NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పెళ్లి పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య..

నంద్యాల జిల్లాలో పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేయడంతో.. మైనర్ బాలిక బలైంది. నందికొట్కూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో వ్యాసమోల్ తాగి బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది బాధితురాలు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మిడుతూరుకు చెందిన మైనర్ బాలిక కర్నూలు కేవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. బాలికను తెలంగాణ పెబ్బేరు మండలం వెంకటాయంపల్లికు చెందిన.. సమీప బంధువు అయిన యువకుడు పెళ్లి చేసుకోవాలని వేధించినట్లుగా చెబుతున్నారు.. బాలికకు యువకుడు సమీప బంధువు కావడంతో ఇద్దరికి వివాహం చేయాలని పెద్దల మధ్య కూడా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే, అప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంలోని బాలిక.. ఇంకా చదువుకోవాలని, పెళ్లికి సమయం కావాలని చెబుతూ వచ్చింది.. కానీ, కర్నూలులో కంప్యూటర్ సెంటర్ వద్ద పెళ్లి చేసుకోవాలంటూ బాలికతో సదరు యువకుడు వాగ్వాదానికి దిగాడు.. చదువు అవసరం లేదు పెళ్లి చేసుకుందామంటూ ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తుంది.. దీంతో.. విసిగిపోయిన బాలిక వాసమోల్ కొని నందికొట్కూరు బస్టాండ్ దగ్గర తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.. అయితే, బాలికను కర్నూలుకు తరలించగాలో.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, ఈ ఘటనపై బాలిక బంధువులు నోరు మెదపడం లేదు.

దేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది

ప్రధాని నరేంద్ర మోడీ రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఆయన మనతో ఉండి ఉంటే ఎంతో ఆనందంగా ఉండేదన్నారు. సోమవారం గుజరాత్‌లోని వడోదరలో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిసి టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రత్యేక సందర్భంగా టాటా సన్స్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటాను గుర్తుచేసుకున్నారు ప్రధాని మోడీ. ఇటీవల మనం దేశం గొప్ప కుమారుడు రతన్ టాటా జీని కోల్పోయామని ఆయన అన్నారు. ఈరోజు ఆయన మనమధ్య ఉంటే చాలా సంతోషంగా ఉండేవారు. కానీ, ఆయన ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ మాత్రం కచ్చితంగా ఆనందంగా ఉంటారని ఆయన అన్నారు. ఈ C-295 ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీ కొత్త భారతదేశపు కొత్త పని సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ప్రధాని మోడీ అన్నారు.

తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు

లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం నాడు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ఇదివరకే నగరంలోని 10 హోటళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉన్న తాజ్ హోటల్‌కు పంపిన ఇమెయిల్‌లో ఆవరణలో బాంబు పేలుడు సంబంధిత విషయం ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు నివేదించాయి. ఆదివారం (అక్టోబర్ 27) లక్నోలోని 10 హోటళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా సోదా చేసింది. అయితే, ప్రాంగణాన్ని విస్తృతంగా పరిశీలించిన తర్వాత, అన్ని బెదిరింపులు నిరాధారమైనవిగా తేల్చారు అధికారులు.

ఇది కర్ఫ్యూ కాదు.. దీపావళి పండుగకు ఎలాంటి ఆంక్షలు లేవు..

హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు వెల్లడించారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నవంబర్ 28వరకు వరకు నెలరోజుల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లోకి పాత జీవోలు..!

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. గత వైసీపీ సర్కార్‌ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేయాలని నిర్ణయించింది.. 2021 ఆగస్టు 15 తేదీ నుంచి 2024 ఆగస్టు 28 తేదీ వరకూ గోప్యంగా ఉంచేసిన జీవోలన్నింటినీ జీవోఐఆర్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు సాధారణ పరిపాల శాఖ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్.. ప్రస్తుతం జీవోఐఆర్ వెబ్ సైట్ ను పునరుద్ధరించటంతో పాత జీవోలన్నీ అప్ లోడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఉత్తర్వులనూ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది ప్రభుత్వం.. 2008 నుంచి ఇప్పటి వరకూ అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ జీవోఐఆర్ వెబ్ పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్న సర్కార్.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకూ మాత్రమే ఉత్తర్వులు అందుబాటులో లేకుండా పోయాయని.. వాటన్నింటినీ అప్ లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేసినట్టు సాధారణ పరిపాలన శాఖ వెల్లడించింది.

ఆర్మీ వాహనంపై దాడి.. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..

