విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం.. బొత్స గెలుపు ఇక లాంఛనమే!
ఏపీలోని విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. విశాఖ జిల్లా నేతలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులుగా పోటీలో నిలిపేందుకు ఆయన సమాలోచనలు చేశారు. ఆయనతో పాటు ఉపఎన్నికల్లో పోటీచేయాలా లేదా అనే విషయంపై కూటమి పార్టీలు తర్జనభర్జన పడ్డాయి. సరైన బలం లేకపోవడంతో చివరికి పోటీ నుంచి తప్పుకున్నాయి. వైసీపీకి మెజార్టీ సభ్యుల మద్దతు ఉండటంతో పోటీ చేయకపోవడమే మంచిదని నిర్ణయించారు. ప్రస్తుతం వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థి షేక్ సఫీ పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోయినా బొత్స విజయం లాంఛనమే కానుంది. ఎందుకంటే.. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది జడ్పీటీసీలు, 97 మంది కార్పొరేటర్లు, 53 మంది కౌన్సిలర్లు, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. మరో ముగ్గురు వైసీపీ ఎక్స్ ఆఫీషియో కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కు పైగా ఓట్లు ఉండగా, వైసీపీకి 543కు పైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి. విపక్ష వైసీపీకి 615 మంది ప్రజాప్రతినిధులు ఉండగా, టీడీపీకి 214 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇరు పార్టీల మధ్య 400 మంది తేడా ఉంది. ఈ నేపథ్యంలో బొత్స గెలుపు సులభం కానుంది.
నేటితో ముగియనున్న సీఎం విదేశీ పర్యటన.. రేపు హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్ రానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా నుంచి పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతమైంది. ఇప్పుడు దక్షిణ కొరియాలో కొనసాగుతోంది. అమెరికా పర్యటన ముగించుకుని శనివారం కొరియా చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సీఎం వివరించారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులు రాబట్టుకున్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. కొరియాలోని వివిధ కంపెనీలు మరియు వివిధ వ్యాపార మరియు వాణిజ్య సమూహాల ప్రతినిధులతో చర్చలు జరిగాయి. కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ చైర్మన్ క్యాక్ సంగ్, వైస్ చైర్మన్ సోయోంగ్ జూతో సహా 25 అగ్రశ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ హ్యుందాయ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మెగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారత్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (హెచ్‌ఎంఐఈ) ద్వారా మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డి బృందానికి తెలిపారు. ఈరోజు రేవంత్ టీమ్ ఫ్యూచర్ హ్యాంగంగ్ ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లనుంది.
హరీష్ రావు ఆరోపణలపై మంత్రి తుమ్మల కంట కన్నీరు..
హరీష్ రావు ఆరోపణలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కన్నీరు పెట్టుకున్నారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ తాను ఎప్పుడూ అభివృద్ధి కోసమే పని చేశానని, ప్రకటనల కోసము అడ్వర్టైజ్మెంట్ ల కోసం, రాజకీయాల కోసం పనిచేయననీ తాను ఎప్పుడూ నిరంతరం రైతుల కోసం పనిచేస్తానని చెప్పాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేసినా ఏ నాయకుడు మంచి పనులు చేసిన వారి పనులని ముందుకు పోయే విధంగా చేశాను అని మాత్రమే అన్నారు . సీతారామ ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే సందర్భంలో మీరు వస్తే మేము మీపై కూడా నీళ్లు చల్లుతామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నాడు. తాను అభిమానించే నాయకుడు మాజీ ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని అంటున్నారు. నేను అభిమానించే వ్యక్తులు, రాజకీయ నాయకుడు మాజీ ఆర్థిక మంత్రి కూడా నా మీద మాట్లాడిన తీరు బాధాకరం అన్నారు. మీరు పూర్తి చేసి ఆ క్రెడిట్ ఎందుకు తీసుకోలేదన్నారు. కొంతమంది స్థానిక పెద్దలు కూడా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. పది నియోజకవర్గాలకు నీళ్లు వెళ్ళాలన్నారు. పార్టీల పరంగా అభివృద్ధి పథకాలు నేను చేయనని తెలిపారు. నా ఫస్ట్ ప్రయారిటీ.. