రాహుల్ ప్రధాని అవుతారు.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది..
2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. ఆంధ్రప్రదేశ్‌ఖి ప్రత్యేక హోదా వస్తుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.. రెండు ప్రాంతీయ పార్టీలూ సిద్ధాంత పరంగా కాంగ్రెస్ పార్టీతో కలిసిరావడానికి సిద్ధంగా లేవన్న ఆయన.. మా సహజ మిత్రులు కమ్యూనిష్టు పార్టీలు మాతో కలిసి వస్తాయన్నారు. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి సందేశం, ఆదేశం ప్రకారం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసి రాజశేఖరరెడ్డి ఆత్మకు శాంతి కలిగిస్తాం అన్నారు.. 2024లో రాహుల్ ప్రధాని అవుతారు.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి మారబోతోందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ మారబోతోందన్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైఎస్ షర్మిల అంశంపై మాట్లాడదాం అంటూ దాట చేశారు కేవీపీ రామచందర్‌రావు. కాగా, ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రచారం హీట్ పుట్టిస్తోంది.. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ లో ఫలితాలు వెలువడనున్న విషయం విదితమే.. అన్ని పార్టీలో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి.. మరోవైపు.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు కొనసాగిస్తున్నాయి.
ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా.. ఎందుకంటే..?
ఈ నెల 31వ తేదీన జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 31వ తేదీన అనగా రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది.. దీనిపై గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రేపటి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ఈ రోజు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.. విజయనగరం రైలు ప్రమాద నేపథ్యంలో కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది.. క్షతగాత్రుల సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, అధికారులు నిమగ్నమై ఉన్న నేపథ్యంలో కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. అయితే, వచ్చే నెల అనగా నవంబర్ 3వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
భువనేశ్వరి టీడీపీ అధ్యక్షురాలు కానున్నారా..? లోకేష్‌ను ఎందుకు దూరం పెడుతున్నారు?
నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కానున్నారా..? లోకేష్‌ను ఎందుకు దూరం పెడుతున్నారు..? అంటూ కొత్త అనుమానాలు వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. తాడేపల్లిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు జ్యూడిషియల్ కస్టడీ కి 50 రోజులు అయితే టీడీపీ నేతలు ఉత్సవాలు చేసుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. ఎడుపులు, నవ్వులతో ఎన్నికల డ్రామాలు చేస్తున్నారు అని దుయ్యబట్టారు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయితే అవి తప్పుడు కేసులు అని ఆధారాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాం.. కేసుల్లో నిజా నిజాలు బయటకు తీసుకువచ్చాం.. వైఎస్ జగన్ పై తప్పుడు కేసులు పెట్టామని కాంగ్రెస్ ఒప్పుకుందన్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ నేతల చర్యలు పరాకాష్టగా ఉన్నాయని సెటైర్లు వేశారు సజ్జల.. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో చేసిన ప్రదర్శన అంతా ముందే రిహార్సల్స్ చేసి వచ్చినట్లుగా ఉందన్న ఆయన.. ప్రజలు గురించి ఏమనుకుంటున్నారు? అని నిలదీశారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉంటే.. అక్కడ ఎందుకు పోటీ చేయటం లేదు? అని ప్రశ్నించారు. ఇక, జనసేన ఒక పార్టీనా? జనసేన.. టీడీపీకి తోక పార్టీ అని మండిపడ్డారు.. జనసేన అంటూ ఒక షో చేస్తున్నారన్నారు. రాజమండ్రిలో రెండు దేశాల మధ్య చర్చల్లా కూర్చున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అంతర్గతంగా దివాళా తీసింది.. అందుకే రైల్వే క్షతగాత్రుల పరామర్శకు భువనేశ్వరి వెళ్తున్నారని విమర్శించారు. ఆమె టీడీపీ అధ్యక్షురాలు కానున్నారా? లోకేష్ ఏమయ్యాడు? ఎందుకు దూరం పెడుతున్నారు? అంటూ అనుమానం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో భద్రతా సమస్యలు.. రైల్వేమంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో భద్రతా సమస్యలపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు.. హౌరా-చెన్నై ప్రధాన లైన్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో రైలు భద్రతపై క్రమబద్ధమైన మరియు విస్తృత సమీక్షను కోరారు.. వాల్తేర్ రైల్వే డివిజన్లోని అలమండ మరియు కంటకపల్లె మధ్య విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో కనీసం 14 మంది మృతి చెందిన ఘోర రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో కేవలం ఐదు నెలల వ్యవస్థలో రెండు పెద్ద రైలు ప్రమాదాలు సంభవించటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, ఈ ఏడాది జూన్‌లో ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కు జరిగిన ఘోర ప్రమాదంలో 280 మంది ప్రయాణికులు మరణం చెందిన విషయం గుర్తు చేస్తూ, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోని