*ధరణి పోర్టల్ పై సీఎం కీలక ఆదేశాలు
సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ధరణిపై నిర్వహించిన సమీక్ష కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ రూప కల్పన ఎవరికి ఇచ్చారు. టెండర్ పిలిచారా? ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేసేందుకు అవకాశం ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18లక్షల 46వేల 416 మందికి ఇంకా పాస్ బుక్స్ ఇవ్వలేదని పేర్కొన్నారు. 2 లక్షల 31 వేల 424 దరఖాస్తులు టీఎం33, టీఎం 15కు చెందినవి పెండింగ్ లో ఉన్నాయరని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ పై సమగ్ర అధ్యయనం చేసి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ధరణిలో చాలా డేటా తప్పులు, పాసు బుక్స్ లో తప్పులు సవరించాలని ఆయన చెప్పారు. ధరణికి అసలు చట్టబద్ధత ఏంటని అధికారులను ప్రశ్నించారు. సాదా బైనామాల్లో తప్పు తొలగించాలి.. భూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కంప్యూటర్లనే నమ్ముకోవద్దు, జమా బంది రాయాలి, రికార్డులు రాయాలి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు.. ధరణిపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, గ్రీవెన్స్ విధానాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. భూ సమస్యలపై వినతులకు అందుబాటులోకి వచ్చిన మ్యాడ్యుల్లు, వాటి ద్వారా వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించిన దరఖాస్తులపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో.. పలు అంశాలపై క్లారిఫికేషన్, అదనపు సమాచారమడిగారు సీఎం రేవంత్ రెడ్డి. సమగ్ర వివరాలతో మరో నివేదిక తయారు చేయాలని ఆదేశం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పారు.
*కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త.. రెగ్యులరైజేషన్ గైడ్‌లైన్స్ విడుదల
కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఈ నెల 15 వ తేదీ నుంచి రెగ్యులరైజేషన్ కోసం కాంట్రాక్టు ఉద్యోగుల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. సంక్రాంతి లోపు రెగ్యులరైజేషన్ పూర్తికి చర్యలు తీసుకోనుంది ఏపీ సర్కారు. సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు ఇవాళ నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లకు సంబంధించి గడువు కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అందులో ఒకే ఒక నామినేషన్ దాఖలు అయింది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. రేపు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రొటెం స్పీకర్ ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ వికారాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి డాక్టర్ మెటుకు ఆనంద్‌పై 12,893 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పై గెలుపొందారు. గడ్డం ప్రసాద్‌కు మొత్తం 86,885 ఓట్లు పోలయ్యాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థికి 73,992 ఓట్లు వచ్చాయి. 2009లో గడ్డం ప్రసాద్ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై నమ్మకంతో వికారాబాద్ టికెట్ కేటాయించింది. ఈసారి 12 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ముందుగా ప్రసాద్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. స్పీకర్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. స్పీకర్ పదవి చేపట్టేందుకు శ్రీధర్ బాబు ఆసక్తి చూపలేదు. దీంతో.. మంత్రిగా పని చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ అధిష్టానం ప్రసాద్ కుమార్‌ను స్పీకర్‌గా నియమించింది.
*టీడీపీ రాజకీయ పార్టీగా ఉనికి కోల్పోయింది.. అది ఒక ముఠా..
ఇంఛార్జ్‌ల మార్పులతో కొంతమందిలో బాధ, ఆవేదన ఉంటుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. టీడీపీ రాజకీయ పార్టీగా ఉనికి కోల్పోయిందని.. ఒక ముఠాగా మారిందని విమర్శించారు. ప్రజలకు ఏం చెప్పామో అదే చేస్తున్నామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో వచ్చినప్పుడు బాధ్యతగానే పని చేశామన్నారు. ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల మద్దతు పొందాలని సీఎం చెప్పారని ఆయన అన్నారు. సిట్టింగ్‌ల మార్పులు అనేది ఎన్నికలు ముందు జరిగే సాధారణ ప్రక్రియ అని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని సజ్జల స్పష్టం చేశారు. నోటిఫికేషన్ కోసం మేము ఎదురు చూడడం లేదన్నారు. టీడీపీ, జనసేన కోఆర్డినేషన్ సమావేశాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయన్నారు. ఒక మీటింగ్ పెట్టుకున్న వెంటనే పార్టీలు కొట్టుకున్నారని ఆయన తెలిపారు. పరీక్షలకు పూర్తి స్థాయిలో చదివిన విద్యార్థుల్లా మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. జైల్లో ఉన్నప్పుడు ప్రపంచంలోని రోగాలు అన్ని ఉన్నాయి అన్నారని.. ఇప్పుడు రొమ్ము విరుచుకుని దేశం అంతా తిరుగుతాను అంటున్నారని.. చంద్రబాబును ఉద్దేశించి సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోసం హడావిడి చేసిన భార్య, కోడలు ఎక్కడ ఉన్నారంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ -జనసేన పొత్తు తేలిందా.. వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు కోసం చనిపోయారు… వాళ్ళ కోసం పరామర్శ అన్నారు…ఏమయ్యిందన్నారు. అసలు ఏ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో వాళ్ళకైనా తెలుసా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారని.. ఇక్కడకు వస్తారన్న ఊహాగానాలపై ఏం మాట్లాడతామన్నారు. ఎంత మంది ఏ రకంగా కలిసి వచ్చినా మేం చేసిన అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు మద్దతు ఇస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
*నలుగురు కాదు ఆరుగురు.. పార్లమెంట్ దాడి ఘటనలో పరారీలో మరో ఇద్దరు..
