పలు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. లిస్ట్ ఇదే!
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షంతో పాటు వడగండ్లు పడే అవకాశం ఉందని సూచించింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు వాతావరణ శాఖ వార్నింగ్ (Warning) ఇచ్చింది. మార్చి 1 నుంచి 3 వరకు భారీ వర్షాలు (Rainfall) కురుస్తాయని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో భారీ వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్‌లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది. అలాగే హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ యూపీలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
వారి దుర్మార్గాలకు క్రీడాకారులు కూడా బలైపోతున్నారు..
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలకు క్రీడాకారులకు కూడా బలైపోతున్నారని దుయ్యబట్టారు. అందుకు నిదర్శనం హనుమ విహారినేనని అన్నారు. ప్రతిభ, సామర్థ్యాలున్న హనుమ విహారిని కాదని, వైసీపీ నాయకుడి కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పని చేయడం క్రీడాలోకానికే అవమానం అని పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలో ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతిష్ట మసక బారిందని వ్యాఖ్యానించారు. దోపిడీకి ఆలవాలంగా మారిందని పేర్కొన్నారు.
కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు ఉంది కొత్త మంత్రుల పరిస్థితి
కొత్త బిచ్చగాడు పొద్దేరుగడన్నట్లు ఉంది..ఇప్పుడు కొత్తగా మంత్రులు అయ్యిన వారు పరిస్థితి అంటూ విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్. ఇవాళ పెద్ద కొత్తపల్లి కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి అయ్యామని అద్ధూ అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని, ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది.. వీళ్ళ మారుస్తున్న రంగులు చూసి అంటూ ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో లేని కాంగ్రెస్ గల్లీ లో ఎందుకు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. బీఅర్ఎస్ మీద వ్యతిరేకత నే కాంగ్రెస్ నీ అధికారంలోకి తెచ్చిందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గతంలో 10 సంవత్సారాలు అధికారం లో ఉండి కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలు చేసిందన్నారు లక్ష్మణ్. అంతేకాకుండా.. కుంభకోణాలు చేసిన కాంగ్రెస్ కి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, ఇన్నేళ్ల మళ్ళీ ఇప్పుడు పదేళ్ల తరువాత కొత్త రాజకీయాలు మొదలు పెట్టారన్నారు.
వాళ్లు సాధించిందేమీ లేదు.. మాకొచ్చిన నష్టం కూడా ఏమీ లేదు
స్పీకర్ అనర్హత వేటు వేయడంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఏడాది క్రితమే తమను వైసీపీ సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అనర్హత వేటు వేసే నైతిక అర్హత ప్రభుత్వానికి లేదని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నారో.. ఆ రోజు ఈ చర్య తీసుకుని ఉంటే ప్రజలు హర్షించేవారని చెప్పారు. ఈ చర్యలతో వాళ్లు సాధించిందేమీ లేదని.. తమకు వచ్చిన నష్టం కూడా ఏమీ లేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించాల్సిన వేదికల్లో ఒక ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తే, దానిని అంటరానితనంగా చూసి తమను సస్పెండ్ చేశారని తెలిపారు. తమను సస్పెండ్ చేసిన తర్వాత.. అనర్హత వేటు వేసే నైతిక అర్హత ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
రావి నది ప్రవాహాన్ని నిలిపేసిన భారత్.. ఇది “వాటర్ టెర్రరిజం” అంటూ పాక్ గగ్గోలు..
సింధు నదీ ఉపనది అయిన రావి నది నీటిని భారత్ నిలిపేసింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే చీనాబ్ నదీ నీటిని భారత్ డైవర్ట్ చేసింది, తాజాగా రావి నది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు షాపుర్‌కండి బ్యారేజీని నిర్మించింది. ఈ బ్యారేజ్ వల్ల జమ్మూ లోని కథువా, సాంబా ప్రాంతాల రైతులకు సాగు నీరు అందించడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీని వల్ల పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు లాభపడనున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం, మనకు హక్కుగా ఉన్న నీటిని ఉపయోగించుకోనున్నాం.
ఎక్కడా కూడా ఇంత వెనుకబడి పరిస్థితి కనిపించలేదు..
కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ మారే వ్యక్తి ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యేనన్నారు. ఇప్పటి వరకు చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించానని, ఎక్కడా కూడా ఇంత వెనుకబడి పరిస్థితి కనిపించలేదన్నారు వెంకట రమణ. రాజకీయం వేరు..పరిపాలన వేరని, మంత్రి గా ఉన్న జూపల్లి నోరు జారీ మాట్లాడుతున్నాడన్నారు. పేరు కృష్ణా రావు.. కానీ మనిషి మాత్రం రావణాసురుడని ఆయన వ్యాఖ్యానించారు. మోడీకి కర్రు కాల్చి వాత పెట్టాలి అని జూపల్లి మాట్లాడుతున్నాడన్నారు. కనీసం మోదీ దగ్గరకు కూడా నువ్వు వెళ్ళలేవన్నారు. ఇలాగే మాట్లాడితే ప్రజలే నీకు కర్రు కాల్చి వాత పెడతారు గుర్తు పెట్టుకో అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ సున్నపు రాయి నిక్షేపాలు ఉన్నాయన్నారు.
మీ ఉత్సాహం చూస్తుంటే ఏపీలో అధికారంలో వచ్చే నమ్మకం కలుగుతుంది..
