‘పెద్ది’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ .. ఇండియన్ సినిమాకు న్యూ బెంచ్‌మార్క్?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ టైటిల్ ప్రకటనతో పాటు విడుదలైన రెండు ఫస్ట్‌లుక్ పోస్టర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. జాతీయ అవార్డు గ్రహీత, “ఉప్పెన” ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, విజనరీ నిర్మాత వెంకట సతీష్ కిలారు తన వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు, “పెద్ది” సినిమా యొక్క తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జోరుగా కొనసాగుతోంది. ఈ భాగంలో, భారతీయ సినిమాలలో ఇప్పటివరకు చూసిన అత్యంత సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలలో ఒకటిని చిత్రీకరించేందుకు ప్రత్యేకంగా ఒక భారీ రైలు సెట్ను నిర్మించారు. ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఇటువంటి స్కేల్లో రైలు సెటప్ ను చాలా అరుదుగా చూసాం. ఈ సెట్లో షూటింగ్ జరుగుతున్న యాక్షన్ సన్నివేశాలు పూర్తి స్థాయిలో హై-రిస్క్, హై-ఆక్టేన్ ఫీలింగ్‌ను కలిగించేలా ఉంటాయని సమాచారం. అయితే ఈ యాక్షన్ సీన్‌కి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నాభకాంత్ మాస్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పుష్ప 2’ లో చేసిన యాక్షన్ సీన్‌లకు ఆయన దక్కిన ప్రశంసల నేపథ్యంలో, ‘పెద్ది’లో కూడా మరోసారి తన టాలెంట్‌ను చూపించబోతున్నారు. ఇక రామ్‌చరణ్ పాల్గొన్న ఈ హై-రిస్క్, హై-ఆక్టేన్ స్టంట్, భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జూన్ 19 వరకు కొనసాగనుంది.
బుమ్రా ఆడొద్దని ఇంగ్లండ్ టీమ్ కోరుకుంటోంది.. బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను లెజెండరీ ఆస్ట్రేలియా పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌తో ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పోల్చాడు. తన బంతులతో బ్యాటర్లను బురిడీ కొట్టించగల నైపుణ్యం బుమ్రాలో ఎక్కువగా ఉందన్నాడు. బుమ్రా చాలా తక్కువ రన్‌అప్‌తో బౌలింగ్ వేస్తాడని, అందుకే అతడి బంతుల్లో నియంత్రణ ఉంటుందన్నాడు. బుమ్రా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో పూర్తి మ్యాచ్‌లు ఆడలేడని, ఇంగ్లండ్ టీమ్ కూడా అదే కోరుకుంటోందని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. స్టువర్ట్ బ్రాడ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్‌తో మాట్లాడాడు. ‘జస్ప్రీత్ బుమ్రా చాలా తక్కువ రన్‌అప్‌తో బౌలింగ్ చేస్తాడు. బుమ్రా రన్‌అప్‌ను చూస్తే 70 మైళ్ల వేగంతో బంతి విసిరేలా కనిపిస్తాడు కానీ.. ఆ బంతి 90 మైళ్ల వేగంతో దూసుకొస్తోంది. షోయబ్ అక్తర్ 100 మైళ్ల వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి.. 100 మైళ్ల వేగంతో బంతులు వేసేవాడు. బుమ్రా చాలా తక్కువ రన్‌అప్‌తో బౌలింగ్ చేయడంతో అతడి బంతుల్లో నియంత్రణ ఉంటుంది. గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా ఎంతో నియంత్రణగా బౌలింగ్ వేసేవాడు. ప్రస్తుతం బుమ్రా కూడా మెక్‌గ్రాత్ మాదిరే బంతులు వేస్తున్నాడు’ అని బ్రాడ్ పేర్కొన్నాడు.
జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ-మార్క్ కార్నీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
ప్రధాని మోడీ కెనడాలో పర్యటిస్తున్నారు. జీ 7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం కెనడా చేరుకున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జీ 7 సమ్మిట్‌కు హాజరయ్యారు. వాస్తవానికి జీ 7లో భారత్ భాగస్వామ్యం కాకపోయినా.. 2019 నుంచి మోడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతున్నారు. అయితే గతేడాది జస్టిన్ ట్రూడో ప్రభుత్వ హయాంలో కెనడాతో భారత్ సంబంధాలు క్షీణించాయి. తిరిగి ఇన్ని రోజులకు మార్క్ కార్నీ రాకతో తిరిగి సంబంధాలు పునరుద్ధరించబడుతున్నాయి. జీ 7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ- కెనడా ప్రధాని మార్క్ కార్నీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సమావేశంతో తిరిగి ఇరు దేశాల మధ్య సంబంధాలు పున:ప్రారంభమైనట్లుగా సంకేతాలు ఇచ్చారు. భారత్-కెనడా సంబంధాలు చాలా ముఖ్యమైనవిగా ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాలు ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడదామని.. కలిసి ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేద్దామని మోడీ కోరారు. రెండు దేశాలు కలిసి పని చేస్తే.. వనరులన్నింటినీ సముచితంగా ఉపయోగించుకుంటే మానవాళి సంక్షేమం కోసం పని చేయగలమని అభిప్రాయపడ్డారు.
నాకు నటన రాదన్నారు.. అదే నా శక్తిగా మారింది
యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు . కన్నడ, తమిళ, మలయాళ పరిశ్రమల్లోనూ ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తెలుగు లోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే తన మాతృభాష మలయాళం అయినా, ఎందుకు ఆమె సినిమాలు ఎక్కువగా తెలుగులో వచ్చాయి ? ఇదే ప్రశ్నకు ఆమె ఇటీవల ఇచ్చిన సమాధానం, ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అనుపమ మాట్లాడుతూ.. ‘తొలినాళ్లలో నన్ను చాలామంది ట్రోల్ చేశారు. నాకు నటనే రాదన్నారు. కానీ ఆ విమర్శలు నాలో కసిని పెంచాయ్. జనానికి నచ్చే సినిమాలే చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అలాంటి సమయంలో తెలుగులో ఆఫర్లు వచ్చాయి. అవి సక్సెస్‌లు కూడా అయ్యాయి. దీంతో అనుకోకుండా తెలుగులో ఎక్కువ సినిమాలు చేశా. అన్ని ట్రోల్స్ వచ్చినా.. నాపై నమ్మకంతో ఇన్నాళ్లకు మళ్లీ ‘జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ వంటి గొప్ప సినిమాకు నన్ను ఎంపిక చేశారు దర్శకుడు ప్రవీణ్ నారాయణ్. నన్ను విమర్శించిన వారందరికీ ఈ సినిమా సమాధానమిస్తుంది. ఈ సందర్భంగా నాకు మద్దతు ఇచ్చిన వారితో పాటు, నన్ను ద్వేషించిన వారికి కూడా కృతజ్ఞతలు.’ అని పేర్కొన్నది అనుపమ పరమేశ్వరన్. కాగా ఈ నెల 27న అనుమప నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా కేరళలో విడుదల కానుంది. సురేశ్ గోపీ లాయర్‌గా నటించిన ఈ చిత్రంలో జానకిగా అనుపమ కనిపించనుంది.
నేడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ భేటీ.. కలిసి లంచ్ చేయనున్న నేతలు
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో అమెరికాలో పర్యటిస్తున్నారు. అసిమ్ మునీర్ రెచ్చగొట్టడంతోనే పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు.ఈ ఘటనను ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల తర్వాత అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 1 ఒంటి గంటకు వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అసిమ్ మునీర్‌తో ట్రంప్ సమావేశం కానున్నారు. ఇద్దరు కలిసి భోజనం చేయనున్నారు. అనంతరం ఇద్దరి మధ్య సమావేశం జరగనుంది. ఇక అమెరికా పర్యటనలో భాగంగా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌లను కూడా అసిమ్ మునీర్ కలవనున్నారు.
నేడు రెంటపాళ్లకి వైఎస్ జగన్.. పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ!
నేడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత, ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహా ఆవిష్కరణ అనంతరం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లనున్నారు.