ప్రధాన హౌరా-చెన్నై లైన్ లోనే ఆ ప్రమాదం కూడా ప్రమాదం జరిగిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విశాఖపట్నంలో నివసిస్తున్న పార్లమెంటు సభ్యునిగా మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క జోనల్ రైల్వే యూజర్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) సభ్యునిగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య రైళ్ల భద్రత గురించి నా తీవ్రమైన ఆందోళనను తెలియపరుస్తున్నాను అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన లేఖ పేర్కొన్నారు. రైలు భద్రతపై సమీక్ష జరపాలని కోరుతూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ‘‘ఐదు నెలల స్వల్ప వ్యవధిలో జరిగిన పై రెండు ప్రమాదాల దృష్ట్యా, రైలు భద్రతపై క్రమపద్ధతిలో, విస్తృత సమీక్ష చేయవలసిన అవసరం ఉందని, తద్వారా రైలు ప్రమాదాలు అరికట్టడమే కాకుండా ప్రయాణీకులకు భద్రతా భావాన్ని కలిగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిన్న జరిగిన రైలు ప్రమాదంలో క్షతగాత్రులను మరియు మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకున్నందుకు రైల్వే మంత్రి మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణీకుల భద్రత మరియు భారతీయ రైల్వేలపై జాతీయ నమ్మకాన్ని నిలబెట్టే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశభావం వ్యక్తం చేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
చంద్రబాబుపై మరో కేసు.. ఏ-3గా చేర్చిన సీఐడీ
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.. ఇదే సమయంలో.. అమరావతి ఇన్నిర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులు కూడా నమోదయ్యాయి.. తాజాగా చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది సీఐడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కొత్త కేసు నమోదు చేసింది సీఐడీ. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే చంద్రబాబుపై ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు మరో కేసు లైన్లోకి చ్చింది.. అయితే, సీఐడీ నమోదు చేసిన తాజా కేసులో ఏ1 గా నరేష్, ఏ2 గా కొల్లు రవీంద్రను చేర్చింది సీఐడీ.. డిస్టలరీస్ కమిషనర్ వాసుదేవ రెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు నమోదు అయ్యింది.. రూ.1,300 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేశారని అభియోగాలు మోపారు.. నంద్యాలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీకి అనాచిత లబ్ధి చేకూర్చారని సీఐడీ పేర్కొంది.
కీలక ప్రశ్నలు లేవనెత్తిన సీఎం జగన్
విజనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై సోషల్ మీడియా వేదికగా పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విజయనగరం వెళ్లి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఆయన.. వారికి అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు.. ఆ తర్వాత ఏరియల్ సర్వే ద్వారా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఇక, విజయనగరం పర్యటనకు సంబంధించిన వివరాలను ట్విట్టర్లో పంచుకుంటూ ఓ ట్వీట్ చేసిన ఆయన.. ఆ తర్వాత పలు కీలక ప్రశ్నలను లేవనెత్తుతూ మరో ట్వీట్ చేశారు.. విజయనగరం రైలు ఘటన పరిస్థితులు ప్రత్యక్షంగా చూసిన తర్వాత స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు సీఎం జగన్.. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీ వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రికి అభ్యర్థించారు సీఎం జగన్.. ‘నిన్న రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నన్ను చాలా బాధించింది.. రన్నింగ్‌లో ఉన్న రైలు మరో రైలును ఢీ కొట్టింది, రెండూ ఒకే దిశలో నడుస్తున్నాయి.. ఈ భయంకరమైన ప్రమాదం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.. 1. బ్రేకింగ్ సిస్టమ్, అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు?.. 2. సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది?.. 3. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైంది?.. అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి విధ్వంసకర ప్రమాదాలు జరగకుండా దేశ వ్యాప్తంగా అన్ని మార్గాల్లో ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాన మంత్రి, రైల్వే మంత్రిలను అభ్యర్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి.. డీజీపీకి గవర్నర్ తమిళిసై కీలక ఆదేశాలు
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరమన్నారు. ఎంపీపై హత్యాయత్నంపై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కు గవర్నర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల భద్రత విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే, భవిషత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. డీజీపీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల కోసం శాంతియుత, సురక్షితమైన వాతావరణాన్ని నిర్వహించడం చాలా అవసరమన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ఇక, నుంచి సెక్యూరిటీ చర్యలపై మరింత దృష్టి సారించాలంటూ డీజీపీకి గవర్నర్ తమిళిసై కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆమె ఆదేశించారు.
ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేరళ వరుస పేలుళ్ల బాధ్యుడు అరెస్ట్
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పలు వరుస పేలుళ్లకు బాధ్యుడని పేర్కొన్న డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యా నేరాల కింద అతడిని సోమవారం అరెస్టు చేశారు. కన్వెన్షన్ సెంటర్లో బాంబులు పెట్టినట్లు మార్టిన్ ప్రకటించి త్రిసూర్ జిల్లాలో పోలీసులకు లొంగిపోయిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. క్రిస్టియన్ శాఖలో వరుస పేలుళ్లను ఎందుకు అమలు చేశాడో వివరిస్తూ లొంగిపోయే ముందు మార్టిన్ ఫేస్బుక్లో ఒక వీడియోను విడుదల చేశాడు. యొహోవా విట్నెసెస్ బోధనలను ‘విద్రోహపూరితమైనవి’ ఉన్నాయని అతను ఆరోపించాడు. కాబట్టే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మార్టిన్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు. గత 16 ఏళ్లుగా తాను యొహోవా విట్నెసెస్ సమూహంలో సభ్యుడిగా ఉన్నానని, తాను యొహోవా విట్నెసెస్ బోధనలతో ఏకీభవించడం లేదని, వారి కార్యకలాపాలను నిలిపివేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వారి ఆలోచనలు దేశానికి ప్రమాదకరమని, అవి యువకులను విషపూరితం చేస్తున్నాయని ఆయన అన్నారు.
ఆ హక్కు ప్రజలకు లేదు.. రాజకీయ పార్టీల విరాళాలపై సుప్రీంకు కేంద్రం
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పందించింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాల మూలాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి అన్నారు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ఎన్నికల విరాళాలు స్వీకరించడానికి ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చట్టబద్ధతను సమర్థించారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాల మూలాన్ని తెలుసుకునే ప్రాథమిక హక్కు ప్రజలకు లేదన్నారు. అటార్నీ జనరల్ కోర్టులో నాలుగు పేజీల లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎలక్టో బాండ్ స్కీమ్‌లో దాత గోప్యతకు సంబంధించిన ప్రయోజనాన్ని పొందుతారని ఆయన నొక్కి చెప్పారు. ‘ఎలక్టోరేట్ బాండ్ పథకం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) పరిధిలో ఉందని, ప్రాథమిక హక్కుల సాధనపై ప్రభుత్వం సహేతుకమైన ఆంక్షలు విధించేందుకు వీలు కల్పిస్తుందని ఆయన కోర్టుకు తెలిపారు. రాజకీయ పార్టీల నిధుల విషయంలో పారదర్శకత కోసం పిటిషనర్లు లేవనెత్తిన వాదనలను కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ వ్యతిరేకించారు. కొన్ని ప్రయోజనాల కోసం భావవ్యక్తీకరణకు తెలుసుకునే హక్కు అవసరమని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అన్నారు. రాజ్యాంగం ప్రకారం అభ్యర్థుల పూర్వాపరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, అయితే ప్రతీది తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి పేర్కొన్నారు.
ప్రతిరోజూ స్నానం చేస్తున్నారా.. వచ్చే సమస్యలివే..!
