దగ్గుబాటి పుస్తకం రాస్తారని అస్సలు ఊహించలేదు:
మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదిక పైకి వచ్చారు. చంద్రబాబు, దగ్గుబాటి కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా.. ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం మాత్రం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘దగ్గుబాటి వెంకటేశ్వర రావు పుస్తకం రాస్తారని అస్సలు ఊహించలేదు. 40 ఏళ్లు కలిసి ఉన్నాం కానీ.. ఆయన పుస్తకం రాయడం ఏంటని నాకు డౌట్ వచ్చింది. దగ్గుబాటి మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి. దగ్గుబాటి ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారు. వేంకటేశ్వర రావు రైటర్ కాని రైటర్. ఆయన డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేయలేదు. మంత్రిగా ఉండి ప్రాక్టీస్ చేశారు.. సినిమాలు తీశారు. యాక్తివ్ లైఫ్ నుంచి రిటైర్డ్ లైఫ్ కు వచ్చారు కదా.. ఎలా కాలక్షేపం అని అడిగాను. నాకూ అటువంటి పరిస్థితి రావచ్చని అడిగాను’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదు:
ఇప్పటివరకు ఏపీలో 14 వేల పెన్షన్లు తొలగించాము అని, కానీ లక్షల్లో పెన్షన్లు తొలగిస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతోందని, అనర్హులకు పెన్షన్ తీసేసినా తప్పులేదన్నారు. 2019 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ల కింద 53 లక్షల 85 వేల 796 మంది లబ్ధిదారులు ఉండగా.. ప్రస్తుతం 63 లక్షల 59 వేల 907 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని మంత్రి కొండపల్లి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో పెన్షన్ లబ్దిదారుల వెరిఫికేషన్ గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జవాబు ఇచ్చారు.
శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్:
మలక్ పేటలో శిరీష హత్య కేసులో సరిత క్రూరత్వంపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రొఫైల్ పిక్ లో ఆమె అసలు రంగు బయటపడింది. నన్ను తట్టుకుని నిలవాలంటే మూడే దారులు.. మారిపోవాలి, పారిపోవాలి, లేదా సచ్చిపోవాలి అంటూ సవాల్.. నువ్వు సవాలు విసరకు.. నేను శవాలు విసురుతా అని పోస్టులో సరిత పేర్కొనింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక, శిరీషను చంపేందుకు పలుమార్లు సరిత స్కెచ్ వేసినట్లు తేలింది. ఆమె గురించి తెలిసే భర్త దూరం పెట్టాడు.. అమెరికా నుంచి సరితను బలవంతంగా ఇండియాకు పంపించాడు. ఆరు నెలల క్రితం ఇండియాకు వచ్చిన సరిత అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు శిరీషను కిరాతకంగా చంపేసింది సరిత.
నేను ఎమ్మెల్సీ అడగడం లేదు:
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈరోజు ఢిల్లీకి పయనం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్సీ అడుగుతలేను.. నేను అడగొద్దు కూడా అన్నారు. నాకు పార్టీ ఆల్రెడీ టికెట్ ఇచ్చింది.. పోటీ చేసిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓడిపోయానని పేర్కొన్నారు. నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశా.. ఎమ్మెల్సీ కావాలని పడి పడి మరి అడిగే గుణం నాది కాదు అని వెల్లడించారు. మీడియా మిత్రులు ఎవరు కూడా ఎమ్మెల్సీ విషయంలో ఊహాగానాల వార్తలు రాయొద్దని జగ్గారెడ్డి తెలియజేశారు. ఇక, 2017లో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల గురించి వారి దృష్టికి తీసుకెళ్లాడం కోసమే గత ఆరు నెలల నుంచి ఢిల్లీకి వెళ్లాలని అనుకుంటున్నాను.. రాహుల్ సభ ఆర్గనైజేషన్, ఎలాంటి పరిస్థితుల్లో సభ ఏర్పాట్లు చేశానో ఆ విషయాలన్నింటినీ ఆయనకే స్వయంగా చెప్పాలని ఇప్పుడు హస్తినకు పోతున్నాను.. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరుతాను.. అపాయంట్మెంట్ దొరికితే అతడితో మాట్లాడుతాను అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌కి ఊరట:
సుప్రీంకోర్టులో తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట లభించింది. సనాతన ధర్మం వ్యాఖ్యలపై కొత్త కేసులను నమోదు చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉదయనిధికి ఉపశమనం లభించింది. తదుపరి చర్యలకు కోర్టు అనుమతి అవసరం అని సుప్రీం ధర్మాసనం గురువారం పేర్కొంది. సనాతన ధర్మం వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్‌లను ఏకీకృతం చేయాలని కోరుతూ ఉదయనిధి స్టాలిన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా కేసులు నమోదు చేయొద్దని. అంతేకాకుండా చర్యలు తీసుకునే ముందు కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది. 2023, సెప్టెంబర్‌లో ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని… డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అయితే తన వ్యాఖ్యలు ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నవి కాదని.. సామాజిక అన్యాయాలను ప్రశ్నించడానికేనని ఉదయనిధి తెలిపారు.
