Site icon NTV Telugu

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఇవాళ్టి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ..

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష ఒకటి.. తొలి దశలో ఆరోగ్య సురక్ష విజయవంతంగా నిర్వహించిన ఏపీ ప్రభుత్వం.. 60 లక్షల మందికి పైగా సొంత ఊళ్లలోనే వైద్యం అందించింది.. ఇక, ఇవాళ్టి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో దశలో మొదటి గ్రామీణ ప్రాంతాల్లో, 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్‌ క్యాంపులు ప్రారంభం కానున్నాయి. 6 నెలల పాటు ఈ రెండో దశ కార్యక్రమం కొనసాగనుంది. దీని కోసం 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందురు ఏపీ వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి వద్దే పరిష్కారాన్ని, వైద్య సేవల్ని అందించాలన్నది జగన్‌ సర్కార్ లక్ష్యం. అవసరమైన సందర్భాలలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఈ బాధ్యతను పూర్తిగా ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వోలు, ఎఎన్ఎంలకు అప్పగించారు. వారు చికిత్సానంతరం పేషెంట్లకు అవసరమైన కన్సల్టేషన్ సేవలతో పాటు అవసరమైన మందుల్ని కూడా వారికి అందజేస్తారు.

విశాఖలో కరోనా కలకలం.. అధికారుల హెచ్చరికలు
విశాఖపట్నంలో కోవిడ్ కేసులు ఉధృతి పెరుగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య ఎక్కువైంది. తాజాగా 10 మందికి వైరస్ నిర్దారణ అయ్యింది. దీంతో.. ఈ సీజన్‌లో కరోనా భారినపడ్డ బాధితుల సంఖ్య 38కి చేరింది. వీరిలో 25 మంది ఆస్పత్రులు, హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది డిశంబర్ రెండోవారంలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. డిశంబర్ 24న కంచరపాలెంకు చెందిన సోమకళ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందిన తర్వాత పరీక్షిస్తే కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఆమె కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులకు స్క్రీనింగ్ లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అనుమానిత లక్షణాలతో ఈ సీజన్లో జరిగిన తొలి మరణం కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. టెస్టులు సంఖ్యను పెంచింది. ఇక, సీజనల్ వ్యాధులతో పాటు కోవిడ్ కేసులు పెరుగుతున్నందున వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.. రద్దీ ప్రదేశాలు, మార్కెట్లకు వెళ్లేప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యులు. జనవరి నెలలో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. పండుగ సీజన్ కావడంతో రైళ్లు, బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణాలు, సమూహాలుగా వేడుకల్లో పాల్గొవడం వల్ల కోవిడ్ బాధితులు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుందని డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని.. కోవిడ్ బారిన పడకుండా.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవాలని వార్నింగ్‌ ఇస్తున్నారు అధికారులు.

