Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్..

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని, ఆ క్యాన్సర్ కణాలు ఇప్పుడు అతని ఎముకలకు వ్యాపించాయని వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 82 ఏళ్ల బైడెన్ మూత్ర విసర్జన లక్షణాల గురించి పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు బైడెన్ కు ఏయే చికిత్సలు అందించాలో పరిశీలిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ హార్మోన్-సెన్సిటివ్‌గా కనిపిస్తుంది. ఈ కారణంగా చికిత్స చేయడం సాధ్యపడుతుంది. హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, కొన్ని సందర్భాల్లో ఎముకలను లక్ష్యంగా చేసుకుని చికిత్స చేయడం ప్రభావవంతంగా ఉంటుంది.

కల్నల్ సోఫియా ఖురేషిపై బీజేపీ మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఆపరేషన్‌ సింధూర్‌ వివరాలను మీడియాకు తెలియజేసిన ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషీతో పాటు భారత సైన్యంపై మధ్యప్రదేశ్‌ రాష్ట్ర గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఈ పిల్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్‌కే సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించనుంది.

తీవ్ర విషాదం.. కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

విజ‌య‌న‌గ‌రం జిల్లా ద్వార‌పూడిలో విషాదం చోటుచేసుకుంది. న‌లుగురు చిన్నారులు కారులో చిక్కుకొని మృతి చెందారు. ఒకే ఇంటిలో ఇద్దరు, వేర్వేరు కుటుంబాలకు చెందిన మ‌రో ఇద్దరు మృతి చెందారు. ఆడుకుంటూ కారులోకి ఎక్కిన చిన్నారులు.. డోర్‌లాక్‌ కాకవడంతో అందులో చిక్కుకున్నారు.. ఓవైపు ఎండ.. మరోవైపు ఊపిరి ఆడకపోవడంతో.. విలవిలలాడి కన్నుమూశారు.. ఊర్లో జరుగుతోన్న శుభ‌కార్యంలో అంద‌రూ ఉండిపోవ‌డంతో గుర్తించ లేక‌పోయామ‌ని చెబుతున్నారు. క‌ళ్ల ముందు తిరిగాడే చిన్నారు లేర‌న్న విష‌యాన్ని జీర్ణించుకో లేక‌పోతున్నారు గ్రామ‌స్తులు.

ఆపరేషన్ సిందూర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు.. ప్రొఫెసర్ అరెస్ట్

పాకిస్థాన్‌పై ఇటీవల భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ జరిగింది. ఎప్పటికప్పుడు ఆపరేషన్ సిందూర్ విషయాలను మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. ఈ విధంగా వీరిద్దరూ గుర్తింపులోకి వచ్చారు. అయితే ఆపరేషన్ సిందూర్‌పై హర్యానాలోని సోనిపట్‌ అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. సోఫియా ఖురేషి మరియు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశాలను అసోసియేట్ ప్రొఫెసర్ ‘‘ఆప్టిక్స్’’గా అభివర్ణించారు. అంతేకాకుండా వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు.

శ్రీవారి భక్తులకు అలర్ట్..

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఇవాళ్టి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ సేవా టికెట్లు, దర్శన టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇవాళ లక్కిడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు రిజిష్ర్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.. ఇక, ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు లక్కిడిఫ్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది టీటీడీ.. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేసిన టీటీడీ.. ఆ తర్వాత భక్తుల రద్దీ సాధారణంగా ఉండడంతో.. తిరిగి సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుమతి ఇస్తోన్న విషయం విదితమే కాగా.. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.. మరోవైపు, నిన్న శ్రీవారిని 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు.. 33,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.49 కోట్లుగా ప్రకటించింది టీటీడీ..

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరీ పర్యటనపై పోలీసుల విచారణ..!

హర్యానాలోని హిస్సార్‌కు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఆ విషయాన్ని పూరీ పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.

అరేబియా సముద్రంలో తుఫాన్.. దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడింది.  దక్షిణ గుజరాత్‌కు ఆనుకుని ఈశాన్య అరేబియా సముద్రంపై సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఎగువ వాయు తుఫాను కొనసాగుతుందని పేర్కొంది. మే 21 నాటికి కర్ణాటకలో తీరాన్ని దాటే ఛాన్సుంది. దీని కారణంగా మే 20 నుంచి పలు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 23 వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది.

నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో ముడిపడి, ద్రోణి మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకు ఏర్పడిందని తెలిపింది. ఇది సముద్రమట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వివరించింది. ఈ ద్రోణి ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఇది నైరుతి దిక్కుకు విస్తరిస్తుందని పేర్కొంది.

గాజాలోకి ఆహారం తీసుకెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతి

ఇజ్రాయెల్-గాజా మధ్య కొన్ని నెలలుగా యుద్ధం సాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఐడీఎఫ్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. అయితే మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా బందీలు-ఖైదీల మార్పిడి జరిగింది. అయితే తొలి విడత ఒప్పందం ముగియడంతో తిరిగి ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. అయితే గాజాలో పరిస్థితి దుర్భరంగా మారింది. పాలస్తీనియన్లు కరవు అంచుకు వెళ్లారు. దాదాపు మూడు నెలల నుంచి గాజాలోకి స్వచ్చంధ సంస్థలు తీసుకెళ్లే ఆహారాన్ని అనుమతించడం లేదు. దీంతో గాజాలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గాజాలో కరవు ఆసన్నమైందని ఆహార భద్రతా నిపుణులు హెచ్చరించడంతో ప్రధాని నెతన్యాహు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సిఫార్సుల మేరకు గాజాలోకి ఆహారాన్ని అనుమతించడానికి మంత్రివర్గం అంగీకరించిందని సోమవరం అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అయితే గాజాలో కరవు తీవ్రత ఎక్కువ కావడంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే హమాస్‌కు ఆహారం అందకుండా చూడాలని నెతన్యాహు ఆదేశించారు.

గుల్జార్‌ హౌస్‌ అగ్ని ప్రమాదంలో వెలుగులోకి విస్తు పోయే విషయాలు

హైదరాబాద్‌ చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌ హౌస్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నగరాన్ని షేక్ చేసింది. శ్రీకృష్ణ పెరల్స్‌ పేరిట పలు సంవత్సరాలుగా ఆభరణాల వ్యాపారం చేస్తున్న గోవింద్ మోడీ, సునీల్ మోడీ, పంకజ్ మోడీలకు చెందిన ఈ షాపులో మే 18 వ తేదీన అర్థరాత్రి తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ఘటనపై వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది. నేడు ప్రత్యేక దర్యాప్తు బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించనుంది.

 

Exit mobile version