NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పోసానికి తృటిలో తప్పిన ప్రమాదం!

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి తృటిలో ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ వద్ద జీపు దిగి లోపలికి వెళుతూ ఉండగా.. అకస్మాత్తుగా డ్రైవర్ జీపును ముందుకు కదిలించాడు. జీపు తగిలి పోసాని త్రూలి పడబోయారు. పక్కనే ఉన్న పోలీసులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. పోసాని సహా పోలీసు అధికారులు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన అనంతరం పోసాని ఓబులవారిపల్లె పీఎస్‌లోకి వెళ్లిపోయారు.

ఓబులవారిపల్లె పోలీస్‌ స్టేషన్‌లోనే ప్రభుత్వ వైద్యుడు గురు మహేశ్‌ ఆధ్వర్యంలో పోసాని కృష్ణమురళికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ స్టేట్‌మెంట్‌ను రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. పోసానిని కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. బుధవారం రాత్రి రాయదుర్గంలోని మైహోమ్‌ భూజాలో పోసానిని ఓబులవారిపల్లె పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ సహా వారి కుటుంబాలపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి ఓబులవారిపల్లె పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మణి ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా?

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. “తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక నేనా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా? తెలంగాణ క సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో నేను రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ నిధులు తీసుకొస్తున్నా. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. నేను ఒక్క ప్రాజెక్టు అడ్డుకున్నట్టు రుజువు చూపించాలని సవాల్ చేస్తున్నా. చేతకాని, దమ్ములేని సీఎం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెట్రోకి సంబంధించి మొన్న ప్రతిపాదనలు పంపారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఏమాత్రం అవగాహన లేకుండా దుందుడుకు వైఖరితో వ్యవహరిస్తున్నారు. మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేదు. నెపం నా మీదకు నెడుతున్నారు.

రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా.. కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తోంది!

ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంటే మళ్లీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు వల్ల మరలా రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా.. కూటమి ప్రభుత్వం ఎంత మంచి పాలనందిస్తుందో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే.. ప్రధాని నరేంద్ర మోడీ సహకారం కూడా మన రాష్ట్రానికి ఉందన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతడిని గెలిపించాలని మంత్రి కోరారు.

సంచలనంగా పూణే అత్యాచార ఘటన.. చెరకు తోటలో నిందితుడు, డ్రోన్లతో గాలింపు..

పూణే అత్యాచార ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. పూణే నగరం నడిబొడ్డున, పోలీస్ స్టేషన్‌కి 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్‌స్టాండ్‌లో నిలిచి ఉన్న బస్సులో 26 ఏళ్ల మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని దత్తాత్రేయ రామ్‌దాస్ గాడే అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది. రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్‌పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన విమర్శలు గుప్పిస్తోంది.

ఇదిలా ఉంటే, అత్యాచారం అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇతడిని పట్టుకునేందుకు పోలీసులు 08 టీములు ఏర్పాటు చేశారు. పూణేకి చెందిన వ్యక్తి తన స్వస్థలానికి సమీపంలోని చెరుకు తోటల్లో దాక్కున్నట్లు పోలీసులు అనుమతిస్తున్నారు. చెరకు తోటలు విస్తారంగా ఉన్న ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీసులు స్నిఫర్ డాగ్స్, డ్రోన్లను మోరించారు. చెరకు తోట దాదాపుగా 10 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది కాబట్టి, నిందితుడిని వెతికేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు.

బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు..

కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో కొమరవోలు గ్రామస్తులు ఫోటోలు దిగుతుండగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గ్రామాన్ని పట్టించుకోరా అని గ్రామస్తులు ప్రశ్నించగా.. బాలకృష్ణ మాట్లాడుతూ.. పట్టించుకోను.. ఫోటోలు దిగారుగా.. ఇక వెళ్ళండి అంటూ ఆగ్రహం చేశారు. కొమరవోలు గ్రామమా అదెక్కడ అని వ్యంగంగా మాట్లాడారు. కొమరవోలు గ్రామానికి ఈ జన్మలో రాను అని బాలయ్య అన్నారు. వాళ్లు లింగాయత్తులు.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వ్యంగాస్త్రాలు సందించారు. అయితే, బాలకృష్ణ మాతృమూర్తి బసవతారకం స్వగ్రామం కొమరవోలు.

రేపు ఏపీ కేబినెట్ భేటీ.. బడ్జెట్కు ఆమోదం తెలిపే ఛాన్స్!

రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2025-26వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టనుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇందులో భాగంగానే, రేపు (ఫిబ్రవరి 28న) ఉదయం 9 గంటలకు ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ మంత్రి మండలి సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలువుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టనున్నారు. ఇక, కౌన్సిల్ లో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశ పెట్టనున్నారు.

కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన మాజీ ఈఎన్సీల విచారణ

కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్సీలు నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ రావు, నరేందర్ రెడ్డిల విచారణ ముగిసింది. ముగ్గురు ఈఎన్సీలను ఒకేసారి కూర్చోపెట్టి కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. చేసిన ప్రతిజ్ఞకు న్యాయం చేయాలని… నిజాలను చెరిపి వేయొద్దని కమిషన్ వ్యాఖ్యానించింది. ఇంజనీర్లు పలు డాక్యుమెంట్లను దాచారని కమిషన్ కామెంట్ చేసింది. డిజైన్స్, డీపీఆర్, నిర్మాణ సంస్థకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందంపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. అన్నారం, సుందిళ్ల, లొకేషన్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు జరిగిందని కమిషన్ ప్రశ్నించగా.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు లొకేషన్ మార్చినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించగా.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ ఆదేశాల మేరకు నీళ్లను స్టోరేజ్ చేశామని అధికారులు తెలిపారు. అయితే.. కమిషన్ అడిగిన ప్రశ్నలకు మాజీ ఈఎన్సీ జనరల్ మురళీధర్ రావు గుర్తుకు లేదని సమాధానం ఇచ్చారు. డీపీఆర్‌ తయారీలో వ్యాప్ కాన్ సంస్థకు పనులు అలాట్ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ అడగగా.. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే వ్యాప్కన్ సంస్థకు DPR పనులను అలాట్‌ చేశామని అధికారులు వివరించారు.

సీఎం రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌ విమర్శల వర్షం

తెలంగాణలో ఇటీవల జరుగుతున్న మిస్టీరియస్ మరణాల (Mystery Deaths) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతరులపై బోరింగ్ ప్రసంగాలు ఇస్తూ, పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్ర పాలన నిర్వహించే బాధ్యత తనపై ఉందన్న విషయాన్ని మరిచిపోయి, అసంబద్ధ ఆరోపణలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

“ఒక ముఖ్యమంత్రి (Chief Minister) లాగా మాట్లాడాలి కానీ, చీప్ మినిస్టర్ (Cheap Minister) లా కాదు” అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మిస్టీరియస్ మరణాలపై నిజాయితీ ఉంటే విచారణ చేయించుకోవచ్చని, కానీ బ్లేమ్ గేమ్ (Blame Game) ద్వారా ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించడం సరైన విధానం కాదన్నారు.

‘‘ఆట మళ్లీ మొదలైంది’’.. బీజేపీకి మమతా బెనర్జీ వార్నింగ్..

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ‘‘ఖేలా హోబే’’ నినాదంతో బీజేపీకి సవాల్ విసిరింది. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు మరింత దూకుడుగా రాజకీయ ఆటను ప్రారంభించింది. ఆమె టీఎంసీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఆట మళ్లీ ప్రారంభమైంది(ఖేలా అబర్ హోబే)’’ అంటూ నినదించారు.

ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్న మమతా బెనర్జీ.. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించడానికి వెనకడానని సవాల్ చేశారు. ‘‘ నేను 26 రోజులు ధర్నా చేయగలిగితే, ఎన్నికల కమిషన్ ముందు చేయవచ్చు. దీని వల్ల ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది’’ అని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అణగదొక్కే ఏ ప్రయత్నానైనా తన పార్టీ ఎదురు నిలుస్తుందని చెప్పారు. మనం మహారాష్ట్రలా కాదు, అని పేర్కొంటూ బీజేపీపై విమర్శలు చేశారు.

మంత్రులు రోజూ వస్తున్నారు.. పోతున్నారు.. ఇదేమైనా టూరిస్టు ప్రాంతమా.

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతోంది SLBC టన్నెల్‌ ప్రమాద ఘటన. గత నాలుగు రోజులుగా సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీష్‌ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఘటనాస్థలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. హరీష్‌ రావుతో పాటు మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి తదితరులు సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించేందుకు SLBC సొరంగం ప్రాంతానికి చేరుకున్నారు. అయితే, ప్రభుత్వ అధికారుల సూచన మేరకు పోలీసులు వారిని ఆపివేశారు. పోలీసుల తీరుపై హరీష్‌ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడంలేదని మండిపడ్డారు. పోలీసుల అనుమతి లభించకపోవడంతో హరీష్‌ రావు, బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు అసెంబ్లీ సభ్యులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమని మండిపడ్డారు. సహాయక చర్యల్లో అక్రమాలు జరుగుతున్నాయా? ప్రజలకు అసలు నిజాలు చెప్పకుండా ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోంది? అంటూ హరీష్‌ రావు ప్రశ్నించారు.