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం దేశం చూస్తానని తెలిపారు. చప్పట్ల కోసం, మీ కీర్తి కోసం నేను పని చేయనని అన్నారు. ఏ రాజకీయ నాయకుడి నీ కూడా పల్లెత్తు మాట అనను.. జలగం వెంగళా రావు ను ఆనాడు విమర్శించలేదు… త్యాగం చేసిన మహానుభావుల పథకాలు పూర్తి చేశానని తెలిపారు. లపంగి రాజకీయాలు నేను చేయనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడినంత మాత్రాన మంచి పనులు కాదు అని నేను అనలేదు ఆనాటి ప్రభుత్వం సాంక్షన్ చేసింది… కేవలం మోటార్ లు పనిచేయాలని కోరిక మాత్రమే నాదన్నారు. నన్ను వ్యతిరేకించే వారికి, అవమాన పరిచే వ్యక్తులకు నా గురించి తెలుసు… ఎవ్వరిని దేహి అని అడిగాను.. టికెట్ అడుగలేదు..ఎవ్వరిని డబ్బులు అడుగలేదు. ఓడిన రోజున నేను ఇంటికి పోయి వ్యవసాయం చేసుకున్నాను.. కుహనా విమర్శల కు చిల్లర విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రభుత్వం పై ఆరు నెలలకే అడిపోసుకోవడం మీకే తగులుతుందన్నారు. మీ నిర్వహకం, మీ అవినీతి వల్ల నే వ్యవస్థ దెబ్బతిన్నదని, మీరు చేసిన నిర్వాకం వల్ల నే హాస్టల్ లో దారుణంగా వుందన్నారు.
ఫ్రీ హోల్డ్ స్కాంలో వెలుగులోకి మరో బాగోతం.. మంత్రి అనగాని సంచలన ప్రకటన
ఫ్రీ హోల్డ్ స్కాంలో మరో బాగోతం వెలుగులోకి వచ్చింది. ఫ్రీ హోల్డులోకి కొన్ని ప్రభుత్వ భూములు వెళ్లినట్లు మంత్రి అనగాని సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వానికి చెందిన కొన్ని భూములను కూడా గత ప్రభుత్వం ప్రీ హోల్డ్ పెట్టేశారని రెవెన్యూ యంత్రాంగం గుర్తించినట్లు వెల్లడించారు. ఫ్రీ హోల్డులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై రెవెన్యూ శాఖ లెక్కలు తీస్తోంది. రెవెన్యూ సదస్సుల్లో గత ప్రభుత్వ భూ బాగోతాలన్నీ బయటకు వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అంటున్నారు. కొన్ని ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ చేశారని.. ప్రజా అవసరాలకు ఉంచిన ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు చేశారని మంత్రి వెల్లడించారు. నిజమైన అసైనీలకు న్యాయం చేసేందుకే మూడు నెలల పాటు ఫ్రీ-హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేశామన్నారు. ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో జరిగిన తప్పులన్నింటీని సరిచేస్తామన్నారు. ఒరిజనల్ అసైనీలకు వందకు వంద శాతం పూర్తి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒరిజనల్ అసైనీలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫ్రీ హోల్డ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఒరిజనల్ అసైనీలకు లబ్ది చేకూర్చేందుకే మా లక్ష్యమని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని ఆయన ఆరోపించారు. అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకొని వైసీపీ నేతలు ఒరిజనల్ అసైనీల నుంచి అతి తక్కువ ధరలకే భూములను కొనేశారని మంత్రి అన్నారు. నిబంధనలకు విరుద్దంగా అనర్హులకు అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేశారన్నారు. రిజిస్టర్ అయిన అసైన్డ్ భూముల్లో కొన్ని నిబంధనలకు విరుద్దంగా గిఫ్ట్ డీడ్లుగా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మంత్రి చెప్పారు. 20 ఏళ్ల పరిమితి దాటని భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసినట్లు సమాచారముందన్నారు.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం.. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో రాజీవ్ ఏ2గా ఉన్నట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజీవ్.. అగ్రి గోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు. అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని జోగి రాజీవ్ చెప్పారు. మరోవైపు అగ్రి గోల్డ్ భూములు ఆల్రెడీ అటాచ్‌లో ఉన్నాయని, అటాచ్‌మెంట్‌లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా అంటూ నిలదీశారు. తప్పు చేస్తే ఉరేసుకుంటానని జోగి రమేష్ ఛాలెంజ్ చేశారు.
