*తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్.. మార్చి నుంచే వడగాడ్పులు!
ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది. మార్చి నుంచి మే దాకా సాధారణం కంటే అధిక గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. భూమధ్య రేఖకు ఆనుకుని పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ఎల్‌నినో పరిస్థితులు వేసవి చివరి వరకూ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పసిఫిక్‌లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉండనున్నందున ఆ దిశగా వచ్చే గాలులతో దేశంలో మార్చి నుంచి మే నెల వరకూ మూడు నెలలు ఎండలు తీవ్రంగా ఉంటాయి. మార్చిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. మార్చి నుంచి మే వరకూ దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. దీంతోపాటు వడగాడ్పులు వీచే రోజుల సంఖ్యా ఎక్కువ కానున్నాయి. దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లానినా పరిస్థితులు వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు ఐఎండీ తెలిపింది. జూన్ నుంచి తటస్థ పరిస్థితులు ప్రారంభమై ఆగస్టు నాటికి లానినా మొదలవుతుందని ఐఎండీ అంచనా. నైరుతి రుతుపవనాల సీజన్ రెండో భాగం అంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిఫుణులు చెబుతున్నారు.
*నో టెన్షన్.. నిమిషం నిబంధన తొలగించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అయితే పరీక్ష కేంద్రానికి ఒక్కనిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించడం లేదు. దీంతో విద్యార్థులు కాస్త ఆలస్యంగా వచ్చిన కేంద్రంలోకి అనుమతించడం లేదు అధికారులు. ఎంత ప్రాధేయపడ్డ కనికరం చూపడం లేదు. ఇంటర్మీడియట్ పరీక్ష హాజరు విషయంలో ప్రవేశపెట్టిన మినిట్ నిబంధనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేకపోయారు. దీంతో ఏడాదంతా కష్టపడి చదివి పరీక్ష రాయలేక కన్నీళ్లతో వెనుదిరగాల్సి వచ్చింది. పరీక్షకు అనుమతించకపోవడంతో మనస్తాపం చెందిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.. దీంతో.. తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిలిస్తున్నారు. వీటన్నిటికి పరిజ్ఞానంలోకి తీసుకున్న ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం నిబంధనను సడలించింది. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌ని అనుమతించనుంది. ఫలితంగా ఆలస్యంగా వచ్చే విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ ఉంటుంది. ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ప్రైవేట్ పరీక్షలకు హాజరవుతున్న వారు 58,071 మంది ఉన్నారు. ఈ ఏడాది తెలంగాణలో కూడా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గత అనుభవాల నేపథ్యంలో పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విధులకు దూరంగా ఉంచేవారు. పరీక్షల్లో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ అందించేందుకు ఇంటర్ బోర్డు ‘టెలి మనస్’ పేరుతో టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు 14416 లేదా 040-24655027కు కాల్ చేయవచ్చు.
*పెట్రోలియం యూనివర్శిటీ నిర్మాణానికి నేడు భూమి పూజ
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో నిర్మించనున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ(ఐఐపీఈ-పెట్రోలియం యూనివర్సిటీ) భవన సముదాయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ నేడు వర్చువల్‌గా భూమిపూజ చేయనున్నారు. సబ్బవరం మండలం వంగలి గ్రామంలో నిర్మిస్తున్న ఐఐపీఈ శాశ్వత క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. దేశానికి అవసరమైన పెట్రోలియంను వినియోగించేందుకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఉత్పత్తి చేయడంలో ఐఐపీఈ కీలక పాత్ర పోషించనుంది. సుమారు 500 మంది ఈ రోజు కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. వంగలి ఐఐపీఈ స్థలంలో ఈ భూమిపూజ కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు.
