NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మూసీ ప్రాంతంలో కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలి..

మూసీ ప్రాంతంలో కూల్చివేతలు జరగకుండా మేము అడ్డం కూర్చుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలని తెలిపారు. హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. అనవసరంగా మూసి సుందరీకరణ అంటున్నారు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యా నించారు. కాంగ్రెసు పార్టీ అంటే ఆపన్న హస్తం అంటారు…కానీ ఇది భస్మాసుర హస్తం గా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మార్చుకొని… బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి అన్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఎఫ్టీఎల్ లో ఉందని గుర్తు చేశారు. ముందు నీ ఇల్లు, నీ సోదరుని ఇల్లు కూల్చుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపదొస్తే ఫోన్ చేయండి.. అర్ధగంటలో మీ ముందుంటా అన్నారు. బుల్‌డోజర్లు వచ్చినా.. జేసీబీలు వచ్చినా.. ముందు మమ్మల్ని దాటి రావాలన్నారు.

లేక్స్ లేకపోతే విజయవాడ పరిస్థితే హైదరాబాద్ కు..

లేక్స్ లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఇటీవల విజయవాడ నగరం వరదలో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాదులోనూ ఏర్పడతాయి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నది గర్భంలో ఇల్ల నిర్మాణాలు చేస్తున్నారు. వీటిని ఇప్పటికీ ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుంది. హైదరాబాద్ కి ప్రాణాంతకంగా మారుతుంది. పేదవాళ్లను అడ్డంపెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారు. ధన, మానప్రాణాలు కాపాడడం ప్రభుత్వం బాధ్యత. ఆస్తులు కాపాడడం ప్రభుత్వం బాధ్యత. అందులో భాగంగా చెరువులను రక్షించేందుకు భవిష్యత్తు తరాలను అందించేందుకు తెలంగాణ రాష్ట్రంలో చర్యలు చేపట్టాం. వందల చెరువులు కనపడకుండా పోయాయి. కనీసం చెరువు గర్భంలో కట్టుకోకుండా అయినా ఆపాలి అనేది మా ప్రభుత్వం ఆలోచన అన్నారు. మూసీ నదిలో మంచినీరు పారించడం, పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అన్నారు.

అండర్ గ్రౌండ్ మెట్రోను ప్రారంభించిన మోడీ!

సెప్టెంబరు 26న జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ పూణె పర్యటన వర్షం కారణంగా రద్దయింది. జిల్లా కోర్ట్ మెట్రో స్టేషన్ నుండి స్వర్గేట్ మెట్రో స్టేషన్ (పుణె మెట్రో) వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్గాన్ని ఈరోజు ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ స్వయంగా ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే హాజరయ్యారు. ఇక ఈ విషయం పూణే వాసులకు నిజంగానే శుభవార్త. చాలా కాలంగా ఎదురుచూస్తున్న జిల్లా కోర్టు నుండి పూణేలోని స్వర్గేట్ మొదటి భూగర్భ మెట్రో లైన్ (పూణే మెట్రో) నేటి నుండి ప్రయాణీకుల కోసం ప్రారంభమైంది. జిల్లా కోర్టు నుండి స్వర్గేట్ మెట్రో మార్గాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ మెట్రోని ఆన్‌లైన్‌లో నరేంద్ర మోదీ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ హాజరుఅయ్యారు. ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత సాధారణ ప్రయాణికులకు మార్గం తెరవబడుతుంది. ఈ మార్గంలో డిస్ట్రిక్ట్ కోర్ట్, కస్బా పేత్, మండై, స్వర్గేట్ అనే 4 మెట్రో స్టేషన్లు ఉన్నాయి.

ఆర్టీసీ కార్మికులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలో పీఆర్సీ, కారుణ్య నియామకాలు..

