జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం:
జకియా ఖానంను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం అని, బీజేపీ మతతత్వ పార్టీ కాదని జకియా ఖానం చేరిక ద్వారా చెపొచ్చు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కులమతాలకు తావులేకుండా భారతీయులుగా ముందుకెళ్లాలన్నది బీజేపీ నినాదం.. మూల సిద్ధాంతం అని చెప్పారు. దేశంలో బీజేపీ అద్భుతమైన పాలనను అందిస్తోందన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో దృఢమైన నిర్ణయం ప్రధాని మోడీ తీసుకున్నారని పురంధేశ్వరి ప్రశంసించారు. ఈరోజు ఉదయం వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పిన జకియా ఖానం.. కాసేపటి క్రితం కాషాయ కండువా కప్పుకున్నారు.
బీజేపీలో చేరిన జకియా ఖానం:
ఈరోజు ఉదయం వైసీపీ పార్టీకి జకియా ఖానం గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జకియా ఖానం.. కొద్ది గంటల్లోనే బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే పార్థ సారధి పాల్గొన్నారు. బీజేపీలో చేరిన అనంతరం జకియా ఖానం మాట్లాడుతూ… ‘ప్రధాని న్రరేంద్ర మోడీ కులమతాలకు అతీతంగా అందరినీ తన బిడ్డలుగా భావించారు. వక్ఫ్ సంపదలో ముస్లిం పేదలు కూడా భాగస్వాములు కావాలని మోడీ ఆలోచించారు. బీజేపీలోకి వచ్చి ముస్లిం మైనారిటీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఆలోచించాను. నన్ను చూసి ముస్లిం మైనారిటీలు బీజేపీలో మరింత మంది చేరాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
రేవంత్ స్థానంలో కేసీఆరే సీఎం:
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నేడు (మే 14)న మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తున్న, ఇకముందు కూడా చేస్తానని హరీష్ రావు చెప్పుకున్నారు.. కేటీఆర్ నాయకత్వంలో కూడా పని చేస్తానని వివరించుకున్నారు.. ఎందుకు హరీష్ రావు అలా మాట్లాడారన్నది ఇప్పుడు ప్రధాన అంశమని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలన పూర్తి అయి.. కాంగ్రెస్ పాలన ప్రారంభమైందని అన్నారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తరువాత కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యమని ఆయన సంచలన కామెంట్స్ చేసారు.
కొత్త సమాచారం కమిషనర్లు నియామకం:
తెలంగాణ రాష్ట్రంలో సమాచారం హక్కు చట్టం (RTI) అమలుకు సంబంధించి కీలక పాత్ర పోషించే సమాచార కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. పీవీ శ్రీనివాసరావు, మోసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్ లను రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించారు. వీరు తలపట్టిన ఈ పదవి మూడేళ్ల కాలానికి ఉంటుంది.
కరాచీ పోర్టు అష్టదిగ్బంధనం:
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందుకు ప్రతిగా పాక్ ప్రతిస్పందించే అవకాశాన్ని పసిగట్టిన నౌకాదళం సముద్ర సంసిద్ధతను గణనీయంగా పెంచడానికి అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పాక్‌లోని కరాచీ పోర్టే లక్ష్యంగా ఐఎన్‌ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను భారీగా మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వాటిని మోహరించడంతో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందన్నారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసిన సీడీఎస్:
భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును “ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టేట్” (సీడీఎస్) అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు కలిశారు. సైన్యం అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావికాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్మును కలిసి “ఆపరేషన్ సిందూర్” విజయం గురించి వివరించారు అధికారులు. ఇక, ఉగ్రవాదంపై భారతదేశం ప్రతిస్పందించిన తీరును, సాయుధ దళాల శౌర్యం, అంకితభావాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు.
పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల:
పాకిస్తాన్ రేంజర్లు గత నెల ఫిరోజ్‌పుర్ దగ్గర అదుపులోకి తీసుకొన్న బీఎస్‌ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ సాహూను ఎట్టకేలకు రిలీజ్ చేశారు. అతడిని ఈ రోజు ఉదయం పంజాబ్‌లోని అటారీ సరిహద్దు వద్ద భారత దళాలకు అప్పగించినట్లు పీటీఐ పేర్కొంది. అయితే, బీఎస్‌ఎఫ్ 182వ బెటాలియన్‌కి చెందిన జవాన్ పూర్ణమ్.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ సెక్టార్‌లో డ్యూటీ చేస్తున్నాడు. ఏప్రిల్ 23న సరిహద్దు దగ్గర కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తుండగా ఆయన కాస్త ఆనారోగ్యానికి గురయ్యారు. దీంతో సమీపంలో ఓ చెట్టు కనిపించడంతో దానికింద రెస్ట్ తీసుకున్నారు. అయితే, ఆ చెట్టు పాక్ భూభాగంలో ఉన్న విషయాన్ని గమనించలేకోపోయారు.
