NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర

ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. పైగా రానున్న ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి వాటిపై ప్రభావం పడే అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు నేడు (శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేశారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అస్వస్థత.. పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయిన ఎంపీ..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. షుగర్ లెవల్స్ డౌన్ కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు పిల్లి సుభాష్ చంద్రబోస్. హుటాహుటిన డాక్టర్ల పర్యవేక్షణలో రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.. వైద్యుల సహకారంతో వెనువెంటనే తేరుకున్నారట వైసీపీ రాజ్యస సభ్యులు సుభాష్ చంద్రబోస్.. ఈ విషయాన్ని మీడియాకు వివరించారు వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి.. ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌కు అస్వస్థతపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి.. ఈరోజు పార్లమెంట్‌లోకి వస్తూ.. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కళ్లు తిరిగి పడిపోయారు.. ఇది గమనించిన సిబ్బంది.. మాకు, వైద్యులకు సమాచారం ఇచ్చారు.. వెంటనే వైద్యులు పరీక్షలు నిర్వహించారు.. షుగర్‌ బాగా డౌన్ అయ్యింది.. మార్నింగ్‌ నుంచి ఏమీ తినకపోవడం వల్లే షుగర్‌ డౌన్‌ అయినట్టు డాక్టర్లు చెప్పారని తెలిపారు.. పార్లమెంట్‌ లోనే ప్రాథమిక చికిత్స అందించి.. తర్వాత ఎలాంటి సమస్య లేకుండా ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించాం. వైద్యులు ఎలాంటి ఇష్యూ లేదని.. ప్రస్తుతం ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి..

పీసీబీకి మరో తలనొప్పి.. తొలగించడం లేదంటూ వివరణ!

ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) సర్వం సిద్ధం చేస్తోంది. ట్రోఫీ ఏర్పాట్లలో బిజీగా ఉన్న పీసీబీకి మరో తలనొప్పి వచ్చింది. పాకిస్థాన్‌కు వన్డే ప్రపంచకప్‌ అందించిన మాజీ కెప్టెన్, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్‌ పేరును గడాఫీ స్టేడియం నుంచి తొలగిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ వార్తలపై పీసీబీ వర్గాలు స్పందించాయి. ఎవరి పేర్లను తొలగించడం గాని, మార్చడం గాని చేయడం లేదని పేర్కొన్నాయి.

ఇమ్రాన్‌ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్‌ టీమ్ 1992లో ప్రపంచకప్‌ను గెలిచింది. ఇందుకు గుర్తుగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఇమ్రాన్‌ పేరుతో ఓ స్టాండ్‌ను పీసీబీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌.. జైలు జీవితం గడుపుతున్నారు. ఫిబ్రవరి 7న గడాఫీ స్టేడియాన్ని ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ పునఃప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంలో ఇమ్రాన్‌ పేరును తొలగిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ న్యూస్ పీసీబీ వద్దకు చేరగా.. తాజాగా బోర్డు వర్గాలు వివరణ ఇచ్చాయి. ఇటీవల గడాఫీ స్టేడియాన్ని పీసీబీ ఆధునీకరణ చేసింది.

