నేడు ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం.. రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు
సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశాన్ని చుట్టేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు.. తూర్పు గోదావరి జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో ప్రధాని ప్రచారం కొనసాగనుంది.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి రానున్నారు ప్రధాని మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో దిగి నేరుగా సభ వేదిక వద్దకు వెళ్లనున్నారు.. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం విశాఖ జిల్లా అనకాపల్లి బయలుదేరి వెళ్తారు.. ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.. భారీగా జన సమీకరణ కోసం ఎన్డీఏ కూటమి పార్టీలు కసరత్తు చేస్తోంది.. ఇక, అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం దగ్గర కూటమి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది.. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కూడా ఈ సభల్లో పాల్గొననున్నారు. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. రాజమండ్రి, చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు, ఇతర రాష్ట్ర, జిల్లాల నుండి వచ్చే, పోయే వాహనాలకు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.. కడియం మండలం వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలు విధించారు.. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ క్రింది విధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వేరే రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉండనున్నాయి..
సీఎం జగన్ సుడిగాలి పర్యటన.. నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. తన ప్రచారంలో మరింత దూకుడు పెంచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ మధ్య వరుసగా రోజు మూడు సభల్లో పాల్గొంటున్న ఆయన.. నిన్న (ఆదివారం) తన ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు.. అయితే, ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు.. నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన కొనసాగనుంది.. వరుసగా ఉమ్మడి జిల్లాలో, రెండు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం బహిరంగ సభల్లో పాల్గొననున్నారు సీఎం జగన్.. ఉదయం 10 గంటలకు బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న సీఎం.. బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని రేపల్లెలో ఉన్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహం సెంటర్‌లో ఈ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు పల్లాడు జిల్లా మాచర్లలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని మాచర్లలో ఉన్న శ్రీనివాస్ మహల్ సెంటర్‌లో ఈ సభ జరగనుంది.. ఆ తర్వాత.. కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లనున్నా సీఎం జగన్.. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.
మెగా హీరోపై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగిన పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారానికి కదలివస్తున్నారు మెగా హీరోలు.. జనసేనాని గెలుపు కోసం తమ వంతు సాయం చేస్తున్నారు.. అయితే, సినీ నటుడు, పవన్ కల్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌పై దాడికి యత్నించిన ఘటన కలకలం రేపుతోంది.. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ప్రచారంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్‌పై కూల్ డ్రింక్ బాటిల్ విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు.. అయితే, సాయి ధరమ్ తేజ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.. కానీ, పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్‌కు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయ్యాయింది.. కంటి పై భాగంలో బాటిల్ బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఇక, హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ.. గాయపడిన శ్రీధర్ ని పరామర్శించి.. ఘటన ఏ విధంగా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. అంతకుముందు సాయి ధరమ్ తేజ్ రోడ్ షో.. తాటిపర్తి నుంచి చిన్న జగ్గంపేట వెళ్తుండగా.. వైసీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. బాణసంచా కాలుస్తూ హడావిడి చేయడంతో.. ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగినట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనకు సాయి ధరమ్ తేజ్‌పై దాడి యత్నానికి ఏదైనా లింక్ ఉందా? అనేది తెలియాల్సి ఉంది.
వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుపై దాడి.. ఏలూరులో టెన్షన్.. టెన్షన్..!
ఏలూరు జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ- టీడీపీ కార్యకర్తలు కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్.. ముసునూరు మండలానికి వెళ్తున్న క్రమంలో టీడీపీ నాయకుల అదే మార్గంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అటుగా వస్తున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ కారును అడిగించి పలువురు కార్యకర్తలు.. దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. రంగాపురం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, సొంగ రోషన్, చింతమనేని ప్రభాకర్ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశంలో హాజరైన వారి వర్గీయులే ఈ దాడికి పాల్పడినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. ఈ ఘటనపై స్పందించిన ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్. కూటమి కమ్మ ఆత్మీయ సమావేశానికి వచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులు నాపై దాడి చేశారని ఆరోపించారు. నా కారుపై దాడి చేసి, రెండు కార్లపై కర్రలతో అద్దాలు ధ్వంసం చేశారు.. అక్కడ ఎదురు తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అక్కడినుండి వెళ్లిపోయా.. అధికారంలో లేకపోతేనే ఇంతటి అరాచకానికి తెగబడుతున్నారు అని ఫైర్ అయ్యారు. హుందాగా రాజకీయాలు చేయాలి.. కానీ, మా సహనాన్ని పరీక్షిస్తే, మేం తలచుకుంటే ఇంట్లోంచి అడుగు కూడా బయటపెట్టలేరని వార్నింగ్ ఇచ్చారు. ఓడిపోతున్నాం అన్న భయంతోనే మా పై దాడులకు పాల్పడుతున్నారు.. దెందులూరు నియోజకవర్గంలో అయితే రోజూ అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్.
