NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి, బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఈ ఓటమిపై కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇండియా కూటమి పార్టీలు హస్తం పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అహంకారం, అతివిశ్వాసమే కాంగ్రెస్‌ని దెబ్బతీసిందని ఉద్దవ్ ఠాక్రే శివసేన ఆరోపించింది. టీఎంసీ కూడా ఇలాంటి విమర్శలనే చేసింది.

దశాబ్ద కాలం డీఎస్సీ ఇవ్వలేదు.. ఈ ప్రభుత్వం మనది మీది….

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ నియామకాల గురించి పట్టించుకోలేదని, ఉపాధ్యాయ నియామకాల పై కనీసం ఆలోచన చేయలేదన్నారు. దశాబ్ద కాలం డీఎస్సీ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పేదలకు విద్యా అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, ఎన్ని ఇబ్బందులు వచ్చిన , ఎందరు కుటిల ప్రయత్నాలు చేసినా ఎగ్జామ్ నిర్వహించాలని దృఢ నిశ్చయం తో ముందుకు వెళ్ళామన్నారు. ఈ ప్రభుత్వం మనది మీది అని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామన్నారు. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించామని, పరీక్షల నిర్వహణకు నిధులు విడుదల చేశామన్నారు.

హర్యానా ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన ట్వీట్..

హర్యానా ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. జనం అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి.. ఏపీలో లాగే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు ఉన్నాయని.. హర్యానా ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని అన్నారు. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.. పోలింగ్ కొరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం సమర్ధనీయం కాదన్నారు. దేశంలో పేపర్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికీ బ్యాలెట్‌లనే వాడుతున్నారు.. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయని అన్నారు. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్ కే వెళ్లటం మంచిది.. అప్పుడే ఓటర్లలో కూడా విశ్వాసం పెరుగుతుంది.. ఓటర్లలో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలని వైఎస్ జగన్ కోరారు.

ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్స్ అందచేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్స్ అందచేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మిమ్మల్ని చూస్తోంటే దసరా పండగ మూడు రోజుల ముందే వచ్చినట్లుందన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు గత పదేళ్లు కోరి కొరివిదెయ్యాన్ని తెచ్చుకున్నారని, ఆ కొరివి దెయ్యాన్ని రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదన్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే ఇవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ మూడేళ్లు ఆలస్యంగా 2017లో ఇచ్చారని, నోటిఫికేషన్ ఇచ్చిన రెండేళ్ల తరువాత 2019 నియామకాలు జరిపారన్నారు. తండ్రీ కొడుకుల ఉద్యోగాలు ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు మాట ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. మేం అధికారంలోకి వచ్చిన 90రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని, డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే 10,006 ఉపాధ్యాయ నియామకపత్రాలు అందిస్తున్నామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక ప్రతిపాదనలపై చర్చ

రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో వివిధ కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ కు సంబంధించి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనపై కెబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అలాగే.. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై చర్చించనుంది కేబినెట్. అంతేకాకుండా.. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ విషయమై ప్రతిపాదన కేబినెట్ ముందుకు రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై హైడ్రా స‌మీక్ష

డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై హైడ్రా కమిషనర్‌ స‌మీక్ష నిర్వహించారు. న‌గ‌రంలో వ‌ర‌ద‌లు, కారణాలు, ఉపశమన చర్యలు (డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌)పై బుధ‌వారం హైడ్రా కార్యాల‌యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స‌మీక్ష చేశారు. బెంగ‌ళూరులో అనుస‌రిస్తున్న విధానాల‌పై ప‌వ‌ర్‌పాయింట్ ప్రజెంటేష‌న్ ద్వారా క‌ర్ణాట‌క రాష్ట్ర ప్రకృతి వైప‌రీత్యాల నిర్వహ‌ణ కేంద్రం మాజీ డైరెక్టర్ డా. జీఎస్ శ్రీ‌నివాస్ రెడ్డి వివ‌రించారు. బెంగ‌ళూరుతో పాటు.. దేశంలోని ఇత‌ర ప‌ట్టణాల్లో అనుస‌రిస్తున్న విధానాల‌ను అధ్యయ‌నం చేసి స‌మ‌న్వయంతో మెరుగైన వ్యవ‌స్థను రూపొందించ‌డంపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం న‌గ‌రంలో అనుస‌రిస్తున్న డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విధానాల‌ను మ‌రింత స‌మ‌ర్థవంతంగా, స‌మ‌న్వయంగా రూపొందించ‌డం, ప్రజ‌ల‌ను ముందుగానే అప్రమ‌త్తం చేసి.. యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచ‌డం వంటి చర్యలపై సమీక్షలు చేశారు.