న్యూ ఇయర్‌ జోష్‌.. ఏపీలో రికార్డు స్థాయిలో లిక్కర్‌ సేల్స్‌
ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరిగాయి.. భారత్‌లోనూ న్యూ ఇయర్‌ వేడుకల్లో మునిగితేలారు యువత.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ జోష్ కనిపించింది. ముఖ్యంగా డిసెంబర్‌ 31, జనవర్‌ 1వ తేదీన.. రెండు రోజుల పాటు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి.. తెలంగాణతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ లిక్కర్‌ సేల్క్‌ కొత్త రికార్డు సృష్టించాయి.. డిసెంబర్‌ 31, జనవరి 1వ తేదీల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు.. ఈ రెండు రోజుల్లో కలిపి ఏకంగా దాదాపు రూ.250 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది.. డిసెంబర్‌ 31వ రోజున రాష్ట్రవ్యాప్తంగా రూ.147 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తుండగా.. జనవరి 1వ తేదీకి వచ్చేసరికి దాదాపు రూ.100 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో డిసెంబర్‌ 31వ తేదీన 1.51 లక్షల కేసుల లిక్కర్‌, 67 వేల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్టు అధికారులు అంచనా వేస్తు్న్నారు.. గతేడాది అదే రోజున రూ.142 కోట్ల విలువైన మద్యం అమ్మగా, ఈసారి రూ.5 కోట్ల మేర అమ్మకాలు పెరిగిపోయాయి.. ఇక, 2024 జనవరి 1వ తేదీతో పోలీస్తే.. 2023 జనవరి 1న మద్యం అమ్మకాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.. 2023 జనవరి 1న రూ.98 కోట్ల మద్యం అమ్మకాలు సాగగా.. ఈ ఏడాది అది రూ.100 కోట్ల పై మాటే.. 31, జనవరి 1 తేదీల్లో మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు.. మద్యం అమ్మేందుకు ప్రభుత్వం అనుమతించడానికి సెలబ్రేషన్స్‌ తోడుకావడంతో.. సేల్స్‌ అమాంతం పెరిగాయి.. ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.75 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. ఈ రెండు రోజుల్లో అది అమాంతం పెరిగిపోయింది.

హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. మెట్రో వేళలు పొడిగింపు..!
83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్-2024) హైదరాబాద్‌లోని నాంపల్లి గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ తెరవబడుతుంది. అయితే.. ఈ ఎగ్జిబిషన్‌కు నగరం నలుమూలల నుంచి సందర్శకులు పోటెత్తారు. ఇదిలా ఉండగా.. ఎప్పటిలాగే సందర్శకుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సందర్శకుల కోసం మెట్రో రైళ్ల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మియాపూర్ – ఎల్బీనగర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైలు మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంటకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మెట్రో స్టేషన్లలో నుమాయిష్ సందర్శకుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది. దాదాపు 22 లక్షల మంది ఈ ప్రదర్శనను సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రవేశ టిక్కెట్ ధర రూ.40గా నిర్ణయించారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ టైమింగ్స్.. వారాంతపు రోజులలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు.. వారాంతాల్లో, సెలవు దినాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శించే అవకాశం కల్పించారు. అయితే.. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు వాహనాలతో లోపలికి వెళ్లి దర్శించుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. అయితే.. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్‌లో దేశం నలుమూలల నుంచి వ్యాపారులు వచ్చి స్టాళ్లను ఏర్పాటు చేసారు. దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చేనేత వస్త్రాల నుండి వంట సామాగ్రి వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇందులో ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి.

నేడు తమిళనాడులో పర్యటించనున్న ప్రధాని మోడీ.. రూ.19,850 కోట్ల వరాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తమిళనాడు, లక్షద్వీప్‌లలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి త‌న ప‌ర్యటన సంద‌ర్భంగా రెండు రాష్ట్రాల‌లో అనేక అభివృద్ధి ప‌థ‌కాల‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. తమిళనాడుకు ప్రధాని ఈరోజు 19,850 కోట్ల రూపాయల బహుమతిని ఇవ్వనున్నారు. తిరుచిరాపల్లిలో నూతన విమానాశ్రయ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాని లక్షద్వీప్, కేరళలను కూడా సందర్శించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన దృష్ట్యా తిరుచిరాపల్లిలో ఏర్పాట్లు చేశారు.తమిళనాడులోని భారతిదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత తిరుచిరాపల్లిలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ఆయిల్ అండ్ గ్యాస్, ఏవియేషన్, రైల్, రోడ్, షిప్పింగ్‌కు సంబంధించి దాదాపు రూ.19,850 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. దీని తర్వాత ప్రధాని లక్షద్వీప్‌లోని అగతిలో బహిరంగ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా మహిళా మోర్చా మెగా తిరువతీర నిర్వహించనుంది. ఈ తిరువతీరలో 2000 మంది మహిళా కార్మికులు కలిసి పాల్గొంటున్నారు.