ఆర్టీసీ లో ఉద్యోగులు ,కార్మికులకు పీఆర్సి ,కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ,డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్ లని మొదటి విడత గా ప్రారంభిస్తున్నామన్నారు. జేబీఎం సంస్థ తో ఆర్టీసీ ఒప్పందం చేసుకుందన్నారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్ లను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డిజిల్ బస్ కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నమని తెలిపారు. హైదరాబాద్ లో అన్ని ఎలక్ట్రిక్ బస్ లు నడిపేలా చూస్తామన్నారు. విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీ ని మెరుగు పరుస్తామని తెలిపారు. రాష్ట్ర మహా లక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుండి రూ.3200 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం మహిళలు చేశారన్నారు. ఆర్టీసీ బస్ లకి ఇప్పుడు డిమాండ్ పెరిగిందన్నారు. ఆర్టీసీ – ప్రభుత్వం కలిపి త్వరలోనే బస్ ల కొనుగోలు చేస్తామన్నారు. ఆర్టీసీ లో ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సి ,కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామన్నారు.

బుల్డోజర్లు ముందు మా మీద.. ఆ తరువాత పేదల ఇళ్ల వద్దకు..

హైడ్రా బుల్డోజర్లు ముందు మా మీద నుండి వెళ్ళాలి.. అప్పుడే పేదల ఇళ్ల వద్దకు వెళ్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పై కిషన్ రెడ్డి రాగానే బీజేపీ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పేదలకు అండగా బీజేపీ ఉంటుందన్నారు. ఒకటి రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. బుల్డోజర్ ముందు మా మీద నుండి వెళ్ళాలని.. అప్పుడే పేదల ఇళ్ల వద్దకు వెళ్తాయన్నారు. తెలంగాణ లో హైడ్రా పాపం కాంగ్రెస్ కు తగులుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఇబ్బందులు తలెత్తిన అధికారులతో మీడియా సమావేశం పెట్టి తప్పును కప్పి బుచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా రాజ్యం అంటే పేదల ఇళ్ళు కూల్చడమా?? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తుందని మండిపడ్డారు. పట్టాలు , లింకు డాక్యుమెంట్స్ , గ్రామా పంచాయితీ అనుమతి ఉందని తెలిపారు. అందులో ఉన్నవారంతా పేదలే అన్నారు. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమీక్ష చేయాలని బండి సంజయ్ తెలిపారు.

పెద్ద స్కెచ్ తోనే రంగంలోకి దిగారు.. ఈటల కీలక వ్యాఖ్యలు..

లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన చేస్తామని.. పెద్ద స్కెచ్ వేసుకొని రంగంలోకి దిగారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో నేను వచ్చే సమయం లేక రాకపోయినా.. నాకు సంపూర్ణ మద్దతిచ్చి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. టెక్నికల్ గా గెలిచింది ఈటల రాజేందర్ కావచ్చు.. కానీ గెలిచింది మల్కాజ్ గిరి ప్రజలు అన్నారు. ప్రలోభాలు, దావతులు, కుట్రలు, విష ప్రచారాలు ఎన్ని చేసిన నన్ను నమ్మి మీరందరూ ఓటు వేశారన్నారు. మిషన్ భగీరథ, కాలేశ్వరం లాంటివి అయిపోయాయి ఇక డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని ఆలోచన చేసి.. మూసి ప్రక్షాళనను తెరమీదకు తీసుకొచ్చారన్నారు. లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన చేస్తాము అంటున్నారు. పెద్ద స్కెచ్ వేసుకొని రంగంలోకి దిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది..

కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డగా మారిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు.. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని దుయ్యబట్టారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు.. ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారని అన్నారు. అడ్డగోలుగా దాడులు చేస్తున్నారు.. చంద్రబాబు వైఖరి వలనే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని మేరుగ నాగార్జున తెలిపారు. ఈ దాడులను ఆపాలని ఏనాడూ చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు..? అని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తమ ఎమ్మెల్యేలు తప్పుదారిలో నడిస్తే చర్యలు తీసుకున్నారు.. చంద్రబాబు హయాంలో ప్రత్యర్థులు కదిలినా, మెదిలినా కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.