ప్రతిరోజూ స్నానం చేస్తే శుభ్రంగా ఉంటారని అందరికి తెలుసు. మరీ ముఖ్యంగా ఇండియన్స్ అయితే సాంప్రదాయం అని క్రమం తప్పకుండా రోజు స్నానం చేస్తారు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో స్నానం పవిత్రంగా భావిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రోజూ స్నానం చేయడం వల్ల శరీరానికి హాని కలుగజేస్తుందట. అంతేకాకుండా.. రోగనిరోధక శక్తి తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలోనైతే రోజూ తలస్నానం చేయడం తగ్గించుకోవడం చాలా మంచిదని చర్మ నిపుణులు అంటున్నారు. ఎక్కువగా స్నానం చేయడం వల్ల మన చర్మానికి హాని కలుగుతుందని వారు తెలుపుతున్నారు. చలికాలంలో ఎక్కువగా వేడి నీటితో స్నానం చేస్తారు. కానీ వేడినీళ్లతో స్నానం చేస్తే హాని జరుగుతుందని నిపుణులు అంటున్నారు. వేడినీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది. దాంతో శరీరంలో ఉండే సహజ నూనెను తొలగిస్తుంది. మన శరీరంలో ఉండే ఈ సహజ నూనె రోగనిరోధక శక్తిగా పనిచేస్తుంది. అందువల్ల ఈ నూనె మిమ్మల్ని తేమగా, రక్షణగా ఉంచుతుందని సైన్స్ చెబుతోంది. అంతేకాకుండా.. అధిక స్నానం చేయడం వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి జెర్మ్స్, వైరస్‌తో పోరాడలేకపోతుంది. దీంతో శరీరం బలహీనమవుతుంది. ఓ సర్వే ప్రకారం.. ప్రజలు ఎక్కువగా స్నానం చేసే దేశాలలో భారతదేశం, జపాన్, ఇండోనేషియా ముందు వరుసలో ఉన్నాయి. అయితే మనం రోజూ స్నానం చేయడం వల్ల నీరు వృథా కావడమే కాకుండా శారీరకంగా, మానసికంగా కూడా హానికరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. స్నానపు అలవాట్లు కూడా వ్యక్తి మానసిక స్థితి, ఉష్ణోగ్రత, వాతావరణం, లింగం, సామాజిక ఒత్తిడిపైన ఆధారపడి ఉంటాయి. సామాజిక ఒత్తిడి కారణంగా రోజూ స్నానం చేస్తుంటారు. అయితే దీన్ని బట్టి మీరు రోజూ స్నానం చేస్తారో.. రోజు విడిచి రోజు చేస్తారో మీరే ఆలోచించుకోండి.
డంకీ టీజర్‌పై అప్డేట్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.షారుఖ్ ఖాన్ తాజాగా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. జవాన్ సినిమా చూసి షారుఖ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.. తాను కూడా జవాన్ సినిమా సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ డంకీ సినిమా తో మరో సారి ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాడు..షారుఖ్‌ఖాన్ నటిస్తున్న ఈ చిత్రం లో ఢిల్లీ భామ తాప్సీ పన్ను హీరోయిన్ గా నటిస్తుంది..తాజాగా సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డంకీ టీజర్ కు సంబంధించి మూవీ లవర్స్ కు అదిరిపోయే అప్డేట్ ను అందించాడు. సలార్ ట్రైలర్ గురించి ఎందుకు అప్డేట్ చేయలేదని అందరూ నన్ను అడుగుతున్నారు… కానీ నేను అప్డేట్ చేయలేను.. షారుఖ్ ఖాన్ సార్ కి కాల్ చేశా. తన పుట్టినరోజున టీజర్ వస్తుందని చెప్పారు. డంకీ టీజర్ 56 సెకన్లు ఉంటుంది. నేను నా టీజర్ ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు సలార్ ట్రైలర్‌ని అప్లోడ్ చేయవచ్చు. ఎందుకంటే ఇది సలార్ వర్సెస్ డంకీ కాదు.. సలార్-డంకీ.. అని షారుఖ్ ఖాన్ చెప్పారని ట్వీట్ చేశాడు ప్రశాంత్ నీల్.అంటే డంకీ టీజర్ విడుదలయ్యాక సలార్ ట్రైలర్ వస్తుందని ప్రశాంత్ నీల్ తెలియజేశారు.. మొత్తానికి ఒకేసారి రెండు అప్డేట్స్ అందించి అటు షారుఖ్ ఫ్యాన్స్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి శుభ వార్త అందించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. డంకీ సినిమాను రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, జియో స్టూడియోలు సంయుక్తం గా డంకీ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 21న గ్రాండ్‌గా థియేటర్ లలో విడుదల కానుంది.మరి డంకీ సినిమా తో షారుఖ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి..
