పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ నిజంగా వామనుడే.. బలి చక్రవర్తి చంద్రబాబును పవన్ తొక్కబోతున్నాడు.. అది బాబు గమనించాలని ఎద్దేవా చేశారు. ఎవరైనా పార్టీ పెడితే అదికారంలోకి రావాలని కోరుకుంటారు.. ప్రజలకు సేవచేయాలని వస్తారు.. పవన్ లా వేరే వాళ్లను ముఖ్యమంత్రిని చేయాలని రారని పేర్కొన్నారు. జగనన్న దెబ్బకు పవన్‌కు భయమేస్తుంది అందుకే అతనికి కేటాయించిన 24 స్థానాలలో తను ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించలేదన్నారు. చట్ట సభలలో అడుగు పెట్టే రాత పవన్‌కి లేదన్నారు. టీడీపీ-జనసేన పొత్తు ఉదయించే పొత్తు కాదు.. అస్తమించే పొత్తు అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ పొత్తును ప్రజలు అంగీకరించటం లేదన్నారు.
భారతదేశంలో నిరుద్యోగం పాకిస్తాన్ కన్నా ఎక్కువగా ఉంది..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. భారత్‌లో నిరుద్యోగం పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా ఎక్కువగా ఉందని, భూటాన్ కన్నా వెనకబడి ఉన్నామని రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారాలన్నింటికీ తీవ్ర విఘాతం కలిగిందని ఆయన దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత 40 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగిత రేటు చేరుకుందని, పాకిస్తాన్‌తో పోలిస్తే భారత్‌లో రెండింతల నిరుద్యోగిత ఉందని అన్నారు.
పవన్ కల్యాణ్‌ను కలిసిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లాలో కీలకమైన రాజకీయాలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరు నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే ఆరిణి శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతోనే బలిజ నేత అయిన శ్రీనివాసులు పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయనందా రెడ్డిని గెలిపించాలంటూ చిత్తూరు బలిజ సంఘం నేతలందరూ నగరంలో భారీ నిర్వహించి విజయనందా రెడ్డిని గెలిపించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఇటు బలిజ ఎమ్మెల్యే పార్టీ మారడం.. ఇదే సమయంలో అత్యధిక ఓటర్లుగా ఉండే బలిజ సంఘం నేతలు విజయనందా రెడ్డికి మద్దతు పలకడం నగరంలో హాట్ టాపిక్ మారింది. ఇక నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ లీడర్‌గా ఉన్న ఇన్నాళ్ళూ మౌనంగా ఉన్న సీకే బాబు టీడీపీకి మద్దతు పలికారు. టీడీపీ అభ్యర్థి గురజాల జగన్ మోహన్ గెలిపించాలని కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఎంపీ రంజిత్ రెడ్డి పోటీపై నెలకొన్న అనిచ్చితి
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఖరారు చేసే పనిలో పడ్డారు ఆయా పార్టీల అధిష్టానం పెద్దలు. నిన్న బీజేపీ అధిష్టానం 195 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. దీంతో పాటు.. తెలంగాణలోనూ పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేస్తూ పేర్లను ప్రకటించింది. అయితే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో సీట్లు గెలిచేందుకు బీఆర్‌ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల లోక్ సభ పరిధిలోని నియోజకవర్గ నేతలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. అయితే.. రంజిత్ రెడ్డి పోటీపై అనిచ్చితి నెలకొంది. పోటీ చేస్తారో లేదో అని ఇంతవరకు రంజిత్ రెడ్డి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో.. ప్రత్యామ్నాయ నేతల పేర్లను బీఆర్‌ఎస్ అధిష్టానం ఆలోచిస్తోంది.
మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూత
రాజస్థాన్ క్రికెట్‌లో విషాదం నెలకొంది. ఆ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ(40) మృతి చెందారు. గత కొంతకాలంగా లివర్ సమస్యలతో బాధపడుతున్న రోహిత్ శర్మ.. జైపూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు. నాలుగైదు రోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
2004 నుంచి 2014 వరకు ఆయన రాజస్థాన్ తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. 2014లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఆర్‌ఎస్ క్రికెట్ అకాడమీని స్థాపించి, కోచ్‌గా సేవలందిస్తున్నారు. ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారు. కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్, లెగ్ స్పిన్ బౌలర్ అయిన రోహిత్ 2004-2014 మధ్యలో రాజస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. రోహిత్ రాజస్థాన్ తరఫున 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 28 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టీ20లు ఆడారు. రోహిత్ ఖాతాలో రెండు లిస్ట్-ఏ సెంచరీలు ఉన్నాయి.
ప్రధాని మోడీ “హిందువు” కాదు.. ఎందుకంటే..?
బీహార్ పాట్నా వేదికగా ఈ రోజు రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో ‘జన్ విశ్వాస్ ర్యాలీ’ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ హిందువు కాదని అన్నారు.
ప్రధాని హిందువు కాదని, ఆయన తల్లి మరణిస్తే గుండు కొట్టించుకోలేదని లాలూ అన్నారు. ప్రధాని మోడీ కుటుంబ రాజకీయాలపై దాడికి పాల్పడుతున్నారని, అతనికి కుటుంబమే లేదని ఎద్దేవా చేశారు. తల్లి మరణిస్తే హిందువులెవరైనా గుండు చేయించుకుంటారని, కానీ ప్రధాని అలా చేయలేదని, ఎందుకు గుండు చేయించుకోలేదు..? అతను హిందువు కాదని మోడీని టార్గెట్ చేస్తూ లాలూ విమర్శలు గుప్పించారు. కుటుంబ రాజకీయాలను ప్రధాని టార్గెట్ చేస్తున్నారని, అతనికి ఎందుకు పిల్లలు లేరు, ఎందుకు ఫ్యామిలీ లేదు, ఎందుకంటే అతను హిందువు కాదు అంటూ ఆరోపించారు. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా విద్వేషాన్ని పెంచుతున్నారని మండిపడ్డారు.
6న కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రాక
బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో మేడిగడ్డ పిల్లర్ ఘటన దీనికి మరింత బలాన్ని చేకూర్చుతుండగా.. కాళేశ్వరం నిర్మాణంపై విచారణ జరపాలని బీజేపీ సైతం కోరుతోంది. ఈ క్రమంలోనే.. 6వ తేదీన కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రానున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నాం.. అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. నేషనల్ డ్యామ్ సెఫిటీ అథారిటీ సూచనలను ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. గతంలో కుంగిపోయిన మెడిగడ్డ బ్యారేజ్ ను నేషనల్ డ్యామ్ సెఫిటీ అథారిటీ పరిశీలించి నీటిని ఖాళీ చేయాలని సూచించిందని, అనంతరం సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్ లను పరిశీలించిన డ్యామ్ సెఫిటీ అథారిటీ మెడిగడ్డ లో ఉన్న సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయని ఈ రెండు బ్యారేజ్ లలో కూడా నీటిని ఖాళీ చేయాలని సూచించింది. అథారిటీ సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం నీటిని ఖాళీ చేస్తుందన్నారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి విద్వేష మత బోధకులు రాకుండా బ్యాన్.. యూకే కీలక నిర్ణయం..
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా దేశాల నుంచి రాడికల్ ఇస్లామిక్ట్ దృక్పథం కలిగిన మత విద్వేష బోధకులు రాకుండా యూకే బ్యాన్ విధించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించబడతారని యూకే మీడియా ఆదివారం నివేదించింది. బ్రిటన్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటంతో అక్కడి రిషి సునాక్ ప్రభుత్వం కొత్త ప్రణాళికను రూపొందించే పనిలో ఉంది. విదేశాల నుంచి వచ్చే అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాదులను గుర్తించడానికి అధికారులను నియమించారు. తద్వారా వారికి వీసా హెచ్చరికల జాబితాలో చేర్చవచ్చని తెలుస్తోంది. కొత్త ప్లాన్ ప్రకారం.. లిస్టులో ఉన్న వారు ఆటోమేటిక్‌గా యూకేలోకి ప్రవేశించకుండా నిరాకరించబడుతారు.