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నట్లు పోలీసుల వర్గాలు అనుమానిస్తున్నాయి. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దర పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు సాగర్ శర్మ, మనో రంజన్ పార్లమెంట్ హాలులో పోగ డబ్బాలను వదిలారు. దీంతో సభలోని ఎంపీలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. 2001, డిసెంబర్ 13 పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన 22 ఏళ్లు గడుస్తున్న ఇదే రోజున ఇలాంటి ఘటన జరగడం దేశాన్ని ఆందోళనకు గురిచేసింది. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల పసుపు పొగ డబ్బాలను పేల్చారు. వీరిని అమోల్ షిండే, నీలం దేవిగా గుర్తించారు. ఐదో వ్యక్తిని లలిత్ ఝాగా పోలీసులు గుర్తించారు. ఈ ఐదుగురు ఒకే ఇంటిలో నివసించినట్లు తేలింది. ఆరో వ్యక్తికి పేరును ప్రకటించలేదు. లలిత్ ఝాతో పాటు ఆరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ లోపల పొగ డబ్బాలను పేల్చిన సాగర్ శర్మది ఉత్తర్ ప్రదేశ్ కాగా.. మనోరంజన్‌ది కర్ణాటకలోని మైసూర్. ఇక పార్లమెంట్ వెలుపల పట్టబడ్డ నీలందేవీది హర్యానాలోని హిసార్ కాగా, అమోల్ షిండే మహారాష్ట్ర లాతూర్‌కి చెందిన వాడు. సాగర్ శర్మ, మనోరంజన్‌లకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం విజిటింగ్ పాస్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.
*హోం మంత్రి సమాధానం చెప్పాల్సిందే.. రాజ్యసభ నుంచి ఇండియా కూటమి వాకౌట్..
పార్లమెంట్‌లో ఈరోజు జరిగిన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్‌లోకి విజిటర్ల రూపంలో వెళ్లి, సభ జరుగుతున్న సమయంలో ఛాంబర్‌లోకి దూసుకెళ్లారు. పొగతో కూడిన డబ్బాలు పేల్చారు. ఈ ఘటనతో ప్రజాప్రతినిధులు ఆందోళన చెందారు. సరిగ్గా డిసెంబర్ 13, 2001న పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడికి నేటితో 22 ఏళ్లు గడిచాయి. ఇదే రోజున ఇలా ఆగంతకులు దాడికి యత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ వ్యవహారంపై విపక్షాలు, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇప్పటికే బీజేపీ ఎంపీ ఇష్యూ చేసిన విజిటర్ పాసులపై నిందితులు పార్లమెంట్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో బీజేపీ విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే, భద్రతా లోపాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయడానికి నిరాకరించాని ఆరోపిస్తూ ఇండియా కూటమి నేతలు ఈ రోజు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ‘‘ఈ రోజు లోక్‌సభలో జరిగిన అసాధారణ సంఘటనలు, ఈ విషయంపై ప్రకటన చేయడానికి హోంమంత్రి నిరాకరించడంపై ఇండియా కూటమి పార్టీలు ఈ రోజు మధ్యాహ్నం రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. 22 ఏళ్ల క్రితం పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి జరిగిన రోజు ఈ భద్రత ఉల్లంఘన జరిగింది’’ అంటూ కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ జైరాం రమేష్ ట్వీట్ చేశారు. రాజ్యసభలో హోంమంత్రి ప్రకటన చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే డిమాండ్ చేశారు. పరిస్థితిని అనుసరించి, ఎంపీలందరికి అప్డేట్ చేస్తామని చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ తెలిపారు. అయినా విపక్ష సభ్యులు శాంతించక, సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ రోజు పార్లమెంట్‌లో జరిగిన భద్రతా ఉల్లంఘన చాలా తీవ్రమైన విషయమని ఖర్గే ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. దీనిపై ఉభయ సభల్లో హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని, ఇంత పెద్ద భద్రత ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు గ్యాస్ తో కూడిన డబ్బాలను ఎలా తెచ్చారు..? ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.
*సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజే సంచలన ఆదేశాలు.. లౌడ్ స్పీకర్లపై నిషేధం..
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు మోహన్ యాదవ్ పదవీ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు సీఎం సంచలన ఆదేశాలు జారీ చేశారు. మతపరమైన, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 230 స్థానాలున్న ఎంపీలో ఏకంగా 163 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అయితే అనూహ్యంగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ని కాదని, బీసీ నేత మోహన్ యాదవ్‌ని బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఈ రోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ పదవిని స్వీకరించారు. గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హజరయ్యారు.
*ఎట్టకేలకు సాధించిన వర్మ.. వ్యూహం సెన్సార్ చేయించాడుగా!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’కి సెన్సార్ ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన అంశాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఈ సినిమా ఎప్పుడో నవంబర్ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. అప్పట్లో సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలోని నేతల పేర్లను పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింద, ‘వ్యూహం’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవిత ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ‘వ్యూహం’ సినిమాతో పాటు పార్ట్-2ని ‘శపథం’ పేరుతో వర్మ రిలీజ్ చేయబోతున్నారు. ‘వ్యూహం’ సినిమాని నవంబర్ 10న, ‘శపథం’ మూవీని జనవరి 25న ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి ముందు ప్లాన్ చేశారు. జగన్ జీవితంలోని కొన్ని ప్రత్యేక ఘటనలను ఈ రెండు సినిమాల్లో చూపెట్టబోతున్నామని ఆర్జీవీ ప్రకటించారు. ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళన నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, జగన్ భార్య వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనుంది. రామదూత బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ అయినట్టు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ సినిమాను డిసెంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అంతేకాదు ఇది బాడ్ పీపుల్ కి బాడ్ న్యూస్ అంటూ ఆయన పేర్కొనడం హాట్ టాపిక్ అయింది.