నేడు పున్నమి వెలుగుల్లో కోదండరాముడి కళ్యాణం.. సిద్ధమైన ఒంటిమిట్ట
పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణానికి సర్వం సిద్ధం అవుతోంది.. ఈ రోజు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో రాములోరి కల్యాణోత్సవం జరగనుంది.. ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో నవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతుండగా.. అందులో భాగంగా ఛైత్ర పౌర్ణమి రోజు రాత్రి స్వామివారికి కళ్యాణం జరిపించడం ఒంటిమిట్ట ఆనవాయితీగా వస్తుంది.. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే కళ్యాణం కోసం ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక, ఒంటిమిట్ట ఆలయం కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే రహదారికి పక్కనే ఉండడంతో.. కల్యాణోత్సవం దృష్ట్యా.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ దారిమల్లించారు.. ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం సందర్భంగా కడప – తిరుపతి మధ్య భారీ వాహనాలు దారి మళ్లించారు.. నేడు ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని.. ఉదయం 6:30 నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఈ వాహనాల దారి మళ్లింపు ఉంటుందని తెలిపారు కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లించాం అన్నారు.. ఇక, కల్యాణ వేదిక సమీపం నుండి కడప మార్గంలో 10 చోట్ల, సాలాబాద్ వద్ద 5 ప్రదేశాల్లో ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. వాహనదారులు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.
నేడు టెన్త్ ఫలితాలు విడుదల
విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న టెన్త్ ఫలితాల విడుదలకు సమయం వచ్చేసింది.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.. ఈ రోజు ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్.. వెబ్‌సైట్‌లో 2023–24 ఎస్ఎస్‌సీ ఫలితాలను విడుదల చేయనున్నారు.. ఇక, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, మరో 1.02 లక్షల మంది ప్రైవేట్‌గా ఈ పరీక్షలు రాశారు.. కాగా, ఈసారి ఏపీలో 3,473 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించారు.. రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది పరీక్షలు రాయగా.. 1.02 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌గా పరీక్షలు రాశారు.. ఇక, గత ఏడాది మే 6వ తేదీన ఫలితాలు విడుదల కాగా.. ఈ సారి మరింత ముందుగానే ఫలితాలు వెల్లడిస్తోంది విద్యాశాఖ.. అయితే, సోమవారం టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి నిన్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. ఇక, ఏపీ టెన్త్ ఫలితాలను మీ కోసం అందించనుంది ఎన్టీవీ తెలుగు వెబ్‌సైట్.. https://ntvtelugu.com కి వెళ్లి.. మీ హాల్ టికెట్ నంబర్ ఎంట్రీ చేస్తే.. ఫలితాలు చూసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది.
మరోసారి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్.. నేడు సీఎం జగన్ కీలక సమావేశం
మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కీలకమైన సమయాల్లో తన యాత్రకు బ్రేక్ ఇస్తూ ఇస్తున్నారు.. ఇక, ఇవాళ “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర కు బ్రేక్ పడింది.. ఉత్తరాంధ్రలో ఎన్నికల వ్యూహంపై కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు జగన్.. సీనియర్ నేతలతో అంతర్గత సమావేశం కానున్నారట.. మరోవైపు.. ఈనెల 26వ తేదీన వైసీపీ మ్యానిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో.. ఓవైపు ప్రచారం విస్తృతం చేస్తూనే.. ఇంకో వైపు.. ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.. ఇక, గత ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల యుద్ధంలో విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సారి మేనెఫెస్టోపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిపై మేనిఫెస్టోలో పొందుపరుస్తుందట వైసీపీ.. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. మరోవైపు.. రేపు సోషల్ మీడియా వింగ్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు.. సోషల్ మీడియా సమావేశం అనంతరం బస్సు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది.. రేపు విజయనగరం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుండగా.. రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలు ప్రకటించి.. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా.. సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగన్ సీఎం అయితేనే సాధ్యం అవుతుందంటున్న వైసీపీ.. ఎన్నికల మేనిఫెస్టోపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసామని చెబుతున్న వైసీపీ నేతలు.. ఈ సారి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ధీటుగా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.
కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. అనంతరం కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తీహార్ జైలులో ఉండగానే ఈ నెల 11న అరెస్టు చేసింది. ఈడీ కేసులో తన కుమారుడికి పరీక్షలున్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న, సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. కవిత పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ కావేరి భవేజా నేతృత్వంలోని ధర్మాసనం నేడు మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరపనుంది.