విధులకు డుమ్మా కొట్టి.. క్రికెట్ ఆడుతున్న పంచాయతీ సెక్రటరీలు

ప్రభుత్వ ఉద్యోగులు అంటే అలసత్వం, నిర్లక్ష్యం, లంచగొండితనం అనే ముద్ర పడింది. తాజాగా, నల్లగొండ జిల్లాలో కొందరు పంచాయతీ సె్క్రటరీలు చేసిన పని కూడా నిర్లక్ష్యానికి నిలువుటద్దం అని చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే.. నల్గొండలో అనధికారికంగా కొందరు పంచాయతీ సెక్రటరీలు విధులకు డుమ్మా కొట్టి.. గత రెండు రోజులుగా క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, నాలుగు రోజులుగా 60 మందికి పైగా పంచాయతీ సెక్రటరీలు విధులకు గైర్హాజరు అయ్యారు. హాలియాలోని ప్రైవేట్ బీఈడీ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. అయితే, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫ్లెక్సీలతో రెండు రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. అందులో వీళ్లు పాల్గొన్నారు. ఒకవైపు ఎన్నికల కోడ్, మరోవైపు ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనను గాలికీ వదిలేసి ఆట పాటలతో బిజీగా గడుపుతున్నారు ఈ పంచాయతీ సెక్రటరీలు. తీవ్ర విమర్శలకు తావిస్తున్న కొందరు పంచాయతీ సెక్రటరీ లీడర్ల వ్యవహారం. ఇక, పంచాయతీ సెక్రటరీలు విధులకు డుమ్మా కొట్టడం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో తీవ్రంగా మండిపడ్డారు. గైర్హాజరు అయినా అధికారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు వెళ్లాయి. విధులకు డుమ్మా కొట్టి.. క్రికెట్ ఆడిన పంచాయతీ సెక్రటరీలకు మెమో జారీ చేసే అవకాశం ఉంది.

ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్నా.. నేను కొడితే మాములుగా ఉండదు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా నేను మోనంగా, గంభీరంగా చూస్తున్నా.. నేను కొడితే మాములుగా ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్ వాళ్ళకి చూపించి మెడలు వుంచుతామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు.. కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని అన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది.. నేను చెప్పిన ప్రజలు వినలేదు.. అత్యాశకు పోయి కాంగ్రెస్‌కి ఓటేశారని కేసీఆర్ పేర్కొన్నారు. రైతు బంధుకి రాంరాం, దళితబంధుకి జై భీం చెబుతారని ఆనాడే చెప్పాను.. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కి ఓటేశారని ఆరోపించారు.

2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.. మళ్ళీ కేసీఆరే సీఎం

పదవీకాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మన్ లకు తెలంగాణ భవన్‌లో ఆత్మీయ సత్కారం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన మున్సిపాలిటీలను అభివృద్ది చేసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ హయంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చామని, 700 కోట్లతో నల్లగొండను అభివృద్ది చేసుకున్నామని ఆయన తెలిపారు.

ఈత సరదా.. రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు యువకులు గల్లంతు

ఈత సరదా ఇద్దరి యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని ఆర్కే బీచ్‌లో విషాదం నెలకొంది. కొందరు ఇంటర్మీడియట్ విద్యార్థులు సరదాగా ఆర్కే బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో సముద్రంలో స్నానానికి దిగారు. మొత్తం 11 మంది విద్యార్థులు బీచ్‌కు రాగా.. అందులో ఆరుగురు విద్యార్థులు సముద్రంలో స్నానానికి దిగారు. అయితే సముద్రంలో అలల ధాటికి నిఖిల్ (18) అనే విద్యార్థి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. దీంతో.. విద్యార్థి నిఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి కోసం వెతికే పనిలో పడ్డారు.

కుంభమేళాలో మరో విషాదం.. ట్రక్కు ఢీకొనడంతో పలువురి మృతి!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఘాజీపూర్‌లో భక్తుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురి మృతిచెందినట్లు తెలుస్తోంది. కుంభమేళాలో పాల్గొని తిరిగి వస్తుండగా ఘాజీపూర్‌లో భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనాస్థలికి చేరుకుంటున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నంద్‌గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కుస్మి కాలా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

కేంద్ర బడ్జెట్ వేళ.. రేపటి నుంచి మారనున్న రూల్స్ ఇవే!

దేశ ప్రజల చూపంతా ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే ఉంది. ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తారు? వస్తువుల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? బంగారం ధరల పరిస్థితి ఏంటి అంటూ చర్చలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ వేళ రేపటి నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. ప్రతి నెల మాదిరిగానే ఫిబ్రవరి నెలలో కూడా బ్యాంకింగ్, యూపీఐ, గ్యాస్ వంటి వాటిల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన

హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ, రానున్న రెండున్నర ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 40 విభాగాలు పనిచేస్తాయని, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. రూ. 2700 కోట్ల వ్యయంతో, అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుపత్రిని నిర్మించనున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రిని ఆధునికీకరించి, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి రాజనర్సింహ తెలిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌ ఇప్పుడు అమల్లోకి వచ్చిందని, త్వరలోనే పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.