ఐదో రోజుకు చేరిన కోటి దీపోత్సవం.. ఇల కైలాసంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే
భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా కోటి దీపోత్సవం విజయవంతంగా సాగుతోంది.. కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు.. అదే ఒకే చోట.. ఓ వెలుగుల ఉత్సవం జరిగితే.. వేలాది మంది ఒకేచోట చేరి.. దీపాలు వెలిగిస్తే.. అది దీపయజ్ఞం అవుతుంది.. అదే ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం అవుతుంది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఇల కైలాసంగా మారిపోయింది.. ఇప్పటికే ఐదు రోజుల పాటు నిర్వహించిన విశేష కార్యక్రమాలు కలుపండుగా సాగాయి..
ఐదో రోజు కోటి దీప యజ్ఞం వేదికగా సాగే వివేష కార్యక్రమాలు ఇవే..
* సర్వ శుభదాయకం భక్తులచే స్వయంగా నృసింహ స్వామి విగ్రహాలకు రక్షా కంకణ పూజ
* వీక్షించిన జన్మధన్యం సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ కల్యాణం
* శేషవాహనంపై సింహాద్రిఅప్పన్న దర్శనభాగ్యం
* సకల సౌభాగ్యాలను ప్రసాదించే కాంచీపుర కామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవార్ల అనుగ్రహం
* కర్ణాటక హల్దీపుర మఠం శ్రీవామనాశ్రమం స్వామి అనుగ్రహభాషణం
* బృందావనం ఆనంద్‌ధామ్ శ్రీస్వామి రితీశ్వర్‌ఆశీర్వచనం
* శ్రీమతి అరుణాచల మాధవి ప్రవచనామృతం
* కోటి దీపాల వెలుగులు
* సప్తహారతుల కాంతులు
* స్వర్ణ లింగోద్భవ వైభవం
* మహాదేవునికి మహానీరాజనం
మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ భారీగా పెరిగిన మద్యం ధరలు..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి మద్యం ధరలు పెరిగిపోయాయి.. క్వార్టర్ సీసాపై ఏకంగా ఒకేసారి రూ.10 వడ్డించారు.. ఫారిన్ లిక్కర్ పై కూడా వడ్డించింది ప్రభుత్వం.. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ధరలు, మద్యం బ్రాండ్లపై ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.. ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా మద్యం ధరలు ఉన్నాయని మందు బాబులతో పాటు విపక్షాలు కూడా.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిన్న పరిస్థితి ఉండగా.. ఇప్పుడు మరోసారి లిక్కర్ ప్రైజ్ పెంచేసింది ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు శుక్రవారం రోజు ఉత్తర్వులు జారీ చేసింది.. పన్నుల సవరణ పేరిట పెంచిన తాజా ధరలతో క్వార్టర్ సీసాపై రూ.10, ఫుల్ బాటిల్‌పై రూ.20 వరకు ధరలు పెరిగిపోయాయి.. మద్యంపై విధించే అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్‌ఈటీ)ను రూపాయల నుంచి శాతాల్లోకి మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఎక్సైజ్ శాఖ.. ప్రస్తుతం ఏఆర్‌ఈటీ శ్లాబుల ఆధారంగా రూపాయల్లో ఉన్నందున అన్ని బ్రాండ్లపై పన్నులు సమానంగా లేవని, అన్నీ ఒకేలా ఉండటం కోసం నిర్ణీత ధర నుంచి ఏఆర్‌ఈటీని శాతాల్లోకి మార్చాల్సిన అవసరం ఉందంటూ ఏపీఎస్‌డీసీఎల్ ప్రతిపాదనలు పంపగా.. వాటికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.. దీంతో.. సవరణలు చేస్తూ ఏపీ ఎస్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. ఐఎంఎఫ్‌ఎల్ కనీస ధర రూ.2,500లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2,500 దాటితే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్‌పై 200 శాతం, ఫారిన్ లిక్కర్‌పై 75 శాతం ఏఆర్‌ఈటీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఎక్సైజ్ శాఖ.. ఈ సవరణ ఫలితంగా మరోసారి మద్యం ధరలు పెరిగాయి.. ఒక బ్రాండ్ ఫుల్ బాటిల్ ప్రస్తుతం రూ.570 ఉంటే.. అది రూ.590కి చేరింది.. అదే క్వార్టర్ రూ.200 నుంచి రూ.210కి పెరిగింది.. అయితే, ఈ పెరుగుదల కొన్ని బ్రాండ్లకు పరిమితం అయ్యింది.. ఈ సవరణ తర్వాత కొన్ని రకాల బ్రాండ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు.. ఫారిన్ లిక్కర్ సరఫరాదారులకు ఇచ్చే ధరను పెంచింది ఎక్సైజ్ శాఖ.. చాలాకాలంగా ఫారిన్ లిక్కర్‌పై ధరలు సవరించలేదని, పెరుగుతున్న రవాణా, ఇతర ఖర్చుల నేపథ్యంలో ధరలు పెంచాల్సిన అవసరం వచ్చిందని.. సరఫరాదారులకు ఇచ్చే ధరను 20 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏఈ ఎక్సైజ్ శాఖ.