జపాన్‌ లో 56భూకంపాలు.. ఆరుగురు మృతి
జపాన్‌లో సోమవారం 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు కనీసం ఆరుగురు మరణించారు. సోమవారం నాటి భూకంపానికి కేంద్రంగా ఉన్న జపాన్‌లోని ప్రధాన ద్వీపం హోన్షు పశ్చిమ తీరంలో ఉన్న ఇషికావా ప్రిఫెక్చర్‌లో అన్ని మరణాలు సంభవించాయి. నేషనల్ బ్రాడ్‌కాస్టర్ NHK ఈ సమాచారాన్ని ఇచ్చింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భూకంపంలో పదుల సంఖ్యలో ఇతర వ్యక్తులు కూడా గాయపడ్డారు. జపాన్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం తరువాత, వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. గత 24 గంటల్లో జపాన్‌లో 4.0 కంటే ఎక్కువ తీవ్రతతో 56 భూకంపాలు సంభవించాయి. నిరంతర ప్రకంపనలతో దేశ ప్రజలు ఇప్పటికీ భయాందోళనలకు గురవుతున్నారు. ఈ అత్యంత బలమైన భూకంపం కారణంగా భవనాలు కూలిపోయాయి. అనేక భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి. తూర్పు రష్యా వరకు సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. దీని కారణంగా ప్రజలు జపాన్ ప్రభావిత తీర ప్రాంతాలను ఖాళీ చేయమని ఆదేశించారు. సునామీ హెచ్చరికల ప్రాంతాలలో నివసిస్తున్న వేలాది మంది ప్రజలు ఎత్తైన ప్రదేశాలను వెతకాలని కోరారు. అనేక పట్టణాల్లో డజన్ల కొద్దీ కూలిపోయిన భవనాల శిథిలాల కింద తెలియని సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారు. ఇళ్లు వదిలి వెళ్లాల్సిన వారికి జపాన్ సైన్యం ఆహారం, నీళ్లు, దుప్పట్లు అందజేస్తోంది..

71 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసిన వాట్సాప్
మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో 71 లక్షలకు పైగా అకౌంట్స్ ను బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. 2023 నవంబర్ 1 నుంచి -30వ తేదీ మధ్య 71 లక్షల 96 వేల ఖాతాలను బ్యాన్ చేసినట్లుగా తెలిపింది. ఇందులో దాదాపు 19 లక్షల 54 వేల ఖాతాలపై ముందుగానే ఫిర్యాదులు వచ్చినట్లు వాట్సాప్ సంస్థ చెప్పింది. భారత ఐటీ నిబంధనలను అనుసరించి ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. భారతీయ ఖాతాలుగా చెలామణీ అవుతూ.. +91 కోడ్ లేని ఖాతాలపై కూడా వాట్సాప్ నిషేధం విధించినట్లు తెలిపింది. అయితే, భారత్ లో 500 మిలియన్లకు పైగా యూజర్స్ ను వాట్సాప్ కలిగి ఉంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వారి వ్యక్తిగత డేటాకు ఎలాంటి భంగం కలగకుండా ఎండ్ -టు- ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో భద్రతను కల్పిస్తుంది. ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్లు ఉన్న ప్రతి సోషల్ మీడియా సంస్థ నెలవారీ రిపోర్ట్ ను పబ్లిష్ చేయాల్సి ఉంది. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే డిటైల్స్ ను పొందుపరాచాల్సి ఉంది.

