Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్రం కొత్త రూల్స్..!

ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్రం ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తున్న విషయం తెలిసిందే..డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సొనెల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) తాజాగా కీలకమైన స్పష్టత ఇచ్చింది.. ఎల్‌టీసీకి సంబంధించిన కొత్త రూల్స్ అంశంపై క్లారిటీ తీసుకువచ్చింది. ఎల్‌టీసీ కింద ట్రైన్ జర్నీ, ఎల్‌టీసీకి సంబంధించి ఎయిర్‌ టికెట్లు బుకింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. 7వ వేతన సంఘం కింద జీతం తీసుకుంటున్న ఉద్యోగులకు ఈ రూల్స్ వర్తిస్తాయి..

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1988 కింద ఎల్‌టీసీ రూల్స్ వర్తిస్తాయి. డీఓపీటీ ఈ మేరకు ఆఫీస్ మెమరాండమ్ జారీ చేసింది. ఇకపై ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్షీషన్ కింద బుక్ చేసుకున్న టికెట్లపై కేటరింగ్ చార్జీలను రీయింబర్స్‌మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు కేటరింగ్ ఫెసిలిటీ పొందాలా? వద్దా? అనే అంశానికిసంబంధించి ఆప్షన్ కల్పిస్తోంది.. ఉద్యోగులు టికెట్ బుకింగ్ సమయంలో ఈ ఆప్షన్ ను ఎందుకుంటే ఎల్‌టీసీ కింద కేటరింగ్ చార్జీలను రీయింబర్స్‌మెంట్ పొందొచ్చు..

విశ్వకర్మ యోజనకు కేంద్రం ఆమోదం.. వారికి రాయితీపై రుణాలు

నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA).. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన “పీఎం విశ్వకర్మ”కు ఆమోదం తెలిపింది. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రకటించిన ఈ పథకం ద్వారా 30 లక్షల మంది హస్తకళాకారులు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందించడం ద్వారా ప్రయోజనం అందిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.2028 వరకు ఐదు సంవత్సరాల కాలానికి రూ.13,000 కోట్ల ఆర్థిక వ్యయంతో కూడిన ఈ పథకం, మొదటి సందర్భంలో 18 సంప్రదాయ వ్యాపారాలను కవర్ చేస్తుంది. పథకంలో భాగంగా రూ.1 లక్ష వరకు రుణ సదుపాయాన్ని కల్పించనున్నారు. దీనిపై గరిష్టంగా 5 శాతం వడ్డీని విధించనున్నారు. విశ్వకర్మ యోజన పథకానికి రూ.13 వేల కోట్ల నిధులను వెచ్చించనున్నారు. ఈ పథకం వల్ల దేశంలో 30 లక్షల మంది చేతివృత్తుల కళాకారులకు లబ్ధి చేకూరనుంది. “పీఎం విశ్వకర్మ” పథకం కింద మొదటి దశలో కవర్ చేయబడిన వారిలో వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, కమ్మరి, తాళాలు చేసేవారు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు, చెప్పులు కుట్టేవారు, తాపీ పని చేసేవారు ఉన్నారు.

బీజేపీ హర్ ఘర్ తిరంగ అంటుంటే… కేసీఆర్ హర్ ఘర్ మద్యం సీసా అంటున్నారు

బీజేపీ హర్ ఘర్ తిరంగ అంటుంటే… కేసీఆర్ హర్ ఘర్ మద్యం సీసా అంటున్నారని విమర్శించారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 60 వేల బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, గౌడ్ లకు, ఎస్టీలకు, ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించారు.. దరఖాస్తు కోసం రెండు లక్షల రూపాయల నాన్ రిఫండ్ ఫీజు పెట్టారని ఆయన మండిపడ్డారు. మధ్యతరగతి ప్రజానీకానికి మద్యం దుకాణం దరకాస్తు చేసుకునే అవకాశమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. వందల కోట్ల విలువ చేసే భూముల వేలంలో పాల్గొనేందుకు లక్ష రూపాయలు పెట్టీ… మద్యం దుకాణాలకు రెండు లక్షలు పెట్టడం వెనుక కుట్ర ఉందని ఆయన అన్నారు.

