ఏపీలో అల్లర్లపై నేడు మరో నివేదిక ఇవ్వనున్న సిట్..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై నేడు మరో నివేదికను సిట్ ఇవ్వనుంది. సోమవారం ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే.. కీలక సిఫార్సులు, గుర్తించిన అంశాలు పొందుపర్చింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ.. కేసులపై పర్యవేక్షణ ఇకపై కూడా చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కేసుల పర్యవేక్షణపై పురోగతితో పాటు మరో రిపోర్ట్ సిట్ టీమ్ సిద్ధం చేయనుంది. అల్లర్లపై నమోదైన కేసుల దర్యాప్తుపై నిరంతరం సిట్ అధికారులు పర్యవేక్షించనున్నారు. పురోగతి రిపోర్ట్ ఎన్నికల కౌంటింగ్ లోపు ఏపీ డీజీపీ హరిష్ కుమార్ గుప్తాకి ఇచ్చే అవకాశం ఉంది. మూడు జిల్లాల్లో కలిపి ఇప్పటి వరకు పరారీలో 1,152 మంది నిందితులు ఉన్నారు. కాగా, తాడిపత్రిలో 728 మంది అల్లర్లలో పాల్గొన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. పల్నాడు జిల్లాలో 471 మంది, తిరుపతిలో 47 మంది, తాడిపత్రిలో 636 మంది నిందితులు పరారీ అయినట్లు పేర్కొనింది. అలాగే, తాడిపత్రి అల్లర్ల కేసులో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై కూడా కేసు నమోదు అయింది. కాగా, ఇప్పటి వరకు 33 కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో 1370 మంది నిందితులు ఉండగా.. పల్నాడు 22, తిరుపతి 4, అనంతపురంలో 7 కేసులు నమోదు చేయబడ్డాయి. ఇప్పటి వరకు 124 మంది అరెస్ట్ చేయగా.. 94 మందికి నోటీసులు పంపించారు. కొన్ని ఎఫ్ఐఆర్ లలో అదనపు సెక్షన్లు చేర్చాలని సిట్ తెలిపింది. మొత్తం 1370 మందిపై ఎఫ్ఐఆర్ లు నమోదు.. దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించామని పేర్కొన్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు.. అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నాం.. మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్లదాడి జరిగింది.. ఇకపై అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులను కూడా సిట్ అధికారులు పర్యవేక్షించనున్నారు.
చంద్రగిరిలో హింసాత్మక ఘటనలపై పోలీసులు అలెర్ట్
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అత్యంత సమస్యాత్మక క్రేందాలను గుర్తించి కార్డెన్ సెర్చ్ చేస్తున్నారు. 3 సీఐలు, 4 ఎస్ఐలు, 70 మంది కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. ఏ.రంగంపేటలో అనుమానాలున్న వ్యక్తులపై పోలీసులు ఆరా తీస్తన్నారు. ఇళ్లు, దుకాణాల్లో మారణాయుధాలు, నేరాలకు ఉపయోగించే వస్తువులు గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కౌంటింగ్ ముగిసినా కేంద్ర బృందాలు అందుబాటులో ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలు, రాజకీయంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కాగా, మరోవైపు ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం తయారు చేసిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్లర్లపై రెండు రోజుల పాటు విచారణ చేసిన సిట్ అధికారులు.. సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను అందించింది. 150 పేజీలతో కూడిన ఈ నివేదికలో సిట్ అధికారులు కీలక అంశాలను పొందుపర్చారు. పోలింగ్ రోజు, ఆ తర్వాతి రోజు చెలరేగిన ఘర్షణల్లో మరణాలకు దారితీసే స్థాయిలో రెండు వర్గాలు రాళ్ల దాడికి పాల్పడినట్లు సిట్ టీమ్ పేర్కొంది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారని వెల్లడించింది.
శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు తిరుమలలో ఆగస్టు నెల టికెట్లు విడుదల..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ఆగస్టు నెల టికెట్లు రిలీజ్ చేయనున్నారు. తిరుమలలో ఇవాళ ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చెయ్యనుంది. నేటి ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్లను కూడా రిలీజ్ చేయనుంది. అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విడుదల చెయ్యనుంది. కాగా, తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు సైతం నేటి నుంచి షురూ కానున్నాయి. తిరుమలలో సిఫార్సు లేఖల పై వీఐపీ బ్రేక్ దర్శనాల జారీని టీటీడీ పాలక మండలి పున: ప్రారంభించింది. ఎన్నికల కోడ్ కారణంగా మార్చి 16వ తేదీ నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ.. అయితే.. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ పూర్తి కావడంతో మళ్లీ తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభిస్తున్నారు. సిఫార్సు లేఖల స్వీకరణపై టీటీడీ విజ్ఞప్తికి సానుకూలంగా ఎన్నికల సంఘం స్పందించింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోవడంతో వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఇక, నిన్న శ్రీవారిని 85, 825 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన 36, 146 మంది భక్తులు.. హుండి ఆదాయం 4.4 కోట్ల రూపాయలు వచ్చింది. కాగా, ఎల్లుండి పౌర్ణమి గరుడ వాహన సేవ ఉండనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు.
నేడు, రేపు వర్షాలు.. 24న వాయుగుండంగా మారే చాన్స్..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం కర్ణాటక అంతర్భాగం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని, ఎత్తుకు స్వల్పంగా నైరుతి వంగి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు (22)న వానలు కురిసే ఛాన్స్ ఉందని.. బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించారు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. బుధవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మాలజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, జోగులాంబ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్.. ఐసిస్ ఉగ్రవాదుల విచారణలో విస్తూపోయే నిజాలు..
ఎన్నికల హడావిడి, మరోవైపు ఐపీఎల్ ఫైనల్స్ ఇలా దేశమంతా కోలాహలం నిండి ఉండగా, ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ భారీ దాడికి కుట్ర పన్నింది. శ్రీలంకకు చెందిన వ్యక్తుల సాయంతో ఉగ్రదాడులు నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే మన ఇంటెలిజెన్స్, పోలీసు అధికారులు చాకచక్యంతో నలుగురు శ్రీలంక జాతీయులను అరెస్ట్ చేశారు. సోమవారం గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) నిన్న పక్కా సమచారంలో నలుగురిని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసింది. భారతదేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు నిందితులు అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో పలు బృందాలను ఏర్పాటు చేసి పట్లుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నలుగురు ఉగ్రవాదులు నిన్న చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లే ఇండిగో విమానంలో ఎక్కారని గుజరాత్ డీజీపీ వికాష్ సహాయ్ తెలిపారు. దక్షిణాది నుంచి వచ్చే ప్రయాణికుల జాబితాను తనిఖీ చేసిన తర్వాత, వీరి గుర్తింపును శ్రీలంక అధికారులతో ధృవీకరించిన తర్వాత అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నలుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో అబూ అనే వ్యక్తితో సోషల్ మీడియాలో టచ్‌లో ఉన్నారని, వీరిని భారత్‌లో ఉగ్రదాది చేయాలని ప్రోత్సహించాడని, వీరు ఆత్మాహుతి దాడికి కూడా ఒప్పుకున్నట్లు సహాయ్ చెప్పారు. అబు వీరికి శ్రీలంక కరెన్సీలో రూ. 4 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇరాన్ అధ్యక్షుడి మరణంలో మా ప్రమేయం లేదు..