ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన కేకేఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 పున ప్రారంభానికి వరుణుడు భారీ షాక్ ఇచ్చాడు. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. దీంతో చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
పీఎస్‌ఎల్‌వీ – సి61 ప్రయోగం విఫలం.. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే..
ఆదివారం ఉదయం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 101వ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. తాజా భూమి పరిశీలన ఉపగ్రహ మిషన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 5:59 గంటలకు PSLV-C61 రాకెట్ ప్రయోగించిన తర్వాత EOS-09 మిషన్ పూర్తికాలేదని ఇస్రో (ISRO) ధృవీకరించింది. ఫలితాన్ని ఉద్దేశించి ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఇలా అన్నారు.. “EOS-09 మిషన్ పూర్తికాలేదు.” “మేము విశ్లేషణ తర్వాత తిరిగి వస్తాము. మూడవ దశ మోటార్ సంపూర్ణంగా ప్రారంభమైంది కానీ దాని పనితీరు సమయంలో సమస్య వచ్చిందని తెలిపారు. PSLV 4-దశల వెహికల్, రెండవ దశ వరకు పనితీరు సాధారణంగా ఉందని తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం..
అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబాంగ్ లోయలో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం భూకంపం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ సమాచారం ఇచ్చింది. జాతీయ భూకంప కేంద్రం ప్రకారం, ఉదయం 5:06 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించ లేదు. భూకంపం కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రత తక్కువగా ఉండడంతో పెనుప్రమాదం తప్పనట్లైంది.
తుఫాన్ దెబ్బకు అమెరికా విలవిల.. 25 మంది మృతి..!
అమెరికాలో ఏర్పడిన తుపాన్ కెంటకీ, మిస్సోరీలో 25 మందిని బలి తీసుకున్నాయి. తాజాగా అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో అనేక ఇల్లు, ఆస్తులు ధ్వంసమయ్యాయని తెలిపారు. కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని లారెల్ కౌంటీలో జరిగిన తుఫానులో 17 మంది మృతి చెందారు. ఇది లెక్సింగ్టన్‌కు దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉంది. మరో ఒకరు పలాస్కీ కౌంటీలో మరణించారు. ఇది ఎంతో బాధాకరమైన ఉదయం అని బెషియర్ అన్నారు. ఆయన రాష్ట్రంలో ఎమర్జెన్సీని ప్రకటించారు.
సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్ల కలకలం.. స్నేహితుడైన ఓ ఖైదీ కోసం గంజాయి ఇవ్వడానికి వెళ్ళి..
చెన్నై సెంట్రల్ జైల్లో గంజాయి బిస్కెట్లు కలకలం సృష్టించాయి. సేలం సెంట్రల్ జైలులో ఉన్న స్నేహితుడైన ఓ ఖైదీకి గంజాయి ఇవ్వడానికి వెళ్లాడు ఓ యువకుడు. బిస్కెట్ల ఫ్యాకేట్ ఓపెన్ చేసి ఉండటంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు జైలు సిబ్బంది. బిస్కె్ట్లలో గంజాయి తరలించడాన్ని చూసి షాక్ కు గురయ్యారు. బిస్కెట్లకు రంధ్రం చేసి వాటిలో గంజాయి పెట్టి తీసుకొచ్చాడు ఆ యువకుడు. బిస్కెట్ ప్యాకెట్‌లో దాచిన 80 గ్రాముల గంజాయి స్వాదీనం చేసుకున్నారు పోలీసులు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఒక గొప్ప ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు తక్కువ ధరలకే సిమెంట్ , స్టీలు సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు, సంబంధిత ప్రభుత్వ అధికారులు సిమెంట్ , స్టీలు ఉత్పత్తి చేసే వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల కంటే గణనీయంగా తక్కువ ధరకు లబ్ధిదారులకు సిమెంట్ , స్టీలును అందించే విషయంపై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం మార్కెట్లో సుమారు ₹320 పలుకుతున్న ఒక సిమెంట్ బస్తాను ₹260కే అందించాలని అధికారులు ఆయా కంపెనీలను కోరారు.
కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్ ప్రకటించిన టెలిగ్రామ్.. 42 లక్షలకు పైగా బహుమతులు..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్లకు సరికొత్త అవకాశాన్ని అందిస్తూ టెలిగ్రామ్ తమ మొదటి అంతర్జాతీయ పోటీని ప్రకటించింది. ఈ కాంటెస్ట్‌లో విజేతలకు మొత్తం 50,000 డాలర్స్ (భారత రూపాయల్లో సుమారుగా రూ. 42.8 లక్షలు) బహుమతులు అందించనున్నారు. ఈ పోటీ ద్వారా టెలిగ్రామ్ తన మెసేజింగ్ ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్లోబల్ కాంటెస్ట్ లో పాల్గొనేవారు టెలిగ్రామ్ అందించిన సాంకేతిక, వినూత్న ఫీచర్లను చాటి చెప్పే షార్ట్ వీడియోలు రూపొందించాలి.
పీలేరులో అదుపుతప్పి బావిలో పడ్డ కారు.. ముగ్గురు మృతి
అన్నమయ్య జిల్లాలోని పీలేరు సదుం రోడ్డులో ఘోర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటనలో కర్ణాటక కు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారు అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లి పడడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. స్థానికులు కారును బావిలోంచి బయటకు తీశారు. మృతులు ఎవరన్నది తెలియ రాలేదు. కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్ తో కారు ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వచ్చే మూడు రోజుల కూడా సల్లగనే ఉంటదట..!
దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం , పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా, మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు అదే ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ స్థితుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు స్థాయికి మించిన స్థాయిలో మూడు నుంచి ఐదు డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.