NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

కేజ్రీవాల్, ఆప్ మంత్రులు యమునాలో స్నానం చేయగలరా? యూపీ సీఎం సవాల్

వింటర్ సీజన్‌లో దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడి విమర్శలతో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానంగా ఆప్-బీజేపీ నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కేజ్రీవాల్‌, ఆప్ మంత్రులకు సవాల్ విసిరారు. తాను, యూపీ కేబినెట్ మంత్రులంతా ప్రయాగ్‌రాజ్‌లోని సంగమంలో స్నానం చేశామని.. తమకు లాగా కేజ్రీవాల్, ఢిల్లీ మంత్రులు కూడా యమునా నదిలో స్నానం చేయగలరా? అని యోగి ప్రశ్నించారు.

16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష..

16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులిద్దరిని దారుణంగా హత్య చేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులకు ఛత్తీస్‌గఢ్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నేరాన్ని అత్యంత నీచమైన, అసహ్యమైన, పాశవిక దాడిగా అభివర్ణించిన కోర్టు, ఇది సమాజం యొక్క మనస్సాక్షిని కదిలించిందని చెప్పింది. కోర్బా జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు హత్య, అత్యాచారం, సామూహిక అత్యాచారం ఎస్సీ/ఎస్టీ, పోక్సో చట్టాల కింద నిందితులను దోషులుగా నిర్ధారించింది.

2021లో జరిగిన ఈ ఘటనలో ఆరో వ్యక్తి ఉమాశంకర్ యాదవ్‌ వైద్య కారణాల దృష్ట్యా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అతడు నేరంలో పాల్గొనే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే శస్త్రచికిత్స చేయించుకున్నట్లుగా కోర్టు గుర్తించింది. మరణశిక్షలను అమలు చేయడానికి ముందు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నుంచి నిర్ధారణ అవసరం. నిందితులు ఉన్నత కోర్టులో తీర్పుని అప్పీల్ చేసుకునే హక్కు కలిగి ఉన్నారు.

ప్రముఖ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ క్రాష్‌ డౌన్‌

అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌లలో ఒకటైన ChatGPT సేవల్లో అంతరాయం నెలకొంది.  చాట్ జీపీటీ సేవల్లో అంతరాయం చోటు చేసుకోవడం యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా చాట్‌జీపీటీ మొరాయించింది. అయితే.. ఈ మధ్య చాట్‌జీపీటీ వినియోగం పెరగడంతో దీనిపై ఆధారపడిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఎక్కువగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అదే విధంగా ఎక్సెల్ షీట్స్ దీంతో పాటు కోడింగ్ వంటి విషయాల్లో కూడా చాట్ జీపీటీ ప్రీమియం సర్వీసులను సైతం వాడుతున్నారు చాలామంది.

గుంటూరు టీడీపీలో వర్గ విభేదాలు.. ఎమ్మెల్యేను అడ్డుకున్న నేతలు

గుంటూరు తూర్పు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. భగత్ సింగ్ జయంతి సందర్భంగా 1వ వార్డులో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు స్థానిక టీడీపీ మహిళా నేతలు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. అయితే.. వార్డులో కార్యక్రమాలు నిర్వహించే సమయంలో స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌ను అడ్డుకున్నారు టీడీపీ డివిజన్ స్థాయి నాయకులు.. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు, డివిజన్ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో.. అక్కడున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నాం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పునరుద్ధరింపబడిన బస్టాండ్ ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సంవత్సరంలో 4 కోట్ల 500 రూపాయల విలువ గల 134 కోట్ల మంది మహిళలను క్షేమముగా గమ్య స్థానాలకు చేర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో హుస్నాబాద్ డిపో పరిధిలోని 169 గ్రామాలకు బస్ సౌకర్యం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. హుస్నాబాద్ డిపో లాభాల్లో నడవడం శుభసూచకం, 600 ఆర్టీసీ బస్సులను మహిళ సంఘాల ద్వారా కొంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు పోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, మహాలక్ష్మి పథకం ద్వారా పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్ లను ఏర్పాటు చేశామని, ఆర్టీసీలో సమస్యలు పరిష్కరించి, కారుణ్య నియామకాలు చేపడుతున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. కార్గో సర్వీసుల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

క్యాన్సర్ చికిత్సలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రితో కలిసి పనిచేయండి..

కేరింగ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బోరో డ్రోపులిక్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్‌లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి జన్యుచికిత్స, అత్యాధునిక ఆరోగ్యసంరక్షణ మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం వహించాలన్నారు లోకేష్.. దీని ద్వారా రాష్ట్రంలోని క్యాన్సర్ రోగులకు మరింత అందుబాటులో వైద్యసేవలు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. అంతర్జాతీయ బయోటెక్ సంస్థలు, పరిశోధనా సంస్థలతో గ్లోబల్ కొలాబరేషన్‌కు సహకారాన్ని అందించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి ఏపీని బయో టెక్నాలజీ, జన్యుచికిత్సల ప్రాంతీయ కేంద్రంగా నిలిపేందుకు క్యాన్సర్ వైద్య పరిశోధనలు, అభివృద్ధికి సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు. ఏపీలో బయోటెక్నాలజీలో స్థానిక ఆవిష్కరణలు, అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలు, జీన్ థెరపీలో లోకల్ ఇన్నోవేషన్ కోసం బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి పనిచేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.

వచ్చే ఏడాది ఆర్ధిక బ‌డ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం క‌స‌రత్తు..