నేడు అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్ లో సీఎం పర్యటన
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ కీలక నేతలంతా ప్రచారంలో బిజీ బిజీ అయ్యారు. రాష్ట్రంలోని మెజారిటీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను పీసీసీ ప్రకటించింది. నేటి నుంచి 10వ తేదీ వరకు ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీంపట్నం రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రచారం చేస్తారు.
రాగల 5 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు..
తెలంగాణలో భానుడు మండిపోతుంది. అయితే.. ఈ వేడికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలకు చల్లని కబురు అందించింది. రాగల ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. దీంతో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా.. కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నిన్న (ఆదివారం) ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ఎండ వేడిమి నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసాయి. కొన్ని చోట్ల గాలి వేగంతో ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇవాళ (సోమవారం) భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగళ్ల వాన కురుస్తుందని హెచ్చరించింది. రేపు (మంగళవారం) సిద్దిపేట, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
రోజుకు 80 వేల మందికే శబరిమల అయ్యప్ప దర్శన భాగ్యం
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్‌లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. శబరిమలకు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మే 4వ తేదీన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం చెప్పుకొచ్చింది. రోజుకు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా అయ్యప్ప దర్శనానికి 80 వేల మందిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. గతంలో ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం 10 రోజుల ముందు వరకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు దానిని మూడు నెలల ముందు వరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం పెంచినట్లు ప్రకటించింది. మరోవైపు, తిరువాభరణం ఊరేగింపు, మకరవిళక్కు టైంలో ఆన్‌లైన్ బుకింగ్‌ను అనుమతించాలా? వద్దా? అనే విషయమై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు.
సినీ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య విమర్శలు
సినీ నటి, బీజేపీ మండి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ పై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య మరోసారి ఫైర్ అయ్యారు. కంగనా రనౌత్ కేవలం ఎన్నికల కోసం దిగుమతి చేసుకున్న నాయకురాలని విక్రమాధిత్య సింగ్ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఆమె మండి నియోజక వర్గంలో ఎలాగో ఓడిపోతుందని.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అన్ని ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మండి నియోజకవర్గంలో అయితే రాష్ట్రానికి దిగుమతి చేయబడిన కంగానా రనౌత్ ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. మండిలో ప్రతి రోజు రాత్రి పగలు పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందన్నారు.
పెళ్లికి ముందు వైద్య పరీక్షలు.. పురుషుడిగా తేలిన మహిళ
చైనాలోని హుబీ ప్రావిన్స్ లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కడుపులో వృషణాలు ఉన్నాయని వైద్య పరీక్షల్లో తేలింది. వివరాల్లోకి వెళితే.. చైనాలోని హుబీ ప్రావిన్స్ కు చెందిన ఓ యువతి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. కొన్ని రోజుల్లోనే తన వివాహం ఉండగా.. తన పొట్టలో వృషణాలున్నాయని తేలడంతో కంగుతింది. పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించారు. అయితే. ఆ యువతి పుట్టుకతో వచ్చే అడ్రినల్ గ్రంథి వ్యాధితో బాధ పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. 18 ఏళ్ల వయసప్పుడు అసాధారణ హార్మోన్లు ఉన్నాయని తేలగా.. ఆమె యవ్వనంలో అడుగు పెట్టినప్పటి నుంచి స్తనాల పెరుగుదల సరిగ్గా లేదని నిర్ధారించారు. దీంతో ఆమెకు క్రోమోజోముల పరీక్ష చేయించాలని వైద్యులు సూచించారు. అయితే యువతి తల్లిదండ్రులు దాని పెడచెవిన పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ లో పెండ్లి కి ముందు వైద్య పరీక్షలు చేయించగా.. తమ కూతురు పురుషుడన్న విషయం వారికి తెలిసి వచ్చింది. దీంతో వాళ్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆఫరేషన్ ద్వారా వృషణాలను తొలగించారు వైద్యులు.
