ఇండియా, యూకే గ్రాడ్యుయేట్ల కోసం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్
యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ చాలా తెలివిగా ఓ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చారు. రెండు దేశాలలో నివసించడానికి, పని చేయడానికి యువ బ్రిటీష్, భారతీయ నిపుణుల కోసం కొత్త మార్పిడి పథకాన్ని ప్రారంభించారు. ఇండియా జీ20 ప్రెసిడెన్సీలో భాగంగా ఢిల్లీ పర్యటన సందర్భంగా కొత్త పథకం గురించి ప్రకటన చేశారు. ఈ పథకం కింద, 18-30 మధ్య వయస్సు గల భారతీయ, బ్రిటీష్ పౌరులు రెండు సంవత్సరాల వరకు ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 1న ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ని సందర్శించిన సందర్భంగా బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి జేమ్స్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశం యూకేకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని ఆయన అన్నారు. న్యూ ఢిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్ పరస్పర పథకం కింద అర్హులైన భారతీయులకు మొదటి సెట్ 2,400 వీసాల కోసం బ్యాలెట్‌ను తెరిచింది. ఈ బ్యాలెట్ ఫిబ్రవరి 28 మధ్యాహ్నం ప్రారంభించబడి మార్చి 2న మూసివేయబడింది. యూకే పౌరులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి భారత హైకమిషన్ తన వీసా దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీతకు పదేళ్ల జైలు శిక్ష
నోబెల్ బహుమతి గ్రహీత కార్యకర్త అలెస్ బిలియాట్స్కీకి బెలారస్ శుక్రవారం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇది అంతర్జాతీయంగా తీవ్ర ఖండనను పొందింది. బెలారస్ మానవహక్కుల ఉద్యమకారుడు, 2022 నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల్లో ఒకరైన అలెస్ బియాలియాట్ స్కీకి బెలారస్‌లోని ఓ కోర్టు శుక్రవారం పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆయన స్థాపించిన వియస్నా మానవ హక్కుల కేంద్రం బెలారస్‌లో పౌర హక్కుల కోసం పోరాడుతోంది. బియాలియాట్ స్కీతోపాటు వియస్నా కేంద్రానికి చెందిన మరో ముగ్గురికి కూడా జైలు శిక్షలు పడ్డాయి. వీరు పౌర భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారనీ, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనీ ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
అమ్మాయిలను వద్దు అన్నారని.. ఆ ప్రకటనల్లోనూ అబ్బాయిలే!
ఆన్‌లైన్‌లో లోదుస్తుల ప్రకటనల్లో మహిళలను నిషేధిస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆన్‌లైన్ వ్యాపార నిర్వాహకులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. మహిళల స్థానంలో పురుష మోడళ్లను ఉంచి ప్రకటనలు చేస్తున్నారు. లోదుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించడం వల్ల అశ్లీలత పెచ్చుమీరుతోందన్న కారణంతో చైనా ప్రభుత్వం ఆయా ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించకుండా నిషేధం విధించింది. అంతేకాదు, ఆన్‌లైన్ ప్రచారాలకు మహిళలను ఉపయోగించకుండా ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. దీంతో లోదుస్తుల ప్రచారం ఎలా చేయాలో తెలియక దిగాలు పడిపోయి నష్టాలు మూటగట్టుకున్న ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు తాజాగా కొత్త పంథాను ఎంచుకున్నాయి. ప్రచార వీడియోల్లో అమ్మాయిలకు బదులు అబ్బాయిలకు లోదుస్తులు ధరింపజేసి చిత్రీకరిస్తున్నారు.
