అట్టహాసంగా ప్రారంభమైన నుమాయిష్
నాంపల్లి లో ఎక్సిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభం అయిన నుమాయిష్ నాంపల్లిలో ఆలిండియా ఎగ్జిబిషన్‌ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. వివిధ రాష్ట్రాల ఉత్పత్తులు, స్టాల్స్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇంట్లో కూర్చొని వస్తువులను ఆర్డ్ చేస్తున్నారన్నారు. మొబైల్‌లో ఆర్డ్‌ర్ ఇస్తే వస్తువులు వస్తాయేమో గానీ.. నుమాయిష్‌లో పొందే అనుభూతిని ప్రజలు కొల్పోతారన్నారు. ఈ ఎగ్జిబిషన్‌కు వస్తే వివిధ రాష్ట్రాల సంస్కృతులు, ఆహారపు అలవాట్లు, ఉత్పత్తులు ఎంచుకోవచ్చన్నారు. ఎగ్జిబిషన్ను సందర్శించడం తెలంగాణ ప్రజల లైఫ్‌స్టైల్‌లో భాగమని ఆయన అన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా చాలా మంది విద్యార్థులు చదువుతున్నారని, గతంలో ఎగ్జిబిషన్ ప్రారంభం అయిన వారం రోజుల వరకు షాప్ లు వచ్చేవి కావని, ఇప్పుడు మొదటి రోజే షాప్ లు ఫుల్ అయ్యాయన్నారు. ప్రజలు ఇక్కడకు రావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వచ్చేందుకు బస్సుల సంఖ్యను కూడా పెంచుతామన్నారు మంత్రి హరీష్ రావు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 82 సంవత్సరాల నుంచి నుమాయిష్ నడుస్తుందన్నారు. నుమాయిష్‌తో వచ్చిన ఆదాయంతో పాఠశాలలు, విద్యా సంస్థలు నడుపడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు మంత్రి తలసాని. ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలం విషయంలో చొరవ చూపారని మంత్రి తలసాని తెలిపారు.
గోదావరి జలాలు తో పాలేరు ప్రజల పాదాలు కడిగి నా రుణం తీర్చుకుంటా : తుమ్మల
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40సంవత్సరాలలో ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పని చేశానని, జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేశానని, పదవి కాలంలో గ్రామ సీమలు రైతాంగం, ప్రజలు అడిగిన పనులు పూర్తి చేశానన్నారు. అంతేకాకుండా.. నీతి నియమాలతో పని చేసి చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టు లు పూర్తి చేశామన్నారు తుమ్మల. అయితే.. ఉమ్మడి రాష్ట్రంలో మెలైన పంటలు పండించే సామర్ధ్యం, విద్యుత్ ఉత్పత్తి పై అనేక ఉపనదులపై చెక్ డ్యాంలు పూర్తి చేసి పంటలు సస్యశ్యామలం చేశామన్నారు. వేల కోట్లతో జాతీయ రహదారులు సాధించామని తుమ్మల వ్యాఖ్యానించారు. టీడీపీ, కేసీఆర్ నాయకత్వంలో విద్యుత్ ఉత్పత్తికి కృషి చేశామని, ప్రతి గ్రామానికి మంచి నీరు అందించామన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తో అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా చేశామని ఆయన వెల్లడించారు. 40ఏళ్ల రాజకీయ జీవితం నాకు సంతృప్తి ని ఇచ్చిందని, అయితే.. ఉమ్మడి జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించటం నా ఎకైక లక్ష్యమన్నారు తుమ్మల. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఖమ్మం జిల్లా అభివృద్ధిని చూస్తున్నారన్నారు. గోదావరి జలాలతో పాలేరు ప్రజల పాదాలు కడిగి నా రుణం తీర్చుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట, ముగ్గురు మహిళలు దుర్మరణం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఆయన నాలుగు రోజుల క్రితం కందుకూరులో రోడ్ షో నిర్వహించగా తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను మరువకముందే ఇవాళ చంద్రబాబు గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో వస్త్రాల పంపిణీకి నిర్వహించిన బహిరంగసభలో మరోసారి తొక్కిసలాట చోటుచేసుకుంది.ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. . ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారు గోపిరెడ్డి రమాదేవి, సయ్యద్ ఆసియాగా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే సభా నిర్వాహకులపై స్థానికులు మండిపడుతున్నారు. నూతన సంవత్సరం తొలిరోజే గుంటూరులో ఈ ఘటన జరగడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. చంద్రబాబు సభలో తొక్కిసలాట కారణంగా ముగ్గురు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయాలయ్యాయి. జీజీహెచ్ లో 15 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పలువురిని టీడీపీ నేతలు ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. సంక్రాంతికి వస్త్రాలు పంపిణీ చేస్తామని టీడీపీ గత పది రోజులుగా ప్రచారం చేస్తోంది.