విశాఖ బీచ్ రోడ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన రెస్టారెంట్!
విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డైనో పార్క్ రెస్టో కేఫ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. పాండురంగాపురం మత్స్య దర్శని పక్కనే ఉన్న డైనో పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో డైనో పార్క్ రెస్టారెంట్ పూర్తిగా కాలి బూడిదైంది. భారీ మంటలు, దట్టమైన పొగ కారణంగా చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. రెస్టారెంట్ పక్కన ఇళ్లలోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. వెదురు బొంగులు, కలపతో రెస్టారెంట్‌ను నిర్మించడంతో మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. మంటల్లో ఎవరైనా చుక్కుకున్నారా అన్న విషయం ఇంకా తెలియరాలేదు.
బైడెన్‌ను రేసు నుంచి తప్పించడం ఓ కుట్ర.. మస్క్‌తో ఇంటర్వ్యూలో ట్రంప్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్‌లో ఎలాన్ మస్క్‌తో సంభాషణలు జరిపారు. ఈ సంభాషణలో ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రాట్లపై విరుచుకుపడ్డారు. అలాగే జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుండి బలవంతంగా తొలగించారని చెప్పారు. బైడెన్‌కు వ్యతిరేకంగా డెమోక్రాట్ నేతలంతా తిరుగుబాటు చేసి ఆయనై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఎన్నిక ప్రచారం సందర్భంగా జో బైడెన్‌తో జరిగిన డిబేట్ తన గొప్ప చర్చల్లో ఒకటని అభిప్రాయపడ్డారు. ఆ డిబేట్‌లో బైడెన్‌ను చిత్తుగా ఓడించానని.. దాని ప్రభావంతోనే డెమోక్రాట్లు కుట్ర చేసి ఆయనను పోటీ నుంచి తప్పించారని ఆరోపణలు చేశారు. ప్రచార సభలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. హత్యాయత్నం నుంచి బయటపడ్డ తర్వాత దేవుడిపై నమ్మకం మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు. కాల్పులు జరిగినపుడు తల తిప్పడమే తనను కాపాడిందని, బుల్లెట్ గాయం తర్వాత వెంటనే తనపై కాల్పులు జరిపారనే విషయం అర్థం చేసుకున్నానని వివరించారు. ఆ క్షణమే తేరుకున్నానని, మళ్లీ ప్రసంగం కొనసాగించాలని భావించగా.. సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పారని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌లు తమ ఆటల్లో టాప్‌లో ఉన్నారని ట్రంప్ అన్నారు. వారంతా తమ దేశాలను ప్రేమస్తున్నారని చెప్పారు. వారిది భిన్నమైన ప్రేమ అంటూ పేర్కొన్నారు. వారిని ఎదుర్కోవడానికి అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలన్నారు. అధ్యక్షుడిగా బైడెన్ లేకపోతే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసేదే కాదన్నారు. పుతిన్‌తో చాలా సార్లు మాట్లాడానని.. ఆయన తనకు చాలా గౌరవమిస్తారని చెప్పారు. ఉక్రెయిన్ గురించి కూడా తాము చర్చించుకున్నామన్నారు. అమెరికా సరిహద్దు వివాదాలు, వలసదారులకు అడ్డుకట్ట వేయడంపై ట్రంప్ స్పందిస్తూ.. బార్డర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. విదేశాలు తమ దేశంలోని నేరస్థులను, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని అమెరికాకు పంపిస్తున్నాయని ఆరోపించారు. దేశంలోకి అక్రమ వలసలను కఠినంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మస్క్ కూడా అంగీకరించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు అసలు ఐక్యూయే లేదని ట్రంప్ విమర్శించారు. బైడెన్ కు ఐక్యూ చాలా తక్కువని గతంలో తాను చెప్పానన్న ట్రంప్.. ఆయన పాలన చూశాక అసలు బైడెన్ ఐక్యూ జీరో అని అర్థం చేసుకున్నానని వివరించారు.
