ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్.. అమ్మేసి.. సొమ్ము చేసుకున్న వైనం
వికారాబాద్ జిల్లాలో డబ్బు కోసం ఏడాది బాలున్ని ఎత్తుకెళ్లిన గ్యాంగ్ మగపిల్లలు లేని వ్యక్తికి అమ్మేసి.. సొమ్ము చేసుకున్నారు. నిందితులు విక్రయించిన బాలున్ని స్వాదీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించడంతో తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో కలకలం రేపిన బాలుడి కిడ్నాప్ కథను కరణ్ కోట్ పోలీసులు సుఖాంతం చేశారు. తాండూరు రూరల్ సీఐ నగేష్ కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ నుంచి వచ్చిన భాషా భార్య గోరీబీ, ముగ్గురు కుమారులు, అత్తతో కలిసి గౌతాపూర్లోని మల్లన్న దేవాలయం వద్ద ఉంటున్నాడు. ఈనెల 29న రాత్రి గుడి వద్ద నిద్రించగా మరుసటి రోజు ఉదయం వారి ఏడాది వయస్సు ఉన్న హుస్సేన్ అనే బాలున్ని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లి పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తాండూరు ఇందిరాగర్ చెదిన చరణ్, పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉండే శంకర్, పద్మమ్మ, హన్మంతు, లక్ష్మీ, సాయమ్మలను నిందితులుగా గుర్తించారు. దీంతో వారిని వి చారించగా భాషా వద్ద ఉన్న చెత్త ఏరుకునే క్రమంలో భాషా కుటుంబంతో పరిచయం ఏర్పడింది.
తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు..
తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. 2024లో సంవత్సరంలో మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోందని పేర్కొన్నారు. కేవలం ఆరు నెలల్లోనే సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలను ఆవిష్కృతం చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదవాడి భవిష్యత్‌కు భరోసా ఇస్తూ పింఛన్ల మొత్తాన్ని పెంచామని వెల్లడించారు. ప్రతి ఇంట కట్టెల పొయ్యి కష్టాలు తీరుస్తూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
గతంలో ఆగిపోయిన అన్ని పథకాలు పునరుద్ధరణ చేశాం
ఖమ్మం సత్తుపల్లి వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సంవత్సర కాల పాలనలో 21 వేల కోట్ల రుణామాఫీ, 7,625 వేల కోట్ల రైతు బంధు, 3 వేల కోట్ల రైతు భీమా ఇచ్చామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గతంలో ఆగిపోయిన అన్ని పధకాలు పునరుద్ధరణ చేశామని ఆయన వ్యాఖ్యానించారు. సన్నా ధాన్యానికి బోనస్ ఇచ్చామన్నారు. మిగిలిన అన్ని పంటలకు MSP ధరకే కొనుగోలు చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. రైతాంగ ఖాతాల్లో నగదు జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. రైతు భరోసా మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు.
న్యూఇయర్ వేళ ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు
అన్ని దేశాలు కొత్త సంవత్సరం కోసం ఎదురుచూస్తుంటే.. రష్యా మాత్రం ప్రత్యర్థి దేశంపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ఉక్రెయిన్‌పై భారీస్థాయిలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. కీవ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రష్యా భారీగా క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వైమానిక దళ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో షోస్ట్కా నగరానికి సమీపంలో ఉన్న పలు నివాస భవనాలు, పాఠశాలలు, వైద్యసదుపాయాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. దేశంలోని దాదాపు సగం మౌలిక సదుపాయాలు నాశనమయినట్లు అధికారులు పేర్కొన్నారు.
బ్రేకులు ఫెయిల్.. షాపులోకి దూసుకెళ్లిన ఇసుక లారీ
ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్స్ ఫెయిల్ కావడంతో లారీ ఓ షాపులోకి దూసుకెళ్లింది. విశాఖలోని గాజవాక సుందరయ్య కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకట రమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఓయువతి తప్పించుకుంది. ఈ ఘటనను చూసిన స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తీవ్ర భయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడున్న సీసీ వీడియోలో రికార్డు అయింది. సీసీ ఫుటేజీ ప్రకారం.. రోడ్డుకు ఎదురుగా ఒక కిరాణా షాపు ఉంది. ఆ షాప్‌కు ఓ యువతి వచ్చింది. ఆమెకు కావాల్సిన వస్తువులు అడిగింది. ఇంతలోపు రోడ్డుపై నుంచి వేగంగా ఒక ఇసుక లారీ దూసుకువచ్చింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో.. కంట్రోల్ కాకపోవడంతో కిరాణా షాపు మీదికి దూసుకొచ్చింది. ఆ సమయంలో ఆ యువతి ముందుగానే చూసి పక్కకు తప్పుకుంది. అయితే.. ఈ ప్రమాదంలో వెంకట రమణ అనే వ్యక్తి మృతి చెందాడు.