దారుణం.. RIP అంటూ భర్త ప్రచారం.. శిరోముండనం చేసిన భార్య ప్రియుడు
సాధారణంగా తమ భార్య వైపు ఇతర మగాడు కన్నెత్తి చూస్తేనే భర్తలకు కోపం వస్తుంది. అలాంటిది.. వివాహేతర సంబంధం పెట్టుకుంటే, చూస్తూ ఊరికే ఉంటాడా? తప్పకుండా తనదైన రీతిలో ఇద్దరికి బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు. మరీ ముఖ్యంగా.. తన భార్యతో సంబంధం పెట్టుకున్న వ్యక్తికి తగిన శాస్తి చేస్తాడు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి కూడా అదే పని చేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు కోపంతో రగిలిపోయిన అతను, సోషల్ మీడియాలో భార్య ప్రియుడిపై ఓ ప్రచారం చేశాడు. అయితే.. ఆ పోస్టింగ్స్ చూసి మండిపోయిన భార్య ప్రియుడు, ఎవ్వరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని చంద్రగిరికి చెందిన బాధితుడు.. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఓవైపు భర్త కుటుంబ పోషణ కోసం బెంగుళూరులో పని చేస్తుంటే, అతని భార్య మాత్రం అన్వర్ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేనప్పుడు.. ప్రియుడ్ని ఆమె ఇంటికి పిలిపించుకునేది. అయితే.. వీరి బాగోతం ఎంతోకాలం దాగి ఉండలేదు. భర్తకు వీరి విషయం తెలిసిపోయింది. మరోసారి అన్వర్‌తో కలవొద్దని తన భార్యను మందలించాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. అన్వర్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. దీంతో కోపాద్రిక్తుడైన భర్త.. అన్వర్‌పై పగ పెంచుకున్నాడు. ఆ కోపంలోనే సోషల్ మీడియాలో RIP అంటూ అన్వర్‌పై పోస్టింగ్స్ పెట్టాడు. కనీసం ఆ పోస్టింగ్స్ చూసి అయినా, అన్వర్ తన భార్యకు దూరం అవుతాడని భర్త భావించాడు. కానీ.. ఆ పోస్టింగ్స్ చూసి రగిలిపోయిన అన్వర్, తన స్నేహితుడు వంశీ చౌదరి సహకారంతో బాధితుడ్ని కిడ్నాప్ చేశాడు. బెంగుళూరులో ఉన్న అతడ్ని, చంద్రగిరికి తీసుకొచ్చాడు. అతని తలపై మూత్రం పోసి, గుండు గీయించి, అత్యంత దారుణంగా చితకబాదాడు. అంతేకాదు.. తానే గుండు గీయించుకున్నానని, ఏం జరిగినా దానికి తానే బాధ్యుడినంటూ భర్తతో వీడియో కూడా తీయించాడు. ఈ వీడియోల్ని సోషల్ మీడియాలో పెట్టాడు. ఇవి వైరల్ అవ్వడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టి.. నిందితులైన అన్వర్, వంశీలను అదుపులోకి తీసుకున్నారు.
ఘోర అగ్నిప్రమాదం
ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఆయిల్ డిపోలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ ఇతరులు గాయపడ్డారు. మంటలు పొరుగు ప్రాంతాలకు వ్యాపించడంతో సమీపంలోని వేలాది మంది నివాసితులను ఖాళీ చేయించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కనీసం 260 అగ్నిమాపక సిబ్బంది, 52 అగ్నిమాపక ఇంజన్లు సమీపంలోని పరిసరాల్లో మంటలను అదుపు చేసేందుకు కష్టపడుతున్నాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. టెలివిజన్‌లో ప్రసారమైన అగ్నిప్రమాద వీడియో కమ్యూనిటీలోని వందలాది మంది ప్రజలు భయాందోళనతో పరిగెడుతున్నట్లు చూపించింది. అయితే దట్టమైన నల్లటి పొగ, ఎర్రటి మంటలు ఆకాశానికి ఎగిశాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన మంచువారబ్బాయి
మంచు వారసుడు మంచు మనోజ్ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. గత కొన్నేళ్లుగా భూమా మౌనికతో ప్రేమలో ఉన్న మనోజ్ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కాడు. కొద్దిసేపటి క్రితమే ఈ జంట మూడుముళ్లతో ఒక్కటి అయ్యారు. మంచు లక్ష్మీ ఇంట్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అతి తక్కువ ప్రముఖులే పెళ్లికి హాజరయ్యేనట్లు తెలుస్తోంది. కొత్త జంట మొదటి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. వధూవరులిద్దరూ బంగారు రంగు దుస్తుల్లో మురిసిపోయారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన ఆనందం మంచు మనోజ్ కళ్ళలో కనిపిస్తోంది. ఇకపోతే కొన్నేళ్ల క్రితం మనోజ్ తన మొదటి భార్య ప్రణతి తో విడిపోయిన సంగతి తెల్సిందే. ఆ తరువాత మనోజ్ కు మౌనికతో పరిచయం ఏర్పడింది. కొన్నేళ్లు వీళ్లిద్దరు సహజీవనం కూడా చేసారని టాక్. ఇక వీరి పెళ్ళికి మంచు కుటుంబం ఒప్పుకోకపోవడంతో ఇప్పటివరకు ఆగారు. చివరికి మనోజ్ కుటుంబాన్ని ఒప్పించి ఈ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ వివాహానికి మంచు మోహన్ బాబు అవ్వడం విశేషం. మొదటి నుంచి ఈ పెళ్ళి మోహన్ బాబుకు ఇష్టం లేదని టాక్ నడిచింది. ఇక చివరికి కొడుకు ప్రేమ కోసం ఆయన కూడా తలవొగ్గి ఈ పెళ్ళికి హాజరు అయ్యాడు. ఇక కొత్త జంటకు అభిమానులతో పాటు ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.