నేటి నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేడు తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. 90 రోజుల్లో 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు భట్టి విక్రమార్క. ఆయన పాదయాత్రలో 1,365 కిలోమీటర్లు నడవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి తర్వాత నియోజకవర్గాల సంఖ్య పరంగా ఇది రెండవ అతిపెద్ద పాదయాత్ర. ఈ పాదయాత్ర దాదాపు 50 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. ముఖ్య అతిధులుగా పాల్గొనేందుకు రాజస్థాన్‌తో సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నాలుగైదు పెద్ద బహిరంగ సభలు నిర్వహించనున్నారు. దళిత వర్గానికి చెందిన భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించి జూన్ 15న ఖమ్మం జిల్లాలో యాత్రను ముగించనున్నారు. ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’లో భాగంగా పాదయాత్ర చేపట్టాలని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఏఐసీసీ నాయకత్వం భట్టిని కోరిందని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తెలిపారు. అయితే.. ఇది వ్యక్తిగతంగా చేస్తున్న యాత్ర కాదని, ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ చేపట్టే యాత్రేనని ఇదివరకే భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, వివిధ సెక్షన్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కోట్లు ఖర్చు చేసినా వాటి ఫలాలు ప్రజలకు అందకపోవడం బాధాకరమన్నారు.
నేడే ఏపీ బడ్జెట్.. బుగ్గన పద్దు ఎంతంటే..
ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లో 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలి లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష ఆర్ధిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఈసారి మాత్రం సుమారు రెండు లక్షల 65 వేల నుంచి 70 వేల కోట్ల మధ్య బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు సమాచారం. ఇవాళ ఉదయం ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. అసెంబ్లీ లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ను మంత్రిమండలి ఆమోదించనుంది.
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. 3 గ్రాడుయేట్, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ విధానంలో జరిగిన ఎన్నిక కావడంతో లెక్కింపు విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లెక్కింపు ప్రక్రియలో ముందు బ్యాలెట్ పేపర్ల పరిశీలన ఉంటుంది.
భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి
భారత్‌లో అమెరికా రాయబారిగా ప్రెసిడెంట్ జో బైడెన్ సన్నిహితుడు ఎరిక్ గార్సెట్టి నియామకం రెండేళ్ల విరామం తర్వాత ఖరారైంది. ఎరిక్ గార్సెట్టి నామినేషన్‌ను బుధవారం సెనెట్ 52-42 మెజార్టీతో ఆమోదించింది. గార్సెట్టి నామినేషన్ 2021 జులై నుంచి పెండింగ్‌లో ఉండడం గమనార్హం. రెండేళ్లకు పైగా ఆ స్థానం ఖాళీగా ఉంది. గార్సెట్టి లాస్ ఏంజెల్స్ మేయర్‌గా ఉన్నప్పుడు ఒక మాజీ సీనియర్ సలహా దారుపై లైంగిక వేధింపుల వ్యవహారంలో సరైన చర్యలు తీసుకోలేదన్న కారణంతో కొంతమంది చట్టసభ సభ్యులు చేసిన ఆందోళనల మధ్య ఆయన నియామకం పెండింగ్‌లో పడింది. ఇప్పుడు సెనెట్ ఆమోదం తెలపగా.. ఎట్టకేలకు ఆయన నియామకం ఖరారు అయింది. అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత భారతదేశంలోని చివరి అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ జనవరి 2021లో పదవీ విరమణ చేశారు. ఈ పదవి అప్పటి నుంచి ఖాళీగా ఉండడం గమనార్హం.
ఈడీ ముందుకు కవిత.. ఢిల్లీకి క్యూ కట్టిన మంత్రులు.. ఏం జరగబోతోంది?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు వేగవంతం చేసింది. ఈ కేసు సంబంధించిన వ్యక్తులను విచారిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు చేరుకోనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాల కారణంగా బీఆర్‌ఎస్ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు.
ఆ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత.. మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాలకు ప్రతిగా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ద్వారా ఉత్తర కొరియా అమెరికాకు సవాల్ విసిరింది. ఉత్తర కొరియా వారం వ్యవధిలో మూడోసారి క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఈ సమాచారాన్ని దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ సుదూర క్షిపణిని ప్యోంగ్యాంగ్‌లోని సునాన్ ప్రాంతం నుండి ప్రయోగించబడింది. నాలుగు రోజుల క్రితం కిమ్ జలాంతర్గామి నుంచి రెండు క్షిపణులను పరీక్షించారు.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే, ఇది మీకు గుడ్ న్యూస్. బంగార ఆభరణాలంటే స్త్రీలకు అమితమైన ప్రేమ ఉంటుంది. దేశంలో బంగారం ధర కాస్త తగ్గింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. అయితే, వెండి మాత్రం మళ్లీ భారీగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీసహా తెలుగురాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.