NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఈ నెల 26న జనసేనలోకి భారీగా చేరికలు..

ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు పార్టీలో చేరుతారు అని వెల్లడించారు. ఇప్పటికే వీరు ముగ్గురూ వేర్వేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశం అయిన తర్వాత పార్టీలో చేరికపై చర్చించారు.

అమెరికా, జపాన్‌ పర్యటనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పెట్టుబడులను ఆకర్షించేందుకు, అక్కడి మైనింగ్, గ్రీన్ పవర్ రంగాలపై అధ్యయనం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అధికారుల బృందంతో కలిసి శనివారం అమెరికా , జపాన్‌ల పర్యటనకు బయలుదేరారు. ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఉప ముఖ్యమంత్రి వెంట ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక) కె రామకృష్ణారావు, ఇంధన కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్, డిప్యూటీ సిఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

తిరుమల లడ్డూ వివాదంపై సజ్జల రియాక్షన్..

తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆరోపణలు చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారన్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడటం కాదు జంతువుల కొవ్వు వాడుతున్నారని ఆరోపణలు చేశారని సీఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఇక, జంతువుల కొవ్వు కలిపారాన్న బాబు ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు. రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తామని చెప్పారు.

భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా నాణ్యమైన ప్రసాదం తయారీ

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో లడ్డూ తయారీకి గత 20 ఏళ్లుగా కర్నూలు విజయ డైరీ నెయ్యి వాడుతున్నామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. విజయ నెయ్యి 2022- 23లో 590 రూపాయలకి పెంచడంతో కమిషనర్ నిర్ణయంతో ఒక సంవత్సరం టెండర్ పిలిచాం అన్నారు. 2022- 23లో టెండర్ పిలవడంతో సంఘం డైరీ, రాజేష్ కార్పొరేషన్ రెండు టెండర్లు పాల్గొన్నాయి.. రాజేష్ కార్పొరేషన్ కేజీ నెయ్యి 485 రూపాయలకు అందిస్తామని చెప్పడంతో సంవత్సరం టెండర్ ఇచ్చాం అని ఈవో పేర్కొన్నారు. ఇక, నేటి వీడియో కాన్ఫరెన్స్ లో దేవాలయాలలో ప్రసాదాల నాణ్యతాపరమైన ప్రమాణాలు పాటించాలని చెప్పారు అని ఈవో పెద్దిరాజు వెల్లడించారు.

సీఎం చంద్రబాబుకు నందమూరి మోహనకృష్ణ రూ. 25 లక్షల విరాళం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే భారీ వర్షాల వల్ల వరదలు వచ్చాయి. ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు వాగు పొంగడంతో భారీ నష్టం వాటిలల్లింది. అయితే, ఈ వరద బాధితులకు ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద వరద బాధితులకు తమ వంతు సహాయంగా నందమూరి మోహనకృష్ణ, నందమూరి మోహన్ రూప నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి 25 లక్షల రూపాయల విరాళం అందజేశారు. అయితే, నందమూరి మోహనకృష్ణ ఇన్స్టిట్యూట్లో చదివే రోజుల్లో గోల్డ్ మెడలిస్ట్.. అంతేకాక నందమూరి తారక రామారావు నటించిన బ్రహ్మంగారి చరిత్ర, అనురాగ దేవత, చండశాసనుడు, నందమూరి బాలకృష్ణ నటించిన పలు సినిమాలకు, విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేసిన శ్రీనివాస కళ్యాణం, అదే విధంగా తమిళ్ లో శివాని గణేషన్, ప్రభు నటించిన చరిత్ర నాయగన్, హిందీ లో ఫరూక్ షేక్ యాక్ట్ గర్వాలి బాహర్వాలి సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గానూ.. పలు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా వ్యవహరించారు. కాగా, నందమూరి మోహన కృష్ణ, ఆయన కుమార్తె నందమూరి మోహన రూప తమ వంతు సహాయంగా వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడుని తామే స్వయంగా కలిసి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

మూసీ పరీవాహక ప్రాంతంలో రేపటి నుంచి కూల్చివేతలు

హైదరాబాద్‌ నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. అయితే.. మూసీ పరీవాహక ప్రాంతంలో రేపటి నుంచి కూల్చివేతలు జరుగనున్నాయి. మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. అయితే.. మూసీ పరీవాహక నిర్వాసితులకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. ఇప్పటికే మూసీ ఆక్రమణలపై సర్వే నిర్వహించారు అధికారులు. మూసీ నదిలో 12 వేల ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మూసీ నది ప్రక్షాళనలో 55 కిలో మీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్రభుత్వ నిర్ణయింది.

కార్మిక, ఉపాధి శాఖ అధికారులతో సీఎం రేవంత్‌ సమీక్ష

కార్మిక, ఉపాధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను అప్ గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. సిలబస్ మార్పుకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు సీఎం రేవంత్‌. అవసరమైతే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని, పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ తెలిపారు. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నీక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

నష్ట పరిహారం అందజేతపై సీఎం చంద్రబాబు సమీక్ష..

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు పరిహారం అందజేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులతో ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై రివ్యూ చేశారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో ఈనెల 25వ తేదీన బాధితులకు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విజయవాడలో వరదకు మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తు వారికి రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

అమెరికా చేరుకున్న మోడీ.. క్వాడ్ సమ్మిట్‌కు హాజరుకానున్న ప్రధాని

ప్రధాని మోడీ అగ్ర రాజ్యం అమెరికా చేరుకున్నారు. మోడీకి అమెరికా నేతలు ఘనస్వాగతం పలికారు. మూడు రోజుల పాటు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్‌లో క్వాడ్ సమ్మిట్‌ జరగనుంది. ఈ సమావేశానికి మోడీ హాజరవుతారు. సమ్మిట్‌లో చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు పర్యటనకు ముందు మోడీ ట్వీట్ చేశారు. అధ్యక్షుడు బైడెన్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు తెలిపారు.

శ్రీవారికి అపచారం.. 11 రోజుల పాటు పవన్‌ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష

అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని ఎక్స్(ట్విట్టర్‌) వేదికగా పవన్‌ కల్యాణ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరన్నారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకంమన్నారు. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందన్నారు. అపరాధ భావానికి గురైంది. ప్రజా క్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే తన దృష్టికి రాకపోవడం బాధించిందన్నారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలసిందేనన్నారు. అందులో భాగంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.