మన్మోహన్ సింగ్‌కి బంగ్లా దేశాధినేత యూనస్ నివాళి..
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ నివాళి అర్పించారు. భారత్‌కి రెండుసార్లు ప్రధానిగా చేసిన, భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరుతెచ్చుకున్న మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో మరణించారు. మంగళవారం ఢాకాలోని భారత హైకమిషన్‌లో యూనస్, మన్మోహన్ సింగ్‌కి నివాళులు తెలియజేశారు. ‘‘ఎంతో సాదాసీదాగా ఉండేవారు, చాలా తెలివైనవారు’’ అని యూనస్, మన్మోహన్ సింగ్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. భారతదేశాన్ని గ్లోబల్ దిగ్గజంగా మార్చడంతో ఆయన అతిపెద్ద పాత్ర పోషించారని కొనియాడారు. మంగళవారం ఉదయం ఢాకాలోని బరిధరాలోని హైకమిషన్ కార్యాలయంలోకి యూనస్‌ని భారత హైకమిషనర్ ప్రణయ్ కుమార్ వర్మ రిసీవ్ చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి యూనస్ నివాళులు అర్పించారు. హైకమిషన్‌లోని సంతాప పుస్తకంలో సందేశం రాశారు.
ప్రచార ఆర్భాటాలు తప్ప చేస్తున్న పనులేమీ లేవు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరు ఏమి చేసినా తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో కోటి ఎకరాలు సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఏపీలో జలయజ్ఞం పేరిట 23 ప్రాజెక్టులు పూర్తి చేశారని అన్నారు. చంద్రబాబు అన్నీ నేనే చేశా అంటారు.. పోలవరం నాదే అంటారు.. హంద్రీనీవా నాదే అంటారు.. ఆయనకు ఉన్న మీడియా బలంతో అన్నీ నిజాలే అన్నట్లుగా చెప్పేసుకుంటాడని అంబటి రాంబాబు ఆరోపించారు. ఏ ప్రాజెక్టు అయినా వైఎస్ఆర్ శ్రద్ధతోనే వచ్చాయని తెలిపారు. వైఎస్ తర్వాత తిరిగి ఆయన తనయుడు జగన్ సీఎం అయిన తర్వాత మళ్ళీ పనులు మొదలు పెట్టారని అన్నారు. గోదావరి, బనకచర్ల మూడు దశల్లో పూర్తి చేయాలనుకున్న మొదటి వ్యక్తి జగన్.. 280 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణకు తరలించేలా ప్రయత్నం చేసిన జగన్ అని అంబటి రాంబాబు చెప్పారు.
జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ.. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై కీలక చర్చ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు సహాయం, కొత్త రేషన్ కార్డులు, , నూతన టూరిజం పాలసీపై చర్చించనున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా కార్యక్రమంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త రేషన్ కార్డుల కోసం ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయడంపై ప్రతిపాదనలు కేబినెట్ లో పరిశీలించబడతాయి.
సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన విజయానంద్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి.సాయి ప్రసాద్, యం.టి.కృష్ణబాబు, టీటీడీ ఇఓ శ్యామల రావు, జీఏడి కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు కాంతిలాల్ దండే, జయలక్ష్మి, కుమార్ విశ్వజిత్, పలువురు కార్యదర్శులు ఇతర అధికారులు సీఎస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు మరింత మెరుగైన సేవల కోసం.. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పునఃవ్యవస్థీకరణ
ప్రజలకు మరింత మెరుగైన సేవల కోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పునఃవ్యవస్థీకరణ చేస్తున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో శాశ్వత భవనాలు ఏర్పాటు చేస్తున్నట్లు, మొదటి దశలో నాలుగు జిల్లాల్లో నిర్మాణ చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గచ్చిబౌలిలో మోడల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో శాశ్వతంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మిస్తామన్నారు. అవసరమైన భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మొదటి దశలో సంగారెడ్డి, పటాన్ చెరువు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్ లో నిర్మిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.