అలా నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుని.. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా..
కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా అని, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. సంజయ్ సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలరా… ఎందుకీ డ్రామాలు…? అంటూ మండిపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. డేట్, టైం, వేదిక మీరే నిర్ణయించాలని సవాల్ విసిరారు.
సోషల్ మీడియాలో అడుగుపెట్టిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్..
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలిసారి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన X ఖాతాను తెరిచారు. అంతేకాదు.. కేసీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా కూడా తెరిచారు. ఖాతా ఓపెన్ చేసిన గంటల వ్యవధిలోనే 6521 మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నుంచి కేసీఆర్ ఎక్స్ వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టి ఆయా నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను అలాగే రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎక్స్ అకౌంట్ లో కేసీఆర్ పంచుకుంటారు. ఎక్స్ ద్వారా కేసీఆర్ ఎలాంటి విషయాలను పంచుకుంటారోనని నెటిజన్లు, రాజకీయ వర్గాలు, మరికొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ ఖాతాల ద్వారా కేసీఆర్ ట్రెండ్ సృష్టించే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. కేసీఆర్‌ని ఎక్స్‌లో ఫాలో కావాలనుకునే వారు Link – http://x.com/kcrbrspresident ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన యనమల కృష్ణుడు నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి జగన్ వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. యనమల కృష్ణుడితో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీ నేతలు పి. శేషగిరిరావు, పి. హరిక్రిష్ణ, ఎల్. భాస్కర్ చేరారు. ఈ కార్యక్రమానికి తుని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ హాజరయ్యారు. కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేతగా ఉన్న యనమల కృష్ణుడు వైసీపీలో చేరడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పోడు భూములకు పట్టాలిస్తాము.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మెజారిటీ ఇచ్చిన మండలం మాచారెడ్డి అని, మీరు ఆశీర్వదిస్తే కామారెడ్డి నియోజక వర్గంకి త్రాగు సాగు నీరు తెప్పిస్తానన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల పథకం నిలిపేసింది… లేకుంటే మచారెడ్డి లో నీళ్ళు వచ్చేవని ఆయన అన్నారు. మోడీ రిజర్వేషన్లు తీసేస్తామంటున్నాడు. దేశ ప్రజలు నష్టపోతారని ఆయన మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలిస్తామని, బీబీ పాటిల్ కు 10 సంవత్సరాలు అధికారం ఇస్తే మండలానికి కూడా రాలేదన్నారు. ధరని ద్వారా కోల్పోయిన భూములు కాపాడుతామన్నారు.
వైసీపీది రియాల్టీ మేనిఫెస్టో.. చంద్రబాబుది కాపీపేస్ట్ మేనిఫెస్టో
వైసీపీ మేనిఫెస్టోపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ స్పందించారు. వైసీపీది రియాల్టీ మేనిఫెస్టో అని.. చంద్రబాబుది కాపీపేస్ట్ మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. ప్రజల కష్టాల నుంచి బయట పడవేసే మేనిపేస్టో ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ విధానాలు సంస్కరణల దిశగా వెళ్తున్నాయన్నారు. విశాఖపట్నం క్యాపిటల్ టౌన్‌గా మేనిఫెస్టోలో ప్రకటించడం ఆనందకరమని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలనుకుంటున్నారని ఆయన అన్నారు. విశాఖకు అంతా కనెక్టవిటి ఉందని.. రాష్ర్ట అభివృద్ధికి దోహాదపడుతుందన్నారు. చంద్రబాబుది కాపీపేస్ట్ మేనిఫెస్టో అని.. టీడీపీ మాదిరి ఏదో హామీ ఇవ్వలేదన్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేశామని.. ఇవాళ కూడా అమలు చేయగలిగినవే మేనిఫెస్టోలో పెట్టామన్నారు.
జగనన్న సంక్షేమానికి మద్దతు ఇద్దాం..!
ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని… మీ ఓటుతో ఆదరించాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు అన్నారు. శుక్రవారం నాడు తర్లుపాడు మండలంలోని జగన్నాథపురం, సీతా నాగులవరం, తుమ్మల చెరువు గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ చైర్మన్ జంకే వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలన్నారు.
హరీష్ రావు డ్రామా రావుగా మారారు
హరీష్ రావు డ్రామా రావుగా మారారని కడియం శ్రీహరి విమర్శించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మొదట సవాల్ చేసింది హరీష్ రావే ఆ సవాలను స్వీకరించింది సీఎం రేవంత్ రెడ్డి అని, పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుద్దామంటూ సీఎం ప్రకటన చేస్తే.. రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు రాజీనామా కట్టుబడి ఉండాలన్నారు. కానీ.. రుణమాఫీపై రాజీనామా చేస్తున్నటువంటి హరీష్ రావు ఆ తర్వాత మాట మార్చారని, రుణమాఫీ తో పాటు ఆరు గ్యారంటీలకు లింకు పెట్టారన్నారు. ఆరుగ్యారెంటీలే కాదు మరికొన్నింటిని హామీలకు లింక్ చేసి రాజీనామా పత్రాన్ని ఇవ్వడం డ్రామా అడడం కాకపోతే మరేంటి అని ఆయన మండిపడ్డారు.