మార్క్ ఆంటోనీ హిట్.. డైరెక్టర్ కు లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, రీతూ వర్మ జంటగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మార్క్ ఆంటోనీ. ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మించాడు. గతే నెల 15 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకొని విశాల్ కు గట్టి కమ్ బ్యాక్ వచ్చేలా చేసింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ఓటిటీలో కూడా దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఎప్పటినుంచో.. సినిమా హిట్ అయితే డైరెక్టర్ కు లగ్జరీ కారులను గిఫ్ట్ ఇవ్వడం ట్రెండ్ గా వస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కు నిర్మాత వినోద్ కుమార్ ఒక లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లగ్జరీ BMW కారును గిఫ్ట్ గా ఇచ్చిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు. ఇక ఈ కారు గిఫ్ట్ గా ఇవ్వడంతో డైరెక్టర్ ఫుల్ ఖుష్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అధిక్ గురించి చెప్పాలంటే త్రిష ఇల్లనా నయనతార అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత శింబుతో ఒక సినిమా చేశాడు. ఇవేమి అతనికి మంచి హిట్ ను ఇవ్వలేకపోయాయి. ఇక మార్క్ ఆంటోనీ పై గట్టి నమ్మకంతోనే విశాల్ .. ఈ సినిమాను ఒప్పుకున్నాడు. దీంతో విశాల్ కు గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ గా అధిక్ రికార్డ్ కొట్టేశాడు. ప్రస్తుతం ఈ సినిమా తరువాత స్టార్ హీరోలకు కథలను వినిపించే పనిలో ఉన్నాడట అధిక్. మరి తన తరువాత సినిమా ఏ స్టార్ తో ఉంటుందో చూడాలి.
కలిపి చదువు నాన్న.. చెత్త.. కొడుకు.. చెత్త నా కొడుకు
మాచర్ల నియోజక వర్గం సినిమా తరువాత నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని నితిన్ కాచుకు కూర్చున్నాడు. ఈ నేపథ్యంలోనే వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అందులో ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామ శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ టీజర్ లో నితిన్ .. ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నట్లు కనిపించాడు. కథ మొత్తాన్ని రివీల్ చేయకపోయినా.. నితిన్ రకరకాల గెటప్స్ లో కనిపించాడు. ” భయ్యా కథ అంటే మాములు కథ కాదు భయ్యా.. రియల్ ఇన్సిడెంట్ ను చూసి రాసుకున్న కథ ” అంటూ వాయిస్ ఓవర్ రాగానే.. నితిన్ ప్రతి సినిమాలో చేసిన గెటప్స్ ను చూపించారు. ఇక ఒక డైరెక్టర్ కు తనను పరిచయం చేస్తూ.. బాహుబలి సినిమాలో తాను కూడా నటించాను అని చెప్పడమే కాకుండా.. గ్రాఫిక్స్ లో నితిన్ బాహుబలిలో ఉన్నట్లు చూపించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. ఇక చివర్లో తండ్రి కొడుకులు రావు రమేష్ మధ్య సంభాషణ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. ” రేయ్.. నువ్వు ఒక జూనియర్ ఆర్టిస్ట్ వి.. అంటే ఒక ఎక్స్ట్రా గాడివి.. ఒక ఆర్డినరీ పర్సన్ కు ఎందుకు ఇన్ని ఎక్స్‌ట్రాలు” అని రావు రమేష్ అనగా.. అలా సింగిల్ సింగిల్ గా కాకుండా కలిపి చదువు నాన్న.. ఎక్స్ట్రా.. ఆర్డినరీ, ఎక్స్ట్రా ఆర్డినరీ అని అంటాడు . వెంటనే రావు రమేష్ అదే స్వాగ్ లో.. కొడుకు.. చెత్త, చెత్త నా కొడుకు అనడంతో టీజర్ పూర్తయింది. ఇక హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. టీజర్ తోనే సినిమాపై ఒక హైప్ తీసుకొచ్చారు మేకర్స్. ఇక ఈ సినిమా డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమతోనైనా నితిన్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.