ఏలూరులో కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. నర్సాపురం, ఏలూరు, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఏపీలో బీజేపీ అధికారంలో వస్తుంది అనే నమ్మకం కలుగుతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. పోలవరం కోసం కేంద్రం నిధులు ఇస్తున్న ప్రాజెక్ట్ పూర్తి చేసే ఆలోచనలో ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు లేవని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ మోడీ చేతుల్లోకి తీసుకుని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
దేశంలోనే వృద్ధ ఎంపీ కన్నుమూత
భారతదేశంలో అత్యంత వృద్ధ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత షఫికర్ రహ్మాన్ బర్క్ (93) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొరాదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
ప్రస్తుత పార్లమెంటులో (Parliament) అత్యంత వృద్ధ ఎంపీగా (Shafiqur rahman barq) ఉన్న ఆయన.. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌లో జులై 11, 1930న షఫికర్ రహ్మాన్ బర్క్ జన్మించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా సేవలందించారు. ప్రస్తుతం సంభల్ స్థానం నుంచి పార్లమెంటులో ఎంపీగా కొనసాగుతున్నారు. అంతకుముందు మొరాదాబాద్ ఎంపీగాను మూడుసార్లు పనిచేశారు. ఇక సంభల్ ఎంపీగా రెండోసారి గెలుపొందారు.
ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ స్థానం నుంచే బర్క్‌ను బరిలో దించాలని సమాజ్‌వాదీ పార్టీ ఇటీవలే నిర్ణయించింది. కానీ ఆయన ప్రాణాలు కోల్పోయారు. బర్క్ మృతి పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంతాపం తెలియజేశారు.
కాంగ్రెస్‌కి షాక్.. బలం లేకున్నా ఎంపీ సీటు బీజేపీ కైవసం.!
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ బీజేపీకి వరంగా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒకే ఒక్క రాజ్యసభ ఎంపీ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. 68 మంది సభ్యులు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉండీ, 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవడం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మె్ల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి జైకొట్టారు. దీంతో రాజ్యసభ ఎంపీ స్థానాన్ని బీజేపీ గెలిచిందని ఆ పార్టీ నేత జైరాం ఠాకూర్ ప్రకటించారు. అయితే, ఎన్నికల సంఘం అధికారికంగా ఫలితాలన్ని ప్రకటించాల్సి ఉంది.
కేసీఆర్ అబద్దాలకంటే ఎక్కువ అబద్దాలు చెప్పే సీఎం రేవంత్
కేసీఆర్ ఇచ్చిన హామీలు, అమలుచేయడంలో విఫలం అయ్యారని, కేసీఆర్ అబద్దాలకంటే ఎక్కువ అబద్దాలు చెప్పే సీఎం రేవంత్ అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ రాజరాజేశ్వరి క్లస్టర్ లో జరుగుతున్న విజయ సంకల్ప యాత్రలో రామాయంపేటలో ఈటల రాజేందర్, బోడిగ శోభ, రాణి రుద్రమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రేవంత్ హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా అని యాన సవాల్ విసిరారు. ఫాయి కార్మికుల, వైద్యసిబ్బంది కాళ్ళు కడిగి కరోనాసమయంలో చేసిన సేవను గుర్తించిన వ్యక్తి నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు. కేంద్రం ఇస్తే తప్ప ఇళ్లు కట్టలేడు రేవంత్ రెడ్డి, పెన్షన్ ఇవ్వలేడు, జీతాలు ఇవ్వలేడన్నారు. అందుకే వాళ్లకు ఓట్లు వేసి మనం అడుక్కోవడం ఎందుకు మనకే ఓట్లు వేసుకుందాం అన్నీ తెచ్చుకుందామన్నారు.
కాటసాని రామిరెడ్డికి భారీ షాక్.. సైకిలెక్కిన ఎర్రబోతుల వర్గీయులు..!
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవుతున్నాయి. తాజాగా.. కొలిమిగుండ్ల మండలంలో న్యూట్రల్‌గా ఉన్న 30 కుటుంబాలతో సహా.. 15 మంది వైసీపీ దళిత నేతలు, ఎర్రబోతుల కుటుంబానికి చెందిన కీలక నేత కూడా బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం కొలిమిగుండ్ల మండలంలో జరిగిన చేరికల కార్యక్రమంలో భాగంగా.. గత కొన్నేళ్లుగా స్థానిక రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గూడూరు నాగేశ్వర్ రెడ్డి, గూడూరు నాగ శేష రెడ్డి, గూలి నాగేశ్వర్ రెడ్డి, గూలి జయరామ రెడ్డి, పీరం హర్షవర్ధన్ రెడ్డి వంటి నేతలతో సహా మొత్తం 30 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే దాసరి పెద్ద దస్తగిరి, దాసరి బాలుడు,దాసరి నడిపి దస్తగిరి, దాసరి పుల్లయ్య, నారాయణ స్వామి, దాసరి హరి, దాసరి రాజేష్, దాసరి విష్ణు వర్ధన్ వంటి 15 మంది నేతలు కుటుంబాలతో సహా వైసీపీని వీడి బీసీ జనార్థన్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బీసీ జనార్థన్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబును, బనగానపల్లె అభివృద్ధి కోసం బీసీ జనార్థన్ రెడ్డిని గెలిపించుకుని తీరుతామని ప్రకటించారు.