న్యూయర్ రోజు భారీగా పెరిగిన కండోమ్ ఆర్డర్లు.. గంటకు అన్ని వేల ఆర్డర్లా?
న్యూయర్ రోజు తమకు ఇష్టమైన వారితో సంతోషంగా గడపాలని అందరు అనుకుంటారు.. పాత సంవత్సరాన్ని పంపించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని చాలా మంది అనుకుంటారు.. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ గట్టిగా చేసుకున్నారు. డిసెంబర్‌ 31న జరిగిన అమ్మకాలు చూస్తేనే ఏ రేంజ్‌లో వేడుకలు జరిగాయో అర్థమవుతోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 5.4 లక్షల చికెన్ అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది.. ఎప్పటిలాగానే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఇక బార్లు, పబ్బులు ప్రజలతో కిటకిటలాడాయి. ఇదిలా ఉంటే కొత్తేడాదికి ఆహ్వానం పలికే సమయంలో బిర్యానీలతో పాటు, కండోమ్స్‌ అమ్మకాలు సైతం భారీగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ తెలిపింది.. ఇక ఒక్క హైదరాబాద్ లోనే 4.8 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. 2023 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సమయంలో వచ్చిన ఆర్డర్ల కంటే 1.6 రెట్లు ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తుంది.. ప్రతీ నిమిషానికి 1244 ఆర్డర్లు వచ్చాయి. చివరి గంటలో సుమారుగా 10 లక్షల మంది స్విగ్గీ యాప్‌ను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. న్యూఇయర్‌ వేడుకల సమయంలో ప్రతి గంటకు 1,722 యూనిట్ల కండోమ్స్‌ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గి ఇంస్టామర్ట్ సోషల్ మీడియా వేధికగా తెలిపింది.. జొమాటోలో కూడా భారీగా ఆర్డర్లు వచ్చాయని ఆ కంపెనీ తెలిపింది. దాదాపు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ ఇయర్‌ ఎండ్‌లో సేవలు అందించారని తెలిపింది.. పిజ్జాలు కూడా ఎక్కువగా ఆర్డర్ వచ్చినట్లు తెలిపింది..

న్యూయర్ పార్టీలో అమ్మాయితో రచ్చ చేసిన ఆర్జీవీ.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా?
తెలుగు చిత్ర పరిశ్రమలో వర్మ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. సంచలనాలకు కేరాఫ్ ఈయనే.. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలను తెరకేక్కించి సక్సెస్ డైరెక్టర్ గా పేరు సంపాదించాడు. ఎంతోమంది చిన్న హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. అంతేకాకుండా ఎంతోమందిని సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం చేశాడు వర్మ.. ఆయన దృష్టిలో పడితే ఎవరైనా కూడా స్టార్డం అందుకోవాల్సిందే.. ఇక అమ్మాయిల విషయానికొస్తే వర్మ చెయ్యి పడిందంటే వారి జాతకం పూర్తిగా మారిపోతుంది.. అందుకే చాలా మంది అమ్మాయి లు ఆయన వెనక పడతారు.. ఇక హీరోయిన్లు సైతం ఆయనతో డేట్ కు రెడీ అవుతున్నారంటే మాటలు కాదు.. ఇక సోషల్ మీడియాలో వర్మ పెట్టే పోస్టులు ఏ రేంజులో వివాదాలను తెస్తాయో అందరికి తెలుసు.. నిన్న జరిగిన న్యూయర్ పార్టీ ఫోటోలను, వీడియోలను నెట్టింట షేర్ చేశాడు..అవి వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో ఆర్జీవి తో ఓ అమ్మాయి కనిపించింది.. ఆ అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ పార్టీలో బాగా ఎంజాయ్ చేశాడు.. దీంతో ఆ అమ్మాయి కూడా వైరల్ అయిపోయింది. ఇది చాలదన్నట్టు ఆ అమ్మాయి వీడియో ఒకటి షేర్ చేసి నాతో పార్టీలో ఎంజాయ్ చేసిన అమ్మాయి ఈమె అని తనని ట్యాగ్ కూడా చేశాడు. ఆమె పేరు సిరి స్టేజి. అసలు పేరు ఇదో కాదో తెలీదు కానీ సోషల్ మీడియాలో కొసరు పేరు మాత్రం ఇదే పెట్టుకుంది ఈ భామ..

Exit mobile version