బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, ఒడిశా లాంటి ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.. అయితే, తాజాగా, ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు / శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉందన్న ఆయన.. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు.. దీని ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు అంటే ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు..
మరో రెండు పథకాల అమలు.. బడ్జెట్‌లో నిధుల కేటాయింపు..
మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాం అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు.. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు.. వ్యవస్థలను ధ్వంసం చేసి పరిపాలన అస్తవ్యస్తం చేసింది.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు చిన్నాభిన్నం చేసింది.. గత వైసీపీ సర్కారు 1.35 లక్షల కోట్ల మేర బకాయిలు పెట్టి వెళ్లిపోయింది అని ఫైర్ అయ్యారు.. అయితే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృష్టి చేస్తోందన్నారు.. సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్న ఆయన.. పింఛన్లను 3 వేల నుంచి 4 వేలకు పెంచాం.. ఉచిత గ్యాస్ హామీ అమలులో భాగంగా 840 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాం.. మరో రెండు పథకాల అమలు కోసం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించామని వివరించారు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.
ఏపీ బడ్జెట్ 2024-25.. మాజీ ఆర్థిక మంత్రి సెటైర్లు..
ఏపీ ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో 2024-25కి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.. రూ. 2,94,427.25 కోట్లతో కూడిన వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ ముందు పెట్టారు.. అయితే, వైసీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఏపీ బడ్జెట్‌పై సెటైర్లు వేశారు.. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందన్న ఆయన.. ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల వరకు బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు.. ఏపీ ప్రజలకు బడ్జెట్ గండికోట రహస్యంగా మారిందని దుయ్యబట్టారు.. వైసీపీ 2019లో ప్రభుత్వం వచ్చిన సమయంలో నెల వ్యవధిలో బడ్జెట్ ప్రవేశ పెట్టాం.. కానీ, భారీ మ్యాండెట్ ప్రజలు ఇస్తే ప్రభుత్వం నెగెటివ్ తీరుతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది.. గత ప్రభుత్వం కంటే 41 వేల కోట్లు అధికంగా బడ్జెట్ ప్రవేశ పెట్టారు.. కేంద్రం నుంచి వచ్చే 15 వేల కోట్లు గ్రాంటా అప్పో క్లారిటీ లేదు.. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పన్ను ఆదాయం తగ్గుతోంది.. పన్ను ఆదాయం మైనస్ లో ఉంటే పన్ను ఆదాయం పెరుగుతోంది అని ఎలా చెబుతారు? అసలు సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు ఎక్కడా జరపలేదన్నారు..
జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు.. డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వరుసగా పలువురు నేతలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.. ఇప్పటికే పలువురు కీలక నేతలు, ప్రజాప్రతినిధులు.. టీడీపీ, జనసేన, బీజేపీ గూటికి చేరారు.. ఇక, ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు.. జనసేన కండువా కప్పుకున్నారు.. విజయవాడ సిటీ నుంచి పలువురు కార్పొరేటర్లు , జగ్గయ్య పేట, ధర్మవరం, అనంతపురం ప్రాంతాల నుండి వైసీపీకి గుడ్‌బై చెప్పి వచ్చిన నేతలు.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక, ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ మాత్రం ఆశ లేని పరిస్థితిలో రాజకీయాలకు వచ్చాం.. అధికారం ఉంటుందని, ఆశతో పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు. సిద్ధాంతాల కోసం పనిచేసే నాయకులంతా కలిసి, రాష్ట్రానికి అండగా నిలబడాలని పార్టీ పెట్టామన్న పవన్.. కష్టాల కొలిమిలో కలసి నడిచాం.. పార్టీని పూర్తిస్థాయిలో నిర్మించడానికి, దశాబ్ద కాలం పట్టిందన్నారు.. ఇప్పుడు ఏ పార్టీ నుండి మీరు వచ్చినా, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి నడవాలని సూచించారు.. ఈ రోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టామన్నారు.. రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి ఉన్న పాలన అనుభవానికి తోడు జనసేన రాజకీయ శక్తి చేదోడువాదడుగా ఉంటుందని పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ.. 15 శాతం వృద్ధి రేటు టార్గెట్..
స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. అవకాశాల కల్పనతో సంపద సృష్టిస్తామన్నారు.. విజన్-2047 లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలతో మేధోమథనం నిర్వహించారు సీఎం చంద్రబాబు.. రానున్న రోజుల్లో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేసి ఫలితాలు సాధించాలని సూచించారు.. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 13.5 శాతం వృద్ధి రేటు సాధించాం.. ఇప్పుడు 15 శాతం వృద్ధి రేటు సాధిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047పై సచివాలయంలో పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది.. టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండగా.. కో ఛైర్మన్ గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఉన్నారు.. ఇక, సచివాలయంలో జరిగిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, సీఐఐ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు.. అయితే, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని టాటా గ్రూప్, ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు..
తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు..
తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసులు కార్యదర్శిగా స్మిత సబర్వాల్‌ను నియమించారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో స్మిత సబర్వాల్ కొనసాగనున్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా శ్రీధర్.. దేవాదాయ శాఖ కమిషనర్‌గా శ్రీధర్‌కే అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళ, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబరితి, రవాణా శాఖ కమిషనర్‌గా కే.సురేంద్ర మోహన్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్, ట్రాన్స్ కో సీఎండీగా కృష్ణ భాస్కర్, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కూడా కృష్ణ భాస్కర్ కొనసాగనున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా శివశంకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా సృజన, లేబర్ కమిషనర్‌గా సంజయ్‌కుమార్, జీఏడీ కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, ఆయుష్ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి నియామకం అయ్యారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖలో పలువురు ఐఎఫ్‌ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 8 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
అందరినీ సమాన స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తాం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పాలన యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాంక్షిత జిల్లాలు, మండలాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు చేరడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అని బండి సంజయ్ తెలిపారు. అభివృద్ధి కాని ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయాలి.. అభివృద్ధి అయిన ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలన్నారు. దేశంలో 112 వెనుకబడిన జిల్లాలను, దేశవ్యాప్తంగా 500 మండలాలను నీతి అయోగ్ గుర్తించిందని తెలిపారు. ప్రజలందరినీ సమాన స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తామని కేంద్రమంత్రి పేర్కొ్న్నారు. మరోవైపు.. జిల్లాలో సంపూర్ణత అభియాన్ విజయవంతంగా సాగుతుందని బండి సంజయ్ చెప్పారు. అనంతరం మహముత్తారం మండలంలో పర్యటించారు. సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రదర్శనను తిలకించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఫలాలు అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మోడీ ప్రభుత్వం పేదల కోసం కష్టపడి పనిచేస్తుంది.. పీఎం మోడి ఆదేశాలతో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నానని అన్నారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటివరకు అభివృద్ధి నోచుకోని గ్రామాలు ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. సంపూర్ణత అభియాన్ కింద దేశవ్యాప్తంగా 500 మండలాలు ఎంపిక చేశామని.. రాష్ట్రంలో 10 బ్లాక్ లు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పథకం కింద మహాముత్తారం మండలం ఎంపికైందన్నారు.
ఇప్పుడే ఢిల్లీలో అడుగు పెట్టా.. అప్పుడే వణికిపోతే ఎలా..?
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా అక్కడికి చేరుకోగానే కేటీఆర్ ‘X’లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ‘ఇప్పుడే ఢిల్లీలో అడుగు పెట్టా.. హైదరాబాద్‌లో అప్పుడే వణికిపోతే ఎలా?.. హైదరాబాద్‌లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి’. అని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు.. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయింలో విమర్శలు చేస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి కేసులు విత్ డ్రా చేసుకునేందుకు ఢిల్లీ వెళ్ళారా.. మీ తప్పులు మాఫీ చేయించుకునేందుకు బీజేపీ నేతలను కలవడానికి ఢిల్లీ వెళ్లారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రైతన్నలను కాంగ్రెస్ సర్కార్ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది
రైతుకు ఎక్కడ కష్టం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జాతీయ రహదారిపై మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు. ‘‘రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. దేశంలో ఎప్పుడూ కూడా చేయని పని.. ఒక్కసారి ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రుణమాఫీ చేశాం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేము రుణమాఫీ చేశాం. ఇప్పటికే రైతు ఖాతాల్లోకి 32 వేల కోట్లు వేశాం. పంట నష్టపోయిన రైతు ఖాతాలోకి 10 వేల రూపాయలు వెళ్తున్నాయి. 10 వేల రూపాయలు వేయడం కారణంగా రైతుకు మేలు జరగడం లేదు కాబట్టి రైతుకి రైతు పంటకి బీమా మేమే కల్పిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో మేము చేసినట్లుగా రైతులకు ఏ రాష్ట్రం చేయడం లేదు. రైతులకు ఏ మేలు చేయని వారు రైతుల దగ్గర సానుభూతి పొందేందుకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.’’ అని తుమ్మల ధ్వజమెత్తారు.
ప్రియాంక గాంధీకి సవాల్ విసిరిన రాహుల్.. మరి నెరవేర్చగలదా?
కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన చెల్లెలు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీకు సవాల్ విసిరారు. ప్రియాంక గాంధీ ఎంపీ అభ్యర్థి అని ఆయన అంటూనే.. ఆమె నా చెల్లెలు కూడా కాబట్టి, ఆమెపై వాయనాడ్ ప్రజలకు ఫిర్యాదు చేసే హక్కు నాకుంది. వయనాడ్‌కు నా హృదయంలో చాలా పెద్ద స్థానం ఉందని రాహుల్ అన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా సహాయం చేస్తానని అన్నారు. ఈ సందర్బంగా.. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకు ‘సవాల్’ విసిరాడు. వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నా సోదరిని కూడా సవాలు చేయాలనుకుంటున్నానని కాంగ్రెస్ రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు కేరళ గురించి ఆలోచించినప్పుడు, మొదటి గమ్యం వాయనాడ్ అయి ఉండాలి. ఇది వాయనాడ్ ప్రజలకు, దాని ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. అలాగే జులైలో కేరళ జిల్లా కొండచరియలు విరిగిపడి వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్న రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవాలని నిర్ణయించుకోవడంతో వయనాడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. తొలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రియాంక గాంధీ వాద్రా సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌తో తలపడనున్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ “సాహిబా” ప్రోమో రిలీజ్
వరల్డ్ వైడ్ గా ఛాట్ బస్టర్స్ లో నిలిచిన “హీరియే” సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ జోష్ తో కాస్త గ్యాప్ తర్వాత టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ తన కొత్త సాంగ్ “సాహిబా”తో మరోసారి మ్యూజిక్ లవర్స్ ముందుకు రాబోతున్నారు. “హీరియే” పాటలో, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మెరవగా. ఇప్పుడు రాబోతున్న “సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ లో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించారు. విజయ్ కు జోడీగా రాధిక మదన్ కనిపించనున్నారు. వీరు ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. “సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ కు సుధాంశు సరియా దర్శకత్వం వహించారు. తన సరికొత్త సంగీత శైలి, భావోద్వేగాలతో “సాహిబా” పాటను శ్రోతల ముందుకు తీసుకురాబోతున్నారు జస్లీన్ రాయల్. ఈ పాట చిరకాలం మ్యూజిక్ లవర్స్ మనసుల్లో నిలిచిపోయేలా రూపొందించారు. ఈ రోజు మేకర్స్ “సాహిబా” ప్రోమోని విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్ గా కనిపించారు. విజయ్, రాధిక మదన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. “సాహిబా” కంప్లీట్ మ్యూజిక్ వీడియో ఈ నెల 15న విడుదల కానుంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ కోసం అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు సంగీత ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్నసాహిబా ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.
ఫ్యాన్స్ కోసం సన్నీ లియోన్ వచ్చేస్తోంది..
సన్నీ లియోన్ తెలుగు ప్రేక్షకులనకు పరిచయం చేయనక్కర్లేని పేరు. గతంలో కరెంట్ తీగ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సన్నీ తన నటనతో ఆకట్టుకుంది. ఆ మధ్య మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇది వరకు కామెడీ, హారర్ ఇలా అన్ని జానర్లతో ఆడియెన్స్ అలరించింది. మరోసారి సన్నీ లియోన్ తెలుగు ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు ‘మందిర’ అంటూ రాబోతోన్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ‘మందిర’ చిత్రాన్ని కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మించారు. ఈ మూవీకి ఆర్ యువన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే మందిర సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 22న మందిర చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఇకపై మందిర టీం ప్రమోషన్స్‌తో సినిమా మీద మరింత హైప్ పెంచేందుకు సిద్దం అవుతోంది. ఈ చిత్రానికి జావెద్ రియాజ్ సంగీతం అందించారు. దీపక్ డి. మీనన్ కెమెరామెన్‌గా పని చేశారు. తమిళ నటుడు యోగిబాబు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. హారర్ కామెడీ అంశాలతో అందరినీ ఆకట్టుకునేలా వస్తున్న ఈ సినిమాలో సన్నీ లియోనీ యువరాణిగా నటించారు.
రెబెల్ స్టార్ ప్రభాస్ సినీ ప్రయాణానికి 22 ఏళ్లు
తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన నట ప్రస్థానం నేటికి 22 ఏళ్లకు చేరుకుంది. 2002, నవంబర్ 11న ప్రభాస్ మొదటి సినిమా “ఈశ్వర్” ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి చిత్రమే ఘన విజయం సాధించి ప్రభాస్ అప్రతిహత నట ప్రస్థానానికి పునాది వేసింది. ఈశ్వర్ లో ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ప్రభాస్ ను చూసి ఫ్యూచర్ స్టార్ అని అప్పుడే డిక్లేర్ చేశారు. వారి అంచనాలు మించేలా స్టార్ గా ప్రపంచ ఖ్యాతిని దక్కించుకుంటున్నారు ప్రభాస్. ‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’ ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘రెబల్’, ‘మిర్చి’ వరకు ప్రభాస్ జర్నీ ఒక ఫేజ్ అయితే బాహుబలితో ఆయన పాన్ ఇండియా జర్నీ బిగిన్ అయ్యింది. బాహుబలి రెండు చిత్రాల తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. ప్రభాస్ రెండు సార్లు(బాహుబలి 2, కల్కి 2898 ఎడి) వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలను ఖాతాలో వేసుకోవడం ఒక రేర్ రికార్డ్. ఓవర్‌సీస్ మార్కెట్‌లో పది మిలియన్లకుపైగా వసూళ్లను సాధించిన తొలి హీరోగా ప్రభాస్ నిలిచారు.