భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు:
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏవియేషన్ హబ్ నిర్మాణంలో భాగంగా సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఐఎఎల్ సంస్థకు 500 ఎకరాల భూ కేటాయింపునకు రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు భోగాపురం విమానాశ్రయానికి ఈ భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం 1733 ఎకరాలు, జాతీయ రహదారి నుంచి విమానాశ్రయ అనుసంధానం కోసం 92 ఎకరాలను ప్రతిపాదించారు. భోగాపురం విమానాశ్రయంలో కార్గో ఏరియా కోసం 83.5 ఎకరాలు, నార్త్ టెర్మినల్ భవనం కోసం 98 ఎకరాలు, ఎయిర్‌పోర్ట్ బౌండరీ కోసం 494 ఎకరాలు మేర ప్రతిపాదన ప్రతిపాదన చేశారు. నివాస ప్రాంతం, ఇతర అవసరాల కోసం 201 ఎకరాల కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏటా 36 మిలియన్ల మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా మూడు దశల్లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్లాన్ ప్రకారం 2703 ఎకరాల్ని కేటాయించాల్సి ఉన్నా.. 2203 ఎకరాలను మాత్రమే విమానాశ్రయానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం ప్రాజెక్టు వయబిలిటితో పాటు భవిష్యత్ అవసరాలు, సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలను కేటాయిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ జగన్.. అప్పుడు స్కాం కనిపించలేదా?:
వైసీపీ నేతలు లిక్కర్ పాలసీ అక్రమం అంటున్నారు, ఇవాళ ఉన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో ఉన్న మద్యం పాలసీనే అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్ర ప్రజానీకానికి ఉచితంగా ఇసుక తోలుకోమని చెప్పింది తన ప్రభుత్వమే అని, వైసీపీ పాలనలో గ్రామ స్థాయి నుంచి తాడేపల్లి వరకు కప్పం కట్టారని ఎద్దేవా చేశారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్.. ఇలా అన్ని స్కాములు జరిగింది మీ హయాంలోనే అని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని, రూ.3.5 లక్షల కోట్లు బిల్లులు పెండింగ్‌లో పెట్టారని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు.
తిరుచానూరు పద్మవతి అమ్మవారి కుంకుమతో వీరజవాన్ చిత్రపటం:
ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాలను గుర్తుచేసుకుంటూ తిరుపతికి చెందిన సూక్ష్మ కళాకారుడు పల్లి చిరంజీవి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమతో చిత్రాన్ని గీశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని కల్పించాలని ఉద్దేశంతో తిరుపతి నుంచి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా గ్రామానికి వెళ్లి.. తిరుచానూరు అమ్మవారి కుంకుమతో వేసిన చిత్రపటాన్ని వీరజవాన్ కుటుంబసభ్యులకు అందజేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ మురళీపై అభిమానంతో ఒక చిత్రకారుడుగా తన దేశభక్తిని చాటానని తెలిపారు. పద్మావతి అమ్మవారి కుంకుమతో చిత్రించిన వీరజవాన్ చిత్రపటాన్ని చూసి తిరుపతి జిల్లా కలెక్టర్ కళాకారుడు చిరంజీవిని అభినందించారు.
ట్రాఫిక్ నియమాన్ని పాటించిన వీధి కుక్క:
తాజాగా అలాంటి ఓ తెలివైనా జంతువు హైదరాబాద్‌లో కనిపించింది. అదే వీధి కుక్క. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వీధి కుక్క తెలివిని ఎలా ప్రదర్శించిందని మీకు అనుమానం వచ్చే ఉంటుంది. కొందరి మనుషులకంటే ఆ కుక్క చాలా బెటర్ అనే విధంగా మన్ననలు పొందింది. ఇది చేసిన పనిని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం మెచ్చుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ వీడియోలో.. ఓ కుక్క ట్రాఫిక్ నియమాన్ని తనకు ఇంతకు ముందు తెలిసినట్టుగానే పాటించింది. సిగ్నల్‌ను పడిన వెంటనే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆ మూగ జీవి జీబ్రా క్రాసింగ్ పై నుంచి రోడ్డు క్రాస్ చేసింది. మళ్లీ రోడ్డు అవతలి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ.. సిగ్నల్ పడి వాహనాలు నిలిచే వరకు వేచి ఉంది. సిగ్నల్ పడిన వెంటనే వాహనాలు నిలిచిపోవడంతో ఆ శునకం మళ్లీ జీబ్రా క్రాసింగ్ మీద నుంచి రోడ్డు దాటింది. ఇలా మూడు సార్లు ట్రాఫిక్ నియమాన్ని పాటిస్తూ.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మన్ననలు పొందింది. ఈ వీడియోను షేర్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.. “కొన్నిసార్లు, అతి చిన్న జీవులు మనకు అతిపెద్ద పాఠాలను నేర్పుతాయి.” అని రాసుకొచ్చారు. ఈ కుక్క చేసిన పనికి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలో మూగ జంతువుకు తెలిస్తే.. మనుషులకు ఎందుకు అర్థం కావడం లేదంటూ చాలా మంది కామెంట్ చేశారు.
