్పుకొచ్చారు. ఎంపీ పురంధేశ్వరి సమక్షంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి సౌత్ కాంగ్రెస్ ఇంచార్జ్ వాసుపల్లి సంతోష్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంపై స్పందించారు.
పెన్నుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు:
అక్కడ ఇచ్చే పెన్నుల కోసం ప్రతిఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా వీటి కోసం పోటీ పడతారు. పరీక్షలు వచ్చాయంటే విద్యార్థుల్లో భయం ఒక ఎత్తైతే.. తల్లిదండ్రుల ఆందోళన మరోఎత్తు. అయితే కొందరు తల్లిదండ్రులు, విద్యార్థులు మాత్రం ఓ పెన్ను కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన పెన్నుతో పరీక్షలు రాస్తే విజయం సొంతమట. అదే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి పెన్నుల పండుగ. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాణిపాకం విఘ్నేశ్వర ఆలయం తర్వాత అంతటి ప్రాముఖ్యమైన దేవాలయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం. విద్యను ప్రసాదించే ఆదిగణపతిగా కొలువైన విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఏటా చదువుల పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది. అంబేథ్కర్ కోనసీమ జిల్లాలో కొలువై ఉన్న ఈ ఆలయంలో ఈ ఏడాది కూడా మూడు రోజుల పాటు దిగ్విజయంగా చదువుల పండుగ జరిగింది. స్వామి వారి పాదాలు వద్ద ప్రత్యేకంగా పూజలు చేసిన పెన్నులు తీసుకొని పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో స్వామి వారి పాదాల చెంత అభిషేకం చేసిన పెన్నులను ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు అట్టహాసంగా పంపిణీ చేశారు. స్వామివారి ప్రసాదంగా స్వీకరించే పెన్నులు కోసం వచ్చిన విద్యార్థులు, భక్తులతో ఆలయం కిక్కీరిసిపోయింది. అధిక సంఖ్యలో విద్యార్దుల రాకతో సుమారు కిలోమీటరు మేర పెన్నులు తీసుకునేందుకు బారులు తీరారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో ముందస్తు చర్యలు చేపట్టారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై రెచ్చిపోయిన యువత:
హైదరాబాద్ నగరంలో మరోసారి కార్ రేసర్లు రెచ్చిపోయారు. శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున కొంతమంది యువకులు కార్లతో రేసింగ్‌లు, స్టంట్‌లు చేయడం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ యువకులు ఓఆర్‌ఆర్‌పై వేగంగా కార్లు నడిపించి, ఆపై ఒక్కసారిగా వాటిని ఆపి గింగిరాలు తిప్పారు. ఇలా ఉన్నచోటే కార్లను పలుమార్లు రౌండ్‌గా తిప్పుతూ హంగామా సృష్టించారు. ఈ కార్ రేసింగ్ కారణంగా ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులకు పెద్ద ఇబ్బందులు ఎదురయ్యాయి. వీరి స్టంట్‌లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అవడంతో, ఆ ఫుటేజీ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
అవయవదానంతో మరికొందరికి ప్రాణదానం చేసిన డాక్టర్:
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ వద్ద జరిగిన విషాద రోడ్డు ప్రమాదం విషాదంగా ముగిసింది. తొమ్మిది రోజుల క్రితం డివైడర్‌ను ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఇద్దరు డాక్టర్లు యశ్వంత్, భూమిక తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో డాక్టర్ యశ్వంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, డాక్టర్ భూమిక గాయాలతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, డాక్టర్ భూమికకు బ్రెయిన్ డెడ్ కావడంతో.. అవయవ దానం చేయాలని ఆమె కుటుంబం నిర్ణయించుకుంది. ఈ అవయవదానం ద్వారా మరో కొంతమంది ప్రాణాలను కాపాడే అవకాశం వచ్చింది. ఈ నిర్ణయం నిజంగా సమాజానికి ఒక స్ఫూర్తిధాయకంగా నిలుస్తోంది. డాక్టర్ భూమిక అవయవాలను దానం చేయడం ద్వారా ఆమె తల్లిదండ్రులు ఇతరుల జీవితాలను రక్షించారు.
బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్:
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా జీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వారి ఉనికి లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. దేశంలో నక్సలిజాన్ని రూపుమాపేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా ధళాలు జల్లెడ పడుతూ మావోయిస్టులను ఏరివేస్తున్నారు.