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రేపు మద్యం దుకాణాలు బంద్
రేపు(మంగళవారం) వైన్ షాపులు, బార్లు తెరుచుకోవు. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో ఈ నెల 23న శోభాయాత్రను వైభవంగా నిర్వహించనున్నారు. కావున హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్‌లో బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఆదివారం ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న శోభాయాత్ర గౌలిగూడలోని రాంమందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బంద్ హనుమాన్ ఆలయం వరకు జరుగుతుందని తెలిపారు. శోభాయాత్ర ఏర్పాట్లు, రూట్‌మ్యాప్‌ను ఆయన పరిశీలించారు. ఈయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
జీతాలు చెల్లించలేని పరిస్థితిలో కేఆర్‌ఎంబీ.. నేడు బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల విషయంలో వ్యవహారాలను చక్కబెట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. బోర్డు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలోకి కేఆర్ఎంబీ వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో బోర్డు చైర్మన్ శివనందన్‌కుమార్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు పరిస్థితిని వివరిస్తూ లేఖలు రాశారు. ‘బోర్డు నిర్వహణ కోసం క్రమం తప్పకుండా కేటాయించాల్సి నిధులు గత రెండేళ్లుగా ఇవ్వడం లేదు. బోర్డును మూసేసుకోవడం మినహా గత్యంతరం లేదు’ అంటూ కేఆర్‌ఎంబీ ఛైర్మన్ లేఖ రాశారు. ఈ క్రమంలోనే బడ్జెట్‌పై నేడు కేఆర్‌ఎంబీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. బోర్ఢు నిర్వహణకు నిధుల చెల్లింపుపై చర్చించనున్నారు. హైదరాబాద్ జలసౌధ ప్రాంగణంలోని కేఆర్‌ఎంబీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నిధుల విడుదలపై బోర్డు, రెండు తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ 11 కోట్ల తొమ్మిది లక్షలు, తెలంగాణ 19 కోట్ల 64 లక్షల రూపాయలు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచించింది. కృష్ణా జలాలను కేఆర్‌ఎంబీ నియంత్రణలోకి తీసుకోవడాన్ని మొదటి నుంచి తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మాత్రం సమర్థించింది.
మణిపూర్‌లోని 11 పోలింగ్ స్టేషన్‌లలో నేడు రీపోలింగ్
లోక్‌సభ తొలి దశ ఎన్నికల సందర్భంగా మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ఓటింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ వంతు కోసం పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చున్నారు. రాష్ట్రంలోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు మణిపూర్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 19న మణిపూర్‌లో 69.18 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈవో తెలిపారు. తిరిగి ఓటింగ్ జరుగుతున్న పోలింగ్ స్టేషన్లలో మొయిరంగకంపు సాజేబ్ హయ్యర్ ప్రైమరీ స్కూల్, ఎస్. ఇబోబి ప్రైమరీ స్కూల్ (ఈస్ట్ వింగ్), ఛెత్రిగావ్‌లోని నాలుగు పోలింగ్ స్టేషన్‌లు, థోంగ్జులో ఒకటి, ఉరిపోక్‌లో మూడు, కొంతౌజామ్‌లో ఒక పోలింగ్ స్టేషన్‌లో ఓటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 19న ఈ పోలింగ్ కేంద్రాల వద్ద హింస కనిపించింది. కొందరు దుండగులు కాల్పులు జరిపి ఈవీఎంలను ధ్వంసం చేశారు.
