టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే.. తొలి జాబితాలోనే టిక్కెట్
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన పార్థసారథి.. గతంలోనే టీడీపీ చేరతానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి జాబితాలో తనకు టిక్కెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని పార్థసారథి అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నూజివీడు వెళ్తున్నానని తెలిపారు. మరోవైపు.. కోటి 30 లక్షల మందితో సర్వే చేసి టిక్కెట్లు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. నాన్ లోకల్ అయినా నూజివీడులో ప్రజల పూర్తి మద్దతు ఉందని తెలిపారు.
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు.. విచారణ 3 వారాలు వాయిదా
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మోడీ వల్లనే ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చింది..
అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘న్యాయ సాధన’ సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి అమిత ప్రేమ అని అన్నారు. మరోవైపు.. రాష్ట్ర అభివృద్ధి వైఎస్సార్ హాయంలోనే జరిగినట్లు చెప్పారు. అలాంటి.. సుపరిపాలన అందించేందుకు వైఎస్ షర్మిలను మీ ముందుకు తీసుకొచ్చామని ఖర్గే పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని, తప్పకుండా అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు.
సీమాంతర ఉగ్రవాదంపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
పశ్చిమ సరిహద్దులో సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశం చాలా కాలంగా ఎదుర్కొంటున్న సవాలుకు ఇప్పుడు మరింత సరైన స్పందన లభిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం అన్నారు. జేఎన్‌యూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘భారతదేశం మరియు ప్రపంచం’ అనే అంశంపై పండిట్ హృదయ్ నాథ్ కుంజ్రు స్మారక ఉపన్యాసం 2024లో ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. పశ్చిమ ఫ్రంట్‌లో, సరిహద్దు ఉగ్రవాదం యొక్క దీర్ఘకాల సవాలుకు ఇప్పుడు మరింత సరైన ప్రతిస్పందన అవసరమని అన్నారు. ఉరీ, బాలాకోట్‌లు తమ సందేశాన్ని ఇచ్చాయని విదేశాంగ మంత్రి తెలిపారు.
ఐదేళ్ల పాలనలో ముప్పై ఏండ్లు వెనక్కిపోయింది..
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ఏం మార్పులు వచ్చాయని ప్రశ్నించారు.? ఈ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు ఆనందంగా లేరని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలయ్యారు.. పది రూపాయలు ఇచ్చి వంద దోచుకున్నాడని మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ముప్పై ఏండ్లు వెనక్కి పోయిందని ఆరోపించారు. జగన్.. పేదలమనషి అంటూ కొత్తనాటకం ఆడుతున్నారు.. నేను సవాలు చేస్తున్నా ఎలా పేదవాడు అవుతావు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధరణిపై త్వరలో శ్వేత పత్రం.. పోర్టల్‌ను పుర్తిగా ప్రక్షాళన చేస్తాం
ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్ శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్ లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు. ఆలోచన రహితంగా ధరణి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా మార్చుకోవడానికి ఒక కుట్రపూరితంగా ధరణిని ప్రవేశపెట్టారని విమర్శించారు. ధరణికి సంబంధించి గత ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసారో, ఎన్ని లక్షల కోట్ల ప్రజల సొత్తును కొల్లగొట్టారో త్వరలో ప్రజలముందు పెట్టబోతున్నామని తెలిపారు. భూరికార్డులకు శరాఘాతంగా పరిణమించిన ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని తెలిపారు.
భారత్‌పై మరోసారి విషం చిమ్మిన ముయిజ్జు
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి భారత్‌పై విషం చిమ్మారు. తన 22 మంది సభ్యుల కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులను విదేశీ దేశం ఆదేశాల కారణంగా మాల్దీవుల పార్లమెంట్ తిరస్కరించిందని ఆయన ఆరోపించారు. నిజానికి మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వ కేబినెట్ ఏర్పాటైన తర్వాత అందులో చేరిన మంత్రులు పార్లమెంటు ఆమోదం పొందడం తప్పనిసరి. ప్రస్తుతం మాల్దీవుల పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలకు మెజారిటీ ఉంది. అటువంటి పరిస్థితిలో, ముయిజ్జు మంత్రివర్గంలో చేర్చబడిన ముగ్గురు మంత్రులను పార్లమెంట్ ఆమోదించలేదు. ఈ సందర్భంగా అధికార, విపక్ష ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఎన్నికల స్టంట్లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు..
సీఎం జగన్ కుప్పం పర్యటనపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఎన్నికల స్టంట్లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు అని ఆరోపించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ కు టీడీపీ 87 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 13 శాతం పనులు చేయడానికి జగన్ రెడ్డికి 57 నెలలు సమయం పట్టిందా? అని ప్రశ్నించారు. 3 లిఫ్టుల్లో 2 లిఫ్టులు టీడీపీ హయాంలో పూర్తి చేయగా, మిగిలిన ఒక్క లిఫ్ట్ పూర్తి చేయడానికి జగన్ రెడ్డికి 5 ఏళ్లు సమయం పట్టిందా? అని అన్నారు. రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం టీడీపీ 5 ఏళ్లల్లో రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తే, జగన్ రెడ్డి కేవలం రూ.2వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ, విద్యుత్ కార్మికులతో పోటీ పడి సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను పరిష్కరించుకుంటున్నామని, ఖనిజ నిక్షేపాలు కేంద్రం అమ్ముకుంటుంటే గత ప్రభుత్వం నిలువరించ లేకపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 72 వేల కోట్ల అప్పులతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభమై 7 లక్షల కోట్లకు చేరిందని, రాష్ట్ర ప్రభుత్వం 70 వేల కోట్లు అప్పు సంవత్సరానికి కట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. దివాలా పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉండేనని, రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. ఒకటో తేదీ నుంచి 25 తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి అని ఆయన అన్నారు. డిసెంబర్ నుంచి అక్టోబర్ వరకు రైతు బంధు చెల్లించే అవకాశం ఉందని అసెంబ్లీలో చెప్పామన్నారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తున్నామని, అందర్ని సంతృప్తిపరిచేలా నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. తండ్రి కొడుకులు, మామా అల్లుళ్ళ మాటలు ఆ పార్టీ నేతలే ఆమోదించడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట బాధ్యతగా చేస్తున్నామని, పది సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఒక్కో శాఖలో ఉన్న ఖాళీలు, కోర్టు కేసులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని, అరవై రోజుల్లో 25 వేల ఉద్యోగాలు ఇచ్చినమన్నారు రేవంత్ రెడ్డి. నిర్లక్ష్యంగా వదిలేస్తే మేము వచ్చి బాగు చేస్తున్నామన్నారు.
నిరుద్యోగులకు రైల్వేశాఖ కీలక అలర్ట్
ఎన్నికల ముందు ఆయా ప్రభుత్వాలు ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయడం సహజంగా జరుగుతుంటాయి. పైగా నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రకటనలు కూడా ఎదురుచూస్తుంటారు. ఇలాంటి సమయంలో నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు కేడీగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు.
త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో నిరుద్యోగుల్ని మోసగించే ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
ఆంధ్ర రంజీ జట్టుకు హనుమ విహారి వీడ్కోలు..
ఆంధ్ర రంజీ జట్టుకు భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి గుడ్ బై చెప్పారు. భవిష్యత్లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనని వెల్లడించాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లలో ఆవేదన వెళ్లగక్కాడు. క్రికెట్‌లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో విహారి పోస్టు చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో క్రీడాకారుల కన్నా.. రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉందని వెల్లడించారు.