నేడు ముంబైతో సన్రైజర్స్ ఢీ.. 300 స్కోర్పై కన్నేసిన ఎస్ఆర్హెచ్
ఐపీఎల్ లో ఇవాళ ( సోమవారం ) ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడబోతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది. అయితే, ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న హైదరాబాద్ టీమ్ 300 పరుగుల స్కోర్ పై కన్నేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసిన్, నితీశ్ కుమార్ రెడ్డి, భీకర ఫామ్ లో ఉండటంతో ఎస్ఆర్హెచ్ కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. మరోవైపు, వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ డీలా పడింది. 11 మ్యాచ్ ల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అలాగే, ఎస్ఆర్హెచ్ 10 మ్యాచ్ లలో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదవ ర్యాంక్ లో కొనసాగుతుంది. కాగా, ముంబై ఇండియన్స్ జట్టులో బ్యాటింగ్ లో నిలకడ కనిపించడం లేదు. సూర్యకుమార్ కేకేఆర్ పై అర్ధ సెంచరీ తర్వాత మళ్లీ పెద్దగా రాణించలేదు. ఎంఐ క్యాప్టెన్ హార్థిక్ పాండ్యా అటు బౌలింగ్ లో ఇటు బ్యాంటింగ్ లో వరుసగా విఫలమవుతున్నాడు.. దీంతో విమర్శకుల నోటికి పని చెబుతున్నారు. అయితే, జట్టులో కేవలం రోహిత్ శర్మ, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, టీమ్ డెవిడ్ ఇలా దూకుడైన బ్యాటింగ్ తో రాణించడంలో జట్టు భారీ స్కోర్ చేస్తుంది. కానీ, ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం అని క్రీడా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
అప్పుడు చేజారిన అవకాశం..ఇన్నాళ్లకు మళ్ళీ వచ్చింది..
టాలీవుడ్ యంగ్ బ్యూటీ “ప్రగ్యా జైస్వాల్”.గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన “కంచె” సినిమాతో ఈ భామ హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమాలో ప్రగ్యా తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది.కంచె సినిమా మంచి విజయం సాధించడంతో ఈ భామకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి .కానీ ఈ భామ కెరీర్ కు ఆ సినిమాలేవీ అంతగా ఉపయోగ పడలేదు .ఇదిలా ఉంటే నందమూరి నటసింహం బాలకృష్ణ ,బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిచింది.అఖండ సినిమాలో ప్రగ్యా తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది .ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ప్రగ్యాకు వరుస ఆఫర్స్ వస్తాయని అంత భావించారు కానీ అలా జరగలేదు. అయితే త్వరలో అఖండ సీక్వెల్ కూడా రాబోతుంది .ఆ సినిమాలో మరోసారి ప్రగ్యా బాలయ్య సరసన మరోసారి నటించనుంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగ్యా ఆసక్తికర విషయాలు తెలిపింది. ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే నటించే అవకాశం లభించిందని ప్రగ్యా జైస్వాల్ తెలిపింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘ఖేల్ ఖేల్ మే’లో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ‘2014లో అక్షయ్ సర్ ప్రధాన పాత్రలో తెలుగు దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ చిత్రానికి ఆడిషన్ ఇచ్చాను. కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నటించే అవకాశం రాలేదు.దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు ఆయన హీరోగా రానున్న ‘ఖేల్ ఖేల్ మే’లో కీలక పాత్ర పోషిస్తున్నాను అని ఇన్నాళ్లకు ఆ అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపింది.
రాజమండ్రికి గేమ్ చేంజర్ టీం.. షూటింగ్ అప్డేట్ వైరల్..
గ్లోబల్ స్టార్ రాంచరణ్ “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు.దీనితో రాంచరణ్ తరువాత సినిమాకోసం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు .ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”..ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు .ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయాల్సి రావడంతో రాంచరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.దీనితో రాంచరణ్ ఫ్యాన్స్ నిరాశకు గురి అయ్యారు.ఎంతోకాలంగా ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్ గా రాంచరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి “జరగండి జరగండి ” సాంగ్ రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే గేమ్‌చేంజర్’ సినిమా గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లు వైరల్ అవుతున్నాయి .తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో సోమవారం మొదలు కానుందని తెలుస్తుంది. కథ ప్రకారం ఇది కీలకమైన షెడ్యూల్ అని సమాచారం. ఈ షెడ్యూల్‌లోనే దర్శకుడు శంకర్ ,రామ్‌చరణ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి కీలక పాత్ర పోషిస్తుంది.అలాగే ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, నవీన్‌చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .