ట్రంప్ సుంకాలపై ఉత్కంఠ.. భారత్‌పై ప్రభావం..
డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించబోతున్నాడు. ఏప్రిల్ 2 ‘‘విముక్తి దినోత్సం’’ సందర్భంగా ఇండియాతో పాటు ఇతర దేశాలపై సుంకాలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అంతా ఉత్కంఠత నెలకొంది. పరస్పర సుంకాలు ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌజ్ మంగళవారం తెలిపింది. ట్రంప్ కొన్నాళ్ల నుంచి చాలా గొప్పగా చెప్పుకుంటున్న ‘‘పరస్పర సుంకాల’’ను ప్రకటించనున్నారు. అయితే, ఒక రోజు ముందు ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ తమ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తుందని తాను విన్నానని ఆయన అన్నారు.
భారత్‌తో పాటు చాలా దేశాలు కూడా సుంకాలు గణనీయంగా తగ్గిస్తాయని అనుకుంటున్నానని, ఎందుకంటే గత కొన్నేళ్లుగా అమెరికాపై అన్యాయంగా సుంకాలు విధిస్తున్నారని ట్రంప్ విలేకరుల సమావేశంలో అన్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే యూరోపియన్ యూనియన్ కార్లపై తమ సుంకాలను 2.5 శాతానికి తగ్గించింది. ట్రంప్ ప్రకటనకు కొన్ని గంటల ముందు భారత్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధిస్తుందని వైట్ హౌజ్ తెలిపింది.
మా ఓటమికి కారణం అదే: పంత్
సరైన లక్ష్యాన్ని నమోదు చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. మ్యాచ్‌లో తాము 20-25 పరుగులు తక్కువగా చేశామని, అయితే ఆటలో ఇవన్నీ సహజమే అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకొని ముందుకు సాగాలనుకుంటున్నామన్నాడు. మ్యాచ్‌లో తమకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయని, అవేంటో ఇప్పుడు చెప్పలేను అని పంత్ తెలిపాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ… ‘మేం చేసిన స్కోర్ సరిపోలేదు. మ్యాచ్‌లో 20-25 పరుగులు తక్కువగా చేశాం. అయితే ఇవన్నీ ఆటలో భాగం. మా హోమ్ గ్రౌండ్‌లో పరిస్థితులను ఇప్పటికీ అంచనా వేస్తున్నాను. ఇన్నింగ్స్ ప్రారంభంలో వికెట్లు కోల్పోయినప్పుడు భారీ స్కోరు చేయడం కష్టమే. అయినా ప్రతి ఆటగాడు మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నించారు. స్లో వికెట్‌పై ఆడాలనుకున్నాం. ఇక్కడ బంతులు ఆగి వస్తాయని భావించాను. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకొని ముందుకు సాగాలనుకుంటున్నాము. మ్యాచ్‌లో చాలా సానుకూలాంశాలు ఉన్నాయి కానీ.. అవేంటో ఇప్పుడు చెప్పలేను’ అని తెలిపాడు.
నేడు వైసీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ..
ఇవాళ తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరపున నిలబడిన ప్రజా ప్రతినిధులను అభినందించనున్నారు. ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ కోసం పోరాడిన వారి అంకిత భావాన్ని గుర్తిస్తూ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని వైసీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్షన్ సభ్యులు హాజరుకానున్నారు.
వక్ఫ్ బిల్లు ఉత్కంఠ.. సభలో బీజేపీ సంఖ్యా బలం, ఏ పార్టీ ఎటు వైపు..?
చారిత్రాత్మక వక్ఫ్ సవరణ బిల్లును ఈ రోజు ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ముందుగా లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ సహా కాంగ్రెస్, ఇతర పార్టీలు తమ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేశాయి. మూడు రోజుల పాటు సభకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించాయి. నిన్న సాయంత్రం వక్ఫ్ బిల్లుపై ఇండియా కూటమి పార్టీలు సమావేశాన్ని నిర్వహించాయి. బిల్లుపై చర్చలో పాల్గొంటామని, అయితే బిల్లుకు మాత్రం మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశాయి. ఈ బిల్లుపై చర్చించడానికి రెండు సభలకు 8 గంటలు కేటాయించినట్లు తెలుస్తోంది.
బీజేపీ ఎన్డీయే మిత్ర పక్షాలపై జనతాదళ్ (యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) మరియు తెలుగుదేశం పార్టీ (టిడిపి) వంటి కీలక మిత్రుల మద్దతుపై నమ్మకంతో ఉంది. ఇప్పటికే టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) వంటి పార్టీల నాయకులు బిల్లు ఆమోదాన్ని అడ్డుకోబోమని ధృవీకరించారు. బిల్లు వల్ల ముస్లింల హక్కులు తగ్గుతాయని ప్రతిపక్షాల విమర్శలను కొట్టిపారేశాయి. ఇక షిండే నేతృత్వంలోని శివసేన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఇప్పటికే వారి ఎంపీలకు విప్ జారీ చేసింది. జనసేన కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిజేస్తోంది.
న్యూఢిల్లీలో బీసీల పోరు గర్జన.. హాజరు కానున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి!
విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. బీసీ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులను పార్లమెంట్ ఆమోదించి.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన కార్యక్రమాన్ని బుధవారం చేపడుతున్నాయి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందిన సుమారు1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో సోమవారమే రాజధానికి బయలుదేరి వెళ్లారు.