ఇవాళ సిద్ధిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకో రెండు వారాలే సమయం ఉండటంతో ప్రధాన పార్టీలు అన్ని జోరు పెంచాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో మరింత స్పీడ్ పెంచింది. నియోజక వర్గాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సుడిగాలి పర్యటనలతో రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు సీఎం కేసీఆర్ చేర్యాలలో పర్యటించబోతున్నారు. అక్కడ గులాబీ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొంటారు. ఇక, ఇవాళ సీఎం కేసీఆర్ కేవలం ఒకే ఒక సభలో పాల్గొంటారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. మరోవైపు ప్రతి సభలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. ఓటు ప్రజల చేతిలో ఉండే ఆయుధం.. ఐదేళ్ల తమ భవిష్యత్ తమ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు. మరోవైపు బీజేపీపైనా పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు.
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. శంషాబాద్ నుంచి మరో 4 ఫ్లైట్ సర్వీసులు
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం అనేక దేశాలకు విమానాలను అందిస్తోంది. దేశంలోని అనేక ప్రధాన నగరాలకు దేశీయ విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ను ప్రారంభించారు. కాగా, విమాన ప్రయాణికులకు ఆర్జీఐఏ అధికారులు మరో శుభవార్త అందించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మరో నాలుగు విమాన సర్వీసులను అందించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సహకారంతో ఈ విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. కొచ్చి, గ్వాలియర్, అమృత్‌సర్ మరియు లక్నోలకు కనెక్షన్లు ఉంటాయి. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం నుంచి అమృత్‌సర్, లక్నో, కొచ్చిలకు సర్వీసులు ప్రారంభించినట్లు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పణిక్కర్ తెలిపారు. గ్వాలియర్ నవంబర్ 28 నుండి ప్రారంభమవుతుంది. మెరుగైన ప్రయాణ సౌకర్యాల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. అమృత్‌సర్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రతిరోజూ ఉదయం 7.30 గంటలకు శంషాబాద్ నుండి బయలుదేరి 10.15 గంటలకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. కొచ్చికి వెళ్లే విమానం ప్రతిరోజూ రాత్రి 7.45 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 9.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. శంషాబాద్-లక్నో మధ్య వారానికి ఆరు సర్వీసులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి 4.35 గంటలకు లక్నో చేరుకుంటుంది. శంషాబాద్-గ్వాలియర్ మధ్య వారానికోసారి మూడు సర్వీసులు ఉంటాయని తెలిపారు. ఇది శంషాబాద్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి 4.20 గంటలకు గ్వాలియర్ చేరుకుంటుంది.
రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రియాంక గాంధీ పర్యటన
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రేపు తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ పర్యటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపు ఏఐసీసీ ప్రియాంకగాంధీ రానున్నారు. ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రియాంక గాంధీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రియాంకగాంధీ జిల్లా కేంద్రానికి రానున్నారని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఎదుట నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి షానాయక్ శుక్రవారం సమావేశ మందిరంలో ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ.. బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిన్న (శుక్రవారం) తెలంగాణ చేరుకున్న విషయం తెలిసిందే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాహుల్ గాంధీ రోడ్ షోలో మాట్లాడుతూ.. చాలా దూరం నుంచి చాలా మంది నన్ను చూడడానికి వచ్చారు అని అన్నారు. తెలంగాణ రాజకీయ సంబంధం కాదు రక్త సంబంధం జవహర్ లాల్.. ఇందిర గాంధీ, రాజీవ్ సోనియా గాంధీతో మీకు సంబంధాలు ఉన్నాయి.. కాంగ్రెస్ రాష్ట్రానికి ఏమి చేసిందో నేను చెబుతాను కేసీఆర్.. మీరు చదివిన స్కూల్ కాంగ్రెస్ పార్టీదే నడిచే రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ యువ శక్తితో కాంగ్రెస్ కట్టింది.. 10 ఏళ్లుగా తెలంగాణనీ దోచారు దానికి అంతం పలికే రోజు వచ్చింది అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక ఈ నెల 21 నుంచి నాలుగైదు సభల్లో పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ రెండు సమావేశాలకు ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
రేపే వరల్డ్ కప్ ఫైనల్.. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు
రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్‌లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌ను ప్రజలు ఒకే చోట వీక్షించేలా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.గోపీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. 2 లక్షల మంది మ్యాచ్ చూసేలా ఈ స్ర్కీన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ప్రవేశం పూర్తిగా ఫ్రీ అని చెప్పుకొచ్చారు. ఈ బిగ్ స్ర్కీన్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు మొత్తం అసోసియేషన్ భరిస్తోందని గోపీనాథ్ రెడ్డి తెలిపారు. సీఎం జగన్ సహకారంతో ఏసీఏ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం విశాఖ, కడప, విజయవాడలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్లకు మంచి స్పందన రావడంతో ఫైనల్ మ్యాచ్ కోసం ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటుకు నిర్ణయించామని ఏసీఏ కార్యదర్శి గోపినాథ్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఇక, మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్లు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఓటర్లను ఆకర్షించేందుకు నియోజకవర్గాల్లో ఆయా పార్టీల లీడర్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మైదనాల్లో బిగ్ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ క్రికెట్ ఈవెంట్లకు భారీ స్పందన రావడంతో ఈ ఫైనల్ మ్యాచ్ కు పెద్ద స్ర్కీన్లను తయారు చేస్తున్నారు. ఇక, ఈ సారి వినోదాన్ని మరింత పంచేందుకు సౌండ్ బాక్సులు, లైటింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు.