కేసీఆర్ పక్కన శకుని లాగా సోమేష్ కుమార్ ఉన్నారని, మద్యం దుకాణాలకు దరఖాస్తు పెట్టుకోవాలంటేనే సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. దేశంలో అత్యధికంగా మద్యం రెట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన ఆరోపించారు. రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ తెలంగాణ లో 880 రూపాయలు అయితే యూపీలో 560 రూపాయలు మాత్రమేనని, గౌడ్ లకు సంబంధించి రిజర్వేషన్ చేసిన మద్యం దుకాణాలను.. గీత కార్మికుల సొసైటీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎస్సీలకు సంబధించిన రిజర్వేషన్ చేసిన మద్యం దుకాణాలకు టెండర్ వేయడానికి 25 వేల రూపాయలు మాత్రమే పెట్టాలని బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. ఎలైట్ షాప్స్ కేవలం కేసీఆర్ బినామీలే తీసుకుంటున్నారని, ఉడ్తా తెలంగాణ చేయవద్దని డిమాండ్ చేస్తున్నామన్నారు. బెల్ట్ షాప్స్ తొలగించాలని బూర నర్సయ్య డిమాండ్‌ చేశారు.

కళాశాల అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక స్టూడెంట్ సూసైడ్

మంగళగిరి పరిధిలోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో నాలుగో సంవత్సరం వైద్య విద్యార్థి కామేపల్లి వెంకట ప్రణవ్ యశ్వంత్ ఆత్మహత్య వెనుక కళాశాల యాజమాన్యం ఫీజుల కోసం చేసిన వేధింపులు ఉన్నట్లు సమాచారం. కళాశాల నిర్దేశించిన ఫీజు చెల్లించినప్పటికీ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు అదనంగా ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయటంతోనే యశ్వంత్ నిన్న (మంగళవారం) ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తనకు యాజమాన్యం నుంచి ఎదురౌతున్న అదనపు ఫీజు చెల్లింపు వేధింపుల గురుంచి రెండు నెల్ల క్రితమే యశ్వంత్ విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం అధికారులతో పాటు, ఎన్ఆర్ఐ కళాశాల అధికారులకు లేఖ రాసినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనే కఠిన నిర్ణయాన్ని యశ్వత్ తీసుకున్నారని సమాచారం. కళాశాల యాజమాన్యం ఫీజు వేధింపుల గురించి విశ్వవిద్యాలయ అధికారులకు చేసిన ఫిర్యాదు కాపీ యశ్వంత్ సూసైడ్ అనంతరం వెలుగులోకి వచ్చింది.

‘మట్కా’ కోసం హైదరాబాద్‌లో నోరా ఫతేహి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ను భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సర్ నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ప్రారంభోత్సవ వేడుక కూడా ఇటీవలే ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమాలో నోరా ఫతేహి కి డ్యాన్స్ నంబర్ ఉంటుందని ఆమె పాత్ర చాలా కీలకమైనదని అంటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కానప్పటికీ, సినిమాలో ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో నటించడానికి ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అంటున్నారు. 1958-1982 మధ్య కాలంలో జరిగే ఈ సినిమా కథలో వైజాగ్ అమ్మాయిగా నటించడం పెద్ద ఛాలెంజ్ గా భావిస్తోంది నోరా ఫతేహి.

బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తే ఖబడ్దార్

నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ అమెరికాల బాత్రూమ్ కడుగుతుండే అంటూ వ్యాఖ్యానించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారన్నారు. బలహీన వర్గాల ప్రజలను అవమానిస్తే ఖబడ్దార్ అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హెచ్చరించారు. కాంట్రాక్టర్లు , రియల్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోండని, సామాజిక తెలంగాణ ఎప్పుడు వస్తుంది కేసీఆర్…? అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కేబినెట్ లో ఎక్కువ మంది ఓసిలేనని, కేసీఆర్ చేసింది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ మాత్రమేనన్నారు. పంట నష్టం పది వేల రూపాయలు ఏవి…? అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు విజన్ 2047 ఒక దుస్సాహసం

చంద్రబాబు విజన్ 2047 ఒక దుస్సాహసమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. జనం అంటే ఏమీ తెలియని అమాయకులు, పిచ్చోళ్ళని చంద్రబాబు నమ్మకమంటూ ఆయన ఎద్దేవా చేశారు. వందేళ్ళ వయసులో కూడా పాలన చేస్తానని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నారన్నారు. చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడు అని.. తన విధానం ఏంటో, తాను వస్తే ఏం చేస్తాడో చెప్పాలని ఆయన పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటూ సజ్జల ప్రశ్నించారు. పైకి పోయినా తానే శాశ్వతంగా పాలిస్తాను అనుకుంటున్నారని.. ప్రజలంటే అపహాస్యం, చులకన భావం దీనిలో వ్యక్తం అవుతుందన్నారు.

గత ఐదేళ్లలో ఇప్పుడు చెప్పిన అంశాల్లో ఒకటైనా చేశాడా అంటూ ఆయన ప్రశ్నించారు. నిన్న ఏం చేశారో, ఇవాళ ఏం చేశారో.. పిచ్చి స్థాయి దాటి ఒక ట్రాన్స్‌లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఒక తిక్కమేళమని.. తలా తోక లేని ఆలోచనలు చేస్తుంటాడని ఆరోపించారు. సినిమాల్లో ఇలాంటివి చూపిస్తారన్నారు. ఎన్నికలే ప్రజా కోర్టు అని.. ఎవరి చెవిలో పూలు పెడుతున్నారని ప్రశ్నించారు. సినిమాలు లేనప్పుడు యూట్యూబ్‌లో ప్రజా కోర్టు పెడతాడేమో అంటూ ఎద్దేవా చేశారు.తెలుగు, హిందీలో కూడా ఇలాంటి సీరియల్స్ వచ్చాయన్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావటానికే అవకాశం లేదన్నారు.ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో తెలియదని.. ఇక అధికారంలోకి ఎలా వస్తాడంటూ సజ్జల పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని వీరే అన్నారని.. ఇప్పుడు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాం అనటం ప్రజల్ని మభ్యపెట్టడమేనని మండిపడ్డారు.

దైవదూషణ ఆరోపణలు.. పాకిస్థాన్‌లో చర్చిలు ధ్వంసం

పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రిస్టియన్ మైనారిటీలపై ఓ వర్గానికి చెందిన ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. చర్చీలను ధ్వంసం చేస్తూ.. మైనారిటీల అణిచివేత చర్యలకు పాల్పడ్డారు. ఒక క్రైస్తవ కుటుంబం దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అనేక చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి. పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ నివాసాలను దోచుకున్నారు. ఈ ఘటన ఫైసలాబాద్‌లోని జరన్‌వాలా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. క్లీనర్‌గా పనిచేసే ఒక క్రైస్తవుడు ఖురాన్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో స్థానిక ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ఇంటిని కూల్చివేయడమే కాకుండా, గుంపు ఆ ప్రాంతంలోని చర్చిలు, ఇతర క్రైస్తవ నివాసాలను కూడా ధ్వంసం చేసింది. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో ఓ ఉన్మాద గుంపు చర్చిలపైకి ఎక్కి పవిత్ర శిలువను తన్నడం కనిపించింది.

