NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

గిన్నీస్ బుక్ లోకి చిరంజీవి

ఇప్పటికే సినిమాలు చేస్తూ కొన్నాళ్లపాటు రాజకీయాలు చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కబోతోంది. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోబోతున్నారు. ఎక్కువ సినిమాల్లో డాన్స్ చేసి నటించినందుకుగాను మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ గా ఘనత దక్కించుకున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాదులోని ఐటిసి కోహినూర్ లో జరిగిన ఒక స్పెషల్ ఈవెంట్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిమ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కేటగిరీలో మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నీస్ బుక్ లో నమోదు చేయనున్నారు.

హైదరాబాద్‌ పాతబస్తీలో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌

ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) నేడు హైదరాబాదులో తనిఖీలు చేపట్టింది. సైదాబాద్ ప్రాంతంలోని శంఖేశ్వర్ బజార్ గ్రీన్ వ్యూ అపార్ట్ మెంట్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్ఐఏ తనిఖీలు దాదాపు గంటసేపు కొనసాగాయి. ఎన్ఐఏ ఆగస్టులో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రిజ్వాన్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అని ఎన్ఐఏ గుర్తించింది. రిజ్వాన్ అబ్దుల్ ఐసిస్ తరఫున పుణే నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. రిజ్వాన్ ను ఢిల్లీలోని గంగాబక్ష్ మార్గ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో అతడి నుంచి 30 బోర్ పిస్టల్, 3 కార్ట్రిడ్జ్ లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

కొడుకు కాలేజీ ఫీజుల కోసం అడుక్కున్న: మనీష్ సిసోడియా

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ‘స్కామ్’లో తనను అరెస్టు చేసిన సమయంలో.. ఈడీ తన బ్యాంక్ ఖాతాను స్తంభింపజేసిందని, ఈ కారణంగా అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. తన కొడుకు కాలేజీ ఫీజు కోసం కూడా ‘భిక్షాటన’ చేయవలసి వచ్చిందన్నారు. మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ‘‘2002లో నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు రూ. 5 లక్షల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశాను. దాన్ని లాక్కున్నారు. నా ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయి. అది కూడా విత్‌డ్రా అయిపోయింది. నా కొడుకు ఫీజు కట్టేందుకు సాయం చేయమని వేరేవాళ్లని వేడుకున్నా.” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తాం..

కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన చాలా బాగుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడుతూ.. ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందించగలిగామన్నారు. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌కు తోడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన ఆలోచనతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందన్నారు. తెనాలిలో 100 రోజుల్లో గంజాయిని అరికట్టగలిగామన్నారు. ఇప్పటికే 80శాతం గంజాయిని నిర్మూలించామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కారం కోసం, త్వరలోనే వాట్సాప్ నెంబర్‌ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

ఈనెల 26న పవన్ సమక్షంలో జనసేనలోకి బాలినేని..

ఈనెల 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సన్నిహితులతో మాట్లాడి అందరం కలసి వెళ్తామన్నారు. గతంలోనే పలు సందర్భాల్లో మంచి వ్యక్తి అంటూ తన గురించి పవన్ మాట్లాడారన్నారు. తన ఇబ్బందులతో పార్టీ మారాల్సి వస్తోందని.. జనసేన పార్టీ అభివృద్ది కోసం కృషి చేస్తానన్నారు. పవన్ ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తానన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిగ్గు తేల్చాలని 15 రోజుల క్రితమే సీఎం చంద్రబాబుకు లేఖ రాశానన్నారు.

చీకట్లో కూడా ఆగని హైడ్రా కూల్చివేతలు..

అమీన్ పూర్‌లో చీకట్లో కూడా ఆగకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కృష్ణారెడిపేటలో లైట్ల వెలుతురులో అక్రమ నిర్మాణాలను బాహుబలి మిషన్ కూల్చివేస్తోంది. అక్రమ నిర్మాణాన్ని ఆనుకుని ప్రక్కనే మరొక అపార్ట్మెంట్ ఉంది. అయితే.. ఆ అపార్ట్మెంట్ కు ఇబ్బంది కలుగకుండా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా అధికారులు.. పూర్తి నిర్మాణాలు కూల్చే వరకు హైడ్రా యాక్టివిటీ కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పటేల్ గుడా లో చివరి దశ కు హైడ్రా కూల్చివేతలు చేరుకున్నాయి. పటేల్ నగర్ లో 16 నిర్మాణాలు నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు.. సుమారు 12 గంటలుగా అమీన్ పూర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే పంతం నానాజీ

కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫొరెన్సిక్‌ విభాగాధిపతి, కాలేజీ స్పోర్ట్స్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యానికి దిగి, బూతులు మాట్లాడిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణ చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ కంటతడి పెట్టుకున్నారు. డాక్టర్‌ను తిట్టినందుకు రేపు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. నిన్న ఆవేశంతో తప్పుగా మాట్లాడానని ఆయన క్షమాపణలు చెప్పారు. తాను వైద్య వర్గాన్ని ఉద్దేశించి అలా మాట్లాడలేదు.. అలా ఎవరీతోనూ, ఎప్పుడూ ప్రవర్తించలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. కోపంలో బూతులు వచ్చేశాయని పేర్కొన్నారు. తీరా చూస్తే ఈయన నా స్నేహితుడే.. వైద్య వృత్తికి క్షమాపణలు చెప్తున్నాను అని ఎమ్మెల్యే ప్రకటించారు.

లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పాలకులెవ్వరూ తిరుమల పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదన్నారు. ఎందరికో స్పూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో 5ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని.. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారన్నారు. రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామన్నారు. వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని చంద్రబాబు పేర్కొన్నారు. అలిపిరి ఘటనలో తాను ప్రాణాలతో బయటపడటం స్వామి వారు చేసిన అద్భుతమే తప్ప, ఆ బ్లాస్ట్‌లో ప్రాణాలతో బయటపడటం అసాధ్యమన్నారు. అకౌంట్లు ఎప్పటికప్పుడు స్వామి వారు సెటిల్ చేస్తారు.. ఆయన మహత్యం అది అని సీఎం చెప్పారు. తిరుమల లడ్డూ న్యాణ్యత, సువాసనలో ఎంతో విశిష్టత ఉందన్నారు. స్వామి వారి మహత్యం ఉంది కాబట్టే ఎంతో మంది లడ్డూని కాపీ చేయాలనుకున్నా చేయలేకపోయారన్నారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూకి వాడే పదార్థాలకు రివర్స్ టెండరింగ్ పెట్టి నాణ్యత దెబ్బతీశారన్నారు.

తెలంగాణలో ప్రజారోగ్య స్థితిని అధ్యయనం చేయడానికి బీఆర్‌ఎస్‌ ప్యానెల్

రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు కొత్తగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీతో తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కీలక సమావేశం నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెటుకు ఆనంద్ ఉన్నారు. తెలంగాణలో క్షీణిస్తున్న ఆరోగ్య వ్యవస్థను అధ్యయనం చేయడానికి , ప్రభుత్వానికి సహాయం చేయడానికి ఈ బృందం ఏర్పడింది , ఈ రోజు తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితులు , సవాళ్లను అంచనా వేయడానికి రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆసుపత్రులను సందర్శించడం కమిటీ ఆదేశం. వారు తమ పరిశోధనలను నిర్మాణాత్మక నివేదికగా సంకలనం చేస్తారు, తదుపరి చర్య కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించబడుతుంది.

దులీప్ ట్రోఫీ టైటిల్ గెలుచుకున్న ఇండియా ‘A’..

దులీప్ ట్రోఫీ 2024 టైటిల్‌ను ఇండియా ‘A’ గెలుచుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఇండియా ఏ రెండింట్లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. రెండు విజయాలతో ఈ జట్టు గరిష్టంగా 12 పాయింట్లను కలిగి ఉంది. దీంతో.. జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ సి 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కాగా.. భారత్ ఎ జట్టు 61వ సారి దులీప్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో శాశ్వత్ రావత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

దులీప్ ట్రోఫీ 2024 మొదటి మ్యాచ్‌లో ఇండియా A జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా A జట్టు 76 పరుగుల తేడాతో ఇండియా B చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత.. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు గిల్ టీమ్ ఇండియాలో చేరాడు. ఈ క్రమంలో.. జట్టు కెప్టెన్సీని మయాంక్ అగర్వాల్‌కు అప్పగించారు. ఈ టోర్నీలో మయాంక్ కెప్టెన్సీలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇండియా ఎ 186 పరుగుల తేడాతో ఇండియా డిని ఓడించగా, మూడో మ్యాచ్‌లో ఇండియా ఎ 132 పరుగుల తేడాతో ఇండియా సిని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.