బ్యాంకర్లు ఆర్థికసాయం చేస్తే:
జూన్ 2వ తేదీన ఐదు లక్షల యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్న లక్ష్యాన్ని సమయానికి సాధించేందుకు బ్యాంకర్ల సహకారం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో ఆయన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవడం ముఖ్యమని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఐదు లక్షల యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.6,250 కోట్లు సబ్సిడీతో ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు. యువతను ఉత్పత్తి రంగంలోకి తీసుకువచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేలా పథకం రూపొందించామని తెలిపారు.
వన్నీ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి శ్రేణిలో భాగమే:
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా నేడు వరంగల్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి భూపతి శ్రీనివాస వర్మ, ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లలో వరంగల్, బేగంపేట్, కరీంనగర్ స్టేషన్లను ప్రారంభించడం గర్వకారణమ్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి శ్రేణిలో భాగమే అని ఆమె తెలిపారు.
అగ్నివీరులు అంతా 20 ఏళ్ల లోపు వారే:
ఆపరేషన్ సిందూర్’’తో భారత్ పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ కేవలం 5 రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చింది. పాక్ వైమానిక ఆస్తుల్లో 20 శాతాన్ని కోల్పోయింది. మొత్తం 11 పాక్ ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది. దీనికి తోడు పాకిస్తాన్, పీఓకే లోని లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలు, ట్రైనింగ్ కేంద్రాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదుల హతమయ్యారు. ఇదిలా ఉంటే, ఈ ఆపరేషన్ ఇంత విజయవంతం కావడంతో ‘‘అగ్నివీరుల’’ కృషి ఉందని రక్షణ వర్గాలు ప్రశంసించాయి. సుమారుగా 3000 మంది అగ్నివీరులు గన్నర్లు, ఆపరేటర్లు, భారీ వాహన డ్రైవర్లుగా తమ సేవల్ని అందించారని, వీరి పనితీరు సాధారణ సైనికులతో సమానంగా ఉందని ప్రశంసలు దక్కుతున్నాయి. వీరందరి వయసు 20 ఏళ్ల లోపే కావడం గమనార్హం. వీరందర్ని అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యం రిక్రూట్ చేసుకుంది.
జ్యోతి మల్హోత్రాకు స్పాన్సర్ చేసి పాక్ ట్రావెల్ సంస్థ:
పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయం దేశంలో సంచలనంగా మారింది. జ్యోతితో పాటు మరో 11 మంది పాక్ కోసం గుఢచర్యం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం, పోలీస్ కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రా నుంచి విచారణ అధికారులు, నిఘా ఏజెన్సీలు కీలక విషయాలను రాబడుతున్నాయి. ఇప్పటికే, పాక్ హైకమిషన్‌లోని ఉద్యోగి డానిష్‌తో సంబంధాలు, పాక్ పర్యటనల గురించి, పాకిస్తాన్‌లో ఎవరెవరిని కలిశారు అనే విషయాలను ఎన్ఐఏ, ఐబీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థలు సేకరించాయి. పాక్ తరుపున గూఢచర్యం చేసినట్లు జ్యోతి మల్హోత్రా అధికారుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జ్యోతి చేసిన అనేక వీడియోలను యూఏఈకి చెందిన పాక్‌లో పనిచేస్తున్న ట్రావెల్ కంపెనీ స్పాన్సర్ చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు పాకిస్తాన్‌లో పనిచేయడానికి లైసెన్స్ కలిగి ఉన్న వీగో సంస్థ స్పాన్సర్ చేసింది. ప్రస్తుతం పోలీసులు ఆమెకు స్పాన్సర్లందరిని విశ్లేషిస్తోంది. ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న జ్యోతికి ఈ ప్లాట్‌ఫామ్‌లో దాదాపు 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1,32,000 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.