చంద్రబాబు మోసగాడైతే.. పవన్ కళ్యాణ్ గజ మోసగాడు

ఏపీ మాజీమంత్రి పేర్ని నాని తాజాగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు మోసగాడైతే.. పవన్ కళ్యాణ్ గజ మోసగాడు అని ధ్వజమెత్తారు. సినిమా, సీరియల్ టైటిల్స్ పెడతాడని.. సినిమా కవులు పెట్టిన పేరు ప్రజాకోర్టు అని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వల్ల జరిగిన లాభం ఏంటి? అని ప్రశ్నించారు. ఒక టీ షాప్ వ్యక్తి ఇచ్చిన డబ్బులతో పవన్ ఓ లారీ కొనుగోలు చేసి, దానికి వారాహి పేరు పెట్టాడని అన్నారు. అసలు ఈ మోసాలు ఎందుకని నిలదీశారు. పవన్ ఎన్ని స్థానాలకు పోటీ చేస్తాడో దమ్ముంటే చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తే.. ఆ విషయం ధైర్యంగా చెప్పగలడా? అని అడిగారు. నిజాయితీగా, నిఖార్సుగా ఓట్లు అడుక్కోలేని పరిస్థితి పవన్ కళ్యాణ్‌ది అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తెలంగాణాలో మళ్లీ భారీ వర్షాలు.. ఆ ప్రాంతాలకు అలెర్ట్..

రెండు వారాలుగా కొనసాగుతున్న డ్రై స్పెల్‌కు ముగింపు పలుకుతూ తెలంగాణ వ్యాప్తంగా శనివారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం అంచనా వేసింది.. జూలై చివరి వారంలో అపూర్వమైన అవపాతం తర్వాత, నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. ఆగస్టు 16 నాటికి, రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 117 మి.మీ.కు గాను ఈ నెలలో కేవలం 21 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.. ఫలితంగా 82 శాతం విచలనం నమోదైంది..

గత నెలలో కురిసిన వర్షానికి, వరదల్లో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరియు నదులు మరియు రిజర్వాయర్లు హెచ్చరిక స్థాయిలను ఉల్లంఘించడంతో 27,000 మందికి పైగా ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. ఉదాహరణకు, ములుగు జిల్లాలోని లక్ష్మీదేవిపేటలో ఒక రోజులో 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది 2004 నుండి రాష్ట్రంలో నమోదైన అత్యధిక 24 గంటల వర్షపాతం..బుధవారం ఉత్తర, ఈశాన్య జిల్లాలైన కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆ శాఖ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. దాని వాతావరణ బులెటిన్ ప్రకారం, ఈశాన్య మరియు ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుఫాను సర్క్యులేషన్ ఉంది, దీని ప్రభావంతో ఆగస్టు 18 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

తిరుమల చిన్నారిపై చిరుత దాడి ఘటన.. శ్రీశైల దేవస్థానం అలర్ట్

తిరుమల చిన్నారిపై చిరుత దాడి ఘటన నేపథ్యంలో శ్రీశైల దేవస్థానం అలర్ట్ అయింది. క్షేత్ర పరిధిలో చిరుతల సంచారంపై దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత, ఎలుగుబంటి వన్యప్రాణుల సంచారంపై అటవీశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. రాత్రి సమయంలో జంతువులు క్షేత్ర పరిధిలోకి రాకుండా టపాసులు కాలుస్తూ శబ్దాలు చేయిస్తామని శ్రీశైలం దేవస్థాన ఈవో లవన్న పేర్కొన్నారు. త్వరలో భక్తుల రక్షణకై అడవి జంతువులు క్షేత్రపరిధిలోకి రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పెన్సింగ్ కోసం మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి సహకారంతో రూ. 5 కోట్ల 30 లక్షలకు టెండర్ పిలుస్తామని ఆయన తెలిపారు. 2 సంవత్సరాలలో పెన్సింగ్ ఏర్పాటు చేసి జంతువులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రానికి వచ్చే భక్తులకు రక్షణ కల్పిస్తామని ఈవో లవన్న స్పష్టం చేశారు.

 

Exit mobile version