నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ హాజరు
లోక్ సభ షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ‘టార్గెట్ కాంగ్రెస్’ వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న అధికార బీఆర్‌ఎస్‌పై కాకుండా కాంగ్రెస్‌పైనే ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి రాష్ట్ర ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, కె. లక్ష్మణ్ తదితరుల వరకు అందరూ హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ , బీఆర్‌ఎస్ టార్గెట్ గా తెలంగాణ ఇంఛార్జి తరుణ్ చుగ్,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ నేడు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తెలంగాణాలో ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలకు కీలకంగా మారిన లోక్ సభ ఎన్నికలు.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు సీట్లు తగ్గించి, అదే సమయంలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నాయి. విమర్శల దాడి క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలు అవుతోంది. రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఏపీ బీజేపీలో కలవరం.. ఇంకా ఫైనల్ కానీ అభ్యర్థుల జాబితా..!
ఏపీ బీజేపీలో కలవరం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు పలువురు ముఖ్య నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక, ఎన్డీఏ కూటమిలో ప్రధాన పక్షమైన టీడీపీ ఇప్పటికే మూడు విడతల్లో 139 అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. జనసేన సైతం విడతల వారీగా 17 అసెంబ్లీ, కాకినాడ లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల పేర్లను తెలియజేసింది. అయితే, ఇప్పటి వరకు బీజేపీ 4 విడతలుగా ప్రకటించిన జాబితాలో ఏపీ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కానీ, ఏపీలో అభ్యర్థులను ప్రకటించడంతో బీజేపీ జాప్యం చేస్తుంది. 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక, బీజేపీలో టికెట్ ఆశిస్తోన్న అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు కుదరక ముందే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల నుంచి కమలం పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. అలాగే, ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురిని ఎంపిక చేసిన కాషాయం పార్టీ.. ఇప్పుడు అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోలేకపోతున్నారు. ఇవాళ్టి బీజేపీ అభ్యర్థులెవరో వెల్లడి కాకపోతే ఎలాగని బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి తర్వాత ప్రతి నిమిషం విలువైందన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ముఖ్యనేతలు ఏమీ చెప్పకుండా రోజుల తరబడి జాప్యం చేస్తుండటంతో పార్టీ కేడర్ సహనం కోల్పోతున్నారు. అయితే, పొత్తుల్లో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు సమాచారం. కూటమి పార్టీ నేతల్లో వినిపిస్తున్న వివరాల ప్రకారం రాయలసీమలో 4, కోస్తాలో 3, ఉత్తరాంధ్రలో 3 సీట్లలో బీజేపీ బరిలో దిగబోతుంది.
నేడు బీజేపీ ఐదవ జాబితా.. ఐదు రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
లోక్‌సభ ఎన్నికలకు బిజెపి అభ్యర్థుల ఐదవ జాబితా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్) అభ్యర్థుల పేర్లను విడుదల చేసే జాబితా మధ్యాహ్నం వచ్చే వీలుంది. ఈ జాబితాకు సంబంధించి బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) సమావేశం శనివారం (మార్చి 23, 2024) రాత్రి సుమారు మూడు గంటలపాటు కొనసాగింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ ఐదో జాబితాలో చేరాల్సిన పేర్లపై చర్చలు జరిగాయి. యూపీలోని మిగిలిన 24 స్థానాల్లో (అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది) 10 స్థానాలకు పేర్లు ఖరారు చేసినట్లు తెలిసింది. ఘజియాబాద్ నుంచి అతుల్ గార్గ్, మీరట్ నుంచి అరుణ్ గోవిల్, సహరన్‌పూర్ నుంచి రాఘవ్ లఖన్‌పాల్, మొరాదాబాద్ నుంచి కున్వర్ సర్వేష్ సింగ్‌లకు అవకాశం దక్కవచ్చు. ఈ సమావేశంలో ఒడిశాలోని 21 స్థానాలకు అభ్యర్థుల పేర్లను చర్చించినట్లు వర్గాల సమాచారం. సంభల్పూర్ నుండి ధర్మేంద్ర ప్రధాన్, పూరీ నుండి సంబిత్ పాత్ర మరియు భువనేశ్వర్ నుండి అపరాజిత సారంగికి టిక్కెట్లు ఇవ్వవచ్చు. అలాగే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలను కూడా తొలగించవచ్చని చెప్పారు. ఒడిశాలోని మొత్తం 21 లోక్‌సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను సీఈసీ చర్చించిందని బీజేపీ ఒడిశా విభాగం అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ మీడియాకు తెలిపారు. ఒడిశాలో బీజేపీ, బిజూ జనతాదళ్ (బీజేడీ) మధ్య ఎన్నికలకు ముందు పొత్తుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ చర్చ జరిగింది.
డ్రగ్ కంటైనర్ కేసు విచారణలో సీబీఐకి కొత్త డౌట్స్..
