నేను మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడడం ఎందుకు ..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నైతిక విలువల గురించి తన అభిప్రాయాలు వెల్లడించగానే, ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడటం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.
“మా తాతలూ, తండ్రులూ కాంగ్రెస్‌లో ఉండేవారు అంటూ చెప్పేవారు. కానీ మీకు అనుకూలంగా పరిస్థితులు లేకపోతే తిరుగుబాటు చేసి పార్టీకి వ్యతిరేకంగా నడవడం నిజమైన సిద్ధాంతమా?” అంటూ ప్రశ్నించారు. “చొక్కారావు గారు కాంగ్రెస్‌ను వీడి కరీంనగర్ నుంచి జనతా పార్టీ తరఫున పోటీ చేశారు. ఇప్పుడు మీకు అవకాశమైతే కాంగ్రెస్, లేదంటే మరో పార్టీ — ఇదేనా రాజకీయం?” అని నిలదీశారు.
‘‘డ్రమ్‌లో ముక్కలవ్వడం ఇష్టం లేదు’’.. భార్య అక్రమ సంబంధంపై భర్త.. వీడియో వైరల్..
తన భార్య, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసిన ఓ భర్త, ఇకపై తాను ఆమెతో కలిసి జీవించడం ఇష్టం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను హత్య చేసే అవకాశం ఉందని, మీరట్‌లో జరిగినట్లు డమ్ముల్లో ముక్కలు అవ్వడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలోని మౌరానిపూర్‌లో జరిగింది. ప్రభుత్వ బాలికల కళాశాలలో గుమస్తాగా పనిచేస్తున్న రీతు వర్మ అనే మహిళ స్థానిక కౌన్సిలర్ అభిషేక్ పాఠక్‌తో సంబంధం కలిగి ఉందని ఆమె భర్త పవన్ పోలీసులకు తెలిపారు. సదరు మహిళకు అప్పటికే ఆరేళ్ల కొడుకు ఉన్నాడు.
ఆదివాసులపై మావోయిస్టుల బెదిరింపులు అర్థరహితం.. ఎస్పీ శబరీష్
ములుగు జిల్లా కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు బాంబులు పెట్టినట్టు మంగళవారం ఓ లేఖ ద్వారా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గారు స్పందించారు. ప్రజల్లో భయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టులకు మాత్రం ఇది సరైన మార్గం కాదని స్పష్టం చేశారు. అడవుల్లో నివసిస్తూ తమ జీవనోపాధిని సాగిస్తున్న ఆదివాసీలపై ఈ విధమైన బెదిరింపులు న్యాయసమ్మతం కావని ఎస్పీ చెప్పారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడే ఆదివాసుల జీవనశైలి కాపాడాల్సిన అవసరం ఉందని, బాంబుల పేరిట వారిని భయభ్రాంతులకు గురిచేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
పేదల పాలన ఇది.. రైతన్నలకు భరోసా, ఇళ్లతో చిరునవ్వులు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతుల సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నిస్వార్థంగా అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఇప్పటికీ ప్రజల జీవితాల్లో ఆశాజ్యోతి అన్నారు.
రైతన్నలకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వమని, అదే సమయంలో ఆనాటి ప్రభుత్వం రైతుబంధు పథకం గురించి మోసగించి, ఎన్నికల ముందు అది కూడా ఇవ్వకుండా పరారైపోయిందని పొంగులేటి అన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కేంద్రబిందువుగా తీసుకొని పాలన చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. “మేము అధికారంలోకి వచ్చి రెండు నెలలలోనే రూ. 8200 కోట్లు రైతు భరోసా కింద విడుదల చేశాం,” అని చెప్పారు.
T-Fiber ను T-NXTగా అభివృద్ధి చేస్తున్నాం.. ఎన్టీవీతో మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తాజాగా NTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణపై కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, కంప్యూటర్ సేవలను తక్కువ ధరలో అందించేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.
“ఇప్పటి వరకు ఉన్న T-Fiber సేవలను మరింత విస్తరించి, నూతన సర్వీసులు జత చేస్తూ T-NXTగా ఆవిష్కరిస్తున్నాం,” అని మంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, చివరి గ్రామం, చివరి ఇంటి వరకు ఫైబర్ కనెక్టివిటీ చేర్చే పనిలో ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమం వచ్చే ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నాలుగు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా నడుస్తోంది. అక్కడ ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు,” అని చెప్పారు.
రేపు ఒంటిమిట్ట కోదండ రామయ్య దర్శనానికి సీఎం చంద్రబాబు… పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (ఏప్రిల్ 11) నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి సాయంత్రం 3:30 గంటలకు కడప ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుండి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్ కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన సతీమణి నందమూరి భువనేశ్వరి, ఒంటిమిట్టలోని ప్రసిద్ధ శ్రీ కోదండ రామస్వామి దేవస్థానానికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంటారు. దర్శనం అనంతరం 6 గంటల నుండి 6:30 వరకు పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో పాల్గొంటారు.
మాజీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్ట్
వైసీపీ పార్టీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ సతీమణి భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి నిందితుడిగా ఉన్న చేబ్రోలు కిరణ్‌ను అందుపులోకి తీసుకున్నారు. ఇక అదుపులోకి తీసుకుంటున్న సమయంలో మంగళగిరి నుంచి గుంటూరుకు తరలిస్తున్న సమయంలో గోరెంట్ల మాధవ్ పోలీసు వాహనాన్ని వెంబడిస్తూ, ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గోరంట్ల మాధవ్ చేయి చేసుకునే ప్రయత్నం, అలాగే ఎస్కార్ట్ వాహనాన్ని అడ్డగించడం వల్ల పోలీసుల విధులకు ఆటంకంగా భావిస్తూ ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గుంటూరు జిల్లాలో కొంత ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ మాధవ్‌ను అరెస్ట్ చేయడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు!
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో, హుటాహుటిన హాస్పిటల్ కి తరలించి, అవసరమైన పరీక్షలు జరిపి చికిత్స అందించారు. పవన్ కళ్యాణ్ ఒకపక్క మన్యం పర్యటనలో ఉండడంతో, ఆయన సింగపూర్ వెళ్లేందుకు ఆలస్యమైంది. ఈలోపు, మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లి, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఇక తాజాగా, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
‘‘వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి’’.. ముస్లిం సంస్థ కోటి సంతకాల సేకరణ..
ప్రముఖ ముస్లిం సంస్థ జమియత్ ఉలేమా-ఎ-హింద్ వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ చట్టానికి కోటి మంది వ్యతిరేకంగా చేసిన సంతకాల చేసిన తీర్మానాన్ని ప్రధాని నరేంద్రమోడీ పంపుతామని చెప్పారు. కోల్‌కతా రాంలీలా మైదానంలో జరిగిన భారీ సమావేశంలో జమియిత్ బెంగాల్ చీఫ్, రాష్ట్ర మంత్రి సిద్ధిఖుల్లా చౌదరి చట్టాన్ని రద్దు చేయాలని ప్రధాని మోడీని కోరారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేంగా న్యాయ పోరాటం చేయడానికి జమియత్ క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది. సుప్రీంకోర్టు వచ్చే వారం అనేక పిటిషన్లను విచారించనుంది. వివిధ జిల్లాలు, పట్టణాలత నుంచి సంతకాలను సేకరించి మోడీకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25 మరియు 26 కింద హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను వక్ఫ్ చట్టం ఉల్లంఘించిందని జామియత్ మెమోరాండం పేర్కొంది. వక్ఫ్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ఆరోపించింది.