NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

నీట్ వివాదంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. విద్యార్థి సంఘాలతో పాటు ఆయా విపక్ష పార్టీలు నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. కొద్ది రోజులుగా ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇంకోవైపు సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభలను ప్రతిపక్షాలు స్తంభింపజేసే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. నీట్ పరీక్షలు సజావుగా నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా విద్యాశాఖకు నివేదిక అందజేయాలని కేంద్రం ఆదేశించింది.

మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి

ఓ బాలిక మిస్సింగ్‌ కేసులో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని… ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్‌కు పంపించారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీపీ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ జరుగుతోంది. ఈ భేటీకి తెలుగుదేశం ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. తొలి పార్లమెంటరీ పార్టీ భేటీ కావటంతో సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎవరిని నియమిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఈసారి లోక్ సభలో టీడీపీకి 16 ఎంపీల బలం ఉంది. ఈ నెల 24నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ కేంద్ర నిధులు తీసుకొచ్చేలా ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఎన్నికల తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

వచ్చేవారంలో పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజులపాటు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి నియోజకవర్గానికి రానున్నారు. స్థానిక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని అధికారులకు క్లారిటీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచిన పవన్‌ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ కూర్పులో భాగంగా పవన్ కల్యాణ్‌కు ఏపీ ఉపముఖ్యమంత్రిగా ప్రత్యేక గౌరవం దక్కింది. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను సీఎం చంద్రబాబు కేటాయించారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వచ్చేవారం పిఠాపురంలో పర్యటించనున్నారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుసుకొని నియోజక వర్గంలో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, స్థానిక కార్యకర్తలను తనే స్వయంగా వచ్చి కలుస్తానని, ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటించే కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఏం కావాలో ప్రతిపాదనలు ప్రస్తావించాను..

బడ్జెట్‌ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ(శనివారం) భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేంద్ర బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశానికి ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఈ క్రమంలో స్థూలంగా రాష్ట్రానికున్న అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న ఆర్థిక సహాయం గురించి ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఏపీకి ఏం కావాలో ప్రతిపాదనలు ప్రస్తావించానని మంత్రి తెలిపారు. రాష్ట్ర విభజనతో వచ్చిన ఆర్థిక సమస్యలు, గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణ లోపంతో కలిగిన నష్టాల గురించి ప్రస్తావించానన్నారు. జులైలో మొత్తం రూ.7000 పెన్షన్ ఇచ్చే విషయంలో అనుమానం అవసరం లేదన్నారు. రుణాలు సేకరణ నిరంతరం ప్రక్రియ అని.. రుణ సేకరణపై రిజర్వ్ బ్యాంక్‌తో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తుందని పేర్కొన్నారు.

ముగిసిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..వీటిపై పన్ను మినహాయింపు

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్‌ 53వ సమావేశం శనివారం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను తెలియజేసి కీలక నిర్ణయాలను వెల్లడించారు. సోలార్ కుక్కర్లపై 12 శాతం జీఎస్టీ విధించేందుకు ఆమోదం తెలిపామన్నారు. దేశంలో బయోమెట్రిక్ ప్రామాణీకరణ అమలులో ఉండగా , GST చట్టంలోని సెక్షన్ 73 కింద జారీ చేయబడిన డిమాండ్ నోటీసులకు వడ్డీ, పెనాల్టీని మాఫీ చేయాలని సిఫార్సు చేయబడింది. ఇది కాకుండా, నకిలీ ఇన్‌వాయిస్‌లను అరికట్టడానికి దశలవారీగా దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ ప్రామాణీకరణ అమలు చేయబడుతుంది.


ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి

హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, బ్లడ్ బ్యాంక్ ల, FSSAI Act అమలు తో పాటు అన్ని విభాగాలను బలోపేతం చేయడానికి ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయడం పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫుడ్ సేఫ్టీ పై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించడం వల్ల నాణ్యమైన ఆహారం అందించడంలో దేశంలోనే తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా గుర్తింపు లభిస్తుందన్నారు. నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందేలా ఆహార పరిరక్షణ అధికారులు నిరంతరం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు లోని హాస్టల్స్, క్యాంటీన్ల లతో పాటు అన్ని ఆసుపత్రులలో ఉన్న క్యాంటీన్లలో ఫుడ్ సేఫ్టీ పై నిరంతర పర్యవేక్షణ, నిఘా పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

సీఎం రేవంత్ రెడ్డికి హరీష్‌ రావు బహిరంగ లేఖ

నిరుద్యోగ యువత ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షల అభ్యర్థులు పడుతున్న ఇబ్బందులపై మాజీ మంత్రి టి హరీష్‌రావు శనివారం ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు , రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను ఆలస్యం చేయకుండా నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షల అభ్యర్థులు , నిరుద్యోగ యువత సమస్యలపై చర్చిస్తుందని అంచనాలు ఉన్నాయి, కానీ వారి ఆశలు అడియాశలయ్యాయని మాజీ మంత్రి అన్నారు. నిరుద్యోగ యువతకు రూ.4000 సాయంతో పాటు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా, గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులకు నియామక ఉత్తర్వులు అందించడం తప్ప, ఇప్పటివరకు కొత్త పోస్టులను భర్తీ చేయలేదన్నారు.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలు

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలును ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా దగ్గుమళ్ల ప్రసాద్ రావు, బైరెడ్డి శబరిలను చంద్రబాబు నియమించారు. కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు. పార్లమెంటరీ పార్టీ విప్‌గా గంటి హరీష్ నియామకమన్నారు. ఈసారి లోక్ సభలో తెలుగుదేశంకి 16ఎంపీల బలం ఉన్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతీ ఎంపీల ప్రథమ కర్తవ్యం కావాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నెల 24నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సీతక్క సమక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. గంజాయి ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడుతామని ఆమె అన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆమె వ్యాఖ్యానించారు. భూకబ్జాదారులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని, అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు మంత్రి సీతక్క. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు. త్వరలో మరోసారి సమీక్ష సమావేశం ను నిర్వహిస్తామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అధికారులను హెచ్చరించారు.