గుంటూరు ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
గుంటూరులో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగానిలుస్తుందన్నారు. గుంటూరు ఘటనపై మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. నిన్న కందుకూరులో 8 మంది మృతి చెందారని.. నేడు గుంటూరులో ఇప్పటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి ! అంటూ మండిపడ్డారు. చంద్రన్న కానుక పేరుతో చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు చనిపోయారని.. 30 వేల మందిని సమీకరించి కనీస ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరమన్నారు. కందుకూరు ఘటన తర్వాత కూడా చంద్రబాబుకు జ్ఞానోదయం కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరామర్శించిన మంత్రి విడదల రజిని
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు గాయపడిన వారిని పరామర్శించారు. వారికి పూర్తి చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ఏదో కానుకలు ఇస్తామని ఫేక్ ప్రచారం చేశారని.. వాహనాలు పెట్టి జనాలను తరలించారని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ప్రచార యావ, అధికార దాహంతోనే ఈ దారుణానికి కారణమయ్యారని ఆరోపించారు. ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలని మంత్రి డిమాండ్ చేశారు.
త్రిపుర మంత్రి, ఐపిఎఫ్‌టి అధ్యక్షుడి కన్నుమూత
సీనియర్ మంత్రి, బిజెపి మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపిఎఫ్‌టి) అధ్యక్షుడు నరేంద్ర చంద్ర డెబ్బర్మ దీర్ఘకాలిక అనారోగ్యంతో ఆదివారం మరణించినట్లు కుటుంబ మరియు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అతడి వయసు 80 ఏళ్లు. ఆయనకు గత శుక్రవారం తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు.. అగర్తలాలోని గోవింద్ వల్లభ్ పంత్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజులుగా ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న దెబ్బర్మ ఇవాళ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గిరిజన నాయకుడైన దెబ్బర్మ (ఐపిఎఫ్‌టి)ని స్థాపించి విజయవంతంగా నడిపించారు. 2018లో బిజెపి-ఐపిఎఫ్‌టి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడంలో కూడా దెబ్బర్మ కీలకపాత్ర పోషించారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ కూటమిని ఓడించారు. కాగా, డెబ్బర్మకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, భార్య ఉన్నారు. ‘రాష్ట్ర కేబినెట్ సీనియర్ సభ్యులు ఎన్.సీ.దేవవర్మ మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నా. ఓం శాంతి!’ అని ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సాహా. మరోవైపు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సంతాపం ప్రకటించారు రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్.
మహారాష్ట్రలో ఘోరం.. కెమికల్ ప్లాంట్లో పేలిన బాయిలర్
మహారాష్ట్రలోని నాసిక్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ కెమికల్ ప్లాంట్లో బాయిలర్ బాంబులా పేలింది. ఈ ఘటనతో చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళన చెందారు. ముండేగావ్ గ్రామంలోని జిందాల్ గ్రూప్ పోలిథిన్ తయారీ యూనిట్‌లో మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. మంటల్లో చిక్కుకుని ఒకరు మరణించారు. మరో 19మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం తెలుస్తోంది. కెమికల్ ప్లాంట్ బాయిలర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్దఎత్తున పొగలు చుట్టుపక్కలకు వ్యాపించాయి.
పలువురు ఫ్యాక్టరీలో చిక్కుకుపోవడంతో అధికారులు తక్షణ సహాయక చర్చలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వారి వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారత వాయుసేన హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. తీవ్రంగా గాయపడిన ఒక మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసిందని, వర్కర్లు, సూపర్‌వైజర్ సహా 19 మంది గాయపడ్డారని నాసిక్ ఎస్‌పీ షాహ్జి ఉమాప్ తెలిపారు. నాసిక్ ఫైర్ యాక్సిడెంట్ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన వారిని, గాయపడిన వారిని ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. కాగా, ప్రమాదానికి కారణాలేమిటో తెలియాల్సి ఉంది.
హిమాచల్ ప్రదేశ్ సీఎం న్యూ ఇయర్ గిఫ్ట్.. అనాథలకు ప్రత్యేక నిధి
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ అనాథ పిల్లల ఉన్నత విద్యకు నిధిని ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 6,000 మంది అనాథ పిల్లలకు నూతన సంవత్సర కానుకగా రూ. 101 కోట్ల నిధి(సీఎం సుఖాశ్రయ సహాయత కోష్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధిని రాష్ట్ర ప్రభుత్వం వారి ఉన్నత విద్య, రోజువారీ అవసరాల కోసం వినియోగిస్తామన్నారు. ప్రభుత్వంలోని మొత్తం 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ మొదటి జీతం నుంచి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పరిశ్రమల నుంచి మరిన్ని నిధులు సేకరిస్తామని చెప్పారు. అనాథ శరణాలయాల్లో నివసించేవారికి, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు.
ఈ నిధినుంచి వారికి నెలకు రూ. 4,000 పాకెట్ మనీలా అందజేస్తామన్నారు. తద్వారా వారు తమ అవసరాలను తీర్చుకోవడానికి ఈ మొత్తాన్ని వాడుకోవచ్చని తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారులు కావాలంటే ఎలాంటి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని తెలిపింది. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు సహాయం అందించబడుతుందని ఆయన చెప్పారు. ఒంటరి మహిళల వివాహాలకు కూడా నిధులు మంజూరు చేస్తామన్నారు.