నా ఫోటోలు, నా ఇంటి లొకేషన్‌ను ముంబైలోని ఎవరో వ్యక్తికి ఫార్వర్డ్ చేశారు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. వారిద్దరినీ మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఇస్మాయిల్, మహ్మద్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు బీజేపీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర తిరుగుతుండగా వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్‌ఓ) వారిని పట్టుకుని భౌతికంగా తనిఖీ చేసిన తర్వాత మంగళ్‌హాత్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి వారి పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 27 మధ్య రాత్రి 2 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చి రెక్కీ చేశారని, నా ఇంటి ఫోటోలు & వీడియోలు తీశారని తెలిపారు. అనుమానం వచ్చి స్థానికులు వాళ్ళని పట్టుకున్నారని, అందులో మరో ఇద్దరు పరార్ అయ్యారన్నారు. స్థానికులు వారి ఫోన్ తెరిచి చూడగా నా ఫోటోలు & నా ఇంటి లొకేషన్‌ను ముంబైలోని ఎవరో వ్యక్తికి ఫార్వర్డ్ చేశారని, ఇద్దరు యువకులను మంగళ్‌హాట్‌ పోలీసులకు అప్పగించారన్నారు. పోలీసుల విచారణ సాగుతోందని ఆయన తెలిపారు.

క్షీణించిన మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం.. వేదికపై ప్రసంగిస్తూ..

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం క్షీణించింది. కథువాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన వచ్చారు. వేదికపై ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. స్పృహతప్పి పడిపోబోగా.. ఆయన పక్కనున్న భద్రతా సిబ్బంది, వేదికపై ఉన్న ఇతర కాంగ్రెస్ నాయకులు సకాలంలో ఆయన దగ్గరకు వెళ్లి పట్టుకున్నారు. మంచి నీళ్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని కొంతసేపు నిలిపివేశారు. అంతా సర్దుమనిగాక.. ఖర్గే మాట్లాడుతూ.. మోడీని అధికారం నుంచి గద్దె దించే వరకు తాను చనిపోనన్నారు. “ఈ వ్యక్తులు (కేంద్ర ప్రభుత్వం) జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఎప్పుడూ కోరుకోలేదు. వారు తలచుకుంటే ఒకట్రెండేళ్లలోపు పూర్తి చేసి ఉండేవారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా రిమోట్‌ ప్రభుత్వాన్ని నడపాలనుకున్నారు. గత 10 ఏళ్లలో భారత యువతకు ప్రధాని మోడీ ఏమీ ఇవ్వలేదు. 10 సంవత్సరాలలో మీ శ్రేయస్సును తిరిగి తీసుకురాలేని వ్యక్తిని మీరు విశ్వసించగలరా? మీ ముందుకు బీజేపీ నేతలెవరైనా వస్తే శ్రేయస్సు తెచ్చిందో లేదో అడగండి.” అని వ్యాఖ్యానించారు.

బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల లైంగిక వేధింపులు..

ముంబైలో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు తెచ్చారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ట్యూషన్ టీచర్లు పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్, తరుణ్ రాజ్ పురోహిత్, సత్యరాజ్ అనే ముగ్గురు ఉపాధ్యాయులు బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా, ఆమె అసభ్యకరమైన చిత్రాలను, వీడియోలను కూడా చూపించారు. ఈ కేసులో గౌతమ్, తరుణ్ రాజ్‌పురోహిత్‌లను సెప్టెంబర్ 28న అరెస్టు చేశారు. సోమవారం వరకు కస్టడీలో ఉంటారు. సత్యారాజ్‌ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు కూడా బాలికపై పదే పదే వేధింపులకు పాల్పడ్డారు. ఆమె తల్లి మొదట్లో ఫిర్యాదు చేసేందుకు ఇష్టపడలేదని, కౌన్సిలర్ ఆమెను ఒప్పించడంతో తాము అమ్మాయి స్టేట్‌మెంట్ రికార్డు చేశామని, నిందితులు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లి అనుచితమైన, అసభ్యకరమైన చిత్రాలను, వీడియోలను చూపారని పోలీసులు తెలిపారు.