ప్రాణం తీసిన ఆర్గానిక్ క్యారెట్స్.. 50మంది ఆస్పత్రి పాలు.. అమ్మకాలు నిలిపివేత
ఆర్గానికి క్యారెట్లు అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తున్నాయి. ఆర్గానికి క్యారెట్లలో హానికరమైన ఇ కోలి వ్యాప్తి చెందుతోంది. దీంతో ఇప్పటికే ఒకరు చనిపోగా.. 50 మందికి పైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. దాదాపు 18 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదైనట్లు యూఎస్ సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఇప్పటికే గ్రిమ్‌వే ఫార్మ్స్ విక్రయించిన బ్యాగ్డ్ ఆర్గానిక్ బేబీ మరియు మొత్తం క్యారెటలను రీకాల్ చేసినట్లు సీడీసీ తెలిపింది. ఈ క్యారెట్లతో అంటువ్యాధులు వ్యాప్తిచెందినట్లుగా దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
మంత్రి సీతక్క ఆదేశాలతో జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్
మంత్రి సీతక్క ఆదేశాలతో వరంగల్ జిల్లా జంగాలపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్ చేశారు అధికారులు. RWS నీటి పరీక్షలు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాల వల్ల సుమారుగా 17 మంది చనిపోవడం జరిగింది. జంగాలపల్లి గ్రామంలో ఉన్న ఆరోగ్య సమస్యల గురించి మంత్రి సీతక్క జిల్లా అధికారులను,వైద్య అధికారులను అప్రమత్తం చేసి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. DMHO గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుండి 3 రోజుల వరకు వైద్య పరీక్షలు చేసి చనిపోవడానికి కారణాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
ఏడు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఏడు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మునిసిపల్ లా సవరణ బిల్లు 2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024లను శాసనసభ ఆమోదించింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంతమంది పిల్లలున్నా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులేనని.. జనాభా వృద్ధిరేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ చట్ట సవరణ చేసింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 2024కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు.
మణిపూర్పై అమిత్ షా వరుసగా రెండో రోజు సమావేశం..
మణిపూర్‌లో హింస ఆగడం లేదు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా రెండో రోజు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలు, రాష్ట్ర ఏజెన్సీలకు సూచించారు. రాష్ట్రంలో భద్రత కోసం 50 కంపెనీల అదనపు కేంద్ర పోలీసు బలగాలను షా పంపించారు.
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు..
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏల రద్దు అంశం చాలా వివాదాస్పదం అయినట్లు మంత్రి పేర్కొన్నారు. కేవలం పీపీఏల రద్దు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయినట్లు విమర్శించారు. ప్రతీ ఏడాది వినియోగదారుల సంఖ్య 5 నుంచి 6 శాతం పెరుగుతున్నా కానీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క మెగా వాట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేసిన పాపాన పోలేదని విమర్శించారు. విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇందు కోసం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఏపీ తీసుకొచ్చిన పాలసీ కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు క్రమంగా వస్తున్నాయని అన్నారు.
కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్
వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టుకు NOC సాధించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల కళ నెరవేరబోతుందన్నారు. 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామన్నారు. 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిందని, డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి పౌర విమానయాన శాఖ మంత్రిని కలుస్తామన్నారు. వరంగల్ జిల్లాలో మెగా టెక్స్ టైల్ పార్కు వచ్చింది. దేశంలోనే పెద్దదని, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కూడా సాధిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ నాలుగు ఎయిర్ పోర్టులు పూర్తి చేస్తామని, విజయవాడ హైవే ఆరు లైన్ల రోడ్డు పనులు జనవరిలో ప్రారంభిస్తామన్నారు. 2018లో ప్రారంభం అయిన ఉప్పల్ స్కైవే పనులు 30 శాతం మాత్రమే పూర్తి అయ్యాయని, రాబోయే ఏడాదిన్నర లోపు ఉప్పల్ స్కై వే నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. రీజినల్ రింగ్ రోడ్డు 2016లో నాటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేయాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పనులు పూర్తి చేస్తామని, ఢిల్లీలో ఉన్న మంత్రులు నెలలో 27 రోజులు గల్లీలో ఉంటున్నారన్నారు. కిషన్ రెడ్డి ఎప్పుడు గల్లీలో ఉంటున్నారని, కిషన్ రెడ్డి ఒక్కసారి నల్గొండ జిల్లాలో ఒక గ్రామంలో నిద్ర చేసి రండన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
నాగాలాండ్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాగాలాండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు (సోమవారం) ఉదయం ఢిల్లీ నుండి బయలుదేరి దిమాపూర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న బండి సంజయ్ కుమార్ అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో నాగాలాండ్ రాజధాని కొహిమాకు వెళ్లారు. నేరుగా నాగాలాండ్ రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బండి సంజయ్ కుమార్ కు చీఫ్ సెక్రటరీ జాన్ ఎ ఆలంతో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుచ్ఛక్తి, సంక్షేమం, రవాణా, జల్ శక్తి రంగాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. 20 లక్షల జనాభా కలిగిన నాగాలాండ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, రోడ్ కనెక్టివిటీ విషయంలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. విద్య, వైద్య సౌకర్యాల విషయానికొస్తే…. రాష్ట్రంలో ఒకే మెడికల్ కాలేజీ ఉందని దీనిని ఎయిమ్స్ ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసి కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగించాలని అధికారులు కోరారు. రాష్ట్రంలో ఎన్ఐటీ మినహా ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదని తెలిపారు. కొండ ప్రాంతాల మధ్యనున్న కొహిమా నుండి డిమాపూర్ వరకు ఉన్న రహదారికి ప్రత్యామ్నాంగా మరో రహదారి అవసరముందని అధికారులు ప్రతిపాదించారు. పీఎం విశ్వకర్మ పథకంపట్ల ప్రజల్లో అవగాహన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. స్కిల్ డెవలెప్ మెంట్, సంక్షేమ పథకాల అమలుపైనా అధికారుల నుండి పలు వివరాలు సేకరించారు.
కోటి దీపోత్సవ ప్రభ మాటలకందని విధంగా ఉంది..
“దీపం ఐక్యతకు చిహ్నం.. ఆ ఐక్యతే మనకు బలం.. మనలో ఆ ఐక్యత కొనసాగాలని ఆశిస్తూ.. అలాగే ఈ కోటి దీపోత్సవ ప్రభ మాటలకందని విధంగా ఉంది.. ఇటువంటి దీపోత్సవాల ద్వారా ప్రతి ఇల్లు ఒక ఇల్లు దేవాలయం కావాలి.. జ్ఞానసంపదకు క్షేత్రం కావాలి” అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోటి దీపోత్సవానికి హాజరై ప్రసంగించారు. కోటి దీపోత్సవ ప్రాంగణంలో మొదటి కార్తీక దీపాన్ని రాజ్‌నాథ్ సింగ్ వెలిగించారు. అంతకు ముందు కాశీ విశ్వనాథుడికి ఆయన పూజలు చేశారు.
పెళ్లికి ఒకరోజు ముందు గుండెపోటుతో వరుడు మృతి.. వధువు పరిస్థితి..!
యూపీలో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ జిల్లాలోని భోజ్‌పూర్ ఖెత్సీ గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లికి ఒకరోజు ముందు గుండెపోటుతో మరణించాడు. అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ చనిపోయినట్లు చెప్పారు. దీంతో.. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. వధువు ఇంట్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. కాబోయే భర్త మరణవార్త విన్న వధువు అపస్మారక స్థితికి చేరుకుంది.
రూ.75 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్‌కు చిక్కిన సర్వేయర్
ఏసీబీకి ఓ అవినీతి చేప చిక్కింది. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మారావు ఏసీబీ ట్రాప్‌కు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖకు చెందిన బృందం దాడి చేసింది. ఎలకొలను గ్రామానికి చెందిన బి.రాముడు నుంచి లంచం డిమాండ్ చేశాడు సర్వేయర్ చిక్కాల ధర్మారావు. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఓ పథకాన్ని రచించారు. రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మా రావు రూ. 75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుకున్న బృందంలో ఇన్‌స్పెక్టర్ ఎన్‌వీ భాస్కర్ రావు, డి.వాసుకృష్ణ, వై సతీష్, ఇతర సిబ్బంది ఉన్నారు.