*ప్రేమోన్మాది ఘాతుకం.. తనను విస్మరించిందని ప్రేయసిపై కత్తితో దాడి
రోజురోజుకు దారుణాలు పెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. పోలీసులు ఎన్ని రకాలుగా చట్టాలు తీసుకొచ్చినా.. దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నా మహిళలు, యువతులు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. హత్యలు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అర్ధరాత్రి సమయంలో యువతి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడికి పాల్పడి ఆమెను తీవ్రంగా గాయపరిచిన ఘటన చంద్రగిరిలో జరిగింది. కుటుంబ సభ్యుల ప్రకారం.. చంద్రగిరి ఆర్‌ఎఫ్ రోడ్డుకు చెందిన యువతి చిన్నతనంలోనే తల్లిందండ్రులను కోల్పోయింది. ఆమె అమ్మమ్మ మంగమ్మ చిన్నప్పటి నుంచి ఆ యువతిని పెంచి పోషించింది. నర్సింగ్ పూర్తిచేసుకున్న యువతి ఏడాది క్రితం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో తన పక్కింట్లో అద్దెకుంటున్న కృష్ణయ్య కుమారుడు పిడతల మహేష్ యువతికి పరిచయమయ్యాడు. కొన్నాళ్లు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. తర్వాత మహేష్ చెడువ్యసనాలు తెలుసుకున్న యువతి అతని నుంచి దూరమైంది. అప్పటి నుంచి మహేష్ యువతిపై కక్ష పెంచుకున్నాడు. తరచూ వేధింపులకు పాల్పడేవాడు. అయితే వారికి మగదిక్కు లేకపోవడంతో ఏంచేసినా ఏం అనలేకపోయేవారు. నెలన్నర క్రితం యువతి ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ప్రేమోన్మాది మహేష్, యువతితో పాటు ఆమె అమ్మమ్మపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. స్థానికులు యువకుడిని అడ్డుకున్నారు. ఆపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రక్షణ లేకపోవడంతో పది రోజుల క్రితం యువతి పెద్దమ్మ వచ్చి ఆమెను చైన్నెకి తీసుకెళ్లింది. ఆ యువతి చంద్రగిరి ఆర్‌ఎఫ్ రోడ్డులో ఉంటున్న అద్దె ఇల్లును ఖాళీ చేసేందుకు గురువారం రాత్రి తన పెద్దమ్మతో కలిసి చెన్నె నుంచి చంద్రగిరికి చేరుకుంది. విషయం తెలుసుకున్న మహేష్ అర్ధరాత్రి సమయంలో కత్తి తీసుకుని యువతి ఇంట్లోకి ప్రవేశించాడు. తర్వాత యువతిపై కత్తితో దాడిచేశాడు. ఆమె ఛాతి, ఎడమ చేతిపై దాడి చేయడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో కత్తిని అక్కడ పడేసి ప్రేమోన్మాది మహేష్ పారిపోయాడు. అనంతరం స్థానికులు అక్కడకు చేరుకు ని, యువతిని 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రుయా ఆస్పత్రికి చేరుకుని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
*ఢిల్లీకి రైతుల పాదయాత్ర మళ్లీ వాయిదా.. మార్చి 3 న కొత్త వ్యూహ ప్రకటన
ఢిల్లీకి రైతుల పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. రైతు నేతలు ఇప్పుడు మార్చి 3న అంటే ఆదివారం రోజున ప్లాన్ చేసి కొత్త వ్యూహాన్ని ప్రకటిస్తారు. ఫిబ్రవరి 13 నుండి పంజాబ్, హర్యానా సరిహద్దులో కూర్చున్న రైతులు మార్చి 3వ తేదీకి ఢిల్లీకి తమ పాదయాత్రను వాయిదా వేసి ఉండవచ్చు, అయితే రైతులు పంజాబ్, హర్యానా మధ్య ప్రధాన సరిహద్దులో శంభు, ఖనౌరీ సరిహద్దులో కవాతు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వ్యూహం కింద, రైతులు హర్యానా, పంజాబ్ మధ్య దబ్వాలి-భటిండా-మలోట్ సరిహద్దును ముట్టడించేందుకు కూడా వ్యూహాన్ని రూపొందించారు. తద్వారా ముందుకు సాగడానికి ఏదైనా ప్రయత్నం జరిగితే, హర్యానా పరిపాలనపై అనేక వైపుల నుండి ఒత్తిడి తీసుకురావచ్చు. మరోవైపు భారతీయ కిసాన్ యూనియన్ (BKU) రతన్ మాన్ నేతృత్వంలో సమ్మె