Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు..

ప్రజా ప్రభుత్వం పైన కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్ బీర అయిలయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, కేటీఆర్ వెకిలి చేష్టలతో కాళ్లలో కట్టెలు పెట్టినట్లు మాట్లాడుతున్నాడని బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో..లేకుంటే నాలుక కోస్తామని, అవినీతి డబ్బుతో పెట్టిన పింకీ మీడియా తో ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేస్తున్నాడని, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చుతామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడని, రియల్టర్లు, బ్రోకర్లు, భూ స్కాం లు చేసిన వారు  చందాలు ఇస్తున్నరని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నాడన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనమని చందాలు ఇస్తున్నారని మాట్లాడుతున్నాడని, మీ లాగా సంతలో పశువుల్లా మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోడు.. ప్రజలు ఎన్నుకున్న నిఖార్సైన ఎమ్మెల్యేలు అని ఆయన వ్యాఖ్యానించారు. మా ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడు పోవడానికి సిద్ధంగా లేరని, నీ నాయకత్వం నచ్చకనే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీకి వచ్చారన్నారు.

ఎంతపని చేశావమ్మా..! ఇద్దరు పిల్లల్ని నరికి చంపి.. బిల్డింగ్ పైనుంచి దూకి తల్లి ఆత్మహత్య

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారం ప్రాంతంలో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మానసికంగా చితికిపోయిన ఓ తల్లి, తన ఇద్దరు చిన్నారులను వేట కొడవలితో నరికి, అనంతరం బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన మృతిచెందిన తల్లి తేజస్విని రెడ్డిగా, ఆమె కుమారులు హర్షిత్ రెడ్డి (7), ఆశిష్ రెడ్డి (5) గా పోలీసులు వెల్లడించారు. తేజస్విని తన చిన్న కొడుకు ఆశిష్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, పోలీసులు రామ్రాజ్‌ అసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే ఆశిష్‌ మృతి చెందాడు. అయితే.. హర్షిత్ రెడ్డి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. తేజస్విని రెడ్డి, ఈ ఘటనకు ముందు ఆరుపేజీల సూసైడ్ నోట్ రాసి ఉంచింది. సూసైడ్ నోట్ లో ఆమె తన మనోవేదనను, కుటుంబపరమైన ఒత్తిడులను వివరించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలానికి బాలనగర్ డీసీపీ, జీడిమెట్ల సీఐలు చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలనలు చేపట్టారు. ఈ సంఘటన గాజులరామారంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.

తిరుమల మెట్లు అన్నీ కడగండి.. పవన్‌ కల్యాణ్‌కు రోజా సూచన

టీటీడీకి చెందిన ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై వైసీపీ చేసిన ఆరోపణలు.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో టెంపుల్ సిటీలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.. వైసీపీ ఆందోళనలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. దేవుడితో పెట్టుకోవద్దు.. దేవుడితో పెట్టుకుంటే ఏమవుతుందో.. ఇప్పటికే చంద్రబాబు చూశారు.. ఈ మధ్యే పవన్‌ కల్యాణ్‌కు కూడా తెలిసివచ్చిందన్నారు.. అయితే, ప్రభుత్వాన్ని తానే నిలబెట్టానని చెబుతున్న పవన్‌ కల్యాణ్‌కు ఈ ప్రభుత్వం చేసే తప్పుల్లో కూడా భాగస్వామ్యం ఉందన్నారు.. సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు ఈరోజు తిరుమలలో ఎన్నో అపరాచాలు, ఘోరాలు జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.. ఈ ఘటనలపై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంలో గోవులను మాతగా పూజిస్తారు.. ఇప్పుడు గోశాలలో గోవులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు..

గద్దర్ సినీ అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులు వీరే!

తెలంగాణలో గద్దర్ సినీ అవార్డుల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ సమావేశం నిన్న ప్రముఖ సినీ నటి జయసుధ చైర్మన్‌గా జరిగింది. ఈ కమిటీలోని సభ్యులు జ్యూరీగా వ్యవహరిస్తూ, వచ్చిన అప్లికేషన్లను ఫిల్టర్ చేసి అవార్డులను అందించడానికి కృషి చేయనున్నారు. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా సీనియర్ నటి జయసుధ వ్యవహరిస్తుండగా, మెంబర్ కన్వీనర్‌గా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి నియమితులయ్యారు. వీరితో పాటు, జీవిత రాజశేఖర్, దర్శకులు దశరథ్, నందిని రెడ్డి, శ్రీనాథ్, ఉమామహేశ్వరరావు, శివ నాగేశ్వరరావు, వి.ఎన్. ఆదిత్య కూడా ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. అలాగే, విజయ్ కుమార్ రావు అనే ఎగ్జిబిటర్, లక్ష్మీనారాయణ, జి. వెంకటరమణ (అలియాస్ జీవి) అనే జర్నలిస్టులు, ఆకునూరు గౌతమ్ అనే ఫిల్మ్ అనలిస్ట్ కూడా కమిటీలో ఉన్నారు. ఇంకా, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, ఏడిద నాగేశ్వరరావు కుమారుడు నిర్మాత ఏడిద రాజా కూడా ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ అవార్డుల కోసం వ్యక్తిగత క్యాటగిరీలో 1172 నామినేషన్లు, చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాలు తదితర క్యాటగిరీలలో 76 నామినేషన్లు స్వీకరించబడ్డాయి.

గ్రూప్-1 హైకోర్టు తాత్కాలిక బ్రేక్.. నియామక పత్రాలు ఇవ్వొద్దు..!

తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. గ్రూపు-1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ 20 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం కోర్టు విచారణ ప్రారంభించింది. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు నియామక పత్రాలు జారీ చేయకూడదని స్పష్టం చేసింది. ఇటీవల, గ్రూపు-1 పరీక్షపై రాజకీయ రచ్చ కూడా నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, గ్రూపు-1 నియామకాల్లో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. “పరీక్ష రాని 10 మందికి ఫలితాలు ఎలా వచ్చాయి?” అని ప్రశ్నించారు. ఆయన సీబీఐ విచారణను కోరుతూ, పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై టీజీపీఎస్సీ స్పందించింది. గ్రూపు-1 పరీక్షలో కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, టీజీపీఎస్సీ ప్రకారం అన్ని నిబంధనలను పాటిస్తూ, నిపుణులతో వాల్యుయేషన్ చేయించినట్లు పేర్కొంది.

మేయర్‌పై అవిశ్వాసం ముంగిట.. విశాఖలో వైసీపీకి బిగ్‌ షాక్..!

గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మేయర్ పీఠం అవిశ్వాస పరీక్షపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఆఖరి కొద్దిగంటల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలతో నేతల బుర్రలు వేడెక్కిపోతున్నాయి.. విదేశాల్లో క్యాంప్ ఎత్తేసి కార్పొరేటర్లను తెలుగుదేశం వెనక్కి రప్పించే స్తుండగా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. జనసేన కండువా కప్పుకున్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కి చెందిన పలువురు వైసీపీ కార్పోరేటర్లు.. మంత్రి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు..

ప్రభుత్వ సేవలపై సర్వే.. షాకింగ్‌ విషయాలు వెలుగులోకి..!

వివిధ ప్రభుత్వ సేవలపై ఏపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరిస్తోంది.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య పౌర సేవలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నిర్వహించింది.. అయితే, ఈ సర్వేలో కొన్ని షాకింగ్‌ విషయాలతో పాటు.. మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.. ప్రజా పంపిణీ కింద సరఫరా చేయబడిన వస్తువులపై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆపరేటర్లు అదనపు రేట్లు వసూలు చేస్తున్నారని దాదాపు 26.7 శాతం మంది ఫిర్యాదు చేశారు.. ఇక, PDS కింద సరఫరా చేయబడిన నిత్యావసర వస్తువుల నాణ్యత చెడుగా ఉందని కొంత మంది ప్రజలు ఈ సర్వేలో తమ అభిప్రాయంగా తెలిపారు.. ఇక, దీపం-2 పథకం కింద పంపిణీ చేసే సంవత్సరానికి మూడు సిలిండర్లపై డెలివరీ బాయ్‌లు అదనపు రేటు వసూలు చేస్తున్నారానంటున్న 35.2 శాతం మంది లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు..

జడ్జిలకు మా కృతజ్ఞతలు.. కోర్టు ద్వారా మాకు మంచి న్యాయం లభించింది

వక్ఫ్ బోర్డు, మతపరమైన సంస్థల నిర్వహణ, సామాజిక న్యాయంతో సంబంధం ఉన్న అంశాలపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నుంచి తమ పిటిషన్లపై లభించిన సానుకూల తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు తమకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా, ప్రజల్లో న్యాయం పట్ల నమ్మకాన్ని పెంచిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తమ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పును ప్రశంసించారు. “జడ్జిలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కోర్టు మాకు న్యాయం అందించింది. పార్లమెంట్‌లో మైనారిటీలకు వ్యతిరేకంగా కొన్ని అన్యాయమైన చర్యలు జరిగినప్పటికీ, కోర్టు న్యాయబద్ధంగా తీర్పు ఇచ్చింది,” అని ఆయన తెలిపారు. ఈ పిటిషన్‌లో ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఆ మంత్రిపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం..

మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. వెంటనే మంత్రిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కార చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. జస్టిస్‌ ఎన్‌.ఆనంద్‌ వెంకటేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఏప్రిల్ 23కి వాయిదా వేశారు. డీఎంకే ప్రభుత్వం నిరుపేద గృహిణులకు ప్రతినెలా రూ.1,000 నగదును వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమచేసే ‘కలైంజర్‌ మహిళా సాధికారిక పథకం’ గురించి ఓ సభలో వివరించారు. ఒక సెక్స్‌ వర్కర్‌ గురించి మాట్లాడే క్రమంలో హిందూ మత చిహ్నాలను లైంగిక భంగిమలతో పోలుస్తూ ఆయన చేసిన వివాదాస్పద జోక్‌ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైంది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్‌ పార్టీ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన్ను డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి స్థానం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకు కారణాలను అందులో చెప్పలేదు. తాజాగా కోర్టు సైతం ఈ అంశంపై తీవ్రంగా మండిపడింది.

వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి.. పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్‌లో వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతిచెందింది.. ఆ చిరుత కడుపులో రెండు పిల్లలు కూడా చనిపోవడంపై విమర్శలు వచ్చాయి.. మదనపల్లె మండలం పొన్నూటిపాళెం సమీపంలోని అటవీ ప్రాంతం సమీపంలో పొలం గట్టుపై వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడిన ఆడ చిరుత.. దాదాపు 8 గంటల పాటు నరకయాతన అనుభవించి ప్రాణాలు విడిచింది.. వేటగాళ్ల ఉచ్చునుంచి బయటపడడానికి చిరుత చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మృత్యుఒడికి చేరింది.. అయితే, అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో చిరుత మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.. పీసీసీఎఫ్‌ చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్‌..

 

Exit mobile version