వైఎస్ జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 11 గంటలకు రెంటపాళ్లకు చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు జగన్ రెంటపాళ్ల నుంచి బయలుదేరి.. 1.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్!
బుధ, గురు వారాల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో లోకేశ్ భేటీ అవ్వనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాసవాన్‌తో సమావేశం ఏపీ మంత్రి కానున్నారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో, 5.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్‌తో నారా లోకేశ్ సమావేశమవుతారు. ఇక గురువారం ఉదయం కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అవుతారు. రేపు సాయంత్రం బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో లోకేశ్ సమావేశం కానున్నారు. రెండు రోజుల పర్యటన అనంతరం నారా లోకేష్ తిరిగి రానున్నారు.
మరోసారి కలిసి కనిపించిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా !
సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు తెరపై మాత్రమే కాదు, తెరవెనుక కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతుంటాయి. అలాంటి జంటే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా. వీరిద్దరూ కలిసి చేసిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా, వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని చాలా కాలంగా పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కూడా ఈ విషయం పై పదే పదే స్పందిస్తూ తమ మధ్య ఉన్నది ఒక మంచి స్నేహం మాత్రమే అని స్పష్టం చేసిన, వారి కలయిక ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది..
రంగంలోకి అమెరికా.. ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ప్రణాళిక!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇప్పటికే ఇరు పక్షాలు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకుంటున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీ స్థాయిలో జరుగుతోంది. అణు ఉత్పత్తిని నిలిపివేసేంత వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. మరోవైపు తమతోనే అణు ఒప్పందం చేసుకోవాలంటూ అమెరికా అవకాశాలు ఇస్తోంది. కానీ అందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. ఎవరితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోమంటూ తేల్చి చెబుతోంది. దీంతో పరిణామాలు తీవ్ర ఉధృతం అవుతున్నాయి. తాజాగా ఈ యుద్ధంలోకి అగ్ర రాజ్యం అమెరికా కూడా దిగేందుకు సిద్ధపడుతోంది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు చేసేందుకు వైట్‌హౌస్ ప్రణాళికలు రచిస్తోంది. కెనడాలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశం నుంచి అర్ధాంతరంగా ట్రంప్ వెళ్లిపోయారు. అనంతరం వైట్‌హౌస్‌లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిట్యుయేషన్ రూమ్‌లో ఉన్నత స్థాయి జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరాన్‌తో యుద్ధానికి దిగితే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయని ఉన్నతాధికారులతో ట్రంప్ చర్చించినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది. భవిష్యత్ వ్యూహాలపై ముఖ్య నేతలంతా మేథోమథనం చేసినట్లు తెలుస్తోంది.
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి!
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎంకౌంటర్ జరిగింది. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని దేవిపట్నం మండలం కించకూరు-కాకవాడి గండి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరిలో ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య రావి వెంకట హరిచైతన్య అలియాస్ అరుణ ఉన్నట్టు సమాచారం. మరొకరి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అంజు ఉన్నట్లు గుర్తించారు. ఉదయ్‌ది వరంగల్ జిల్లాలోని వెలిశాల గ్రామం కాగా.. అరుణది అనకాపల్లి జిల్లా పెందుర్తి గ్రామం. ఘటనా స్థలంలో మూడు ఏకే 47 రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నేడు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు
రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బుధవారం బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. సిట్ చేపట్టిన దర్యాప్తులో 2023 నవంబర్ 15నుంచి ఈ ఇద్దరు ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. కేవలం ఎంపీల ఫోన్లు మాత్రమే కాకుండా, వారితో అనుబంధం ఉన్న ముఖ్య అనుచరులు, కుటుంబసభ్యుల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు పోలీసులు. బీజేపీ నాయకుల రాజకీయ వ్యూహాలు, ముందస్తు ప్రచార కార్యాచరణ, ఆర్థిక వ్యవహారాలపై సంపూర్ణ సమాచారం తెలుసుకోవడమే లక్ష్యంగా ఫోన్లను ట్యాప్ చేశారని అధికారులు గుర్తించారు.