యూరప్ హీట్‌వేవ్ హెచ్చరికలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఒకేసారి తీవ్రస్థాయి వేడి వాతావరణం నెలకొంటుందని ఓ అధ్యయనం తెలిపింది. వేడెక్కుతున్న భూగోళానికి ఇది నిదర్శనమన్నారు. 2023లో చోటు చేసుకున్న వాతావరణ పరిణామాలపై పరిశోధకులు సమీక్ష చేశారు. గత సంవత్సరంలో ఉత్పన్నమైన అసాధారణ వాతావరణ పరిస్థితులు.. పెరుగుతున్న భూతాపంపై వేసిన అంచనాలకు తగ్గట్టే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. అత్యంత ఉష్ణమయ సంవత్సరంగా 2023 నిలిచిందన్నారు. భవిష్యత్‌లో మరింత వేడి వాతావరణం నెలకొనే పరిస్థితి ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలను కురిపించే తుఫాన్లు సర్వసాధారణం అవుతాయన్నారు. ఇక, ఈ అసాధారణ వాతావరణంతో రుతువుల మధ్య వైరుధ్యాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వాయవ్య ఐరోపా, బ్రెజిల్, మొరాకో, దక్షిణాఫ్రికాలో వసంత రుతువులోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్నారు. ఈ సీజన్‌లో ఇలాంటి పరిస్థితి చాలా అసాధారణమని ఓ బ్రిటన్ వాతావరణశాఖ పరిశోధకుడు చెప్పారు. ఈ ప్రపంచంలో ఏకకాలంలో భిన్న ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు కనిపిస్తాయన్నారు. గత ఏడాది ఉత్తర అమెరికా, దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియాలో జులై నెలలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు పేర్కొన్నారు. ఇక, తుఫాన్ల వల్ల తీవ్రస్థాయిలో వర్షాలు పెరిగిపోతాయి.. 2023 జులైలో ఉత్తర చైనాలో, సెప్టెంబరులో లిబియాలో వచ్చిన వరదలు దీనికి నిదర్శనం అని చెప్పారు. భూతాపం పెరగడం వల్ల ఏర్పాడే పరిస్థితులు భవిష్యత్‌లో జరిగే పరిణామాలపై ఇది తీవ్ర ప్రభావం చూస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
మాల్దీవుల ఎన్నికల్లో ముయిజ్జు పార్టీకి భారీ విజయం..
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC) భారీ విజయాన్ని నమోదు చేసింది. 86 స్థానాల్లో ఫలితాలను ప్రకటించినప్పటికి.. ఆ పార్టీ 63 చోట్ల గెలిచినట్లు తెలిపగా.. మరో ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. అయితే, మాల్దీవుల పార్లమెంటు (పీపుల్స్ మజ్లీస్) లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం నాడు పోలింగ్ జరిగింది. మయిజ్జుకు చెందిన పీఎన్‌సీ, ప్రతిపక్షం మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) సహా ఆరు పార్టీలకు చెందిన 368 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. కాగా, మెజార్టీకి అవసరమైన సీట్లను ముయిజ్జు పార్టీ ఇప్పటికే గెల్చుకుంది. చైనాకు అనుకూలుడిగా ఉన్న ముయిజ్జుకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. రిసెంట్ గా విడుదలైన ఫలితాలు ముయిజ్జు వైపే మొగ్గు చూపడాన్ని ప్రజలు సమర్ధించారు. పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడికి వారం రోజుల పట్టే ఛాన్స్ ఉండగా.. మే మొదటి వారంలో కొత్త పార్లమెంట్ కొలువుదీరే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మొత్తం 41 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేయగా.. కేవలం ముగ్గురు మాత్రమే గెలివగా.. ఈ ముగ్గురూ ముయిజ్జు పార్టీకి చెందిన అభ్యర్థులేనని స్థానిక మీడియా వెల్లడించింది.
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా..!
ఇప్పటికే ఐపీఎల్‌లో అనేక రికార్డులను తన పేరుపై లిఖించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక జట్టు తరఫున 250 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్స్‌లు బాదిన కింగ్.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఆర్‌సీబీ తరఫున 245 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 250 సిక్స్‌లు బాదాడు. ఐపీఎల్‌లో ఒక జట్టు తరఫున ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాటర్ జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 85 మ్యాచ్‌లు ఆడిన గేల్.. 239 సిక్స్‌లు బాదాడు. ఆర్‌సీబీ తరఫున 156 మ్యాచ్‌లు ఆడిన ఏబీ డివిలియర్స్ 238 సిక్స్‌లు బాది మూడో స్థానంలో ఉన్నాడు. టాప్ 3లోని ముగ్గురు ఆర్‌సీబీ బ్యాటర్లే కావడం విశేషం. ముంబై ఇండియన్స్ తరఫున 205 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 224 సిక్స్‌లు కొట్టాడు. ముంబై ఇండియన్స్ తరఫున 223 మ్యాచ్‌ల్లో కీరన్ పొలార్డ్ 189 సిక్స్‌లు బాదాడు.