బోండా ఉమాపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఫైర్
బోండా ఉమాపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని ఆరోపించారు. బోండాపై మూడు ఫిర్యాదులు చేశాం.. సింగ్ నగర్ పార్టీ ఆఫీస్ లో ఓట్లు నమోదయ్యాయి.. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్ లోనే ఓట్లు ఉండాలన్నారు. తమ ఫిర్యాదు పై సరైన చర్యలు తీసుకోలేదని తెలిపారు. 2014 లో అఫిడవిట్ లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారని.. 2019 అఫిడవిట్ లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ నే పెట్టినట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ లో సింగ్ నగర్ పార్టీ ఆఫీస్ ను ఇల్లుగా చూపించారని.. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారన్నారు.
సీఎం రేవంత్ రాజకీయ ప్రస్థానమే అబద్దాల పునాదుల మీద మొదలైంది
సీఎం రేవంత్ రాజకీయ ప్రస్థానమే అబద్దాల పునాదుల మీద మొదలైందని ఎమ్మెల్యే కె .పి .వివేకానంద ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ ను రేవంత్ స్వీకరించలేకపోతున్నారని, అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు రాకపోతే తన సీటు కు ఎసరు వస్తుందని రేవంత్ భయపడుతున్నారని, అందుకే దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారని ఆయన విమర్శించారు. విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళే తడి బట్టల్తో గుడుల లోకి వెళ్తారని, రుణమాఫీ ,గ్యారంటీ ల పై దేవుళ్ళ మీద ఒట్లు కాదు చేయక పోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని మా సీనియర్ నేత హరీష్ రావు సవాల్ విసిరారన్నారు.
చంద్రబాబులాగా మేనిఫెస్టో పేరుతో మేము దగా చెయ్యం..
వైసీపీ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖ పార్లమెంట్‌కు 32 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని.. ఈ రోజు సీఎం జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారని తెలిపారు. మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని సీఎం జగన్ చెప్పారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలుపరిచి మళ్ళీ మీ ముందుకు వచ్చామన్నారు. చంద్రబాబు లాగా మాయ, మోసం, దగా లేకుండా హామీలు నెరవేర్చామని మంత్రి అన్నారు. ఆయనలాగా మేనిఫెస్టో పేరుతో మేము దగా చెయ్యమన్నారు. నిజాయితీగా, నిక్కచ్చిగా పథకాలు అమలు చేశామని.. రూ.2,70,000 కోట్ల రూపాయలను రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు అందించామన్నారు.
ఉపాధి హామీ పథకం పేదలకు అన్నం పెట్టింది
ఉపాధి హామీ పథకం పేదలకు అన్నం పెట్టిందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలో నే జీవనోపాధి కలిపించిన పథకం తెచ్చింది సోనియా గాంధీ అని, ఉపాధి హామీతో గ్రామాభివృద్ధి.. జీవనోపాధి కల్పించినది సోనియమ్మ అని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ.. పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు భోజనము పెట్టిన అక్షయ పాత్ర ఎట్లనో ఉపాది హామీ పథకం కూడా పేదలకు అక్షయ పాత్ర లాంటిదని, అలాంటి పేదల పథకం మోడీ పక్కన పెట్టేశారన్నారు. ప్రజలు దీన్ని ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. . బీజేపీ నేతల మాటలు అర్థం పర్థం లేనివని, సోనియాగాంధీ ఎన్ని కష్టాలు చూసిందో.. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ల హత్యలు లాంటి గడ్డు పరిస్థితి చూశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు.
ఓటు వేసే భాధ్యతను మరిచి పోవద్దు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 13న జరిగే ఓటింగ్ రోజున తమ ఓటు వేసే బాధ్యతను మరచిపోవద్దని రాష్ట్ర ఎన్నికల సిఇఓ వికాస్ రాజ్ అన్నారు. శనివారం ఎస్ఆర్ నగర్ లో సిఇఓ ఇంటి వద్దకు వెళ్లి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లీప్, పోలింగ్ తేదీతో పాటు ఓటరుగా గర్వ పడుతున్నాను అనే స్టిక్కర్ ను జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ వికాస్ రాజ్ కు అందజేశారు. ఈ సందర్భంగా సిఇఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ… ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలని అన్నారు. ప్రజాస్వామ్య మనుగడ దేశ భవిష్యత్తుకు ఓటు ఒక ఆయుధం లాంటిదని పార్లమెంట్ ఎన్నికలు మే 13 న ఓటింగ్ ను ప్రజాస్వామ్య పండుగ భావించాలని అన్నారు. ఎపిక్ కార్డు ఉంటే సరిపోదని ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో సరి చూసుకోవాలన్నారు.