ఫైబర్ నెట్ స్కాంపై గౌతం రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. పెద్ద తలకాయల పాత్ర ఉందని అప్పుడే చెప్పా..!
ఫైబర్ నెట్ స్కాంలో పెద్ద తలకాయల పాత్ర ఉందని గతంలోనే చెప్పాను.. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు ఇందులో ఉన్నారని చెప్పాను అని గుర్తుచేసుకున్నారు APSFL చైర్మన్ గౌతం రెడ్డి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికే ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్నారు.. ఫైబర్ నెట్ స్కాంలో టేరా సాఫ్ట్ సంస్థదే కీలక పాత్ర అన్నారు.. స్కాంలో టెరా కంపెనీ లేకపోతే అసలు స్కామే లేదన్న ఆయన.. ఈ సంస్థకు ఒక్క రోజులో టెండర్ ను ఇచ్చేశారు.. సంస్థ నుంచి రాజీనామా చేసిన వారికి APSFLలో డైరెక్టర్ చేసేశారన్నారు. అయితే, స్కాంలో నారా లోకేష్ పాత్ర ఉందా? లేదా? అనేది సీఐడీ డిసైడ్ చేస్తుందన్నారు. గతంలో చంద్రబాబు అనేక అక్రమ అరెస్టులు చేయించారని మండిపడ్డారు. చంద్రబాబు తప్పు చేసి అడ్డంగా దొరికి జైలుకి వెళ్లారని తెలిపారు గౌతంరెడ్డి. ఇక, జనరల్ బాడీ మీటింగులో కీలక నిర్ణయాలు తీసుకున్నాం అని తెలిపారు గౌతంరెడ్డి.. 150 కోట్లు హడ్కో నుంచి రుణం తీసుకుంటున్నాం.. 325 కోట్ల రూపాయల రుణాల కోసం రేస్కోకి ప్రతిపాదనలు పంపాం అన్నారు.. గతంలో జరిగిన పనులపై ఆడిట్ చేయాలని, కాగ్ కి పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. సంస్థ ఆపరేషన్ నిర్వహణ గతంలో టెరా సాఫ్టు కంపెనీ నిర్వహించేది.. ఆ సంస్థ సేవలు నిలిపి వేశాం కాబట్టి మేమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. ఇలా చేయటం వల్ల ప్రతి ఏడాది 32 కోట్ల రూపాయలు ఆదా అవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా టెలీకం వర్కులు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. సంస్థ రూ. 2 వేల కోట్ల వరకు రుణాలు తీసుకోవటానికి నిర్ణయించినట్టు పేర్కొన్నారు APSFL చైర్మన్ గౌతం రెడ్డి.
మారిన దసరా సెలవులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వ తాజా ప్రకటన ప్రకారం.. ఈ నెల 23, 24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయి.. అయితే, ఇంతకు ముందు 24, 25 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే.. కానీ, ఇప్పుడు వాటిలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్.. మరోవైపు.. బతుకమ్మ, దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు డిసైడ్ చేశారు.. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ప్రకటించగా.. జూనియర్ కాలేజీలకు ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే.
అసమానతలు లేని అభివృద్ధి కావాలి.. రాష్ట్రంలో యథేచ్ఛగా ఆస్తుల లూఠీ, నిధుల దోపిడీ..!
అసమానతలు లేని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌కి కావాలని ఆకాక్షించారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరగనున్న సెమినార్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో యథేచ్ఛగా ఆస్తుల లూఠీ, నిధుల దోపిడీ జరుగుతుందన్నారు. ప్రజాశ్రేయస్సు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.. గతంలో చంద్రబాబుగానీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ గానీ ప్రజలులకు ఎంతో చేశామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే సంక్షేమం జాడ కనిపించడం లేదన్నారు రాఘవులు.
విరాళాలు బహిర్గతం చేసేందుకు మేం సిద్ధం.. మీకే క్విడ్ ప్రోకో ద్వారా విరాళాలు..!
తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ము అంటున్నారు.. విరాళాలు బహిర్గతం చేసేందుకు మేం సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ సవాల్ చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయంలో లైట్లు ఆర్పి కొవ్వొత్తులు, కాగడాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు నేతలు.. పార్కింగ్ ఏరియాలో కార్ల లైట్లు బ్లింక్ కొడుతూ చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్, దేవినేని ఉమ, నక్కా ఆనంద్ బాబు, పీతల సుజాత, అశోక్ బాబు, పంచుమర్తి అనురాధ, జీవీ ఆంజనేయులు, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక, ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాల్లేకుండా చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారని.. ఈ 29 రోజులుగా ఏం పీకారు? అంటూ మండిపడ్డారు. రూ 3300.కోట్ల అవినీతి ఆరోపణల నుంచి రూ. 370 కోట్లు అని ఇప్పుడు.. రూ. 27 కోట్లు అంటున్నారని దుయ్యబట్టారు.. తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ము అంటున్నారు. విరాళాలు బహిర్గతం చేసేందుకు మేం సిద్ధం అన్నారు. అయితే, స్కిల్ కేసులో సంబంధo ఉన్నవారెవ్వరు పార్టీకి పైసా విరాళం కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. క్విడ్ ప్రోకో ద్వారా విరాళాలు సేకరించింది వైసీపీనే అంటూ ఆరోపణలు గుప్పించారు. పంచభూతాలను దోచుకున్న జగన్ అవినీతి సామ్రాట్టుగా ఎదిగాడు అని ఆరోపించారు అచ్చెన్నాయుడు.
మీ పథకాలు ఏవీ ఎన్నికల్లో పనిచేయవు..
ప్రజలకు మీరేదో పథకాలు ఇస్తున్నామని అనుకుంటున్నారు.. కానీ, ఆ పథకాలన్నీ ఎన్నికల్లో పనిచేయబోవని అంటున్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిల ప్రియ.. చంద్రబాబు చేయని తప్పుకు అనవసరంగా జైలుకు పంపిన వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు 300 కోట్ల రూపాయలు కాదు కదా 3 రూపాయలు కూడా తీసుకొని ఉండరని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ఓటర్ల రీ వెరిఫికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడే వైసీపీకి భయం పుట్టి చంద్రబాబును అరెస్ట్ చేయించిందని విమర్శించారు. ఇక, ప్రజలకు ఇచ్చేది వంద అయితే.. ప్రజల నుంచి దోచుకునేది 200 రూపాయలు అని ఆరోపించారు. భూ సర్వే పేరుతో 17 ఎకరాలు ఉన్న రైతుకు అన్యాయంగా రీ సర్వేలో రెండు ఎకరాలు చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అఖిలప్రియ. మూడు రోజుల లోపల ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ల పొలాలను వాళ్లకు చూపిస్తే సరి, లేదంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడానికి రెడీగా ఉన్నాం అని హెచ్చరించారు. మరోవైపు.. ఎమ్మెల్యే ప్రజల సొమ్ము ఎలా దోచుకోవాలని ఆలోచిస్తున్నాడు.. తప్ప ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదని దుయ్యబట్టారు. ఈ సారి మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీ మరో బీహార్ అవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.
తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్.. ఉత్తర్వులు జారీ
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ నేడు (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాలతో కలిపి కొత్త రెవెన్యూ డివిజన్‌ని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్లో ఏటూరు నాగారం మండలం కొనసాగగా.. స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ములుగు డివిజన్లో గోవిందరావుపేట, వెంకటాపూర్, ములుగు మండలాలతో పాటు నూతనంగా ఏర్పాటయ్యే మల్లంపల్లి మండలం ఉండనున్నాయి. ములుగు మండలంలో అంతర్భాగంగా ఉన్న మల్లంపల్లి గ్రామాన్ని.. మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నాట్లు.. ప్రైమరీ నోటిఫికేషన్ కూడా తెలంగాణ సర్కార్ జారీ చేసింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక మండలంగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది.
బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు.. కాంగ్రెస్ గెలవదు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తప్పిపోయో, పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కైలాసంలో పెద్దపాము మింగినట్టే ఉంటది అని ఆయన వ్యాఖ్యనించారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట.. నడ్డా వచ్చి ఇక్కడ హంగ్ వస్తుంది అంటున్నాడు.. నడ్డా హ్యాట్రిక్ కొడుతం రాసి పెట్టుకో అని హరీశ్ రావు అన్నారు. మిస్టర్ నడ్డా తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫేక్ సర్వేలు పెడుతుంది.. బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు.. కాంగ్రెస్ గెలవదు అని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ దెబ్బకు బిజెపి డక్ ఔట్..కాంగ్రెస్ రన్ ఔట్..కేసీఆర్ సెంచరీ చేయడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరు.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ.. గత ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం.. ఈ సారి 100 సీట్లు గెలిచి సెంచరీ కొడుతాం అని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
సైనికులతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్రం మనా పాస్‌కు చేరుకుని సరిహద్దుల్లో మోహరించిన సైనికులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి యోగి సైనికులను ప్రోత్సహించారు. ఈ సమయంలో సీఎం యోగితో భేటీ అనంతరం సైనికులు కూడా ఉత్సాహంగా కనిపించారు. షెడ్యూల్ ప్రకారం, యోగి ఆదిత్యనాథ్ మధ్యాహ్నం కేదార్నాథ్ ధామ్‌కు బయలుదేరాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా యోగి ఆదిత్యనాథ్ కేదార్నాథ్ ధామ్‌కు వెళ్లలేకపోయారు. బద్రీనాథ్ ధామ్ చేరుకున్న తర్వాత బీఆర్వో గెస్ట్ హౌస్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మనా పాస్ సరిహద్దుకు బయలుదేరి సైనికులను కలుసుకున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం నాడు బద్రీ విశాల్ భగవానుని శయన ఆరతికి హాజరు కావచ్చు. దీని తరువాత బద్రీనాథ్ ధామ్లోనే రాత్రి గడిపిన తర్వాత, ఆదివారం ఉదయం బద్రీ విశాల్ భగవానుని దర్శనం చేసుకోనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాయంత్రం 4 గంటలకు బద్రీనాథ్ ధామ్ చేరుకున్నారు. ఆ తర్వాత బీఆర్వో రెస్ట్ హౌస్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాతసరిహద్దుకు బయలుదేరారు. సరిహద్దు నుండి తిరిగి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి యోగి లార్డ్ బద్రీ విశాల్ నిద్రవేళ హారతికి హాజరు కానున్నారు.
ఇజ్రాయిల్‌కి వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా..
ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి యుద్ధంగా మారింది. ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇప్పటి వరకు 40 మంది ఇజ్రాయిలీలు మరణించారు. చాలా మందిని హమాస్ బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో హమాస్ స్థావరాలను టార్గెట్ చేస్తోంది. తాము యుద్ధంలో ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ప్రకటించారు. ఇజ్రాయిల్‌కి ప్రపంచదేశాలు అండగా నిలుస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోడీ అండగా ఉంటామని అన్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్‌కి వెళ్లే విమానాలను పలు దేశాలు రద్దు చేసుకుంటున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా ఇజ్రాయిల్ వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. యుద్ధ పరిస్థితులు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7, 2023 ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్లే AI139, టెల్ అవీవ్ నుంచి న్యూఢిల్లీ వచ్చే AI140 విమానాన్ని రద్దు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రికార్డులు అన్నీ బద్దలు కొట్టిన సౌతాఫ్రికా..
వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది సౌతాఫ్రికా జట్టు.. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 1975లో ప్రారంభమైనప్పటి నుండి అనేక జట్లు తమ అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనలను ఆవిష్కరించాయి. కానీ, ఈ రోజు ప్రపంచకప్ 2023లో జరిగిన శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ ప్రత్యేకం.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంకపై ఐదు వికెట్ల నష్టానికి 428 పరుగుల భారీ స్కోర్ చేసింది.. దీంతో.. 2015 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా పేరున ఉన్న రికార్డును దక్షిణాఫ్రికా బద్దలుకొట్టింది. ఇక, ఒకే ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మన్స్ సెంచరీలు బాదటం మరో హైలైట్.. మూడు సెంచరీలతో 400కు పైగా పరుగులు నమోదు చేసిన తొలి జట్టుగా మరో రికార్డుకు ఎక్కింది సౌతాఫ్రికా.. ఢిల్లీ వేదికగా ఈ రోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ప్లేయర్స్ క్వింటన్ డికాక్ (100), రస్సీ వాన్ డర్ డస్సెన్.. ఐడెన్ మార్క్రమ్ సెంచరీలతో కదం తొక్కారు.. ఇక, వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు మార్క్రమ్.. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి చెలరేగిపోయాడు.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఓపెనర్ క్వింటన్ డికాక్ 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సహకారంతో 100 పరుగులు చేశాడు.. ఇక, వాన్ డెర్ డస్సెన్ 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 108 పరుగులు బాదాడు.. ఆ తర్వాత ఐడెన్ మార్క్రమ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.. కేవలం 54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదేసి 106 పరుగులు చేశాడు.. దీంతో.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా 428 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. శ్రీలంక ముందు 429 పరుగుల భారీ టార్గెట్‌ను పెట్టింది.
విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శన.. లాంగ్ డైవ్ ఎలా వేశాడో చూడండి
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తాడని క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. కింగ్ కోహ్లి భారత్‌లోనే కాదు ప్రపంచంలోనే టాప్ ఫీల్డర్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫీల్డింగ్ లో అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ.. అద్భుతంగా మైదనమంతా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాడు. రేపు ప్రారంభమయ్యే వరల్డ్ కప్ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. అయితే కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో తాను చాలా లాంగ్ డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ వీడియో చూస్తే విరాట్ కోహ్లీని సూపర్‌మ్యాన్ అని పిలువవచ్చు. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ ఖాళీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను చూడవచ్చు. అతను క్యాచ్ పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా వేగంగా కదులుతున్న బంతిని పట్టుకోవడానికి లాంగ్ డైవ్ చేస్తాడు. బంతి అతని చేతుల్లోకి వెళ్లినప్పటికీ, కోహ్లి చేసిన ప్రయత్నాలు పూర్తిగా టాప్ క్లాస్‌గా ఉన్నాయి. ఈ సోషల్ మీడియాలో శరవేగంగా షేర్ అవుతోంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ చేశాడు. ఆ తర్వాత.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగులు చేశాడు. అయితే ప్రపంచకప్‌లో కోహ్లి ఫామ్ లో ఉండటం భారత్‌కు ఎంతో కలిసొచ్చే అంశం.
తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్, సీజన్ 3 మొదలైంది!
తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (TPGL) నిర్వాహకులు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఈ రోజు సీజన్ 3 ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సెక్రటరీ డి.వందిత్ రెడ్డి , నిధి యూనివర్సిటీ చైర్మన్, లీగ్ టైటిల్ స్పాన్సర్ డాక్టర్ కె.టి.మహి విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “గోల్ఫింగ్ కమ్యూనిటీ కోసం మరో లీగ్‌ని నిర్వహించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ గోల్ఫ్ లీగ్ ను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం & తెలంగాణా పర్యాటక శాఖ వారు అందించిన మద్దతుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడుతున్న TPGL తో జంట నగరాల్లో గోల్ఫ్‌పై అవగాహన పెరగటం తో పాటుగా భాగస్వామ్యం కూడా పెరిగింది, లీగ్ లో 16 జట్లు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. వారితో పాటుగా స్పాన్సర్ల విలువైన సహకారానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము” అని అన్నారు. గౌరవ కార్యదర్శి వందిత్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ యొక్క సీజన్ 3 గణనీయమైన రీతిలో 16 జట్ల నుండి ఆసక్తిని పొందింది. నిధి విశ్వవిద్యాలయం మూడవసారి టైటిల్ స్పాన్సర్‌గా తిరిగి వచ్చింది. టీపీజీఎల్ను ఈ రోజు అద్భుతమైన విజయంగా మార్చడంలో దోహదపడిన టీమ్ స్పాన్సర్లందరి భాగస్వామ్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఈవెంట్ క్రీడాకారులకు గోల్ఫ్ పోటీలో పాల్గొనడానికి మరియు వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి విలువైన అవకాశాన్ని అందిస్తుంది…” అని అన్నారు
ఎట్టకేలకు ప్రభాస్ మూవీ గురించి స్పందించిన దర్శకుడు మారుతీ…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమా లు చేస్తూ బిజీ గా వున్నాడు. `సలార్`, “కల్కి 2898 AD”, వంటి సినిమాల గ్లింప్స్ వీడియోస్ ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో భారీగా అంచనాలు పెంచేసాయి.అయితే ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న మూవీ(రాజా డీలాక్స్) నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.కనీసం ప్రారంభమైందనే వార్తకు రాలేదు, షూటింగ్ ఎంత వరకు పూర్తి అయింది.ఏం జరుగుతుందనే అప్ డేట్ టీమ్ నుంచి అస్సలు రావడం లేదు. వాళ్లు ఈ సినిమాని ఎంతో సీక్రెట్‌గా తెరకెక్కిస్తున్నారు. అనేక సందర్భాల్లోనూ నిర్మాతలు, దర్శకుడు ఈ సినిమాపై స్పందించేందుకు కూడా నిరాకరించారు. మంచి సందర్భంలో ఆ సినిమా గురించి మాట్లాడతామని వారు చెబుతున్నారు.ఈ క్రమంలో ఇన్నాళ్లకి దర్శకుడు మారుతి ఈ సినిమా ఓపెన్ అయ్యాడు. సినిమాపై అప్డేట్ ఇచ్చారు. సినిమా జోనర్, షూటింగ్, రిలీజ్ వంటి అంశాలను ఆయన వెల్లడించారు. దీంతోపాటు సినిమాపై వచ్చిన రూమర్లకి కూడా ఆయన సమాధానం చెప్పారు. అయితే ప్రభాస్ సినిమా గురించి ఏదో ఒక ఇంటర్వ్యూలో కాదు, సెపరేట్ ఇంటర్వ్యూనే చేయాలని, అది చాలా పెద్ద కథ అని, చిన్నగా చెప్పడం సరిపోదని మారుతి అన్నారూ.. సినిమా జోనర్ గురించి చెబుతూ, తన సినిమా అంటే కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎలిమెంట్లు అన్ని ఉంటాయి. కాబట్టి కచ్చితంగా ప్రభాస్ సినిమాలోకూడా ఆయా ఎలిమెంట్స్ ఎక్సపెక్ట్ చేయొచ్చు.. అలాగే సినిమాలో హీరో కామెడీ కూడా చేస్తాడని కూడా మారుతీ క్లారిటీ ఇచ్చారు. భారీ సినిమాల మధ్య మంచి కామెడీ సినిమా చేయాలని ఉందని గతంలో ప్రభాస్ చెప్పిన మాటలను మారుతీ రిపీట్ చేసారు.అయితే ప్రభాస్ కు వున్న క్రేజ్ ప్రకారం భారీ స్కేల్లో ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు చెప్పారు. అయితే సినిమాని ప్రభాస్ లేకుండానే షూట్ చేస్తున్నారనే రూమర్లపై దర్శకుడు మారుతి రియాక్ట్ అవుతూ, సినిమాల్లో కొన్ని సీన్లలో హీరో అవసరం లేదు. బ్యాక్ నుంచి తీసే సీన్లు, కాళ్లు, చేతులు మాత్రమే కనిపించే సన్నివేశాలకు హీరో అవసరం ఉండదని బాడీ డబుల్ ని పెట్టి షూట్ చేస్తారని, తాను కూడా అదే చేస్తానని, తాను మాత్రమే కాదు, ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు సంబంధించి అందరు అదే ఫాలో అవుతారని, ప్రతి హీరోకి డబుల్ ఉంటారని మారుతి తెలిపారు