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆదివారం మరణించాడు. ఈ ప్రమాదం తర్వాత చాలా మంది ఇందులో ఇజ్రాయిల్ గూఢాచర సంస్థ ‘మొస్సాద్’ ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇదే కాకుండా ఇరాన్ వ్యాప్తంగా రైసీ మరణంలో ఇజ్రాయిల్ ప్రమేయం ఉండొచ్చని ప్రజలు చెబుతున్నారు. అంతరిక్ష నుంచి లేజర్ ద్వారా హెలికాప్టర్‌ని కూల్చేశారనే రకరకతా థియరీలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం.. వాతావరణం బాగా లేకపోవడమే అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలడానికి కారణమని ప్రాథమికంగా అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయిల్ ప్రటించింది. ఆదివారం నాటి హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ మరియు మరో ఆరుగురు ప్రయాణికులు మరియు సిబ్బంది మరణించిన ఘటనలో మొసాద్ ప్రమేయం ఉందన్న వాదనల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇప్పటికే గాజా యుద్ధం ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని పెంచింది. నెల రోజుల క్రితం సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై వైమానిక దాడి చేసిన ఇజ్రాయిల్, ఆ దేశానికి చెందిన ఉన్నత స్థాయి సైనికాధికారుల్ని హతమార్చింది. దీనికి ప్రతిగా ఇరాన్, ఇజ్రాయిల్‌పై క్షిపణులతో దాడి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడి మరణంతో అన్ని వేళ్లు ఇజ్రాయిల్ వైపు చూపిస్తున్నాయి.
నేడే క్వాలిఫయర్-1.. ఫైనల్‌కు చేరేది ఎవరో!
ఐపీఎల్ 17వ సీజన్‌లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్, రెండో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య క్వాలిఫయర్-1 జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో ఫైనల్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. నేరుగా అర్హత సాధించేందుకే ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. రెండు టాప్ జట్లు కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయం. 2016లో ఐపీఎల్ ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉంది. అదే ఊపులో టైటిల్ వేటలో ముందంజ వేయాలనే పట్టుదలతో ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హేన్రిచ్ క్లాసెన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠిలతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ముఖ్యంగా హెడ్, అభిషేక్ చెలరేగి ఆడుతున్నారు. ఈ జోడి మరోసారి చెలరేగితే విజయం ఖాయం. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌తో కూడిన సన్‌రైజర్స్ బౌలింగ్ దళం సమష్టిగా రాణిస్తోంది. మరోవైపు కోల్‌కతా కూడా పటిష్టంగానే ఉంది. ఈ సీజన్‌లో కేవలం 3 మ్యాచ్‌లే ఓడిన కోల్‌కతా.. ఏకంగా 9 విజయాల్ని సాధించింది. అటు బౌలింగ్, బ్యాటింగ్‌లో సమతూకంగా ఉన్న కేకేఆర్.. రెండో క్వాలిఫయర్ దాకా చాన్స్ తీసుకోకుండా ఫైనల్ బెర్త్ సాధించాలని ఆశిస్తోంది. సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రసెల్ వంటి వారితో కోల్‌కతా బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. అయితే కీలక బ్యాటర్ ఫిల్ సాల్ట్ స్వదేశానికి వెళ్లిపోవడం కోల్‌కతాకు ప్రతికూలాంశమే. మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్‌లతో బౌలింగ్ కూడా బాగుంది.
‘కల్కి’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..
పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన మూవీ అప్డేట్స్ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా బుజ్జి అంటూ ఇటు మేకర్స్, అటు డార్లింగ్ మంచి బజ్ ను క్రియేట్ చేశారు.. ఆ బుజ్జి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ కథతో రాబోతున్న ఈ సినిమాకు నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ఈ సినిమా గురించి వివరిస్తూ ఊరిస్తున్నాడు.. దాంతో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికి ‘కల్కి 2898AD’ సినిమా విడుదల పై క్లారిటీ వచ్చేసింది.. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్స్ పిక్స్ అయినట్లు తెలుస్తుంది.. నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నారు.. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రముఖ నటుడు కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.. త్వరలోనే సాంగ్ రిలీజ్ కాబోతుందని సమాచారం..