భారత్‌కు రాకుండా.. జర్మనీ వెళ్లిన నీరజ్ చోప్రా! కారణం ఏంటంటే?
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ పోటీలు ఆదివారం ముగియగా.. నీరజ్ స్వదేశానికి రాకుండా జర్మనీకి వెళ్లాడు. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ వర్గాలు ధ్రువీకరించాయి. నీరజ్ జర్మనీకి వెళ్లాడని.. కనీసం మరో 45 రోజుల వరకు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం లేదని అతని కుటుంబీకులు ఒకరు తెలిపారు. తన గాయానికి శస్త్రచికిత్సకు సంబంధించి వైద్య సలహా తీసుకోవడానికి, డైమండ్ లీగ్‌ల్లో పాల్గొనాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి జర్మనీ వెళ్లినట్లు తెలుస్తోంది. ‘నీరజ్ చోప్రా పారిస్ నుంచి జర్మనీ వెళ్లాడు. మరో 45 రోజుల వరకు అతడు భారత్‌కు వచ్చే అవకాశం లేదు. నాకు పూర్తి వివరాలు వివరాలు తెలియదు గానీ.. వైద్యుడిని సంప్రదించడానికి అక్కడికి వెళ్లాడు. నీరజ్ కండిషన్‌ను బట్టి డైమండ్ లీగ్‌ల్లో పాల్గొనాలా? వద్దా అనేది కోచ్, ఫిజియో నిర్ణయిస్తారు’ అని జావెలిన్ త్రోయర్ నీరజ్ కుటుంబీకులు ఒకరు తెలిపారు. గతంలో కూడా గాయం గురించి జర్మనీలోని వైద్యుడిని నీరజ్ సంప్రదించాడు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు కొన్నిరోజులు అక్కడి సార్‌బ్రూకెన్‌లో శిక్షణ పొందాడు. డైమండ్ లీగ్ ఫైనల్ సెప్టెంబర్ 14న బెల్జియంలోని బ్రసెల్స్‌లో జరగనుంది.
భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ ఒక్కరోజే తులంపై వెయ్యి పెరిగింది!
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2024 బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. భారీ షాక్ ఇస్తూ వరుసగా రెండోరోజు పసిడి రేట్స్ పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగ్గా.. నేడు ఏకంగా రూ.950 పెరిగింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.270 పెరిగితే.. నేడు రూ.1,040 పెరిగింది. దాంతో దేశీయంగా మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,620 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిన్న తగ్గిన వెండి ధర కూడా నేడు భారీగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 పెరిగి.. రూ.83,500గా నమోదైంది.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.65,650
విజయవాడ – రూ.65,650
ఢిల్లీ – రూ.65,800
చెన్నై – రూ.65,650
బెంగళూరు – రూ.65,650
ముంబై – రూ.65,650
కోల్‌కతా – రూ.65,650
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,620
విజయవాడ – రూ.71,620
ఢిల్లీ – రూ.71,770
చెన్నై – రూ.71,620
బెంగళూరు – రూ.71,620
ముంబై – రూ.71,620
కోల్‌కతా – రూ.69,710
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.88,500
విజయవాడ – రూ.88,500
ఢిల్లీ – రూ.83,500
ముంబై – రూ.83,500
చెన్నై – రూ.88,500
కోల్‌కతా – రూ.83,500
బెంగళూరు – రూ.83,500