బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు
ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై రెండు గంటల పాటు మంత్రులు కసరత్తు చేశారు. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరు.. క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన క్రమంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు .. అధికారులు సేకరించిన సమాచారం పైన మంత్రులు కసరత్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు రైతులకు రైతు భరోసా ఇచ్చి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
నటుడు అనుమానాస్పద మృతి
మలయాళ సినీ-సీరియల్ నటుడు దిలీప్ శంకర్ హోటల్ గదిలో శవమై కనిపించాడు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో దిలీప్ శంకర్ శవమై కనిపించాడు. దిలీప్ శంకర్ మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. రెండు రోజుల క్రితం దిలీప్ శంకర్ హోటల్ లో రూమ్ తీసుకున్నాడు. అయితే అతను అప్పటి నుంచి గది బయటకు వెళ్లలేదని సమాచారం. ఈరోజు గదిలో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గదిని తెరిచారు. ఈ క్రమంలోనే దిలీప్ శంకర్ శవమై కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దిలీప్ శంకర్ పలు సీరియల్స్‌లో ప్రముఖ పాత్రలు పోషించారు. ఫ్లవర్స్ టీవీలో ఓ సీరియల్‌లో దిలీప్ శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
తిరుమలలో అందరినీ సమానంగా చూడాలి..!
తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గర ప్రాంతీయ వివక్షలు మంచివి కావని, తెలంగాణ ఆలయాల్లో అందరినీ సమానంగా చూసే విధానాన్ని గుర్తుచేశారు. తిరుమలలో కూడా ఇదే నిబద్ధత ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం గద్వాల నియోజకవర్గంలోని జములమ్మ అమ్మవారిని శ్రీనివాస్ గౌడ్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం గద్వాల బీఆర్‌ఎస్ నాయకుడు బాసు హనుమంత నాయుడు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్‌లోనే ఉంటారని గుర్తు చేశారు. అలాంటప్పుడు తిరుమలలో తెలంగాణ భక్తులు, రాజకీయ నాయకులపై వివక్ష ఎందుకు చూపుతున్నారని ప్రశ్నించారు.
మా విమానం రష్యా వల్లే కూలింది.. అజర్‌బైజాన్ ప్రెసిడెంట్..
కజకిస్తాన్‌లో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 38 మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు. బాకు నుంచి రష్యాలోని చెచన్యాలోని గ్రోజీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా గ్రోజీలో విమానం ల్యాండింగ్ తిరస్కరించిన క్రమంలో కాస్పియన్ సముద్రం వైపుగా మళ్లీంచబడింది. చివరకు కజకిస్తాన్ అక్టౌ నగరంలో కూలిపోయింది.
గోవా నుంచి మద్యం తెస్తున్నారా? ఎక్సైజ్ పోలీసులు ఏం చేశారో చూడండి..
గోవా నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాస్కోడిగామా రైల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 43 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. గోవా వస్తున్న వాస్కోడిగామా రైల్లో మద్యం తీసుకు వస్తున్నారని సమాచారం అందింది. ఈ మేరకు ఏఈ ఎస్ జీవన్ కిరణ్, ఎస్ టి ఎఫ్, డిటిఎఫ్ సీఐలు సుభాష్ చందర్, బాలరాజు, ఎస్సైలు వెంకటేష్, రవిలతో పాటు 20 మంది సిబ్బంది శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు తనిఖీలు నిర్వహించారు. పలువురు వద్ద ఉన్న 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ. రెండు లక్షల మేరా ఉంటుందని అంచనా వేశారు. మద్యం బాటిల్లను పట్టుకున్నటువంటి ఎక్సైజ్ టీమ్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలాసన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ అభినందించారు.
ఈ సారి నుమాయిష్ ఆలస్యం..!
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్ (అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన) ఈ సంవత్సరం వాయిదా పడింది. సాధారణంగా జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన దాదాపు 46 రోజుల పాటు జరుగుతుంది. అయితే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా నుమాయిష్ రెండు రోజుల పాటు వాయిదా పడిందని నిర్వాహకులు తెలిపారు. జనవరి 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభం కానుంది. ప్రదర్శనకు సంబంధించి సుమారు 2,500 స్టాళ్ల నిర్మాణానికి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు, స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకున్నది. ప్రదర్శన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం బాధాకరం..
కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కూచిపూడి నృత్య గురువులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలలో భాగంగా 50 అడుగుల ఏకశిలపై కూచిపూడి నృత్య భంగిమలతో పతాకాన్ని ప్రపంచానికి సమర్పించడం అద్భుతం అని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం బాధాకరమని తెలిపారు. కూచిపూడి నృత్యం అజరామంగా విరాజిల్లే విధంగా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.. మనది అని చెప్పుకొని సాంస్కృతిక, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని మంత్రి దుర్గేష్ తెలిపారు.
రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది
రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని, ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో నేరాల రేటు 22.5% పెరిగిందన్నారు. అత్యాచార కేసులు 28.94% పెరిగాయని, ఏడాదిలో మొత్తం 2,945 కేసులు నమోదయ్యాయన్నారు. సగటున రోజుకు 8 కేసులు నమోదవుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇందులో 82 మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరగడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేదని తెలుస్తున్నది.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందన్నారు.
ఆరోజు ధియేటర్ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నారు!
డిసెంబర్ నెల 5వ తేదీన పుష్ప 2 సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అయింది. అయితే ఒక రోజు ముందుగానే హైదరాబాదులో ఉన్న సింగిల్ స్క్రీన్స్ తో పాటు కొన్ని మల్టీప్లెక్స్ లలో పుష్ప సినిమాను ప్రీమియర్ గా ప్రదర్శించారు. అందులో సంధ్య థియేటర్ ప్రీమియర్స్ కోసం అల్లు అర్జున్ తో పాటు ఆయన కుటుంబం, హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలిసి ఆ సంధ్య థియేటర్ కి ఫ్యాన్స్ తండోపతండాలుగా తరలి వచ్చారు. అల్లు అర్జున్ ను కలిసేందుకు ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట ఏర్పడింది. చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ లైసెన్స్ విషయం మీద షోకాజు నోటీసులు జారీ చేశారు. తొక్కిసలాట కారణంగా ఒకరి మృతికి కారణమైన సంధ్య థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని ప్రశ్నిస్తూ షో కాజ్ నోటీసులు జారీ చేశారు.
నేను బీజేపీలో ఉన్నందుకు గర్వపడుతున్నాను
నేను బీజేపీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 140 కోట్ల ప్రజలున్న మన భారత దేశం ప్రశాంతంగా ఉండడానికి కారణం బీజేపీ, మన నాయకుడు మోదీ అని ప్రజలందరికీ అర్థం అయ్యిందన్నారు. తెలంగాణ లో హైదారాబాద్ చుట్టు గెలిచిన పార్టీ మనదని, GHMC ఎన్నికల్లో వికసించేది కూడా బీజేపీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి 40 శాతం ఓట్లు వస్తే బిజెపికి 35% ఓట్లు వచ్చాయి. ఇక భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అని ఈటల రాజేందర్ అన్నారు.