పాక్కి ఊహించని షాక్:
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. పాక్ పై భారత్ మెరుపు దాడులతో దాయాది దేశానికి చావు తప్పి కన్నులొట్టపొయినట్లు అయింది. దీని నుంచి తేరుకునే లోపు పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగలింది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్ పై పోరాటం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అయితే, బలూచిస్తాన్, పాకిస్తాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రావిన్స్, దీర్ఘకాలంగా స్వాతంత్ర్య ఉద్యమాలకు కేంద్రంగా కొనసాగుతుంది.
మసూద్ అజార్‌కు రూ. 14 కోట్ల నష్టపరిహారం:
ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. ఈ దాడుల్లో అనేక మంది టెర్రరిస్టులు చనిపోయారు. అయితే, జైషే మహమ్మద్ అధినేత, మసూద్ అజార్ ఫ్యామిలీలోని 14 మంది ఈ దాడుల్లో చనిపోయారు. దీంతో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. భారత్ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయాల నష్టపరిహారం అందజేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మసూద్ అజార్‌కు నష్ట పరిహారం కింద సుమారు రూ. 14 కోట్లు దక్కే ఛాన్స్ ఉంది.
తగ్గిన బంగారం ధరలు:
కొన్ని రోజుల క్రితం ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధర.. ఇటీవలి రోజుల్లో పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. నిన్న భారీగా పెరిగిన పసిడి రేట్లు.. ఈరోజు స్వల్పంగా తగ్గాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.540 తగ్గితే.. 22 క్యారెట్లపై రూ.500 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (మే 14) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,050గా.. 24 క్యారెట్ల ధర రూ.96,060గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
బీసీసీఐ శతవిధాలా ప్రయత్నాలు:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో విదేశీ ఆటగాళ్ల లభ్యత కీలక సమస్యగా మారింది. మే 9న లీగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేయడంతో అనేక విదేశీ ఆటగాళ్లు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో ప్లేఆఫ్ దశకు చేరిన పలు ఫ్రాంచైజీలకు తమ ముఖ్య ఆటగాళ్లను కోల్పోయే ప్రమాదం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ విదేశీ ఆటగాళ్లను తిరిగి భారత్‌కి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఐపీఎల్ సీఈఓ హేమాంగ్ స్వయంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులతో నేరుగా మాట్లాడుతున్నారు. అలాగే, పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లతో వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే, ఆటగాళ్ల రాకపై నిర్ణయం తామేమీ తీసుకోబోమని, ఇది అటుగాళ్ల వ్యక్తిగత నిర్ణయమే అని ఆసీస్ క్రికెట్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.
నా అనుమతి లేకుండా ఫొటోలు తీయొద్దు:
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రీతి జింటా తాజాగా ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఓ అభిమాని ఆమెను ‘ మీ గురించి తెలియని విషయం ఒకటి చెప్పండి’ అని ప్రశ్నించగా..దానికి ప్రీతి స్పందిస్తూ.. ‘ఆలయాలలో , బాత్రూంలో, భద్రతా తనిఖీల సమయంలో ఫొటోలు తీస్తే నాకు అసలు నచ్చదు. ఈ సమయాలలో తప్ప మిగతా సమయంలో ఫొటో అడిగిన, నాతో దిగిన కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ముఖ్యంగా నా పిల్లల ఫోటోలు తీస్తే నాలోని ‘కాళి’ బయటకు వస్తుంది. నేను ఎంతో సరదా మనిషిని, కానీ నా అనుమతి లేకుండా వీడియోలు తీయోద్దు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైన నన్ను నేరుగా అడగండి, దయచేసి నా పిల్లలను వదిలేయండి’ అంటూ ప్రీతి జింతా చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ చాట్ వైరల్ అవుతుంది.
రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి టైం ఫిక్స్:
కొంచెం గ్యాప్ తీసుకున్న రామ్.. ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ భారీ చిత్రంలో, రామ్ సరసన హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ప్రేమకథా నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా రామ్ పోతినేనికి ఓ కొత్త మేకోవర్‌గా ఉండబోతుందన్న ఫిలింనగర్ టాక్. ఇక పోతే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ వీడియో ను మే 15న రామ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఈ చిత్రం గ్లింప్స్ ఇంకా టైటిల్‌లు ఈ మే 15 ఉదయం 10 గంటల 8 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాదు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రివీల్ చేశారు. మరి ఈ చిత్రానికి పెట్టిన టైటిల్ ఏంటి అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.