బీసీల పోరు గర్జనకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సహా బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్‌కు చెందిన బీసీ నేతలు మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో 1500 మంది బీసీ ప్రతినిధులు హాజరు కానున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహా 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఊటీ, కొడైకెనాల్‌లో ఈ-పాస్ విధానంతో ఇక్కట్లు.. రద్దు చేయాలని వ్యాపారుల బంద్..
సమ్మర్ హాలిడేస్ రావడం, ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఊటీ, కొడైకెనాల్ వెళ్తామనుకుంటున్న వారికి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లో ఈ-పాస్ విధానం అమలు చేయడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక నుంచి వెళ్లిన పర్యాటకులకు ఈ -పాస్ విధానం గురించి తెలియక చిక్కుకుపోయారు. మరోవైపు, ఈ విధానంపై స్థానిక వ్యాపారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేడు ప్రకాశం జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ కి శంకుస్థాపన
ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో 375 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీతో కలిసి లోకేశ్ పాల్గొననున్నారు. ఇక, పెద్దాపురంలో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. ఈ ప్లాంట్ 20 ఎకరాల విస్తీర్ణంలో 114.20 కోట్ల రూపాయలతో నిర్మించారు. దివాకరపల్లి నుంచి వర్చువల్ గా మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లాలో వరి, మొక్కజొన్న, చెరకు, పామాయిల్, కూరగాయలు, పూల తోటలు, ఆక్వా నుంచి వచ్చే వ్యర్ధ పదార్థాలు, పశువుల పేడ కంప్రెస్డ్ బయో యూనిట్లకి వనరులుగా రానున్నాయి. అయితే, ఈ బయో ఎనర్జీ ప్లాంట్ 67. 53 టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేయనుంది. 70 మందికి ప్రత్యక్షంగా, 200 మందికి పరోక్షంగా ఉపాధి దొరకనుంది.
నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ!
నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. గత విచారణ సందర్భంగా బీఆర్ఎస్ తరపు వాదనలు పూర్తయ్యాయి. ఈరోజు స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, పిరాయించిన ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏడాది దాటినా స్పీకర్ చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఎంపీగా ఓడిపోయి.. ఇపుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. స్పీకర్ అనర్హత చట్టాన్ని అమలు చెయ్యాలని కోర్టులు ఎందుకు కోరవద్దని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఇప్పటికే పిరాయింపుల కేసులో స్పీకర్ తరఫున అసెంబ్లీ సెక్రటరీ కౌంటర్ దాఖలు చేసింది. పిరాయింపుల అంశంలో చట్టాన్ని స్పీకర్ ఫాలో అవుతున్నారని పేర్కొంది. కోర్టులు స్పీకర్‌ను ఆదేశించవద్దని, అనర్హత చట్టంలోని ప్రొసీజర్‌ను ఫాలో అవుతున్నామని తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సిట్‌ముందుకి శ్రవణ్‌రావు.. అరెస్ట్ తప్పదా..?
ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంస్థ యజమాని శ్రవణ్‌రావు బుధవారం మరోసారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఎదుట హాజరుకానున్నారు. గత విచారణలో ఆయనను అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వకపోవడంతో, అధికారులు ఆయనకు తిరిగి నోటీసులు పంపారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారంతా పోలీసు అధికారులే కాగా, శ్రవణ్‌రావు మాత్రం ప్రైవేట్ వ్యక్తి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన జోక్యం చేసుకున్నారు? ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్ అధికారులతో ఆయనకు పరిచయం కల్పించినది ఎవరు? ఆయన కార్యాలయంలో హ్యాకింగ్ పరికరాలను ఏర్పాటు చేయడానికి ప్రణీత్‌రావు వెనుక కారణమేమిటి? ఈ వ్యవహారంలో ఎవరెంత మంది సంభాషణలను విన్నారు? దీని ద్వారా ఎవరైనా ఆర్థికంగా లబ్ధి పొందారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత తీసుకురావాలని భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు, రేవంత్ రెడ్డి అనుచరుల ఫోన్ నంబర్లు ట్యాపింగ్ టీంకు ఎందుకు అందించబడ్డాయి? ఆ వివరాలను శ్రవణ్‌రావుకు అందించినది ఎవరు? గత ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులకు ఆయన ఏ సమాచారాన్ని ఇచ్చారు? వంటి ప్రశ్నలపై SIT మరింత లోతుగా విచారణ జరుపుతోంది.
వక్ఫ్ బోర్డుల్లో ఇతర మతస్థులను చేర్చడం ఆమోదయోగ్యం కాదు..
ప్రస్తుతం పార్లమెంటులో చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ చట్టం 2024 పట్ల తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై మాజీ ఎంపీ కేశినేని నాని తన అభిప్రాయం వెల్లడించారు. ప్రభుత్వ వాదన ప్రకారం, ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల పరిపాలనను మెరుగుపరిచేందుకు, అవినీతిని అరికట్టేందుకు తీసుకు వచ్చారు.. ముస్లింల మత వ్యవస్థల్లో ప్రభుత్వ జోక్యం చేసుకుంటుంది.. ఈ బిల్లుతో వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ జరుగుతుంది.. తద్వారా అక్రమ ఆక్రమణలు, భూ దుర్వినియోగం తగ్గే అవకాశం ఉందన్నారు. అదనంగా, ఆడిట్, పర్యవేక్షణ పెరుగుతాయి.. తద్వారా అకౌంటబిలిటీ పెరుగుతుంది.. ఇకపై వక్ఫ్ ట్రిబ్యునల్ లో కేసులు ఏళ్ల తరబడి ఉండకుండా త్వరగా పరిష్కారం చెప్పే అవకాశం ఉంటుందని కేశినేని నాని పేర్కొన్నారు.