చేసింది. జింద్ జిల్లాలోని కిసాన్ భవన్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. కొనసాగుతున్న నిరసనలు, ఇతర డిమాండ్‌లకు మద్దతుగా రైతులను సామూహిక అరెస్టు చేయాలనే ప్రతిపాదనను వారు ఆమోదించారు. BKU రైతుల సమావేశం జరిగింది. దీనిలో వారు మార్చి 11 న నిరసన చేయాలని నిర్ణయించారు. మార్చి 11న రైతుల డిమాండ్‌ల సాధనకు జిల్లా స్థాయిలో రైతు నాయకులు తరలిరావాలని కోరారు. కొనసాగుతున్న నిరసనల సందర్భంగా హర్యానా పోలీసులు అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు ఆందోళనతో పాటు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో అత్యధికంగా గుమిగూడాలని ఆయన తన తోటి రైతులకు పిలుపునిచ్చారు. రైతుల జాతీయ సంఘం మార్చి 14న కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్‌ను నిర్వహించింది. అయితే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నందున పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు పాల్గొనకుండా చూడాలని రైతు సంఘాలు కోరాయి. వృద్ధ రైతులకు జైలు శిక్ష, చట్టపరమైన చర్యలు తప్పవని, యువత పాల్గొనడం మానుకోవాలని అన్నారు. బీకేయూ రాష్ట్ర అధ్యక్షుడు రతన్ మాన్ మాట్లాడుతూ.. ఎస్‌కేఎం నేతలు పిలుపునివ్వాలని కోరితే ఎలాంటి చర్యలకైనా రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫిబ్రవరి 13 నుంచి హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో క్యాంప్ చేస్తున్న ఆందోళనకారులకు బహిరంగ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈ ‘జైల్ భరో ఉద్యమం’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. దీనికి ముందు ఉద్యమానికి సంబంధించి రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి.
*నేడు మధ్య ప్రదేశ్ చేరుకోనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ప్రవేశించనుంది. మొరెనా, గ్వాలియర్లలో రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా జితూ పట్వారీ తన ప్రజాభిమానాన్ని చాటుకునే అవకాశం లభించింది. ఇది జితూ పట్వారీకి ఒక రకమైన పరీక్ష అవుతుంది. దీని ఫలితం రాహుల్ గాంధీతో సహా పర్యటనలో ఉన్న పెద్ద కాంగ్రెస్ నాయకులకు కనిపిస్తుంది. యాత్ర ఏర్పాట్లను క్రమబద్ధీకరించేందుకు 23 కమిటీలను ఏర్పాటు చేసి పలువురు కాంగ్రెస్ నేతలకు జితూ పట్వారీ బాధ్యతలు అప్పగించారు. రాహుల్ ఈ న్యాయ యాత్ర మొరెనా నుండి గ్వాలియర్, శివపురి, గుణ, రాజ్‌గఢ్, షాజాపూర్, ఉజ్జయిని మీదుగా రాజస్థాన్ వరకు సాగుతుంది. రాజస్థాన్ చేరుకోవడానికి ముందు, రాహుల్ ఈ ప్రయాణం ద్వారా మధ్యప్రదేశ్‌లోని అనేక మందితో మాట్లాడనున్నారు. బహిరంగ సభలలో కూడా ప్రసంగిస్తారు. శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఎంపీలోని మొరెనా నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణంలో రాహుల్ గాంధీ సమాజంలోని ప్రతి వర్గాన్ని తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. ఏడు లోక్‌సభ స్థానాలను కవర్ చేసే ఈ యాత్ర గ్వాలియర్-చంబల్, ఎంపీలోని మాల్వా డివిజన్‌ల గుండా సాగుతుంది. ఈ యాత్ర మధ్యప్రదేశ్‌లో ఐదు రోజుల పాటు కొనసాగనుంది. యాత్రకు సంబంధించి పలువురు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. మోరీనా నుంచి ప్రారంభమయ్యే యాత్రలో మధ్యాహ్నం 2 గంటలకు జెండా అందజేత కార్యక్రమం జరగనుంది. గ్వాలియర్‌లోని చార్ షహర్ కా నాకా నుంచి ప్రారంభం కానున్న రోడ్ షో జీరా చౌక్ వరకు కొనసాగనుంది. అనంతరం