41 మంది సజీవ దహనం:
ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది. తాజాగా మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ మెక్సికోలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించారు. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టిందని మెక్సికోలోని టబాస్కో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో ఈఘోరం చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. బస్సు కాన్కున్ నుంచి టబాస్కోకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సులోని 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు మృతిచెందినట్లు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ కూడా మరణించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 38 మృతదేహాలను వెలికితీసినట్లు వెల్లడించారు.
‘తండేల్’ రెండు రోజుల కలెక్షన్స్:
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ హైప్ తో వచ్చిన ఈ మూవీ అనుకున్న అంచనాలను అందుకుంది. తొలి ఆట నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. ఫస్ట్ డే కి ధీటుగా రెండో రోజు కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో భాగంగా తాజాగా మేకర్స్ అఫీషియల్ గా వసూళ్ల వివరాలు అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు రూ. 21.27 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లుగా చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు దగ్గర దగ్గర రూ. 20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం రెండు రోజులు కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా రూ.41.20 కోట్ల వసూళ్లు సాధించినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం.
‘లూసిఫర్ 2: ఎంపురాన్’ నుండి మరో పవర్ ఫుల్ పోస్టర్:
మాలీవుడ్ తో పాటుగా తదుపరి భాషలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎంపురాన్’ చిత్రం రాబోతుంది. మోహన్ లాల్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మొదటి భాగం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే నటుడిగా అందరికీ తెలిసిన పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం అనగానే..గతంలో అందరూ కాస్త సందేహంగా చూశారు. కానీ ఎప్పుడైతే మొదటి ‘లూసిఫర్’ తిరుగులేని హిట్ అందుకుందో అప్పటి నుండి అతని డైరెక్షన్ టాలెంట్ ఏంటో అందరికీ అర్థమైంది. దీంతో ‘ఎంపురాన్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ఎంతో ఆకట్టుకోగా. ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, జైస్ జోస్.. లాంటి స్టార్స్ అందరూ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఛాంపియన్గా MI కేప్ టౌన్:
SA20 2025 లీగ్ ఉత్కంఠభరితమైన మూడో సీజన్ ముగిసింది. జోహానెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో, MI కేప్ టౌన్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్లు తలపడ్డాయి. ఈ సీజన్లో మొదటిసారిగా ఫైనల్‌లో అడుగు పెట్టిన MI కేప్ టౌన్ జట్టు, అదృష్టం కలిసి విజయం సాధించింది. రషీద్ ఖాన్ నేతృత్వంలో ఈ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ స్టేజిలో టాప్ స్థానంలో నిలిచిన తరువాత ఫైనల్‌లో కూడా విజయం సాధించడంలో మంచి ప్రదర్శన ఇచ్చింది. దీనితో MI కేప్ టౌన్ మొదటిసారి విజయం సాధించింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు మూడోసారి కప్ గెలవాలన్న కోరికకు సౌతాఫ్రికా టీ20 లీగ్ లో నిరాశ ఎదురైంది. సన్ రైజర్స్ ను MI కేప్‌టౌన్ దెబ్బకొట్టింది. 182 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ కేవలం 18.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
గ్రౌండ్లోనే నెత్తురోడిన స్టార్ ప్లేయర్:
ఈ ఏడాది పాకిస్తాన్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025ను ఆతిథ్యం ఇవ్వబోతున్న నేపధ్యంలో ఇప్పటికే ఆ దేశం ప్రతిపాదనలు, తయారీలు వివాదాస్పదంగా మారాయి. 24 సంవత్సరాల తరువాత పాకిస్తాన్‌లో ఐసీసీ టోర్నమెంట్ నిర్వహణకు శ్రీకారం చుట్టినప్పుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఇంకా సిద్ధతలకు సంబంధించి కొన్ని లోపాలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాకిస్థాన్ లో ట్రై సిరీస్ లో భాగంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో సీరిస్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన పోరులో ఒక దుర్ఘటన చోటుచేసుకుంది. గద్దాఫీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర ఘోరంగా గాయపడ్డాడు. సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం, ఫ్లడ్ లైట్లు సరిగా పనిచేయకపోవడం కారణంగా రవీంద్ర బంతిని సరిగ్గా చూడలేకపోయాడు. ఈ కారణంగా బంతి అతని కంటి పక్కకు బలంగా తాకి, అతని ముఖం రక్తంతో నిండిపోయింది. దాంతో అతడిని గ్రౌండ్ నుండి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.