రాజీవ్‌గాంధీపై మణిశంకర్ అయ్యర్ వ్యక్తిగత విమర్శలు:
దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై సొంత పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ వ్యక్తిగత విమర్శలకు దిగారు. రాజీవ్ గాంధీ రెండు సార్లు చదువులో ఫెయిల్యూర్ అయ్యారని.. అయినా కూడా ఆయన ప్రధానమంత్రి కావడం ఆశ్చర్యం కలిగించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ అస్త్రంగా మార్చుకుంది. రాజీవ్‌గాంధీ కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యషించేటప్పుడు రెండు సార్లు విఫలం చెందారని తెలిపారు. యూనివర్సిటీ ఇమేజ్‌ను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఉత్తీర్ణులవుతారని.. కానీ కేంబ్రిడ్జ్‌లోనూ… లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలోనూ రెండు చోట్ల రాజీవ్ గాంధీ ఫెయిల్యూర్ అయ్యారన్నారు. అలాంటి వ్యక్తి.. దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు తాను చాలా ఆశ్చర్యపోయానని మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు.
హమాస్‌కు ట్రంప్ చివరి వార్నింగ్:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌కు మరోసారి తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. బందీలను వెంటనే విడుదల చేయాలని.. లేదంటే అంతు చూస్తానంటూ చివరి హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. బందీలుగా ఉన్న వారందరినీ వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా మరణించిన వారి మృతదేహాలను కూడా తిరిగివ్వాలని కోరారు. లేకుంటే తగిన ఫలితం అనుభవిస్తారని తెలిపారు. తాను చెప్పినట్లు వినకపోతే హమాస్‌లో ఏ ఒక్కరూ సురక్షితంగా ఉండరని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన బందీలతో మాట్లాడినట్లు చెప్పారు. గాజా ప్రజల కోసం మంచి భవిష్యత్ ఉంది.. త్వరగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
లండన్ టూర్‌లో ఉగ్ర కలకలం:
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఉగ్ర కలకలం చోటుచేసుకుంది. ఖలీస్తానీ ఉగ్రవాదులు.. జైశంకర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. భారతీయ జెండాను చించేసి నానా హంగామా సృష్టించారు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు.. ఖలీస్తానీ ఉగ్రవాదితో పాటు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో పలు అధికారిక సమావేశాలు ముగించుకుని జైశంకర్ బయటకు వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం (మార్చి 4) జైశంకర్ యూకే పర్యటనకు వెళ్లారు. ఈనెల 9వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బ్రిటన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్యలు జరిపారు. వివిధ అంశాలపై ఇరువు చర్చించారు. అనంతరం ‘ప్రపంచంలో భారతదేశ వృద్ధి.. పాత్ర’ అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైశంకర్ ప్రసంగించారు. ఇక యూకే పర్యటన తర్వాత జైశంకర్ ఐర్లాండ్‌కు వెళ్లనున్నారు.
25 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌తో భారత్ ఢీ:
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగనుంది. ఇక, ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా, కివీస్ మధ్య జరిగబోయే పోరు చాలా ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఎందుకంటే, సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత ఈ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఒకదానికొకటి పోటీ పడబోతున్నాయి. అయితే, వాస్తవానికి 8 టీమ్స్ మధ్య జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో స్టార్ట్ అయింది. ఈ టోర్నమెంట్ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించనున్నారు. కానీ, కరోనా దెబ్బకి ఈ టోర్నమెంట్ 2017 నుంచి ఇప్పటి వరకు జరగలేదు. కానీ, ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో టీమిండియా 25 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ జట్టును ఎదుర్కోబోతోంది.
యంగ్ డైరెక్టర్ తో రామ్ పోతినేని:
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి పరిచయం అక్కర్లేదు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, క్యారెక్టర్లు, లుక్స్ పరంగా, ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపిస్తూ, హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కానీ ఎనర్జిటిక్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ కెరీర్ గ్రాఫ్, ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయిపోయింది. యాక్షన్ మూవీస్ తో బ్యాక్ బ్యాక్ అలరిస్తున్నప్పటికి హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. చివరిగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వరుస చిత్రాలు లైన్ లో పెడుతున్నాడు. తాజాగా రామ్, యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘హిట్’ మూవీతో యూనివర్స్‌ని పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలను, రామ్ కోసం ఓ మాస్ ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ ట్రాక్ లోకి తీసుకురానున్నట్లు టాక్. ఇక సినిమాపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.
ధనుష్ దర్శకత్వంలో అజిత్ కుమార్:
కోలీవుడ్ హీరో ధనుష్ ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు దర్శకుడిగాను వరుస సినిమాలు చేస్తున్నాడు. కోలీవుడ్ లో మరే హీరో చేయని సినిమాలు చేస్తున్నాడు. గతేడాది స్వీయ డైరెక్షన్ లో నటించిన రాయన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే జోష్ లో ఈ ఏడాదిలో మేనల్లుడు హీరోగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాతో అలరించాడు ధనుష్. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. కాగా ప్రస్తుతం తన దర్శకత్వంలో ‘ఇడ్లి కడై’ అనే సినిమా చేస్తున్నాడు ధనుష్. కోలీవుడ్ యంగ్ హీరో అరుణ్ విజయ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అయితే కోలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అదేమంటే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా ధనుష్ ఓ సినిమా చేయబోతున్నాడట. ఇందుకు సంబంధించి ధనుష్ ఇటీవల అజిత్ కు కథ కూడా వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తమిళ సినీ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే గనుక కార్యరూపం దాల్చితే కోలీవుడ్‌లో ఈ సెన్సేషన్ కాంబో హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం. కోసమేరుపు ఏంటంటే ప్రస్తుతం ఆదిక్ డైరెక్షన్ లో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఈ నెల 10న విడుదల కానుంది. అదే రోజు ధనుష్ సినిమా ఇడ్లీ కడై రిలీజ్ డేట్ వేశారు. దీంతో సోషల్ మీడియాలో అజిత్ ఫ్యాన్స్, ధనుష్ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు. అయితే ధనుష్ ‘ఇడ్లీ కడై’ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.