గ్వాలియర్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీ మార్చి 3న గ్వాలియర్‌లో అగ్నివీర్, మాజీ సైనికులతో మాట్లాడతారు. దీని తరువాత శివపురిలోని గిరిజనులతో ముచ్చటిస్తారు. భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా రాహుల్ పలు ప్రసంగాలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మార్చి 4న రాజ్‌గఢ్‌లోని బియోరాలో రైతులతో 100 కోట్లపై చర్చిస్తాం. దీని తర్వాత మార్చి 5న రాహుల్ గాంధీ ఉజ్జయినిలోని మహకల్‌లో పర్యటించనున్నారు. పట్వారీ అభ్యర్థులతో మాట్లాడతారు. అదే సమయంలో మార్చి 6న ఉదయం 9 గంటలకు రాహుల్ గాంధీ మహిళలను పలకరిస్తారు. సాయంత్రం 5 గంటలకు రత్లాంలోని సైలానా మీదుగా రాజస్థాన్‌లోని బన్స్వారాలో యాత్ర ప్రవేశిస్తుంది.
*వ్యాపారి కళ్లల్లో కారం కొట్టి… రూ.33లక్షల బ్యాగుతో ఉడాయించారు
జైపూర్‌లో శుక్రవారం ఓ వ్యాపారి నుంచి దుండగులు రూ.33 లక్షలు దోచుకున్నారు. ఇద్దరు అగంతకులు ఆ వ్యాపారి కళ్లలో కారం కొట్టి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కారులో కూర్చున్న వ్యాపారి చేతిలోని బ్యాగ్‌ని ఈ దుండగులు లాక్కొని పారిపోయారు. సమాచారం మేరకు విద్యాధర్ నగర్ పోలీస్ స్టేషన్‌ను ఎ-కేటగిరీ దిగ్బంధనం చేశారు. కాని దొంగల జాడ దొరకలేదు. ఘటనా స్థలంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యాధర్ నగర్‌లో గర్వ్ ఖండేవాల్ నివాసితో దోపిడీ ఘటన జరిగింది. విశ్వకర్మలో మెటల్ ఫ్యాక్టరీ నడుపుతున్న వ్యాపారి డబ్బు తీసుకునేందుకు స్నేహితుడితో కలిసి శుక్రవారం సాయంత్రం విద్యాధర్ నగర్‌లోని ధనశ్రీ టవర్‌కు వచ్చాడు. ఓ బ్యాగులో సుమారు రూ.33 లక్షలు పెట్టి కారులో కూర్చున్నారు. ఇంతలో కాలినడకన వస్తున్న ఇద్దరు అగంతకులు వెనుక నుంచి వచ్చి ఆయన కళ్లలో కారం చల్లారు. బాధతో కేకలు వేస్తుండగా నేరస్తులిద్దరూ వారి చేతిలోని నగదు బ్యాగును లాక్కొని పారిపోయారు.
*పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన ధరలు..
పసిడి ప్రియులకు భారీ షాక్ ఈరోజు మార్కెట్ లో ధరలు పెరిగాయి.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 10 పెరిగి.. రూ. 57,910కి చేరింది.. అలాగే 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 100 వృద్ధి చెంది.. రూ. 63,170కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 63,160గా ఉండేది.. ఇక వెండి కూడా ధర కూడా పెరిగింది. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,460గా ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,060గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,320గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,910 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,170గా ఉంది.. ఇక చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,410గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,720గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,910గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,170గా నమోదైంది.. ఇక వెండి విషయానికొస్తే.. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,460గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి 74,600కి చేరింది.. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 76,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 74,600.. బెంగళూరులో రూ. 72,100గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..