NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాక్ నుంచి బెదిరింపులు.. పోలీసుల దర్యాప్తు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ముఖ్యమంత్రిపై దాడి చేయబోతున్నట్లు సందేశం యొక్క సారాంశం. ఈ బెదిరింపుపై ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెదిరింపుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాట్సాప్‌లో తెలియని నంబర్ నుంచి ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. బెదిరింపు సందేశం తర్వాత దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు కూడా ఇలాంటి బెదిరింపు సందేశాలే వచ్చాయి. ఈ మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. కారును పేల్చేస్తామని ఈమెయిల్ ద్వారా బెదిరించారు. గోరేగావ్, జెజె మార్గ్ పోలీస్ స్టేషన్లకు ఈ బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీనిపై ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించాయి. సందేశం పంపిన వ్యక్తి ఐపీ చిరునామాను ట్రాక్ చేస్తున్నారు. ఇక బెదిరింపు తర్వాత షిండే భద్రతను పెంచారు.

ఎమ్మెల్యే హరీష్ రావుపై మరో కేసు నమోదు!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌ రావుపై కేసు నమోదైంది. చక్రధర్‌ గౌడ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు ఇటీవల జైలు నుండి విడుదలైన ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని చక్రధర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్‌ రావు, వంశీ కృష్ణ, సంతోష్‌ కుమార్‌, పర్శరాములుపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్‌లో ఏ-2గా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు పేరును బాచుపల్లి పోలీసులు చేర్చారు. హరీష్ రావుపై 351 (2) R/W 3, (5) BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా వంశీ కృష్ణ, ఏ-3గా సంతోష్ కుమార్, ఏ-4గా పర్శరాములు ఉన్నారు.

పోసాని బెయిల్‌ పిటిషన్‌.. అప్పటి వరకు ఆగాల్సిందే..!

సినీనటుడు, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పోసాని కృష్ణమురళికి రైల్వేకోడూరు మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్ విధించిన విషయం విదితమే.. నిన్ని రాత్రి 9.30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల వరకు సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు కొనసాగగా.. ఆ తర్వాత 14 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు.. మరోవైపు.. పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన న్యాయ వాది మధు.. రైల్వేకోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రేపటి నుంచి రైల్వే కోడూరు జడ్జ్ ట్రైనింగ్ కోసం వెళ్తున్న కారణంగా ఈ కేసును శుక్రవారం విచారణకు తీసుకోలేదు. ఇక, శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.. దీంతో, పోసాని కృష్ణమురళి మూడు రోజుల పాటు జైలు జీవితం గడపనున్నారు. జడ్జి సెలవుపై వెళ్తున్న నేపథ్యంలో అనంతపురం పోలీసులు కూడా పీటీ వారెంట్ దాఖలు చేయలేదని సమాచారం… అయితే, అనంతపురం పోలీసులు సోమవారం పీటీ వారెంట్ వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది..

వంశీకి అనారోగ్య సమస్యలు.. డిప్రెషన్‌కు గురయ్యేలా చేస్తున్నారు..!

వల్లభనేని వంశీ మోహన్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. ఒంటరిగా ఉంచి డిప్రెషన్‌కు గురయ్యేలా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వంశీ భార్య పంకజ శ్రీ.. విజయవాడ సబ్ జైలులో ఉన్న వంశీని ఈ రోజు ములాఖత్‌లో కలిశారు పంకజ శ్రీ, వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పంకజ శ్రీ.. వంశీకి ఆస్తమా, ఫిట్స్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. 6/4 బ్యారెక్ లో ఉండటం వల్ల వంశీ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.. ఫిజికల్‌గా వంశీని చాలా ఇబ్బందులు పడుతున్నారు.. 22 గంటలు ఒంటరిగా ఉంచుతున్నారు.. వంశీని పనిష్మెంట్ సెల్‌లో పెట్టారు.. అలా కాకుండా వేరేవారితో కలిపి ఉంచమని కోరుతున్నాం అన్నారు.. ఒంటరిగా ఉంచటం ద్వారా వల్లభనేని వంశీని డిప్రెషన్ కి గురయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు.. అసలు సంబంధం లేని కేసుల్లో ఆయన్ని ఇరికించారు.. కనీసం చైర్ కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు..

కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా ఎస్‌ఎల్‌బీసీ అయిపోయేది!

గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా.. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయేది అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. సొరంగం మార్గంకు టైం పడుతుందని, మొదట్లో లిఫ్ట్ అనుకున్నాం అని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీని వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని చూస్తోందన్నారు. ప్రమాదాన్ని ప్రమాదం లాగ చూడాలని.. రాజకీయం చేయొద్దన్నారు. ఇంతకు ముందు పవర్ హౌజ్‌లో ప్రమాదం జరగలేదా?, కాళేశ్వరంలో జనాలు చనిపోలేదా? అని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీ ఎందుకు ఆలస్యం ఎందుకు అయ్యిందనేది కూడా మాజీమంత్రి హరీష్ రావుకి తెలుసు అని గుత్తా చెప్పుకొచ్చారు. ‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి నీళ్లు తేవాలనేది ఆలోచన. సొరంగం మార్గం టైం పడుతుందని, మొదట్లో లిఫ్ట్ అనుకున్నాం. కృష్ణా బేసిన్లో వాటర్‌పై నిర్లక్షం జరిగింది. కాళేశ్వరం మీద పెట్టిన శ్రద్దలో 20 శాతం పెట్టినా ఎస్‌ఎల్‌బీసీ అయిపోయేది. సీఎం, ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు సమీక్షలు చేసే సమయం ఉండేది కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ వచ్చే మూడేళ్ళలో పూర్తి చేయాలని చూస్తుంది. ప్రమాదాన్ని ప్రమాదం లాగ చూడాలి, రాజకీయం చేయొద్దు. ఇంతకు ముందు పవర్ హౌస్ లో ప్రమాదం జరగలేదా?. నువ్వు ఔను అంటే.. నేను కాదు అనడం మంచిది కాదు. హరీష్ రావుకి అన్ని తెలుసు.. ఎందుకు ఆలస్యం ఎందుకు అయ్యింది అనేది కూడా ఆయనకు తెలుసు. ఆత్మపరిశిలన చేసుకుంటే మంచిది. ప్రమాదం జరిగిన గంటలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పాట్లో ఉన్నాడు. నేతలు ఎంత మంది అక్కడికి పోతే.. అంత డిస్ట్రబ్’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

చిక్కుల్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..! ఎస్పీకి టీడీపీ, జనసేన ఫిర్యాదు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చిక్కుల్లో పడ్డారు.. గురువారం రోజు మాధవ్‌ మీడియాతో మాట్లాడు చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ, జనసేన నేతలు.. అయితే, నిన్న మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి నేతలు.. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.. కూటమి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.. రాష్ట్రంలో అలజడలు సృష్టించి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా గోరంట్ల మాధవ్ మాట్లాడారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు..

టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ ప్రజలకు అందిస్తున్నాం అని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారు.. ఈ బడ్జెట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ళే బాధ్యత ఎమ్మెల్యేలదే అని ఆయన పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలి.. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే మీ పని తీరులో మార్పు రావాలి అన్నారు. మళ్లీ మేము సభకు రావాలని అనే భావనతో ఎమ్మెల్యేల పని తీరు ఉండాలి అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

రెండో దఫా కులగణనలో లోపాలు – బీసీల హక్కులకు ముప్పు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, చిన్న, పరిమితమైన కార్యక్రమాలను జరిపినా వాటిని మొదటి పేజీలో పెద్దగా ప్రచారం చేస్తూ చూపుతున్నందున, ఇతర కీలక విషయాలు పక్కనపడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విమర్శించారు. ఆమె అభిప్రాయం ప్రకారం, రెండో దఫా కులగణనపై సరైన, సమగ్రమైన ప్రచారం జరపకపోవడం వల్ల, మొదటి దశలో గుర్తించబడిన, కూలాంటి కుటుంబాలు సర్వేకి తమ సమాచారాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాయని ఆమె అంటున్నారు. నాగర్‌కర్నూల్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడుతూ, రెండో దఫా కులగణనలో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసిన 10,000 కుటుంబాల లెక్కలను ఆధారంగా తీసుకుని, ప్రభుత్వం బీసీల సంఖ్యను తక్కువ చూపిస్తూ, అసెంబ్లీలో ఒకే బిల్లు పెట్టి, తమ హక్కులను పీల్చే ప్రయత్నం చేస్తున్నదని తెలిపింది. ఆమె ప్రకారం, ఇలా జరిగితే సరిగా గణన జరగకపోవడం వలన, ముందుగా గుర్తించబడిన కుటుంబాలు మరొకసారి తమ భాగస్వామ్యాన్ని ప్రకటించేందుకు తగిన అవకాశం పొందలేకపోతున్నాయి.

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్..

విజయవాడలో అమ్మ హాస్పిటల్ డాక్టర్లు దుర్గా శ్రీ లక్ష్మీ, పవన్ కుమార్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే సూచనా చౌదరి ఆహ్వానించారు. మచ్చలేని పార్టీ కావడంతో బీజేపీలో చేరామని డాక్టర్ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ అన్నారు. కమలం వాణి ఎప్పుడూ ప్రజా వాణి.. సమస్యలపై స్పందించడం, ప్రజల మాట వినిపించడం మా పార్టీ విధానం.. రాజకీయంలో మచ్చలేని పార్టీ బీజేపీ అని చెప్పగలం.. వేలెత్తి చూపలేని పార్టీగా మోడీ పాలనలో బీజేపీ ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు.

దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర

తెలంగాణ రాష్ట్రం దేశ రక్షణలో కీలక భూమిక పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రతకు తెలంగాణ రాష్ట్రం ఎంతో సహకారం అందిస్తోందని, ఇప్పటికే హైదరాబాద్‌ రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, విభాగాలకు కేంద్రంగా మారిందని వెల్లడించారు. తెలంగాణలో డిఫెన్స్ పరిశ్రమలు విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయని, సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా లక్షలాది మంది యువతకు అవగాహన కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రక్షణ పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణను కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.