జమ్మూ కాశ్మీర్ వరస ఉగ్రదాడులతో ఉద్రిక్తంగా ఉంది. వలస కూలీలు, ఆర్మీ జవాన్లు టార్గెట్‌గా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. సోమవారం అఖ్నూర్ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. జవాన్లు తిరిగి ఉగ్రవాదులపై కాల్పులు జరపడంతో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు ఆ ప్రాంతం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. బటాల్ ప్రాంతంలో ఉదయం 7 గంటల సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ స్రాంతాన్ని చుట్టుముట్టి, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దీపావళి పండగ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు, ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో విస్తృతమైన భద్రత ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. మరోవైపు కాశ్మీర్ లోయలో గత వారం నుంచి ఉగ్రవాదుల దాడుల్లో ఇద్దరు సైనికులతో సహా 12 మంది మరణించారు.

సంపద సృష్టిస్తానని వేల కోట్లు అప్పులు.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పటికే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. చివరకు జగన్ సృష్టించిన సంపదను కూడా తన వారికి ఇచ్చేస్తున్నారని అన్నారు. జగన్ కొత్త పోర్టులను సృష్టిస్తే, వాటిని ప్రైవేటు పరం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను తనవారికి పంచుతున్నారు.. రాష్ట్ర విభజన సమయంలో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేయాలని చట్టంలో ఉంది.. కానీ 2014-19 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం కనీసం రామాయపట్నం ఊసే ఎత్తలేదని పేర్ని నాని పేర్కొన్నారు. జగన్ ఆ పోర్టును రెడీ చేశారు.. షిప్‌లు రావటానికి కూడా అనుమతులు వచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. బందరు పోర్టు వైయస్సార్ కల.. ఆ కలను జగన్ సాకారం చేస్తుండగా మళ్ళీ చంద్రబాబు వచ్చి ప్రైవేటు పరం చేశారని ఆరోపించారు.

ఇప్పుడు ఓబీసీ కులగణన వీళ్లకు గుర్తుకు వచ్చింది

ఏ పార్టీ నోట విన్నా ఓబీసీలకు అన్యాయం జరిగిందని అంటున్నాయని, రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీలు ఓబీసీ గురించి మాట్లాడుతున్నాయన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. ఇవాళ ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఇన్ని ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అని, ఇప్పుడు ఓబీసీ కులగణన వీళ్లకు గుర్తుకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. బ్రిటీష్ కాలంలో కులగణన జరిగిందని, 65 శాతం ఉన్న ఓబీసీల కులగణన ఎంతో తెలియదన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌. ఓబీసీల కులగణన జరిగితే ప్రభుత్వాలపై తిరుగుబాటు వస్తుందని భయపడ్డారని, కులగణన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. బీహార్, మహారాష్ట్ర ఓబీసీ కులగణన చేస్తామంటే కేంద్రం ఒప్పుకోలేదని, ఓబీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలన్నారు శ్రీనివాస్ గౌడ్‌. బీహార్ లో 63.1 శాతం ఓబీసీలు ఉన్నట్లుగా కులగణనలో తేలిందని, మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌.

రాష్ట్రంలో 70 మంది రెవెన్యూ అధికారుల బదిలీ

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖలో పెద్ద మార్పులను ప్రారంభించారు. ఆయన పుట్టిన రోజునే 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఒకేసారి బదిలీ చేశారు. ఇటీవల రెవెన్యూ సంఘాలు ప్రమోషన్స్ , బదిలీలపై మంత్రిని కలిసి ప్రస్తావించడంతో, ఈ మార్పులు జరిగినాయి. ఈ బదిలీల విండో చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే పలు అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, భూ సేకరణ అధికారులు , సివిల్ సప్లయిస్ శాఖల్లో పనిచేసే అధికారులను కూడా బదిలీ చేశారు. కొందరు తమ కోరిక మేరకు స్థానాలు పొందలేక పోయారు, అయితే మరికొందరు ప్రాధాన్యత కలిగిన డివిజన్లకు అనూహ్యంగా బదిలీ అయ్యారు.

ఇసుక రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వితే కఠిన చర్యలు..

నెల్లూరు నగర శివారులలోని పెన్నా నదిలో ఇసుక రీచ్‌లను అధికారులతో కలిసి మంత్రి డా. పొంగూరు నారాయణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌ల్లో యంత్రాలతో తవ్వినా, అక్రమ రవాణా చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు.. ఇసుక రీచ్‌ల్లో సీసీ కెమెరాలను పెడతామని అన్నారు. ప్రజలందరికీ సులభంగా ఇసుక లభించాలనే ఉద్దేశంతోనే ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం తీసుకు వచ్చిందని మంత్రి చెప్పారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ఎవరైనా తీసుకుపోవచ్చని మంత్రి వెల్లడించారు. రీచ్‌లలోకి ట్రాక్టర్లను అనుమతించిన తర్వాత ఇసుక లభ్యత పెరిగింది.. ధరలు కూడా గణనీయంగా దిగివచ్చాయని మంత్రి నారాయణ అన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలు ఉంటే ఇప్పుడు రూ.15 వందలకు తగ్గింది.. ఇది మరింత తగ్గుతుందన్నారు. నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఈ ఉచిత పాలసీని తీసుకు వచ్చామని మంత్రి నారాయణ తెలిపారు.