పాక్ పరిస్థితిపై మోడీ విమర్శలు:
పాకిస్తాన్‌పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ గురువారం రాజస్థాన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. బికనీర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాకిస్తా్న్‌పై మోడీ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై జరిపిన దాడుల్ని మోడీ హైలెట్ చేశారు. పాకిస్తాన్‌లోని రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌కు జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుతూ.. ఆ ఎయిర్‌బేస్ ‘‘ఐసీయూ’’లో ఉందని అన్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ..‘‘ నేను ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు, బికనీర్‌లోని నల్ విమానాశ్రయంలో దిగాను. పాకిస్తాన్ కూడా దీనిని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ వారు ఈ వైమానిక స్థావరాన్ని దెబ్బతీయడంలో విఫలమయ్యారు. సరిహద్దుకు అవతలి వైపున రహీం యార్ ఖాన్ వైమానిక స్థావరం ఉంది. ఇది ఐసియులో ఉంది. ఇది ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు? భారత దళాలు ఈ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశాయి.’’ అని అన్నారు.
మీకు రెండు ‘‘చికెన్ నెక్’’లు ఉన్నాయి.. బంగ్లాదేశ్‌కి హెచ్చరిక:
బంగ్లాదేశ్‌కి అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంగా భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. ఇదిలా ఉంటే, మన దేశంలోని ఇతర రాష్ట్రాలతో, ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానించే ‘‘సిలిగురి కారిడార్(చికెన్ నెక్)’’కి సమీపంలో బంగ్లాదేశ్ లాల్మొనిర్హాట్ వైమానిక స్థావరాన్ని పునరుద్ధరిస్తోంది. ఇది భారత్‌కి 100 కి.మీ దూరంలో ఉంది. దీని పునర్నిర్మాణంలో చైనా సహకరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో హిమంత వ్యాఖ్యలు రావడం గమనార్హం. భారతదేశానికి ఒక చికెన్ నెక్ ఉంటే, బంగ్లాదేశ్‌కి రెండు చికెన్ నెక్స్ ఉన్నట్లు హెచ్చరించారు. ‘‘మాకు ఒక చికెన్ నెక్ ఉంది. బంగ్లాదేశ్‌కి రెండు చికెన్ నెక్‌లు ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ ఓడరేవును అనుసంధానించే ప్రాంతం భారత చికెన్ నెక్ కన్నా సన్నగా ఉంటుంది. ఒక్క రాయి విసిరే దూరంలో ఉంది. ’’ అని ఆయన అన్నారు.
పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మతోన్మాది:
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులే టార్గెట్‌గా ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ తర్వాత పాక్ జరిపిన వైమానిక దాడుల్ని తిప్పికొట్టింది. భారత దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 11 కీలకమైన ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాల తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ డచ్ మీడియాకు బుధవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. దీంట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆసిమ్ మునీర్‌కి ‘ఫీల్డ్ మార్షల్’గా పాక్ ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తీవ్రమైన ‘‘మతపరమైన దృక్పథం’’ ద్వారానే పహల్గామ్ ఉగ్రదాడికి ఉగ్రవాదులు పాల్పడ్డారని, 26 మందిని మతం ఆధారంగా టార్గెట్ చేసి చంపారని అన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా మతపరమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టారని విమర్శించారు. పహల్గామ్ దాడికి కొన్ని రోజుల ‘హిందువులు, ముస్లింలు కలిసి ఉండలేరు’ అని పాకిస్తాన్ సంస్కృతిని ప్రస్తావించిన మునీర్‌ను జైశంకర్ ఒక మతోన్మాదిగా పిలిచినట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్ జట్టులోకి ఆడి కొడుకొచ్చేశాడు:
ఇండియా ‘ఎ’తో ఇంగ్లండ్ లయన్స్ జట్టు నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడనుంది. ఇండియా ఎతో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్ లయన్స్ 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కింది. 17 ఏళ్ల రాకీ 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌పై సెంచరీ చేయడంతో రాకీకి చోటు దక్కింది. యాషెస్ 2005 హీరో ఫ్లింటాఫ్ కుమారుడిపై భారీ అంచనాలే ఉన్నాయి.