‘‘ఈవీఎంలు హ్యాక్ చేశారు’’..హర్యానా ఓటమిపై కాంగ్రెస్ సంచలనం..

హర్యానా ఓటమి కాంగ్రెస్‌ ఆశల్ని ఆవిరి చేసింది. ఖచ్చితంగా గెలుస్తామని అంచనా వేసిన హర్యానాలో బీజేపీ చేతిలో దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. మొత్తం 90 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో, కాంగ్రెస్ 37 స్థానాల్లో గెలుపొందాయి. ఎగ్జిట్ పోల్స్‌ అన్ని కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే, దీనికి విరుద్ధంగా షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఈవీఎంలో లోపాలు ఉన్నాయని ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసింది. ఎన్నికల కమీషన్‌తో భేటీ అనంతరం కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లు హ్యాక్ అయ్యాయంటూ ఆరోపించింది. 20 స్థానాల్లో హ్యాకింగ్ జరిగిందని, అందులో ఏడు స్థానాలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలని సమర్పించినట్లు పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. మిగతా 13 స్థానాలకు సంబంధించి రీసెర్చ్ పత్రాలను 48 గంటల్లో సమర్పిస్తామని తెలిపారు. పరిశోధనలు పూర్తయ్యే వరకు అన్ని ఈవీళఎంలకు సీటు వేయాలని, భద్రపరచాలని ఈసీని కోరినట్లు ఆయన తెలిపారు.

పూణెలో దారుణం.. మహిళను చంపిన చిరుత

మహారాష్ట్రలో దారుణం జరిగింది. పొలం పనులు చేసుకుంటున్న మహిళపై చిరుతపులి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. పూణెకు సమీపంలోని పింప్రి-పెంధార్ గ్రామంలో సుజాత ధేరే అనే మహిళ పొలంలో పని చేస్తుంది. సోయాబీన్ పొలంలో పని చేస్తుండగా మాటు వేసిన చిరుత పులి ఒక్కసారిగా మహిళపై దాడి చేసింది. దాదాపు 100 అడుగుల దూరం లాక్కెళ్లింది. తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిరుత పులుల సంచారంపై చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారి తెలిపారు. చెరుకు పొలాలను పులులు నివాసంగా చేసుకుంటాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పింప్రి-పెంధార్, ఇతర ప్రాంతాల్లో 40 బోనులు, 50 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. చిరుతపులిని గుర్తించడానికి థర్మల్ డ్రోన్‌లను సైతం ఉపయోగిస్తున్నట్లు ఫారెస్ట్ డివిజన్ అధికారి పేర్కొన్నారు. స్థానికులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

విమానంలో పైలట్ మృతి.. న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

అమెరికా నుంచి ఇస్తాంబుల్‌కు బయల్దేరిన విమానం మార్గమధ్యలో ఉండగా పైలట్ హఠాత్తుగా ప్రాణాలు వదిలాడు. అయితే వెంటనే న్యూయార్క్‌లో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం యూఎస్ నుంచి టర్కీకి బయల్దేరింది. మంగళవారం అర్థరాత్రి సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం ఉత్తర కెనడా మీదుగా వెళ్తుండగా పైలట్ ప్రాణాలు వదిలాడు. అయితే అతని మరణానికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు.

“డోర్ మ్యాట్‌”గా తమిళనాడు డిప్యూటీ సీఎం ఫోటో.. వైరల్ వీడియోపై స్పందించిన జూనియర్ స్టాలిన్..

తమిళనాడు వ్యాప్తంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉదయనిధి స్టాలిన్ ఫోటోలు ‘‘డోర్ మ్యాట్’’ ఉపయోగిస్తున్న వీడియో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో వైరల్‌గా మారడంపై డీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరగకుండా సంయమనం పాటించాలని ఉదయనిధి తన పార్టీ సభ్యులకు సూచించారు. ప్రశాంతంగా ఉండాలని, ఆ వీడియోపై స్పందించొద్దని కోరారు. ఇలాంటి చర్యలు రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతాయంటూ ఉదయనిధి అన్నారు. ‘‘ నన్ను అవమానిస్తున్నారని భావించే ఈ సంఘీల పట్ట నేను జాలిపడుతున్నాను. వారి రాజకీయ అపరిపక్వత బట్టబయలైంది. వారికి అంత కోపం ఉంటే నేను ద్రావిడ సూత్రాన్ని అనుసరించి సరైన మార్గంలో ఉన్నట్లే’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘‘వారు పెరియార్‌పై చెప్పులు విసిరారు. అన్నాదురై, కరుణానిధిని అవమానించారు. పుట్టుక, మతం ఆధారంగా విభజించే భావజాలంతో ప్రజలను ఆకట్టుకోకపోవడం వల్ల వారు నిరాశలో ఉన్నారు’’ అని ఉదయనిధి అన్నారు.