విశాఖపట్నం డ్రగ్ కంటైనర్ కేసు విచారణలో సీబీఐ అధికారులకి కొత్త డౌట్స్ వస్తున్నాయి. నాలుగు రోజుల విచారణలో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఆరు రకాల నిషేధిత సింథటిక్ డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు. డ్రై ఈస్ట్ తో కలిపి రవాణా చేసిన మాదకద్రవ్యాలు సుమారు 2500 కేజీల వరకు వుండే అవకాశం ఉంది. న్యాయమూర్తి సమక్షంలో శాంపిల్స్ సేకరించిన తర్వాత మరొక కంటైనర్ లోకి మార్చి సీబీఐ ప్రత్యేక సీల్ వేసింది. ప్రస్తుతం కంటైనర్ టెర్మినల్ లోని ఎగ్జామినేషన్ పాయింట్ లో భద్రపరచి శాంపిల్స్ ను ఢిల్లీలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.. కంటైనర్ ను అల్ వెదర్ ప్రూఫ్- అన్ని రకాల వాతావరణాలను తట్టుకునే ప్రాంతంలో భద్రపరచాలని నిర్ణయం తీసుకుంది. కాగా, డ్రగ్స్ అవశేషాలు వాతావరణ ప్రభావానికి దెబ్బ తినకుండా సీబీఐ జాగ్రత్తలు తీసుకుంటుంది. మరో రెండు రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకునేందుకు సీబీఐ చూస్తుంది. వరుసగా ఐదవ రోజు విచారణ కొనసాగనుంది.
ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఐదుగురు మృతి, నలుగురికి సీరియస్
రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు సజీవ దహనం అయ్యారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చాలా మందికి సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స అందించేందుకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తం వ్యవహారం బస్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైనాడలో జరిగింది. ఇక్కడ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఘటన జరిగిన వెంటనే ఫ్యాక్టరీ లోపల నుంచి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఇక్కడ పనిచేస్తున్న వారు ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అనంతరం అనేక అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో భారీ విస్ఫోటనం సంభవించిందని, దీని కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పేలుడు, మంటల కారణంగా కర్మాగారంలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురు కూలీలను బయటకు తీశారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన కూలీలను ఎస్‌ఎంఎస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తన రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ మీనా..!
90 దశకంలో టాలీవుడ్ లో హీరోయిన్ మీనా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత మీనా పెళ్లి చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఆవిడ తన భర్తను కోల్పోయింది. ఆ విషాదకర సంఘటన నుంచి బయటికి రావడానికి మీనా మళ్లీ సినిమాల్లో., అలాగే బుల్లితెరపై కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా గడిపేస్తోంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ, తమిళ ఇండస్ట్రీలో కూడా మీనా సినిమాలు చేస్తుందని సమాచారం. ఇది ఇలా ఉండగా.. మొదటి భర్త మరణించిన కొన్ని రోజులకే మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వచ్చాయి. అందులో మీనా అతి త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుందని., అందుకోసం వరుడు కూడా ఫిక్స్ అయ్యారు అంటూ లేనిపోని వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా తన రెండో పెళ్లి గురించి పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనపై రెండో పెళ్లి చేసేందుకు రెడీ అయినట్లు వచ్చిన వార్తలు పై కాస్త ఘాటుగానే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, అలాగే మీడియా కూడా డబ్బు కోసం ఏమైనా రాస్తానన్నారు అంటూ చెబుతూనే.. రోజురోజుకి మీడియా రంగం దిగజారిపోతుందని వాస్తవాలు తెలుసుకొని రాస్తే.. అందరికీ మంచిదంటూ చెప్పుకొచ్చింది. దేశంలో తనలాగే ఒంటరిగా జీవించేవారు చాలామంది మహిళలు ఉన్నారని ఆమె చెప్పింది. ఇక తన తల్లిదండ్రులు, కూతురు భవిష్యత్తు కూడా ఆలోచన చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
విశాఖలో జరిగే మ్యాచ్ ల టికెట్ల అమ్మకం నేటి నుంచి అన్లైన్ లో ప్రారంభం..!
విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ లకు ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) శనివారం ప్రకటించింది. ఫ్రాంచైజీ యాజమాన్యం చుట్టూ పెరుగుతున్న నిరీక్షణల మధ్య ఈ వార్త వచ్చింది. వైజాగ్ లో జరగబోతున్న మ్యాచ్ లకి సంబంధించి క్రికెట్ అభిమానులు రెండు మ్యాచ్ ల కోసం కోసం టికెట్స్ పొందవచ్చు. ఇందులో మొదటగా ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)తో జరిగే మ్యాచ్ కోసం అభిమానులు మార్చి 24 ఉదయం 10:00 గంటలకు ఆన్ లైన్ లో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. అలాగే మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే పోరు కోసం ఆన్‌లైన్ టిక్కెట్ విక్రయాలు మార్చి 27న ప్రారంభమవుతాయి. ఈ టికెట్స్ పేటియమ్, ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు మార్చి 31 న ఆన్ లైన్ లో టిక్కెట్లను ఆన్లైన్ లో కొనవచ్చు. టికెట్స్ కొనుగోలు చేసే వారు ప్రతి మ్యాచ్ కు ముందు ఏర్పాటు చేస్తున్న నిర్దేశిత కౌంటర్లలో వాటిని రీడీమ్ చేసుకోవచ్చు. KKR మ్యాచ్ టిక్కెట్‌ల కోసం మార్చి 26న రిడెంప్షన్ ప్రారంభమవుతుంది, అయితే CSK మ్యాచ్ కోసం, టిక్కెట్ రిడంప్షన్ మార్చి 27న ఉదయం 11:00 గంటలకు PM పాలెంలోని స్టేడియం ‘B’ గ్రౌండ్, విశాఖపట్నంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. రూ.7,500, రూ.5,000, రూ.3,500, రూ.3,000, రూ.2,500, రూ.2,000, రూ.1,500 మరియు రూ.1,000 రేట్లకి సంబంధించి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.