వచ్చే ఏడాది ఆర్ధిక బ‌డ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం క‌స‌రత్తు దాదాపు పూర్తయింది. ఆయా శాఖ‌లు ప్రతిపాద‌న‌లు ఆర్ధిక శాఖకు అందించే పనిలో ఉన్నాయి. గ‌త బ‌డ్జెట్‌ల కంటే భిన్నంగా కూట‌మి స‌ర్కార్ బ‌డ్జెట్ ప్రవేశ పెట్టె ఆలోచనలో ఉంది. సంక్షేమం, అభివృద్ధికి స‌మ ప్రాధాన్యం ఇవ్వాల‌ని కుట‌మి స‌ర్కార్ భావిస్తోంది. కుట‌మి స‌ర్కార్‌కు సూపర్ సిక్స్ పెద్ద స‌వాల్‌గా మారింది. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలతో పాటు.. ఇరిగేష‌న్, అమ‌రావ‌తి, గ్రామీణ, ప‌ట్టణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బ‌డ్జెట్‌లో ఫోక‌స్ పెట్టనుంది. 2025-26 ఆర్ధిక సంవ‌త్సరానికి బ‌డ్జెట్ త‌యారీపై ఆర్ధిక శాఖ క‌స‌రత్తు ఒక కొలిక్కి వస్తోంది. వచ్చే నెల చివరి నుంచి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. దీనిలో భాగంగా వ‌చ్చే ఏడాది ఆర్ధిక బ‌డ్జెట్ పై ఆర్ధిక శాఖ క‌స‌ర‌త్తు పూర్తి చేస్తోంది. అయితే గ‌త ప్రభుత్వ పాల‌న‌లో ప్రవేశ పెట్టిన బ‌డ్జెట్‌ల‌కు భిన్నంగా బ‌డ్జెట్ రూప‌క‌ల్పన చేయాలని కుట‌మి స‌ర్కార్ భావిస్తోంది. గ‌త ప్రభుత్వం ఏకంగా 7 ల‌క్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. కానీ దానికి స‌మాంత‌రంగా అభివృద్ది జ‌ర‌గ‌లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే క్రమంలో గ‌త ప్రభుత్వం 1.5 ల‌క్షల కోట్లు బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్ర అదాయంలో కీల‌కంగా ఉండాల్సిన అమ‌రావ‌తి, పోల‌వ‌రం లాంటి ప్రాజెక్ట్‌ల‌కు ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ ఉండనుంది.

ఆదిభట్లలో రతన్ టాటా విగ్రహం పెడతాం

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలో 25 కోట్ల రూపాయలతో ఆదిభట్ల నుంచి మంగళ్ పల్లి రోడ్డుకు శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అనంతరం బహిరంగసభలో పాల్కొని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన నుంచి వచ్చాక చర్చించి రతన్ టాటా విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. దేశంలో తన సంపదలో సగానికిపైగా ప్రజల కోసం పంచిన దానశీలురు రతన్ టాటా. వారి కంపెనీలు ఈ ప్రాంతంలో వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. టాటా కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ తో ఐటీఐలను అప్ గ్రేడ్ చేస్తున్నాం. స్కిల్ సెంటర్స్ ను డెవలప్ చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. వారి సేవాతత్పరథకు గుర్తుగా వారిని గౌరవించుకుంటూ ఆదిభట్లలో అద్భుతమైన రతన్ టాటా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో ఎన్.హెచ్-65 విస్తరణ, ఆర్ఆర్ఆర్, ఇతర జాతీయ, రాష్ట్ర రాహదారులు మౌళిక వసతుల కల్పనలో కీలకపాత్ర పోషించబోతున్నాయని ఆయన తెలిపారు. గ్రామసభల్లోనే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేస్తున్నామని, ఆనాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చినం.. ఇవ్వాల అది 10 లక్షలతో సమానమన్నారు మంత్రి కోమటిరెడ్డి.

దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్.. తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురాలేదని కూటమి ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే సరికి దేశ వ్యాప్తంగా ఏపీ ఇండస్ట్రియల్ గ్రోత్ 11వ స్థానంలో ఉందని తెలిపారు. అయితే వైసీపీ వచ్చాక 9వ స్థానానికి వచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ పరిశ్రమలను తీసుకురాకుండా ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా పెరిగిందని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. దావోస్ నుంచి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారు.. రాజకీయ ప్రసంగాలు, విమర్శలు తప్పితే సాధించింది ఏమీ లేదని అన్నారు. లోకేష్ భజనతో దావోస్ ముగిసింది.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బ తీశారు.. చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్ అని దుయ్యబట్టారు. దావోస్‌లో కూడా లోకేష్ భజన చేశారని విమర్శించారు. జిందాల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టాల్సిన 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలించారని తెలిపారు.

తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలని కొత్త విద్యుత్ పాలసీ తీసుకొచ్చాం..

రాష్ట్ర జేడీపీకి సంభందించి జరిగే ఉత్పత్తిలో మీ బంధం అనుబంధం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో ..రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని, సమ్మర్ లో పూర్తి సన్నద్ధంగా ఉన్నాం అని npdcl డిస్కం అధికారులు పేర్కొన్నారన్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలు విద్యుత్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు అని, ఉద్యోగ వ్యవస్థకు అవసరమైన అన్ని సహకారాలు అందిస్తున్నామన్నారు. సుమారు 5వేల మందికి పదోన్నతులు, కొన్నిచోట్ల నూతన నియామకాలు చేపట్టాం,భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేప్పుడు, తగు సిబ్బంది నియామకం చేస్తామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం…రైతులు కట్టే డబ్బులను ఆర్థిక శాఖ డిస్కమ్ లకు కట్టుతుందన్నారు భట్టి విక్రమార్క.