ఎవరైనా తప్పించుకోలేరు:
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడిచిందని, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత ప్రభుత్వ నాయకులు ఐదేళ్లలో చాలా దారుణాలు చేశారన్నారని, ఆరోజు మూగబోయిన గొంతులు ఈరోజు వస్తున్నాయన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా, ఎంతటి హోదాలో ఉన్నా తప్పించుకోలేరని హెచ్చరించారు. వైసీపీ నాయకులు నష్ట నివారణ కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారని మంత్రి డోలా ఎద్దేవా చేశారు.
సోదరుడి కర్మక్రియలు హాజరైన సీఎం:
స్వగ్రామం నారావారిపల్లెలో సోదరుడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి కర్మక్రియలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. బుధవారం రాత్రే నారావారిపల్లెకు చేరుకున్న సీఎం.. నేడు ఉదయం సోదరుడి కర్మక్రియల్లో పాల్గొన్నారు. రామ్మూర్తి నాయుడి పెద్దకర్మకు సీఎంతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్ కూడా హాజరయ్యారు.
సీఎం కుటుంబ వివరాలు నమోదు:
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇంలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు సీఎం ఇంటికి వెళ్లి డీటెయిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా సర్వే పురోగతిపై సీఎం అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని ఆరా తీశారు. హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వీలయినంత త్వరగా కులగణన సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్‌వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ అరెస్ట్:
బీఆర్ఎస్‌వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగిలో ప్రసాద్ ను అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీ యజమానులను ప్రసాద్ ముఠా బెదిరిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అడ్మిషన్లతో పాటు రూ.10 లక్షలు డబ్బులు కావాలని ప్రసాద్ డిమాండ్ చేస్తున్నట్లు గుర్తించారు. డబ్బులు ఇవ్వని కాలేజీ యజమాన్యాల ఇంటికి వద్దకు వెళ్లి ప్రసాద్ వేధింపులకు గురి చేస్తున్నాడని వివరించారు. ఇంజనీరింగ్ కాలేజీ యజమానుల ఇంటి వద్ద, కాలేజ్ యజమానుల కుటుంబ సభ్యులను ప్రసాద్ ముఠా వేధిస్తున్నట్టు తెలిపారు. యజమాలను చేజ్ చేయడమే కాకుండా వారిని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ లో ఉంటూ ప్రసాద్ ముఠా బెదిరింపులకు పాల్పడుతున్నారని గుర్తించారు.
ఢిల్లీలో భారీ పేలుడు:
దేశ రాజధానిలో మరోసారి పేలుడు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం పెద్ద ఎత్తున వినిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం.. గురువారం ఉదయం 11:58 గంటలకు పేలుడు సంబవించింది. ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఉన్న బన్సీ స్వీట్స్ షాప్ ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. అంతకుముందు అక్టోబర్ 20న కూడా ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది.
కుదిరిన మహారాష్ట్ర కేబినెట్:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం ప్రతిష్టంభన ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం పదవి బీజేపీకే దక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా క్యాబినెట్ కూర్పు పైనా మహాయుతి కూటమిలో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. అయితే మంత్రిమండలిలో సగం బెర్త్‌లు బీజేపీ దగ్గరే ఉంచుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు మూడు కీలక శాఖలతో పాటు 12 మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది.
చివరి దశలో హరి హర వీర మల్లు:
‘హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ తో పాటు, 200 మంది ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారు. ఈ షెడ్యూల్ తో ‘హరి హర వీర మల్లు’ చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.
రామ్‌గోపాల్ వర్మ మరో పిటిషన్:
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని, చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని ఆర్జీవీ పిటిషన్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని, ఇకపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ కోరారు. ఈరోజు ఆర్జీవీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారించనుంది. ఆర్జీవీ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
నాడాపై బజరంగ్ పునియా ఫైర్:
ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పూనియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 4 ఏళ్ల పాటు బ్యాన్ విధించింది. ఈ నిషేధంపై ఈరోజు (నవంబర్ 28) పూనియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తనతో పాటు మరి కొందరు రెజ్లర్లను లక్ష్యంగా చేసి.. అధికారుల ద్వారా వేధిస్తోందని ఆరోపణలు చేశారు. తమ గొంతు నొక్కాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.. కానీ తాను తలవంచబోనని వెల్లడించారు. ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరితే తనపై ఎలాంటి కేసులు, నిషేధాలు ఉండవని చెప్పుకొచ్చారు. వేధింపులకు గురైన మహిళలకు, అన్నదాతల పోరాటానికి సపోర్టుగా నిలిచిన నాటి నుంచే మోడీ సర్కార్ తమను టార్గెట్ చేసిందని బజరంగ్ పూనియా పేర్కొన్నారు.