NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

EVM లోని డేటాని తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు..

కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎం నుంచి డేటాను తొలగించవద్దని కోరూతూ దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల(EVM) స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ఏమిటి అని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటా తొలగించవద్దని, ఏ డేటాని రీలోడ్ చేయవద్దని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది.

వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్‌ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన వర్క్ స్టైల్ మార్చారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ (ఫిబ్రవరి 11) బెంగుళూరు నుంచి తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి రాగానే ఆయన అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీలోని అంతర్గత విషయాలపై ఎప్పటికప్పుడు వారితో చర్చిస్తున్నారు.

తిరుమల పవిత్రత దెబ్బ తినేలా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు..

తిరుమల పవిత్రత దెబ్బ తినేలా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆవు కొవ్వు, పందికొవ్వు కలిసినట్లు ఒక్క మాట సీబీఐ సిట్ లో రిమాండ్ లో చెప్పలేదు‌.. ఏఆర్ డైరీ సహా ఇతర రెండు డైరీలు చేసినా అక్రమాలపై మాత్రమే రిమాండ్ రిపొర్టు‌లో చెప్పకోచ్చారు.. చంద్రబాబు మాత్రం లడ్డులో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసింద‌ని ప్రచారం చేశారు.. హిందూల మనోభావాలను దెబ్బ తీసేలా రాష్ట్ర మఖ్యమంత్రి మాట్లాడారు.. నాణ్యత లేకుండా వనస్పతి కలవడంతో తిరస్కరించామని ఈవో శ్యామలరావు తెలిపారు.. ఏఆర్ డైరీలో నుంచి వచ్చిన నాలుగు ట్యాంకుల్లో నాణ్యత లేదని వెనక్కి పంపినట్లు ఈవో చెప్పారు.. అరెస్టు అయినా నలుగురు సరఫరా వ్యవహారం తప్పులు చేశారని సిట్ చెబుతోంది అని భూమన కరుణాక్ రెడ్డి పేర్కొన్నారు.

భారత్-పాక్ సరిహద్దుల్లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు భారత జవాన్లు మరణం..

జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ జవాన్ల మరణాలను నిర్ధారించింది. సైనికులు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి గస్తీలో ఉండగా ఐఈడీ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని సైన్యం తెలిపింది.

భారీగా పెరిగిన బీర్ల ధరలు.. ఏ బీరు ఎంత పెరిగిందంటే?

వేసవి ముందు మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. మండుటెండల్లో కూల్ కూల్ బీరు తాగి చిల్ అవుదామనుకునే బీరు ప్రియులకు పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. బీర్ల ధరలు పెరగడంతో బీరు లవర్స్ ఉసూరుమంటున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బీరుపై 15 శాతం పెంచింది. పెరిగిన బీర్ల ధరలు నేటి నుంచి (ఫిబ్రవరి 11 2025)అమల్లోకి రానున్నాయి. రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ కమిటి సిఫార్సు మేరకు ప్రభుత్వం బీర్ల ఎమ్మార్పీ ధరలపై 15 శాంతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఏ బీరు ఎంత పెరిగిందో ఇప్పుడు చూద్దాం.

నిమిషాల వ్యవధిలోనే చనిపోతున్న కోళ్లు.. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న పౌల్ట్రీ నిర్వాహకులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గంపలగూడెం మండలంలోని అనుమ్మోలంకలో శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి. గడిచిన రెండు రోజుల్లో కలిపి మొత్తంగా 10 వేలకు పగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. పౌల్ట్రీ ఫారం దగ్గర చనిపోయిన కోళ్ళను గంపలగూడెం వెటర్నరీ వైద్యుడు జి. సాయి కృష్ణ పరిశీలించారు. వైరస్ తో చనిపోయిన ప్రాంతాల్లోని సుమారు 10 కిలో మీటర్ల పరిధిలో చికెన్ షాపులు, కోళ్లు, గుడ్లను తినొద్దని ప్రజలకు సూచనలు జారీ చేశారు. మృతి చెందిన కోళ్లను టెస్టుల కొరకు ల్యాబ్ కు పంపనున్నారు అధికారులు. 18 లక్షల ఖర్చుతో 15 వేల కోడి పిల్లలను పౌల్ట్రీలో పెంచుతున్నామని పౌల్ట్రీ ఫారం నిర్వాహకుడు అత్తునూరి కాంత రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 10 వేల కోళ్లు నిమిషాల వ్యవధిలో చనిపోతున్నాయి.. లక్షల్లో నష్టం వాటిల్లింది.. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరారు.

రెప్పపాటు కూడా అంతరాయం ఏర్పడవద్దు

రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో spdcl పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళిక పై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్, రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్తు డిమాండ్ ఉంటుంది.. అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళికల వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా అనేది సున్నితమైన అంశం, నిత్యవసరం కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అన్నారు. వేసవి ప్రణాళికపై అన్ని స్థాయిల్లో అధికారులు వెనువెంటనే సమావేశం నిర్వహించుకుని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ఏ రీతిలో సన్నద్ధంగా ఉన్నారు, వినియోగదారులకు సైతం అవగాహన కల్పించాలి అన్నారు.

కేటీఆర్‌కి మహేష్ కుమార్ గౌడ్ సవాల్

కేటీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన … ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా కేటీఆర్? అంటూ కేటీఆర్‌కు మహేష్ కుమార్‌ గౌడ్‌ ఛాలెంజ్‌ చేశారు. కేటీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేసి.. దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయండన్నారు. చెల్లి, బావ ఇచ్చిన షాక్ తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆయన హెద్దెవ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ – బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం పై చర్చకు సిద్ధం అని ఆయన అన్నారు. బీసీ కులగణన , ఎస్సీ వర్గకరణ చర్చకు ఎక్కడికి రమన్నా వస్తామని, సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కి లేదన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్.

రేపు హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. రేపు (ఫిబ్రవరి 12) ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. రేపటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆయన జ్వరం నుంచి కోలుకుంటుండగానే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది.

కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు.. ఉప ఎన్నికలు ఖాయం

తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఎర్రవెల్లిలోని కేసీఆర్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాజకీయ పరిణామాలు, రానున్న ఉప ఎన్నికలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గంభీరంగా చర్చ జరిగినట్లు సమాచారం.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమని తెలిపారు. రాబోయే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తాటికొండ రాజయ్య పోటీ చేయడం అనివార్యమని, ఈ ఎన్నికల్లో రాజయ్య గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఇటీవల పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.