సూపర్ స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే..రూ.7 లక్షలకు పైగా రాబడి..
ఈరోజుల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పడం కష్టమే అందుకే జనాలు తాము సంపాదించే కొంతభాగం పొదుపు చెయ్యాలని అనుకుంటారు.. ఈ మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉంటారు. ఇందులో భాగంగా సెక్యూరిటీతో పాటు, మంచి వడ్డీ రావాలని కోరుకుంటారు.. ఇలాంటి వారికోసమే పోస్టాఫీసులో అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది.. ఆ స్కీమ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా సేవింగ్స్‌పై 7.5 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ క్రమంలోనే గత ఏప్రిలోలో వడ్డీ రేట్లలో మార్పులు జరిగాయి. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ప్రభుత్వం సవరిస్తుంటుంది.. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి 7.5 శాతం వడ్డీ వస్తుంది.. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, 5 ఏళ్లు పాటు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ఒక ఏడాదిపాటు పెట్టుబడి పెడితే 6.9 శాతం వడ్డీ పొందొచ్చు. లేదా 2 నుంచి మూడేళ్లు పెట్టుబడి పెడితే 7 శాతం వడ్డీ పొందొచ్చు. ఇకపోతే ఒకవేళ 5 ఏళ్లు పెట్టుడితే గరిష్టంగా 7.5 శాతం వడ్డీని పొందొచ్చు..
పది అర్హతతో ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు.. 17,710 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. దానికోసం దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 18వేల ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. ఇందుకు అప్లికేషన్ గడువు మరో పది రోజుల్లో ముగియనుంది.. ఈ ఉద్యోగాల అర్హతలను చూద్దాం.. ఈఎస్‌ఐసీ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 17,710 ఖాళీలను భర్తీ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, హెడ్ క్లర్క్/అసిస్టెంట్, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/మేనేజర్ గ్రేట్ II/సూపర్‌ఇన్‌టెండెంట్ వంటి పోస్టులకు నియామక ప్రక్రియ జరగనుంది.. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు పాసై ఉండాలి. అప్పర్, లోయర్, హెడ్ క్లర్క్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలకు అయితే, అభ్యర్థుల వయసు 30 ఏళ్లలోపు ఉండాలి.. ఒక్కో పోస్టుకు ఒక్కో జీతం ఉంది.. క్లర్క్‌కు జీతం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100.. అప్పర్ డివిజన్ క్లర్క్‌కు రూ.19,900 నుంచి రూ.63,200.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు రూ.18,000 – రూ.56,900, హెడ్ క్లర్క్ రూ.35,400- రూ.1,12,400, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ కు రూ.44,900-రూ.1,42,400 మధ్య ఉంటుంది..
ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన విక్కీ కౌశల్ ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ ‘..
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..విక్కీ కౌశల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.విక్కీ కౌశల్ ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’, మసాన్ , సర్దార్ ఉద్దమ్ వంటి చిత్రాల లో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . ఇక విక్కీ కౌశల్ నటించిన ఉరి సినిమా తెలుగు లో కూడా డబ్ అయి ఇక్కడ కూడా అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్ గా విక్కీ నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. గత ఏడాది విక్కీ కౌశల్ ప్రాధాన పాత్ర లో నటించిన ‘సర్దార్ ఉద్దం’ నేరుగా ఓటీటీ లో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఇదిలా ఉంటే విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’.మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 22 వ తేదీ న ప్రపంచవ్యాప్తం గా ఈ సినిమా విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో కి వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఇక యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించగా.. ధూమ్ త్రీ, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రాల ఫేమ్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ లో యశ్పాల్ శర్మ, వేదాంత సిన్హా, మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా, సదియా సిద్ధిఖీ, అల్కా అమీన్, సృష్టి దీక్షిత్ మరియు భువన్ అరోరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో 50 వ చిత్రం గా తెరకెక్కింది..