ముంబై రెండో స్థానానికి చేరుకుంటుందా?:
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాయి. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచుల్లో ఎనిమిదింట్లో విజయం సాధించిన ముంబై.. 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న ముంబై.. రెండో స్థానంలోకి దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది జరగాలంటే పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో ముంబై కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ పంజాబ్‌గెలిస్తే ముంబై ఖాతాలో 18 పాయింట్స్ చేరుతాయి. అయితే గెలిచినంత మాత్రాన ముంబైకి రెండోస్థానం దక్కదు. మరి ఆ అవకాశాలు ఏంటో ఓసారి చూద్దాం. ప్రస్తుతం 18 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ మొదటి స్థానంలో ఉంది. 17 పాయింట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో, అదే 17 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ మూడో స్థానంలో ఉంది. లీగ్ దశలో లక్నో, చెన్నైలతో గుజరాత్ ఆడాల్సి ఉంది. హైదరాబాద్, లక్నోతో బెంగళూరు తలపడాల్సి ఉంది. ఢిల్లీ, ముంబైతో పంజాబ్ తలపడాల్సి ఉంది. ముంబై టాప్-2 లోకి రావాలంటే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ మిగతా మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అలాగే పంజాబ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో ముంబై విజయం సాదించాలి. ఇది జరిగితేనే ముంబై రెండో స్థానానికి చేరుకుంటుంది.
సల్మాన్ ఖాన్‌కు భద్రతా ముప్పు:
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంత భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ చొరబాటు ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు? గత రెండు రోజుల్లో ఇద్దరు వేర్వేరు వ్యక్తులు సల్మాన్ ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. వారిద్దరూ భవనంలోకి ప్రవేశించి సల్మాన్ ప్లాట్‌కు చేరుకున్నారు. అయితే, పోలీసులు సకాలంలో ఇద్దరినీ అరెస్టు చేశారు. సల్మాన్ ఇంట్లోకి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు సమయాల్లో ప్రవేశించారు. వారిని జితేంద్ర కుమార్, ఇషా చబాడియాగా గుర్తించారు. ఇషాను పోలీసులు విచారించగా, సల్మాన్ ఆహ్వానం మేరకు ఆమె అక్కడికి చేరుకున్నట్లు చెప్పింది. అయితే, సల్మాన్ కుటుంబం ఆమె వాదనను ఖండించింది.
ప్రభాస్ పక్కన క్రేజీ హీరోయిన్:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇంకా మొదలు కాకముందే.. రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ మూవీ గురించి అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇందులో దీపిక పదుకొణెను తీసుకుంటారనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. దీపిక ఇందులో నుంచి తప్పుకుందంట. ఆమె పెడుతున్న కండీషన్లు భరించలేక సందీప్ ఆమెను వద్దని చెప్పేసినట్టు తెలుస్తోంది. ఆమె స్థానంలో ఓ క్రేజీ హీరోయిన్ ను తీసుకువస్తున్నాడంట సందీప్ రెడ్డి. ప్రభాస్ పక్కన హైట్, అందం అన్నింటిలో సరితూగే మృణాల్ ఠాకూర్ తో చర్చలు జరుపుతున్నారంట. త్వరలోనే ఆమెను ఫిక్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా మృణాల్ కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు కాబట్టి అది కూడా మూవీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఇందులో ఫస్ట్ టైమ్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రభాస్ ఫౌజీ, ది రాజాసాబ్ మూవీలను ఫినిష్ చేసే పనుల్లో ఉన్నాడు.
ఆమె నాకు క్షమాపణలు చెప్పింది:
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఓ వివాదంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. గతంలో ఓ ఈవెంట్ లో సిమ్రాన్ మాట్లాడుతూ ‘నేను ఓ సినిమా చూశాను. అది నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఓ నటి పాత్రను ప్రశంసిస్తూ నేను ఓ నోట్ రాశాను. దానికి ఆమె ఇచ్చిన రిప్లైతో నిజంగా షాక్ అయ్యాను. ఆమె ఆంటీ రోల్స్ చేయడం కన్నా ఇలాంటి డబ్బా రోల్స్ చేయడమే బెటర్ అంటూ రిప్లై ఇచ్చింది. అది చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. అయినా అలాంటి డబ్బా రోల్స్ చేయడం కంటే గౌరవంగా ఆంటీ రోల్స్ చేయడంలో తప్పులేదు’ అంటూ సిమ్రాన్ మాట్లాడింది. ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. డబ్బా కార్టెల్ సిరీస్ లో చేసిన నటిని ఉద్దేశించే ఇలాంటి కామెంట్లు చేసిందంటూ రూమర్లు వచ్చాయి. ఈ వివాదంపై తాజాగా సిమ్రాన్ స్పందించింది. నేను మాట్లాడింది చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ నటిని నేను ప్రశంసించాను. కానీ ఆమె సరిగా అర్థం చేసుకోలేదు. తర్వాత నాకు సారీ కూడా చెప్పింది. నిజంగా ఆమె నటన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’ అంటూ చెప్పుకొచ్చింది సిమ్రాన్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.